‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ గురించి ఆయన బాడీగార్డు చెప్పిన 'రహస్యాలు'

ఫొటో సోర్స్, HUGH MILNE
- రచయిత, మైల్స్ బోనార్, స్టీవెన్ బ్రోకెల్‌హర్ట్స్
- హోదా, బీబీసీ స్కాట్లండ్ న్యూస్
హ్యూ మిల్న్ మొదటి నుంచి భారతీయ 'సెక్స్ గురు' భగవాన్ శ్రీ రజనీష్ భక్తుడు. అయితే ప్రేమ, దయ మీద ఆధారపడిన బుద్ధిజీవుల సమూహం అన్న హ్యూ భావన కొన్నాళ్లకు ఘోరంగా కుప్పకూలింది.
అత్యంత ఆకర్షణీయమైన, అదే సమయంలో వివాదాస్పదమైన భగవాన్ రజనీష్....భారతదేశం నుంచి అమెరికాలోని ఓరెగావ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ 64 వేల ఎకరాల రాంచ్‌లో ఎలా తన ఆశ్రమాన్ని స్థాపించారో హ్యూ మిల్న్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'వైల్డ్ వైల్డ్ కంట్రీ' డాక్యుమెంటరీలో వివరించారు.
ఆయన ఆశ్రమం నడిపిన ఐదేళ్ల కాలంలో అక్కడ స్థానికులతో ఎన్నో వివాదాలు, ఉద్రిక్తతలు తలెత్తాయి. వాటితో పాటు హత్యాయత్నం, ఎన్నికలలో రిగ్గింగ్, ఆయుధాల స్మగ్లింగ్, సామూహిక విషప్రయోగం తదితర ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
ఎడిన్‌బర్గ్‌కు చెందిన హ్యూ మిల్న్, దాదాపు దశాబ్దకాలం పాటు 90 రోల్స్ రాయిస్ కార్లలో విలాసంగా తిరిగే రజనీష్‌కు దగ్గరగా మసిలారు.
ఆ సమయంలో భగవాన్ రజనీష్ ఆయనకు ప్రేరణగా నిలిచారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
ఇళ్లు, కుటుంబాలను వదిలిపెట్టి..
చాలా ఏళ్లపాటు భగవాన్ అంగరక్షకుడిగా హ్యూ పని చేశారు. భక్తులెవరూ భగవాన్‌ను తాకకుండా చూడడం ఆయన బాధ్యత.
తాను రజనీష్‌కు శిష్యునిగా ఉన్న దశాబ్ద కాలంలో, ఈ భక్తి ఉద్యమంలో భక్తుల సంఖ్య 20 నుంచి 20 వేలకు పెరిగింది.
''వాళ్లంతా ఆయన కోసం తమ ఇళ్లను, కుటుంబాలను వదిలిపెట్టినవారు. ఎలాంటి వేతనం లేకుండా వారానికి 60-80 గంటలు పని చేస్తూ డార్మిటరీల్లో ఉండేవాళ్లు'' అని హ్యూ తెలిపారు.
ఈ కథనం ప్రసారమయ్యే నాటికి హ్యూ వయసు 70 ఏళ్లు.
ఎడిన్‌బర్గ్‌లో ఆయన కుటుంబం హైడ్రోథెరపీ చేసేది. 1973లో మర్దన చేయడంలో శిక్షణ పూర్తి చేసిన అనంతరం, 25 ఏళ్ల హ్యూ, ఆడియో క్యాసెట్లలో రజనీష్ ప్రవచనాలను విని, ఆయనను ప్రత్యక్షంగా చూడడానికి భారతదేశం వచ్చారు.
''అలాంటి ప్రముఖుణ్ని కలిసినపుడు అది మీ మీద కనీవినీ ఎరగని ప్రభావాన్ని చూపుతుంది. నాకు ఎప్పుడూ ఆయన పాదాల వద్ద కూర్చుకుని నేర్చుకోవాలని అనిపించేది'' అని హ్యూ అన్నారు. భారతదేశంలో ఆయనను స్వామి శివమూర్తి అని పిలిచేవారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
ఊసరవెల్లి ‘భగవాన్’..
రజనీష్ మీద 'భగవాన్: ద గాడ్ దట్ ఫెయిల్డ్' అన్న పుస్తకాన్ని రాశారు హ్యూ.
