అభిప్రాయం: ‘ప్రజలకూ, దేవుళ్లకు మధ్య దళారులుగా స్వామీజీలు’

ఆశారాం బాపు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రొఫెసర్ శివ్ విశ్వనాథన్
    • హోదా, ప్రముఖ విశ్లేషకులు

ఎవరో ఒక విశ్లేషకుడు చెప్పినట్లు - భారతదేశం దళారుల దేశం. ఈ దళారులు కేవలం రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాదు.

మన దేశంలో ఆధ్యాత్మికతకు మెడిటేషన్ (ధ్యానం) ఒక్కటే సరిపోదు. మీడియేషన్ (దళారీ వ్యవస్థ) అవసరం కూడా ఉంది. శక్తికి ప్రతిరూపాలుగా భావించే భగవంతుడూ, రాజకీయ శక్తులకూ, ప్రజానీకానికీ మధ్య కూడా దళారులు అవసరం.

ఆధునిక సమాజంలో ఈ స్వామీజీలు - గురూజీలు అనండి లేదా బాబాలు అనండి - ఇప్పుడు విడదీయరాని భాగమైపోయారు, అవసరమైపోయారు. అయితే వీళ్లు స్వామి నారాయణ్, రమణ మహర్షి లాంటి వాళ్లు కారు.

ఆశారాం బాపు, గుర్మీత్ రామ్ రహీమ్, రామ్‌పాల్ లాంటి వాళ్లు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే వారిగా మారిపోయారు. పట్టణ జీవితంలో, మరీ ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో వీళ్లు ఒక భాగంగా మారిపోయారు. ఈ రకంగా ఆశారాం, రామ్ రహీమ్‌లు మన కాలపు కథలుగా మారారు. వాళ్లుండే ఆశ్రమాలు భూలోకంపై ఆదర్శ ప్రపంచాలుగా మారాయి.

ఆశారాం బాపు

ఫొటో సోర్స్, Getty Images

ఆధ్యాత్మికం, రాజకీయం చెట్టపట్టాలు

ఉత్తర భారతదేశంలో ప్రతి చిన్న పట్టణంలోనూ ఒక సత్సంగ్ కనిపిస్తుంది. ఇలాంటి సామాజిక కూటములు, ప్రజలకు 'తమ వారు' అనే ఒక భద్రతాభావాన్ని ఇస్తాయి.

ఈ ఆధునిక స్వామీజీలు లేదా బాబాలు సమానత్వం, సకలజన సమ్మిళితం అన్న మాటలతో భక్తులను లోబర్చుకుంటారు. వీళ్ల వలన చిన్నచిన్న పట్టణాలకు కూడా వాటికంటూ సొంత చరిత్ర ఏర్పడుతోంది. అవి కూడా ఆధునికతను సంతరించుకుంటున్నాయి.

రాజకీయపరంగా చూస్తే, ఈ 'దైవదూతలు' ఓటు బ్యాంకులుగా ఉపయోగపడతారు. అందువల్లే రాజకీయ నాయకులు వీళ్ల భక్తులుగా మారతారు. రాజకీయాలు, మతం మధ్య ఒక ఇచ్చిపుచ్చుకోవడంలాంటి ఒప్పందం ఉంటుంది.

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

ఫొటో సోర్స్, facebook/Gurmeet Ram Rahim Singh

ఫొటో క్యాప్షన్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

ఆధ్యాత్మిక ఎంటర్‌ప్రెన్యూర్లు

ఈ స్వామీజీలు, బాబాల నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్లు కింది తరగతికి చెందినవారై ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సద్గురు లాగానో, శ్రీశ్రీ లాగానో వీళ్లకు అంతర్జాతీయ భక్తులు ఉండరు. ప్రతి మతంలోనూ ఇలాంటి ఆధ్యాత్మిక ఎంటర్‌ప్రెన్యూర్లు ఉంటారు.

ఇలాంటి స్వామీజీలు ఒకవైపు ప్రజలు అతి సాధారణ జీవితం గడపాలని ప్రవచిస్తూనే మరోవైపు అత్యంత ఖరీదైన జీవితాన్ని గడుపుతుంటారు. వీళ్లలో లైంగిక వాంఛలు, టెక్నాలజీపై విపరీతమైన మోహం కనిపిస్తాయి. ఆశారాంలో మొదటిది కనిపిస్తే, గుర్మీత్ సింగ్‌లో రెండూ కనిపిస్తాయి. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకోని బాబా లేడంటే అతిశయోక్తి కాదు.

నేటి భక్తులు తమ ఆకాంక్షలను ఇలాంటి స్వామీజీలలో చూసుకుంటున్నారు. అందుకే గుర్మీత్ రామ్ రహీమ్ తనను తాను సూపర్ మేన్‌గా ప్రకటించుకుంటూ సినిమా తీశారు. నిజానికి ఇప్పుడు ప్రతి స్వామీజీకి ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక వ్యవస్థ అన్నది తప్పనిసరి అవసరంగా మారిపోయింది.

ఆశారాం బాపు

ఫొటో సోర్స్, Getty Images

సాలెగూడు లాంటి ఆశ్రమాలు

ఇటీవలి కాలంలో లైంగిక భావనలు, లైంగిక ప్రయోగాలు కూడా స్వామీజీల ప్రదర్శనల్లో ఒక భాగంగా మారిపోయాయి. అందువల్లే లైంగిక దోపిడీ నుంచి మానవ అక్రమ రవాణా వరకు నేడు వాళ్ల గుట్టుమట్లు బయట పడుతున్నాయి.

పైకి వీళ్ల ఆశ్రమాలు సంక్షేమ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ కనిపిస్తాయి. కానీ నిజానికి ఇలాంటి ఆశ్రమాలు సాలెగూడు లాంటివి. అందుకే ఇప్పుడు మన దేశంలో మతం వ్యాపారంగా మారిపోయింది. దేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన శక్తులు - నేరాలు, ఆధ్యాత్మికత ఇవి రెండే.

ఆశారాం బాపు

ఫొటో సోర్స్, Getty Images

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - ఈ స్వామీజీలు, బాబాలు తాము ఆశ్రమం తరపున చేస్తున్న సామాజిక కార్యకలాపాల గురించి చెబుతుంటారు. ఇలాంటి కార్యకలాపాలే వాళ్ల సామాజిక దోపిడీకి పవిత్రమైన ముసుగులు. ప్రభుత్వం, అధికారులు మేల్కొనేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది.

ఇవాళ రాజకీయ నాయకుడి లాగా స్వామీజీలు కూడా తాము చట్టానికి అతీతులం అనుకుంటున్నారు. కఠువాలో బీజేపీ రాజకీయ నాయకుల్లాగా అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. విషాదకరం ఏమిటంటే, రాజకీయ నాయకులు కూడా తమ మనుగడ కోసం ఆ స్వామీజీల మీదే ఆధారపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)