ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ

ఫైర్ స్టేషన్లు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘సర్...మా ఊర్లో అగ్నిప్రమాదం జరిగింది త్వరగా రండీ” అంటూ ఫైర్ స్టేషన్లకు ఫోన్ కాల్స్ రావడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు “ఫైర్ స్టేషనా అండీ...గవర్నమెంట్ టీచర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నాను, ఆ పరీక్ష కోసం శిక్షణ ఇస్తారా” అని అడుగుతున్నారు.

రెవెన్యూ, కోర్టు, టీచర్, పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇలా ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా రాష్ట్రంలోని పలు అగ్నిమాపక కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు.

ఫైర్ స్టేషన్లు పోటీ పరీక్షల కేంద్రాలుగా ఎందుకు మారాయి?

ఫైర్ స్టేషన్లు

‘గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం’

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్ష కేంద్రాల్లో శిక్షణ పొందుతుంటారు. అయితే ఈ శిక్షణ కేంద్రాలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లోనే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. పైగా అనుభవజ్ఞులైన శిక్షకులు కూడా దొరకడం కష్టం.

దాంతో, గ్రామాలను వదిలి ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ కోసం సమీప పట్టణాలు, నగరాలకు వెళ్తుంటారు అభ్యర్థులు. అయితే ఇది ఖర్చులతో కూడిన పని.

అందుకే ఫైర్ స్టేషన్లలో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఆలోచన తమ శాఖ చేసిందని శ్రీకాకుళం జిల్లా రణస్థలం అగ్నిమాపక కేంద్రం అధికారి పైలా అశోక్ బీబీసీతో చెప్పారు.

 “ఇదొక వినూత్నమైన ఆలోచన. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు కొన్ని అగ్నిమాపక కేంద్రాలలో పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న మేం కూడా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి? ఏ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’’అని ఫైర్ ఆఫీసర్ పైలా అశోక్ చెప్పారు.

‘‘శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాల్లోని గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై అవగాహన కల్పిస్తున్నాం. మేం కూడా పోటీ పరీక్షలు రాసి, అక్కడ విజయం సాధించి వచ్చిన వాళ్లమే. అందుకే మేం ఏం చదివాం? ఎలా ప్రిపేర్ అయ్యాం అనే విషయాలను వీరికి చెప్పి అవగాహన కల్పిస్తాం. జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాల్లో అంటే శ్రీకాకుళం, రణస్థలం, పలాస, కోటబొమ్మాళి కేంద్రాల్లో ఈ తరహా శిక్షణ ఇస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

ఫైర్ స్టేషన్లు

‘ప్రభుత్వ శాఖల పనితీరుపై అవగాహన’

సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ప్రభుత్వ శాఖల పనితీరు, అందులో ఎలాంటిపనులు జరుగతాయి? ఏ శాఖ ఏ విధంగా పని చేస్తుంది? ఆ శాఖలను ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? అనే అంశాలపై అవగాహన ఉండాలి.

‘‘పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్‌తో పాటు ప్రభుత్వ శాఖలపైనే అధికంగా ప్రశ్నలు వస్తాయి. అందుకే మేం చెప్పేటప్పుడు మా శాఖతో పాటు ప్రభుత్వంలోని ఇతర శాఖలు ఎలా పని చేస్తాయనే అంశాలపై శిక్షణ ఇస్తాం’’అని శ్రీకాకుళం జిల్లా, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వీరభద్రరావు బీబీసీతో చెప్పారు.

 “రాష్ట్ర (ఆంధ్రప్రదేశ్) అగ్నిమాపక ఉన్నతాధికారులు కొంత బడ్జెట్ కేటాయించి, వాటి ద్వారా పోటీ పరీక్షల కోసం అవసరమయ్యే పుస్తకాలను ఆయా అగ్నిమాపక కేంద్రాల్లో ఉంచారు. అలాగే ఎవరైనా ఔత్సాహికులు పుస్తకాలు ఇచ్చినా వాటిని తీసుకుంటున్నాం. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను వాడుకోవచ్చు. అగ్నిమాపక కేంద్రాల్లో సాధారణంగా ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకే అగ్నిమాపక కేంద్రాల ప్రాంగణాల్లోనే అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నాం” అని వీరభద్రరావు తెలిపారు.

ఫైర్ స్టేషన్లు

‘కాలేజ్ నుంచి నేరుగా ఫైర్ స్టేషన్‌కే వస్తున్నాం’

డిగ్రీ సెకండియర్ చదువుతున్న తాను ప్రభుత్వ ఉద్యోగం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పలాసకు చెందిన లక్ష్మీ కుమారి అన్నారు. తమకు దగ్గరలోనే ఫైర్ స్టేషన్ ఉందన్నారు. కాలేజ్ అయిపోగానే, లేదా సమయం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నామని చెప్పారు.

“ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారే, ఉద్యోగం పొందేందుకు ఎలా సన్నద్ధమవ్వాలనే మెళకువలు నేర్పుతున్నారు. బ్యాంకు, రెవెన్యూ, గ్రూప్స్, డీఎస్సీ వంటి పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ చెప్పడంతో మేం ఉద్యోగాలు సాధించగలమనే ధైర్యం క్రమంగా పెరుగుతూ ఉంది” అని పలాసకు చెందిన డిగ్రీ విద్యార్థిని లక్ష్మీ కుమారి బీబీసీతో చెప్పారు.