''నేను ఆయనను అద్భుతమైన గ్రహణశక్తి, మనుషులను అర్థం చేసుకునే శక్తి కలిగిన పరిణామం చెందిన మానవునిగా చూశాను'' అని హ్యూ అన్నారు.
1990లో చనిపోవడానికి ముందు తన పేరును ఓషోగా మార్చుకున్న రజనీష్ ఊసరవెల్లిలాంటివాడని, భక్తులు తనను ఏ విధంగా చూడగోరితే, ఆయన అలా మారిపోయేవాడని తెలిపారు.
మొదటి 18 నెలల పాటు రజనీష్ హ్యూను అత్యంత వేడిగా ఉండే పొలంలో శారీరక శ్రమ చేయడానికి పంపి, ఆయన గర్ల్ ఫ్రెండ్‌తో పడుకునేవారు.
అప్పటికి 40లలో ఉన్న రజనీష్ తన ఆడభక్తులకు ఉదయం 4 గంటలకు ప్రత్యేక దర్శనం ఇచ్చేవారు.
''ఆయన చేసే ప్రసంగాలలో సెక్స్ గురించి, భావప్రాప్తి గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించేవారు. అంతే కాకుండా ఆయన తన ఆడభక్తులతో కలిసి పడుకునేవారు, అందుకే ఆయనకు 'సెక్స్ గురు' అన్న పేరొచ్చింది'' అని హ్యూ తెలిపారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
ఒకానొక సమయంలో హ్యూ అసూయకు గురై, ఆశ్రమాన్ని వీడిపోయే ఆలోచన కూడా చేశారు. అయితే క్రమంగా అంతా మంచి జరుగుతుందని అనిపించి అక్కడే ఉండిపోయారు.
''మేమందరం లైంగికంగా విముక్తి అయినట్లు భావించేవాళ్లం. అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఒకే ఒక్కరితో సంబంధాలు ఉండేవి'' అని హ్యూ తెలిపారు.
భగవాన్‌తో ప్రత్యేక దర్శనాల తర్వాత హ్యూకు తన గర్ల్ ఫ్రెండ్ కొత్తగా కనిపించడం ప్రారంభించింది. అయితే కొద్ది కాలానికే భగవాన్ ఆయనను అక్కడికి 400 మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతానికి పంపారు.
ఒకసారి రజనీష్ వ్యక్తిగత కార్యదర్శి యోగ లక్ష్మి ఒక భక్తునికి దర్శనాన్ని నిరాకరించినపుడు, అతను ఆమెపై దాడి చేశారు. దీంతో హ్యూ తిరిగి వచ్చాక రజనీష్ ఆయనను యోగ లక్ష్మి బాడీగార్డ్‌గా నియమించారు.
అయితే తనతో పాటు రజనీష్ భద్రత కూడా హ్యూ బాధ్యతే అని ఆమె స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
ఆశ్రమం తరలి వెళ్లడానికి కారణం ఆమే
తన భక్తుల కోరికను మన్నించకపోతే తనకు బాగుండదని రజనీష్ అనేవారు. అయినా భక్తులు ఆయనను తాకినపుడు లేదా ఆయన పాదాలను ముట్టుకున్నపుడు ఆయన చాలా అసౌకర్యంగా కనిపించేవారని హ్యూ తెలిపారు.
భగవాన్ అంతర్గత సహాయకులలో ఆనంద్ షీలా కూడా ఒకరు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఒరెగావ్ కమ్యూన్ గురించిన కథనంలో షీలా చాలా ఎక్కువగా కనిపిస్తారు.
షీలా భారతీయురాలే అయినా, న్యూజెర్సీలో చదువుకుని, ఒక అమెరికన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భగవాన్ ఆశ్రమంలో చేరారు.
షీలాతో కలిసి హ్యూ పుణె ఆశ్రమంలోని క్యాంటీన్‌ను నడిపేవారు. అప్పటికే భగవాన్ భక్తుల సంఖ్య పెరగడం ప్రారంభించింది.
ఈ క్రమంలో షీలాకు, హ్యూకు మధ్య గాఢమైన బంధం ఏర్పడింది. అయితే నెల తర్వాత దీనిపై రజనీష్ వద్ద ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది జరిగాక, హ్యూతో ఆమె ప్రవర్తన మారిపోయింది. లక్ష్మీ స్థానంలో ఆమె రజనీష్ వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక హ్యూకు సమస్యలు ఎదురయ్యాయి.
