జగన్ వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ వ్యయం.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఇజ్రాయెల్ దేశంలోని జెరుసలేంలో ఆయన పర్యటించబోతున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లి, అక్కడి నుంచి నేరుగా బయలుదేరారు. తిరిగి ఈ నెల 5న తాడేపల్లి చేరుకుంటారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
జగన్ తొలి పర్యటన చుట్టూ ఇప్పుడు వివాదం అలముకుంది. ఆయన పర్యటన వ్యక్తిగతం అని చెబుతూ దానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జులై 31న విడుదల చేసిన జీవో ఆర్టీ నెంబర్ 1737 ప్రకారం జగన్ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం 30,531 అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. దానికి గాను మన కరెన్సీ ప్రకారం రూ.22,52,500 విడుదల చేసింది.
ఇజ్రాయెల్‌కు చెందిన ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ఈ నిధులు చెల్లించారు. హైదరాబాద్ కి చెందిన ఎయిర్ ట్రావెల్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా వాటిని చెల్లిస్తున్నట్టు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వులను పలువురు ప్రశ్నిస్తున్నారు. దానిపై కాలమిస్ట్ కుసంపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానిస్తూ "సీఎం తన కుటుంబంతో తన వ్యక్తిగత పనిపై జెరూసలేం వెళుతున్నారు. పైగా సొంత ఖర్చుతో ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. అయినా ఈ పర్యటన పేరుతో ఏపీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడం విస్మయకరం. నిజానికి ఆయన కుటుంబం మొత్తం చేసే ఖర్చు కన్నా ప్రభుత్వ వ్యయమే ఎక్కువగా కనిపిస్తోంది. రానుపోనూ టికెట్ ఛార్జీలు, ఇతర ఖర్చులు చూసినా అంత పెద్ద మొత్తం ఖర్చు కాదు" అంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో నిధుల వినియోగంపై బీబీసీ తెలుగు ఏపీ ప్రభుత్వ అధికారులను సంప్రదించింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రామ్ ప్రసాద్ సిసోడియా స్పందించారు.
జడ్ కేటగిరీలో ఉన్న వారి భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయడం సాధారణ పరిపాలనా శాఖలో భాగమేనని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా వ్యాఖ్యానించారు.
"ముఖ్యమంత్రి పర్యటనకు తగిన భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. సీఎం హోదాలో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా భద్రత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. జడ్ కేటగిరీలో ఉన్న వారందరికీ అలాంటి ఏర్పాట్లు ఉంటాయి. సీఎం పర్యటనకు ఇజ్రాయెల్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీకి బాధ్యత అప్పగించాం. ఏపీ ప్రభుత్వంతో ఆ ట్రావెల్ ఏజన్సీకి ఒప్పందం ఉంది. అందులో భాగంగానే జీవో విడుదల చేసి నిధులు చెల్లించామని" ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Govt of AP
రాష్ట్రపతి, ప్రధానికి తప్ప అందరికీ ఇది తప్పదు..
ప్రముఖులు పర్యటనల్లో ఉన్నప్పుడు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు తప్పవని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ చంద్రన్ వ్యాఖ్యానించారు.
జగన్ వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ నిధుల వెచ్చించిన జీవో వివాదాస్పదం అయిన నేపథ్యంలో తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్న విజయ్ చంద్రన్.. "వీఐపీలకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా తప్పదని నిబంధనలున్నాయి.
విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి తప్ప అందరికీ అవసరమైన పక్షంలో మన ప్రభుత్వాలే భద్రత ఏర్పాటు చేయాలి.
కొన్నిసార్లు ప్రధానికి కూడా మనమే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఆయా దేశాల్లో నిబంధనల ప్రకారం మన సెక్యూరిటీకి సమస్య అవుతుంది కాబట్టి, అత్యధిక సందర్భాల్లో అక్కడి సెక్యూరిటీ ఏజన్సీలతో ఒప్పందాలు చేసుకుంటారు.
గతంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పర్యటనల్లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం జగన్ పర్యటనలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, అవసరమైన మేరకు నిధులు విడుదల చేయడంపై వివాదం సమంజసం కాదని" పేర్కొన్నారు.
‘జగన్ అన్నింటా మాట తప్పడమే’ - టీడీపీ విమర్శ
వైఎస్ జగన్ పాలన పూర్తిగా ప్రచారానికే పరిమితం అవుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహార్ వ్యాఖ్యానించారు. జెరూసలెం జీవో పై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. మాట తప్పడం..మడమ తిప్పడం జగన్ కి అలవాటుగా మారిందని, నిరాడంబరంగా పాలన, ఒక్క రూపాయి వేతనం అని చెబుతున్న ఆయన లోటస్ పాండ్ లోని ఇంటికి 28లక్షల ప్రజాధనం వినియోగించారని, ఇప్పడు జెరూసలెంలో వ్యక్తిగత పర్యటన కోసం రూ.22లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రచారానికి భిన్నంగా అన్ని విషయాల్లోనూ జగన్ ప్రభుత్వం ఉందనడానికే ఇవి నిదర్శనం అంటూ విమర్శించారు.
‘నిబంధనల ప్రకారమే నిధుల విడుదల’ - రాష్ట్ర మంత్రి పేర్ని నాని
వీఐపీల భద్రత విషయంలో నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటోందని, అయినా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జీవోపై వస్తున్న విమర్శలను బీబీసీ ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇదంతా విపక్షాల పసలేని రాద్దాంతం. అన్నీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదు. అయినా పూర్తి వివరాలు తెలుసుకుంటాను. మా ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అనుగుణంగా పనిచేస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?
- వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: ‘నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక ఆశ, అదేంటంటే..’
- జెరూసలెం: మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?
- ఆ గ్రహంపై వజ్రాల వర్షం
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది...
- ఉన్నావ్ రేప్ కేసులను దిల్లీకి బదిలీ చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయా, తగ్గుతాయా...
- 'హలో.. సన్నీ లియోని స్నానానికి వెళ్లారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు'
- 'ఎన్నాళ్లు భయపడతాం? చంపేస్తే చంపేయండి' - ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