‘‘ఇక్కడ ఇతర ప్రభుత్వ శాఖల పనితీరుపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయంపై కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉంది” అని లక్ష్మీ కుమారి అన్నారు.

ఫైర్ స్టేషన్లు

“స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నాం”

గ్రామీణ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, తాము కూడా స్వచ్ఛందంగా అగ్నిమాపక కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోటీ పరీక్ష శిక్షణ కేంద్రాలకు వచ్చి శిక్షణ ఇస్తున్నామని రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాల కామర్స్ లెక్చరర్ ఎం. శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

“నేను బ్యాంకు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. నాకు వీలు దొరికినప్పుడు, సెలవు రోజుల్లో లేదా పిల్లలతో పాటు కళాశాల అయిపోగానే ఇక్కడికి వచ్చి పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్లే ప్రవేశపెట్టినా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే చాలా మంది ఉద్యోగార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది” అని శ్రీనివాసరావు చెప్పారు.

ఫైర్ స్టేషన్లు

‘పోలీసు ఉద్యోగం సాధిస్తా’

 ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని ఇంటర్ సెకండియర్ చదువుతున్న వర్ష బీబీసీతో చెప్పారు.

 “మా కళాశాల పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్‌లో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారని తెలియగానే నా స్నేహితులతో సహా ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నాను. పోటీ పరీక్షల నోటిఫికేషన్ పడినప్పుడే కాకుండా, రోజూ ఇక్కడ ప్రిపేరయ్యే అవకాశం ఉంది. ఫైర్ సిబ్బంది వారి విధుల నిర్వహణతో పాటు మా కోసం కూడా సమయం కేటాయించడం సంతోషంగా ఉంది” అని వర్ష చెప్పారు.

 “ప్రభుత్వశాఖలో పని చేస్తున్న వారే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా పొందాలో, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో శిక్షణ ఇస్తుండటంతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పైగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును పరిచయం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలు, డైలీ న్యూస్ పేపర్లు కూడా అందుబాటులో ఉంచడం మాకు ఉపయోగకరంగా ఉంది” అని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న జ్యోతి అన్నారు.

 “నేను పోలీసుశాఖలో చేరాలని అనుకుంటున్నాను. దానిపై అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు పోలీసు శాఖ ఎలా పని చేస్తుంది? దానిలోని వివిధ విభాగాలేంటి? అనే విషయాలను వివరించారు. ఇక్కడ ఫైర్ స్టేషన్‌లో పని చేస్తున్న వారు కూడా పోలీసు శాఖలోని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. మాతో కలిసి వారు కూడా చదువుతున్నారు”అని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి లోకేష్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

‘అవగాహనే ముఖ్యం, ఒక అడుగు ముందే ఉండాలి’

 ‘‘మనకు పోటీ పరీక్షల విషయంలో అవగాహనే ముఖ్యం. మేం ప్రభుత్వ ఉద్యోగం పొందాలని అనుకుని చదివేటప్పుడు ఏం చదవాలి? ఎలా చదవాలనే విషయాలపై అవగాహన ఉండేది కాదు. ఎవరు ఏం చెప్పినా అది చదివేసేవాళ్లం. దాని వలన సమయం, డబ్బు కూడా చాలా సార్లు వృథా అయ్యింది. ఇప్పుడున్న విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవగాహన తక్కువగా ఉంటోంది. అందుకే మా ఫైర్ స్టేషన్ లో ఇచ్చే పోటీ పరీక్షల శిక్షణ ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నాం’’అని ఫైర్ ఆఫీసర్ అశోక్ చెప్పారు.

 “ప్రతి సెంటరులో కనీసం 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. దాతలు, ఔత్సాహికుల నుంచి మరిన్ని ఎక్కువ పుస్తకాలను సేకరించి పెద్ద లైబ్రరీని కట్టాలని అనుకుంటున్నాం. కళాశాలలకు, చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్లి ఫైర్ స్టేషన్లలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న విషయంపై ప్రచారం చేస్తున్నాం” అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా?

‘త్వరలో రాష్ట్రమంతా’

‘‘గత రెండు నెలలుగా ఈ తరహా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. త్వరలో రాష్ట్రంలోని ఇతర అన్నీ ప్రాంతాలకు దీనిని విస్తరించే ఆలోచనలో అగ్నిప్రమాద శాఖ ఉన్నతాధికారులున్నారు’’అని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వీరభద్రరావు బీబీసీతో చెప్పారు.

“వెనుకబడిన జిల్లాల్లో కొన్ని గ్రామాల్లోని ఫైర్ స్టేషన్లలో గ్రంథాలయాలు ప్రారంభించాం. కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన మా సిబ్బంది అనుభవాలను కూడా విద్యార్థులు, ఉద్యోగార్థులతో పంచుకోవడం, ఔత్సాహికులైన ఉపాధ్యాయులు సైతం ముందుకు వచ్చి శిక్షణ ఇవ్వడం మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం” అని వీరభ్రదరావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)