జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?

ఫొటో సోర్స్, BBC/SHIRLEY PALKAR
- రచయిత, రోహన్ టిల్లు, గణేశ్ పొల్
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధులు
ఇజ్రాయెల్ ఆవిర్భావం సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వేల మంది యూదులు కొత్త దేశానికి వలస వెళ్లారు. అక్కడ భారతీయులు 80వేల మంది వరకు ఉన్నారు. తాజా వివాదంపై బీబీసీ వారిని పలకరించింది.
'నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు భారతదేశం వదిలి పెట్టి, ఇజ్రాయెల్ వెళ్లాం. ఈ నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదు' అన్నారు షిర్లే పాల్కర్.
మరాఠీ మాట్లాడే పాల్కర్ 20 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం గెడెరాలో విద్యాశాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
'మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వాటన్నింటినీ ఎలాగోలా తట్టుకుని నిలబడ్డాం. ఇప్పుడు ఇజ్రాయెల్ నా దేశం. కానీ భారత దేశం పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉంది. దాన్ని దేనితో పోల్చలేము' అని చెప్పారు.
మహారాష్ట్రలోని థానెలో శ్రింగా సొసైటీలో షిర్లే ఉండేవారు. సరస్వతి ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు చెందిన స్కూల్‌లో చదివారు.
ఇజ్రాయెల్‌కి రావడానికి ముందు పర్యాటకురాలిగా ఇక్కడికొచ్చాను. మా బంధువులు ఇక్కడే ఉంటారు. 20 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ అవకాశాల దేశంగా నాకు కనిపించింది. అందుకే ఇక్కడే స్థిరపడ్డానని షిర్లే చెప్పారు.

ఫొటో సోర్స్, ABBAS MOMANI/AFP/GETTY IMAGES
హిబ్రూ రాకుంటే అంతే సంగతులు!
చుట్టం చూపుగా వచ్చే వారికి, ఇజ్రాయెల్ పౌరులుగా మారడానికి ఎంతో తేడా ఉంది. అదేంటో షిర్లేకు కొన్నిరోజుల్లోనే తెలిసొచ్చింది.
ఇజ్రాయెల్‌లో భాష అతి పెద్ద సవాల్. 'హిబ్రూ' భాష తెలిసి ఉండటం తప్పనిసరి. ఆ భాష రాకుంటే మనమేం చేయలేమని షిర్లే చెప్పారు.
అందుకే నేను ప్రభుత్వం నేర్పించే హిబ్రూ కోర్సులో చేరా. ఆ తర్వాత సొంత ఖర్చుతో హిబ్రూపై పట్టు సాధించా. అప్పటి చేదు జ్ఞాపకాలు అన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయని ఆమె తెలిపారు.
భాష ఒక్కటే కాదు, ఆహారం, ఆహర్యం, ఆచారాలు, అలవాట్లు ఇలా అన్నీ సవాళ్లే. ఇతర బెనీ యూదుల్లాగే షిర్లే కూడా వాటన్నింటికీ అలవాటు పడ్డారు. భారతదేశం నుంచి వలస వెళ్లిన వారిని బెనీ యూదులు అంటారు.
అయితే, ఇప్పటికీ తమ సొంత ఆచార, సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని షిర్లే గర్వంగా చెప్పారు.
చాలా దేశాల్లో యూదులను చిన్నచూపు చూస్తారు. అందుకే చాలామంది ఇజ్రాయెలీలు తమ సొంత దేశాన్ని మర్చిపోతారు. మాతృ దేశంతో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు.
కానీ బెనీ ఇజ్రాయెలీలు దీనికి విభిన్నం. భారత్ మమ్మల్ని గౌరవంగా చూసింది. అందుకే భారత్ అంటే మాకు ఎంతో గౌరవం అన్నారు షిర్లే.

ఫొటో సోర్స్, SHIRLEY PALKAR
బెనీ ఇజ్రాయెలీలు అంటే ఎవరు?
షిర్లే పాల్కర్‌తో పాటు ఎంతోమంది భారత్ నుంచి ఇజ్రాయెల్‌కి వెళ్లారు. అందులో ప్రొఫెసర్ విజయ్ తపాస్ ఒకరు. మరాఠీ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు.


హిబ్రూ భాషలో బెనీ అంటే కుమారుడు అని అర్థం. అందుకే వీళ్లు తమను తాము ఇజ్రాయెల్ కుమారులుగా చెప్పుకుంటారని రుయా కాలేజీ హిస్టరీ ప్రొఫెసర్ మొహసిన ముకద్దాం అన్నారు.
బ్రిటిష్ హయాంలో చాలా మంది బెనీ ఇజ్రాయెలీలు కొంకన్ ప్రాంతం నుంచి ముంబైకి వలస వచ్చారు.
1948లో ఇజ్రాయెల్ ఆవిర్భావం తర్వాత యూదులందరూ అక్కడికి రావాలని పిలుపు ఇచ్చారు.
దాంతో చాలామంది ఇజ్రాయెల్ వెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లినా, మహారాష్ట్ర సంస్కృతిని కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/SHIRLEY PALKAR
చేపలను పొలుసులతో పాటు తినేస్తారు!
మొదట్లో బెనీ ఇజ్రాయెలీలను పరాయి వారిగా చూసేవారు కాదు. కానీ బ్రిటిష్ వాళ్లు వచ్చాక, వారి అసాధారణ అలవాట్లను గుర్తించారు.


