Chhota Rajan: ఇది ఓ డాన్ కథ.. బడా రాజన్ ‘ప్రేమ’.. చోటా రాజన్ ‘పగ’

ఫొటో సోర్స్, AFP
- రచయిత, వికాస్ త్రివేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
అండర్ వరల్డ్ డాన్ చోటా రాజాన్ కరోనాతో చికిత్స పొందుతున్నారు. బ్లాక్ టికెట్‌ల అమ్మకం, చిన్నచిన్న దొంగతనాలతో మొదలైన చోటా రాజన్ నేర చరిత్ర అండర్ వరల్డ్ డాన్‌గా వేళ్లూనుకునే వరకు ఎలా సాగింది?
నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న చోటా రాజన్ ఎందరి ప్రాణాలు తీశాడు.. ఎన్ని సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు?
చివరకు ఇండోనేసియాలో ఎలా చిక్కాడన్నదే ఈ కథనం..
బడా రాజన్ కథ ముగిసిన చోట నుంచి మొదలు..
ప్రతి కొత్త కథా.. పాత కథ ముగిసిన దగ్గర మొదలవుతుంది. చోటా రాజన్ కథ కూడా.. బడా రాజన్ అలియాస్ రాజన్ నాయర్ కథ ముగిసిన చోట మొదలయింది.
రాజన్ నాయర్ టైలర్‌గా పనిచేసేవాడు. రోజుకు పాతిక రూపాయలు సంపాదించేవాడు. అలాంటి సమయంలో అతడి ప్రియురాలి బర్త్‌డే వచ్చింది. పార్టీ చేయటానికి డబ్బులు అవసరమయ్యాయి. అందుకోసం ఆఫీస్ టైప్ రైటర్ చోరీ చేసి 200 రూపాయలకు అమ్మేశాడు.
ఆ డబ్బుతో తన ప్రియురాలికి ఒక చీర కొన్నాడు. కొద్ది రోజులకే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మూడేళ్ల జైలు శిక్ష పడింది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజన్ గ్యాంగస్టర్‌గా మారాడు. ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని 'గోల్డెన్ గ్యాంగ్' అని పేరు పెట్టాడు. అదే తర్వాత 'బడా రాజన్ గ్యాంగ్'గా పేరు పడింది.
అబ్దుల్ కుంజు అనే అనుచరుడిని రాజన్ తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అదే అబ్దుల్ కుంజు.. రాజన్ నాయర్ ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. రాజన్, కుంజుల స్నేహం శత్రుత్వంగా మారింది. పఠాన్ సోదరులు పురమాయింపుతో ఒక రిక్షా పుల్లర్.. కుంజు సాయంతో రాజన్ నాయర్‌ను కోర్టు బయట హత్య చేశాడు.
అప్పటికి అండర్ వరల్డ్‌లో రాజన్ నాయర్ బడా రాజన్‌గా పేరు పడ్డాడు. బడా రాజన్ మరణంతో చోటా రాజన్ కథ మొదలైంది. ఈ చోటా రాజన్.. అండర్ వరల్డ్ మరో డాన్ దావూద్ ఇబ్రహీంకి చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. దావూద్ 1993 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడన్న విషయం తెలిసిందే.
చోటా రాజన్‌ను చంపటానికి చోటా షకీల్ అనే వ్యక్తి పలుమార్లు ప్రయత్నించాడు. దావూద్, చోటా రాజన్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని చోటా షకీల్ భావించాడు.

