ఆస్ట్రేలియా గనిలో అద్భుతం: రెండు రాళ్లలో 100 కిలోలకుపైగా బంగారం

ఫొటో సోర్స్, RNC MINERALS
పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిపిన తవ్వకాల్లో కోట్లాది రూపాయల విలువైన రెండు భారీ 'బంగారు' శిలలు బయటపడ్డాయని మైనింగ్ కంపెనీ తెలిపింది.
95 కిలోల బరువున్న ఒక స్పటికశిల(పలుగు రాయి)లో 68 కిలోలకు పైగా బంగారం ఉందని కెనడాకు చెందిన మైనింగ్ సంస్థ ఆర్ఎన్‌సీ మినరల్స్ వెల్లడించింది.
63 కిలోల బరువున్న మరో శిలలో 45.3 కిలోల పసిడి ఉన్నట్టు పేర్కొంది.
పలుగు రాళ్లలో ఈ బంగారం ఇమిడిపోయి ఉందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
గతవారం కల్గూర్లీ పట్టణం సమీపంలోని గనుల్లో దాదాపు 80 కోట్ల రూపాయల విలువైన బంగారం వెలికితీసినట్టు ఈ కంపెనీ పేర్కొంది.
ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం అత్యంత అరుదైన విషయమని ఓ మైనింగ్ ఇంజినీర్ అన్నారు.
"'సాధారణంగా ఆస్ట్రేలియాలోని గనుల్లో బంగారం ముద్దలు దొరుకుతాయి. కానీ, వాటి బరువు కొన్ని ఔన్సులు మాత్రమే ఉంటుంది" అని కర్టిన్ విశ్వవిద్యాలయంలోని వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కూల్ ఆఫ్ మైన్స్ డైరెక్టర్, ప్రొఫెసర్ శామ్ స్పియరింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, RNC MINERALS
సాధారణంగా ఆస్ట్రేలియాలోని గనుల్లో టన్ను బరువున్న రాళ్ల నుంచి 2 గ్రాముల బంగారం దొరుకుతుందని ఆయన బీబీసీతో అన్నారు.
ఆర్‌ఎన్‌సీ మినరల్స్ సంస్థ మాత్రం తాము టన్ను రాళ్లలోంచి 2,200 గ్రాముల పసిడి వెలికితీశామని తెలిపింది.
"ఇంత భారీ మొత్తంలో బంగారం లభ్యమవడం చాలా చాలా అరుదు. ఇంత బంగారం దొరకడం ఆసక్తికరమైన విషయమే" అని ప్రొఫెసర్ స్పియరింగ్ అన్నారు.
రాళ్లలో ఇమిడిపోయి ఉండే బంగారం రేణువులను మనిషి కంటితో గుర్తించడం కూడా అంత సులువు కాదని ఆయన అంటున్నారు.
తాజాగా బయటపడిన భారీ బంగారు శిలలను వేలానికి పెట్టనున్నట్టు ఆర్‌ఎన్‌సీ మైనింగ్ కంపెనీ సీఈవో మార్క్ సెల్బీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









