ఇజ్రాయెల్: వెయ్యేళ్ల కిందటి బంగారు నాణేల నిధి

బంగారు నాణేల నిధి

ఫొటో సోర్స్, YANIV BERMAN

ఇజ్రాయెల్‌లోని ప్రాచీన ఓడరేవు నగరం సీజరియాలో జరుపుతున్న పురాతవ్వకాల్లో .. 900 ఏళ్ల కిందట దాచిపెట్టినవిగా భావిస్తున్న బంగారు నాణేలు బయటపడ్డాయి.

ఒక గోడ పక్కన రాళ్ల మధ్య ఉన్న ఒక రాగి కుండలో ఈ బంగారు నాణేలతో పాటు ఒక బంగారు చెవి రింగు కూడా లభించింది.

మొత్తం 24 బంగారు నాణేలను తర్వాత ఎప్పుడైనా మళ్లీ తీసుకునే ఉద్దేశంతో దాచినట్లుగా కనిపిస్తుంది.

ఈ నిధిని దాచిన వ్యక్తి.. 1101లో క్రూసేడుల సైన్యం నగరవాసులను ఊచకోత కోసినపుడు చనిపోయి ఉండవచ్చునని పురాశాస్త్రవేత్తలు అంటున్నారు.

సీజరియా ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతం సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో ఈ నిధి వెలుగుచూసింది.

అబ్బాసిద్, ఫాతిమిద్ కాలాలకు చెందిన నివాస ప్రాంతంలోని ఒక ఇంటి గోడ పక్కన ఉన్న రెండు రాళ్ల మధ్య.. 11వ శతాబ్దానికి చెందిన ఈ బంగారు నాణేలు కనిపించాయి.

ఇజ్రాయెల్ ప్రపంచ వారసత్వ సంపద

ఫొటో సోర్స్, YAAKOV SHIMDOV

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతంలో ఒక గోడలో రెండు రాళ్ల మధ్య ఈ నిధి లభ్యమైంది

‘‘సీజరియా చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామాలకు.. క్రూసేడుల హింసాత్మక దాడికి.. ఈ నిధి ఒక మౌన సాక్ష్యం’’ అని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి చెందిన ఆర్కియాలజిస్టులు పేర్కొన్నారు.

జెరూసలేం క్రూసేడు రాజ్యాన్ని 1100 - 1118 సంవత్సరాల మధ్య పరిపాలించిన ఒకటో బాల్దివిన్ సైన్యం.. సీజరియా ప్రజల్లో అత్యధికులను హతమార్చినట్లు లిఖిత చరిత్ర చెప్తోంది.

‘‘ఈ నిధి యజమాని, వారి కుటుంబం ఆ ఊచకోతలో అంతమైపోవటం కానీ.. వారిని బానిసలుగా అమ్మివేయటం కానీ జరిగి ఉండొచ్చని భావించవచ్చు. అందువల్ల వాళ్లు దాచుకున్న ఈ బంగారాన్ని తిరిగి తీసుకోలేకపోయి ఉంటారు’’ అని ఈ తవ్వకాలకు డైరెక్టర్లుగా ఉన్న డాక్టర్ పీటర్ జెండిల్మన్, మొహమ్మద్ హతార్‌లు విశ్లేషించారు.

బంగారు నాణేల నిధి

ఫొటో సోర్స్, YANIV BERMAN

ఫొటో క్యాప్షన్, ఈ నాణేలు 11వ శతాబ్దానికి చెందినవని పురాశాస్త్రవేత్తలు గుర్తించారు

ఈ నిధి లభ్యమైన ప్రాంతంలో.. అదే కాలానికి చెందిన మరో రెండు నిధులు కూడా బయటపడ్డాయి. 1960ల్లో బంగారు, వెండి నగల మూట లభ్యమవగా.. 1990ల్లో రాగి పాత్రల సమాహారం వెలుగుచూసింది.

ఈ నిధులను ప్రస్తుతం జెరూసలేం లోని ఇజ్రాయెల్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.

ఇజ్రాయెల్‌ మధ్యధరాసముద్ర తీరంలో అతిపెద్ద బంగారు నాణేల నిధిని 2015లో స్కూబా డైవర్లు అనుకోకుండా కనుగొన్నారు. వేయి సంవత్సరాల కిందటి కాలానికి చెందిన దాదాపు 2,000 బంగారు నాణేలను సముద్రగర్భంలో పడున్న సుమారు ఆ డైవింగ్ క్లబ్ సభ్యులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)