ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రానైట్ పరిశ్రమ: '75 శాతం ఉద్యోగాలు స్థానికులకే' నిబంధన ప్రభావం ఎలా ఉంటుంది

గ్రానైట్ కార్మికులు
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన 'పరిశ్రమలు, కర్మాగారాల్లో ఉపాధి బిల్లు-2019' పెద్ద చర్చకు తెరలేపింది. రాజకీయవర్గాలతో పాటు నిరుద్యోగులు, కార్మికుల్లోనూ చర్చ సాగుతోంది.

ఇప్పటికే అసెంబ్లీతోపాటు మండలిలోనూ ఆమోదం లభించడంతో ఇక గవర్నర్ రాజముద్ర మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఈ బిల్లు చట్టంగా మారితే తలెత్తే పరిణామాలపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న స్థానికేతర కార్మికుల భవితవ్యంపై బీబీసీ పరిశీలన చేసింది.

బిల్లులో ఏముంది?

తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు, జాయింట్ వెంచర్లలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది.

స్థానికతకు మండలం, జిల్లా లేదా రాష్ట్రాన్ని ఆయా పరిస్థితులను బట్టి ప్రమాణికంగా తీసుకుంటారు.

కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. అందుకు ఆయా సంస్థలకు ప్రభుత్వం మూడేళ్ల గడువు ఇస్తుంది.

తగిన శిక్షణ పొందిన వారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.

అయినా, అమలు నుంచి మినహాయింపు కావాలంటే మాత్రం దానికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటే, మాకు ఉపాధి పోతుందేమో

గ్రానైట్ రంగంలో పరిస్థితి ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. అందులో ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రధానమైనది. గెలాక్సీ గ్రానైట్ అక్కడ మాత్రమే లభిస్తుండడంతో చీమకుర్తి గ్రానైట్‌కి ఎంతో ఆదరణ ఉంది.

గ్రానైట్ రంగంలో రెండు రకాలున్నాయి. మైనింగ్ మొదటి భాగమైతే, ప్రాసెసింగ్ మరో విభాగం. ఈ రెండు విభాగాల్లోనూ స్థానికేతర కార్మికులే అత్యధికంగా ఉన్నారు.

చీమకుర్తిలో మొత్తం 40 మైనింగ్ కంపెనీలు, దాదాపు 600 వరకూ ఉన్న చిన్న, పెద్ద గనులు, ప్రోసెసింగ్ యూనిట్లలో 75శాతం మంది స్థానికేతరులే పనిచేస్తున్నారని యజమానులు చెబుతున్నారు.

ఇక్కడ సుమారు 13వేల మంది పని చేస్తుండగా, వారిలో ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చినవారే అధికంగా ఉన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల కార్మికులు కూడా ఉన్నారు. పని పరిస్థితులు మెరుగ్గా లేనప్పటికీ ఉపాధి వేటలో కార్మికులంతా ఇక్కడికి క్యూ కడుతున్నారు.

గ్రానైట్ కార్మికులు

ఉపాధి బాగా తగ్గింది

గత ఐదారేళ్లుగా గ్రానైట్ తవ్వకాల్లో యంత్రాల వాడకం పెరగడంతో కార్మికులకు ఉపాధి తగ్గిపోతోందని ఒడిశాకు చెందిన జువగల్ చెప్పారు.

"నేను 20 ఏళ్లుగా చీమకుర్తి‌లో పనిచేస్తున్నా. మొదట కూలీగా వచ్చాను. ప్రస్తుతం మేస్త్రిగా మారి ఒడిశా నుంచి వచ్చిన వారితో ఉంటున్నాను. మైనింగ్‌లో యంత్రాల వినియోగం పెరిగిన తర్వాత కార్మికుల పనిదినాలు తగ్గిపోయాయి. 2006లో ఇక్కడ మూడు వేలమంది ఒడిశా కార్మికులుంటే, ఇప్పుడు 1600 మంది మాత్రమే ఉన్నారు. ఇతర రాష్ట్రాల వారితో కలిపితే 5 వేలమంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి గనుల్లో పనిచేస్తున్నారు. ప్రాసెసింగ్‌ కర్మాగారాల్లో రాజస్థాన్‌కి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన వస్తే మా అందరికీ ఉపాధి పోతుందేమో అన్న ఆందోళన మాలో మొదలైంది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

ప్రాసెసింగ్‌లో నాన్ లోకల్

చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల్లో బీబీసీ పరిశీలన ప్రకారం, గనుల్లో కొంత మంది స్థానికులు పనిచేస్తున్నారు. చీమకుర్తి మండలానికి చెందిన పలు గ్రామాల యువతతో పాటుగా సంతనూతలపాడుకు చెందినవారు కూడా మైనింగ్‌లో కార్మికులుగా ఉన్నారు.