రజనీష్ ఆశ్రమం పుణె నుంచి ఓరెగావ్‌కు తరలివెళ్లడానికి కూడా కారణం షీలానే అని హ్యూ తెలిపారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
కుట్రలు.. కుతంత్రాలు..
రజనీష్ భారతదేశంలో క్రమంగా వివాదాస్పదంగా మారడం ప్రారంభించారు. దాంతో ఆయన తన భక్తులతో కలిసి వేరే చోటికి మారాలని నిర్ణయించారు.
1981లో షీలా ఓరెగావ్‌లోని బిగ్ మడీ రాంచ్‌ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆమె స్థానిక చట్టాలను పట్టించుకోలేదు. అక్కడ రజనీష్ ప్రవచనాలకు అనుగుణంగా ఒక కొత్త నగరాన్ని నిర్మించడం ప్రారంభించారు.
''ఓరెగావ్‌కు మారడం చాలా తప్పు. దాని వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనాల్సి వచ్చింది'' అని హ్యూ అన్నారు.
ఓరెగావ్ ఆశ్రమ నిర్మాణంలో మొదటి నుంచి చట్టాలను ఉల్లంఘించారు.
షీలా తన బృందంతో కలిసి స్థానికులను బెదిరించేవారు. చివరికి తమకు అడ్డుగా నిలుస్తున్న కొంత మంది ప్రభుత్వ అధికారులను హత్య చేయాలని కూడా వ్యూహం పన్నారు.
అక్కడ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే ప్రయత్నంలో ఆశ్రమ సన్యాసినులు సలాడ్‌లో విషాన్ని కలిపారు. దాని కారణంగా 750 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
అక్కడ ప్రేమ, దయ, ధ్యానం లేవు
1982 ఏప్రిల్ నాటికి హ్యూకు కమ్యూన్‌పై అనేక సందేహాలు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరి అక్కడ ప్రేమ, దయ, ధ్యానం కనిపించేవి కావు.
కమ్యూన్ నిర్మాణం కోసం వారానికి 80-100 గంటలు పని చేసే చాలా మంది సన్యాసినులు క్రమంగా రోగగ్రస్థులు కావడం ప్రారంభించారు.
అయినా షీలా వారి పట్ల చాలా నిర్దయగా వ్యవహరించేదని హ్యూ తెలిపారు.
ఒకసారి ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుణ్ని కూడా చూడడానికి తనను అనుమతించలేదని హ్యూ తెలిపారు.
''నేను మరీ రాక్షసుడిలా తయారవుతున్నానా? అనుకున్నాను. నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నాను? అనే ప్రశ్న నాలో బయలుదేరింది.''

ఫొటో సోర్స్, HUGH MILNE
హ్యూ 1982, నవంబర్‌లో ఓరెగావ్‌ను వదిలి వెళ్లిపోయారు.
ఆరువారాల పాటు ఒక మానసిక చికిత్సాలయంలో ఉన్నాక తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
కొద్దికాలం పాటు ఎడిన్‌బర్గ్‌లో మర్దన వైద్యం చేసిన అనంతరం ఆయన అక్కడి నుంచి లండన్, ఆ తర్వాత జూరిచ్, అక్కడి నుంచి కాలిఫోర్నియా వెళ్లారు. 1985 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.

ఫొటో సోర్స్, HUGH MILNE
'వైల్డ్ వైల్డ్ కంట్రీ' డాక్యుమెంటరీలో చూపించిన విషయాల చాలా వరకు నిజమేనన్న హ్యూ, అందులోని అనేక విషయాలు తాను అక్కడి నుంచి వెళ్లిపోయాక జరిగాయని తెలిపారు. షీలా అక్కడ ఏమేం చేసిందో తనకు చాలా తక్కువగా తెలుసని అన్నారు.
మరి షీలా, ఆమె మద్దతుదారులు ఏం చేసేవారో రజనీష్‌కు తెలుసా? ''ఆయనకు తెలుసు, ఎలాంటి సందేహం లేదు'' అన్నారు హ్యూ.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









