ఫ్రాన్స్: 15 ఏళ్ల లోపు వారితో సెక్స్.. అత్యాచారమే

ఫ్రాన్స్ లింగ సమానత్వ శాఖ సహాయ మంత్రి మార్లీన్ షియాపా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సెక్స్‌కు అంగీకరించే వయసును 15 సంవత్సరాలుగా విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు లింగ సమానత్వ శాఖ సహాయ మంత్రి మార్లీన్ షియాపా మీడియాకు తెలిపారు

లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే చట్టబద్ధ వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయించే దిశగా ఫ్రాన్స్ చర్యలు చేపడుతోంది. దీనర్థం అంతకన్నా తక్కువ వయసున్న వారితో సెక్స్ చేయటాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు.

డాక్టర్లు, న్యాయ నిపుణుల సలహాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని లింగ సమానత్వ శాఖ సహాయ మంత్రి మార్లీన్ షియాపా ఆహ్వానించారు.

ప్రస్తుతం.. పదిహేనేళ్ల లోపు వయసున్న వారితో ఎవరైనా సెక్స్ చేసినట్లయితే.. అది రేప్ అని అభియోగం నమోదు చేయాలంటే బలాత్కారం జరిగిందని ప్రాసిక్యూటర్లు రుజువు చేయాల్సి ఉంటుంది.

ఇటీవల 11 ఏళ్ల వయసున్న బాలికలతో పురుషులు సెక్స్ చేసిన కేసుల మీద తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో చట్టంలో ఈ మార్పు తీసుకురావాలని నిర్ణయించారు.

ప్రస్తుతమున్న చట్టం ప్రకారం.. హింస కానీ, బలవంతం చేసినట్లు కానీ నిరూపణ కాకపోతే.. మైనర్‌పై లైంగిక దోపిడీ అభియోగాలు మాత్రమే నిందితుల మీద నమోదవుతాయి కానీ రేప్ అభియోగం నమోదు కాదు. ఆ నేరానికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, సుమారు రూ. 6.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

మైనర్లు, మైనర్లు కాని వారి మీద లైంగిక దాడులకు ఒకే రకమైన శిక్షలు ఉన్నాయి. కానీ రేప్ కేసుల్లో దోషులకు మరింత కఠినమైన శిక్షలు ఉన్నాయి.

కొత్తగా నిర్ణయించిన వయసు పరిమితి చట్టాన్ని ఇతర లైంగిక హింస చట్టాలతో పాటు ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఈ 15 ఏళ్ల వయో పరిమితి నిర్ణయానికి మద్దతు తెలిపారు

ఒక 11 ఏళ్ల బాధిత బాలికపై ‘నిర్బంధం, బెదిరింపు, హింస’కు గురిచేయలేదని నిర్ణయించిన కోర్టు.. 30 ఏళ్ల పురుషుడిపై అత్యాచారం అభియోగాలను గత నవంబర్‌లో కొట్టివేసింది.

మరో కేసులో సైతం.. బాధితురాలైన 11 ఏళ్ల బాలికతో సెక్స్ చేయటానికి 28 ఏళ్ల నిందితుడు భౌతికంగా బలప్రయోగం చేయలేదని, కాబట్టి రేప్ అభియోగాలు కాకుండా లైంగిక దాడి అభియోగాలు నమోదు చేయాలని ఒక కోర్టు తొలుత పేర్కొంది.

అయితే.. అతడిపై నిజానికి రేప్ అభియోగాలే నమోదు చేయాలని అదే కోర్టు గత నెలలో తన నిర్ణయాన్ని మార్చింది.

  • 14 సంవత్సరాలు: ఆస్ట్రియా, జర్మనీ, హంగరీ, ఇటలీ, పోర్చుగల్
  • 15 సంవత్సరాలు: గ్రీస్ పోలండ్, స్వీడన్
  • 16 సంవత్సరాలు: బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, రష్యా
  • 17 సంవత్సరాలు: సైప్రస్

బ్రిటన్‌లో లైంగిక అంగీకారం తెలిపే కనీస వయసు 16 సంవత్సరాలుగా ఉంది. అయితే 13 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారులకు అదనపు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయి.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)