జోధ్‌పూర్ కోర్టు తీర్పు: ఆశారాం బాపుకు మరణించే వరకు జైలు శిక్ష

ఆశారాం బాపు

ఫొటో సోర్స్, Getty Images

అత్యాచారం కేసులో నిందితుడు ఆశారాం బాపు భవితవ్యాన్ని తెల్చే కీలకమైన తీర్పు బుధవారం వెలువడింది. ఆయన్ను దోషిగా పరిగణిస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. మరణించే వరకు ఆయనకు జైలు శిక్ష విధించింది. బీబీసీ ప్రతినిధి ప్రియాంకా దూబే అందిస్తున్న రిపోర్ట్

16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఈ కేసులో కోర్టు నిందితులందరినీ దోషులుగా పేర్కొంది.

77 ఏళ్ల ఆశారాం బాపు మరో మహిళపై అత్యాచారం కేసులోనూ నిందితునిగా ఉన్నారు.

ఆశారాం బాపు ఉన్న జైలు వద్ద న్యాయమూర్తి ఈ తీర్పును వెల్లడించారు. ఆశారాం బాపు సహజంగా మరణించే వరకు జైలు జీవితం గడపాలని, ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులు 20 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాలని ఈ తీర్పులో పేర్కొన్నారు.

బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఆశారాం అయిదేళ్లుగా జైల్లోనే ఉన్నారు.

ఈ తీర్పు సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో జోధ్‌పూర్‌కు చేరుకున్నారు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు జోధ్‌పూర్‌లో ఏప్రిల్ 30 వరకు 144 సెక్షన్ విధించారు.

ఈ కేసు ఐదేళ్ల పాటు కొనసాగింది. ఆశారాం బాపు, బాధితుల కుటుంబానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో చాలా మలుపులు చోటు చేసుకున్నాయి.

ఆశారాం బాపు

ఫొటో సోర్స్, Getty Images

జోధ్‌పూర్ కేసు ఏంటి?

2013 ఆగస్టులో ఆశారాం బాపుపై అత్యాచార ఆరోపణలు చేసిన షాజహాన్‌పూర్‌కు చెందిన బాధితురాలి కుటుంబం మొత్తం మొదట్లో ఆయన భక్తులే.

'పవిత్రమైన విద్య' లభిస్తుందనే నమ్మకంతో ఇద్దరు పిల్లలను ఆయన చింద్వాడా ఆశ్రమానికి పంపారు. 2013, ఆగస్టు 7న బాధితురాలి తండ్రికి 16 ఏళ్ల కూతురు అనారోగ్యంతో ఉన్నట్లు ఫోన్ వచ్చింది.

బాధితురాలి తల్లిదండ్రులు మరుసటిరోజు చింద్వాడా చేరుకున్నపుడు, ఆయన కుమార్తెకు దయ్యం పట్టిందని, వాటిని ఆశారాం బాపు బాగు చేస్తారని తెలిపారు. ఆగస్టు 14న బాధితురాలి కుటుంబం ఆశారాంను కలిసేందుకు జోధ్‌పూర్‌కు వెళ్లింది.

ఆగస్టు 15న నమోదు చేసిన ఛార్జిషీటులో ఆశారాం 16 ఏళ్ల బాధితురాలి ఆరోగ్యాన్ని బాగు చేస్తాననే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ ఫిర్యాదుతో బాధితురాలి తండ్రిని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆయనను డబ్బు ఇచ్చి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా ఆ కుటుంబం ఆశారాం బాపుపై న్యాయపోరాటం చేస్తూనే ఉంది.

ఆశారాం బాపు కేసు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)