ఇలాంటి ఆచారాలు పాటించే వారిని యూదులుగా బ్రిటిష్ వాళ్లు నిర్ధరించారని మొహసిన ముకద్దాం వివరించారు.
బ్రిటిష్ కాలంలో బెనీ ఇజ్రాయెలీలకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్లు మిలటరీ, రైల్వేలు, విద్యా, వైద్య రంగాల్లో పనిచేశారని పుణెలో ఉండే శామ్యూల్ రొహెకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/SHIRLEY PALKAR
యూదుల ప్రార్థనా మందిరం 'సెనగోగ్'
బెనీ ఇజ్రాయెలీలు ముంబైకి వచ్చినప్పుడు యూదుల ప్రార్థనా మందిరం సెనగోగ్‌ను నిర్మించారు.


నెలలో ఒకరోజు, శనివారం నాడు పవిత్ర గ్రంథాలు చదువుతూ ప్రార్థనలు చేస్తారని శామ్యూల్ తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/SHIRLEY PALKAR
వివాహ వేడుకలో 'గ్రేప్‌వైన్' ప్రత్యేకం
యూదుల వివాహ వేడుకల్లో 'గ్రేప్ వైన్'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వైన్‌ను వాళ్లు 'కిడ్డీష్' అని పిలుస్తారు.
బెనీ ఇజ్రాయెలీలు ఎన్నో హిందూ సంప్రదాయాలను తమ సంస్కృతిలో అంతర్భాగం చేసుకున్నారు. వివాహాలు, గాజులు వంటి వాటిని హిందూ ఆచారాల నుంచి స్వీకరించారు.
ఇతర దేశాల్లో యూదులపై అరాచకాలు జరిగేవి. అందుకే స్థానికులతో వాళ్లు మమేకం కాలేకపోయే వారు. కానీ ఇండియాలో పరిస్థితి వేరు. భారతీయులు మమ్మల్ని గౌరవంగా, హుందాగా చూసేవాళ్లు. అందుకే మేం భారతీయులతో కలిసిపోయాం. ఎంతగా అంటే వాళ్ల సంప్రదాయం మా ఆచారంలా మారేంతగా అని అన్నారు షిర్లే.

ఫొటో సోర్స్, BBC/SHIRLEY PALKAR
మాతృ భాషపై మమకారం
ఇజ్రాయెల్ వెళ్లిన భారతీయ యూదులు నిజానికి మరాఠీ బాగా మాట్లాడతారు. కానీ ఇప్పటి తరానికి మరాఠీ బొత్తిగా రాదు. అందుకే బెనీ ఇజ్రాయెలీలు మరాఠీ లెర్నింగ్ కోర్సులు ప్రారంభించారు.
ఇందులో భాగంగా ప్రొఫెసర్ విజయ్ తపాస్ ముంబై నుంచి ఇజ్రాయెల్ వెళ్లారు. బెనీ ఇజ్రాయెలీలకు మరాఠీ పట్ల అమితమైన ప్రేమ ఉంది. మాతృ భాష నేర్చుకోవాలన్న పట్టుదల ఉంది. ఎందుకంటే భారత్‌తో వారికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో చాలా ప్రార్థనా మందిరాలకు నిధులు వాళ్లే ఇస్తున్నారు.
భారత్ అంటే ప్రత్యేక అభిమానం
అయితే, దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌లో ఉంటున్నా.. భారత్ పట్ల వారికి ప్రత్యేక అభిమానం ఉందని షిర్లే చెప్పారు. మా హృదయాల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేం ఇప్పటికీ అక్కడికి వెళ్తాం. నిన్న మొన్నటి వరకు మా తల్లిదండ్రులు థానెలోనే ఉండేవాళ్లు. మా సోదరి ముంబైలో ఉంటోంది. నేను అక్కడికి వెళ్లినప్పుడు తినాల్సిన వాటి జాబితా తయారు చేసుకుంటా. వడాపావ్, చాట్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు.. షిర్లే.
షిర్లే కూతురు ఇజ్రాయెల్‌లో పుట్టింది. మరాఠీ మాట్లాడుతుంది. కానీ ఇక్కడే ఎప్పటికీ ఉండాలని అనుకోవడం లేదు.
ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించడంపై మరాఠీ యూదులుగా మేం సంతోషంగా ఉన్నాం. గతంలోనూ జెరూసలెం ఇజ్రాయెల్ రాజధానే. ఇప్పుడూ రాజధానే. అయితే, అమెరికా ప్రకటన తర్వాత పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. జెరూసలెం అత్యంత కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. దాని గురించే మా ఆందోళన అని షిర్లే చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK/NOAH MASSIL
ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జెరూసలెంలో పరిస్థితి ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటుంది. తాజా ఘటనలు హింసకు దారితీయొచ్చు. అయితే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మేము, మా సైన్యం సిద్ధంగా ఉంది. భారత్ కూడా అమెరికా బాటలోనే నడవాలి. జెరూసలెంలో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాలని అక్కడ ఉంటున్న మహారాష్ట్రవాసి నోహ్ మాసిల్ అభిప్రాయపడ్డారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