కానీ, ప్రాసెసింగ్ యూనిట్లలో మాత్రం దాదాపుగా 90శాతం మంది ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. మిగిలిన వారు కూడా చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం నుంచి వచ్చిన వారే ఉన్నారు. వాళ్లు కూడా ఏటా ఐదారు నెలలు ఇక్కడి గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేసి ఆ తర్వాత సొంత ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉంటారు.

చీమకుర్తి

పనుల్లేక వచ్చాం

వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయం సాగడం లేదని, దాంతో పనుల్లేక వలస రావాల్సి వచ్చిందని చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కుప్పం ప్రాంతానికి చెందిన మునియ్య తెలిపారు.

"మాతో పాటుగా రాజస్థాన్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. గ్రానైట్ ప్రాసెసింగ్ వాళ్లకే బాగా తెలుసు. అందుకే వారికి ఇక్కడ ఎక్కువగా ఉపాధి దొరుకుతోంది. మేము కొంత నేర్చుకున్నప్పటికీ వాళ్లలా చేయలేకపోతున్నామని యజమానులు అంటారు. అందుకే, రాజస్థానీలకు ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడొస్తున్న కొత్త నిబంధనలతో వారిని వెనక్కి పంపిస్తే మాకు అవకాశాలు పెరుగుతాయి" అని మునియ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితి కేవలం చీమకుర్తికే పరిమితం కాలేదు. గ్రానైట్ మైనింగ్ జరుగుతున్న రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాదాపుగా ఈ రీతిలోనే ఉందని చీమకుర్తికి చెందిన గ్రానైట్ ప్రాసెసింగ్‌ సంస్థ యజమాని ఆంజనేయులు తెలిపారు.

గ్రానైట్ రాళ్లను కత్తిరించడం, పాలిష్ చేయడంలో రాజస్థాన్ కార్మికులకు మంచి నైపుణ్యం ఉంటుందని, అందుకే ఇక్కడి ప్రాసెసింగ్ యూనిట్లలో వాళ్లే ఎక్కువగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

స్థానికులకు శిక్షణ ఇచ్చి ఆ పనిచేయించడం చాలా కష్టమైన పని అని ఆయన అభిప్రాయపడ్డారు.

"మైనింగ్ వ్యయం పెరగడంతో ప్రాసెసింగ్ యూనిట్లకు భారంగా మారింది. గతంలో 25 వేలకు వచ్చే గ్రానైట్ బండ... ఇప్పుడు 50వేలు దాటుతోంది. కానీ, మార్కెట్‌లో ప్రాసెసింగ్ తర్వాత అమ్ముతుంటే ధరలు సగానికి పడిపోయాయి. ఇలాంటి సమయంలో స్థానికేతర సిబ్బందికి బదులుగా శిక్షణ ఇచ్చి స్థానికులకు అవకాశం ఇవ్వాలని అంటే మాత్రం మాకు కొన్ని సమస్యలు తప్పవు" అని ఆయన బీబీసీతో అన్నారు.

గ్రానైట్ కార్మికులు

స్థానికులకు మేలు

స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అమలులో ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని ప్రకాశం జిల్లాకు చెందిన సామాజిక వేత్త కారుసాల శ్రీనివాసరావు అన్నారు.

"గ్రానైట్ సహా అన్ని పరిశ్రమల్లోనూ స్థానికేతరులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వారికి కూడా తగిన ప్రయోజనాలు దక్కడం లేదు. కానీ, ఉపాధి లేకపోవడంతో ప్రకాశం జిల్లా నుంచి అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వడం వల్ల ఇప్పటికే పనిచేస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో కొందరిని వెనక్కి పంపించాల్సి వస్తుంది. కానీ, భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వారికి అవకాశాలు పెరుగుతాయి" అని ఆయన వివరించారు.

వేచి చూస్తున్నాం

అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు అమలులోకి వచ్చే సరికి నిబంధనల విషయంలో సడలింపు అవసరం ఉంటుందని చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఓ గ్రానైట్ కంపెనీ యజమాని బూచేపల్లి రవి ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

"చట్టాన్ని గౌరవిస్తాం. స్థానికులకు ప్రాధాన్యమిస్తాం. కానీ, కొన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలంటే ఇతర ప్రాంతాల మీద ఆధారపడాల్సిందే. అలాంటి చోట్ల మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందిస్తే ఆహ్వానిస్తాం" అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)