ఫొటో సోర్స్, AFP
మరాఠీ కుర్రాడు రాజేంద్ర.. అలియాస్ చోటా రాజన్
1960లో ముంబైలోని చెంబూర్ తిలక్‌నగర్‌లో ఒక మరాఠీ కుటుంబంలో ఒక పిల్లవాడు పుట్టాడు. అతడికి రాజేంద్ర సదాశివ్ నికల్జే అని పేరు పెట్టారు. అతడి తండ్రి సదాశివ్ థాణేలో ఉద్యోగం చేసేవాడు. రాజన్‌కి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు.
రాజన్‌కు చదువు మీద ఆసక్తిలేదు. ఐదో తరగతి తర్వాత బడి మానేశాడు. త్వరలోనే దుష్ట సావాసం మొదలైంది. జగదీశ్ శర్మ అలియాస్ గూంగా గ్యాంగ్‌లో చేరాడు. సుజాత అనే యువతితో రాజేంద్రకు పెళ్లయింది. వారికి ముగ్గురు కూతుళ్లు పుట్టారు.
1979లో.. ఎమర్జెన్సీ రోజుల తర్వాత.. నల్ల బజార్లకు పోలీసులు నట్లు బిగిస్తున్నారు. ఆ సమయంలో రాజేంద్ర ముంబైలోని సాకార్ సినిమా హాలు బయట బ్లాక్ టికెట్లు అమ్మటం మొదలుపెట్టాడు.
ఒక రోజు ఆ సినిమా హాల్ బయట పోలీసులు లాఠీ-చార్జ్ చేశారు. పోలీసుల చేతిలోని ఒక లాఠీని లాక్కున్న రాజన్ అదే పోలీసులను కొట్టటం మొదలుపెట్టాడు. అతడు పోలీసులతో తలపడటం అదే మొదటిసారి.
చాలా మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనతో.. ఐదడుగుల మూడంగుళాల ఎత్తున్న రాజేంద్రను తమ గ్యాంగ్‌లో చేర్చుకోవాలని ముంబైలోని చాలా గ్యాంగ్‌లు భావించాయి. రాజేంద్ర బడా రాజన్ గ్యాంగ్‌లో చేరాడు.
కొన్ని రోజుల తర్వాత కుంజు.. బడా రాజన్‌ను వంచించి అతడిని హత్య చేశాడు. బడా రాజన్ మరణం తర్వాత రాజేంద్ర గ్యాంగ్ నాయకుడయ్యాడు. అలా చోటా రాజన్‌గా మారాడు. తన అన్నగా భావించే బడా రాజన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని చోటా రాజన్ భావించాడు. చోటా రాజన్‌ను చూసి కుంజు తీవ్రంగా భయపడిపోయాడు. 1983 అక్టోబర్ 9న స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోవటానికి అదొక్కటే దారి అని అతడు అనుకున్నాడు.
కానీ చోటా రాజన్ అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. 1984 జనవరిలో కుంజును చంపటానికి చోటా రాజన్ ప్రయత్నించాడు. ఆ దాడిలో కుంజు గాయపడ్డాడు కానీ ప్రాణాలతో బయటపడ్డాడు.
1984 ఏప్రిల్ 25న కుంజును పోలీసులు చికిత్స కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లినపుడు.. అక్కడ ఒక 'పేషెంట్' చేతికి కట్టుకట్టుకుని కూర్చుని ఉన్నాడు. కుంజు దగ్గర్లోకి రాగానే ఆ పేషెంట్ తన చేతికున్న కట్టును తీసేసి అతడిపై కాల్పులు మొదలుపెట్టాడు. కానీ కుంజుకు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది.
అయితే.. ఈ తరహా దాడి భవిష్యత్తులో రెండు రంగాలపై చాలా ప్రభావం చూపింది. మొదటిది దావూద్ ఇబ్రహీం ముఠా పనితీరు. రెండోది బాలీవుడ్.. సినిమాల్లో ఇప్పటికీ ఈ తరహా దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.

ఫొటో సోర్స్, PTI
దావూద్‌తో చోటా రాజన్ మొదటి భేటీ...
'డోంగ్రీ టు దుబాయ్' అనే పుస్తకంలో ఎస్. హుస్సేన్ జైదీ ఇలా రాశారు:
''ఈ వార్త విని దావూద్.. చోటా రాజన్‌ను పిలిపించాడు. ఆ భేటీ అనంతరం దావూద్ గ్యాంగ్‌లో చోటా రాజన్ చేరాడు. ఆ తర్వాత కుంజును హత్య చేయటానికి అతడు చేసిన ప్రయత్నం సఫలమైంది.''
కుంజు క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నాడు. గ్రౌండ్‌లో తెల్లటి దుస్తులు ధరించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అంతలో కొంతమంది కొత్త ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి వచ్చారు. కుంజు, అతడి అనుచరుల మీద కాల్పులు జరపటం మొదలుపెట్టారు. అండర్ వరల్డ్‌లో చోటా రాజన్ అన్న బడా రాజన్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారు.
దావూద్, చోటా రాజన్‌ల మధ్య పరస్పరం విశ్వాసం, నమ్మకం బలపడింది. కొన్నేళ్ల పాటు దావూద్ కోసం చోటా రాజన్ పనిచేశాడు.
ఇప్పుడు దావూద్ గ్యాంగ్‌లో ఇద్దరు 'చోటా'లు ఉన్నారు. 'భాయ్' కోసం ఎంత 'బడా' పని చేయటానికైనా వారు తెగిస్తారు.
1987లో దావూద్ పనులు చూసుకోవటానికి చోటా రాజన్ దుబాయ్ వెళ్లాడు. అంతకుముందు ఏడాది కిందట చోటా షకీల్ కూడా దుబాయ్ వెళ్లాడు. కానీ దావూద్‌కి చోటా రాజన్ సన్నిహితుడు. చోటా షకీల్ కాదు.
దావూద్ తనకన్నా రాజన్‌ను ఎక్కువగా నమ్ముతుడున్నాడని చోటా షకీల్ మండిపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ గ్యాంగ్‌లో చోటా రాజన్‌ను నానా అని కూడా పిలుస్తుండేవారు.
దావూద్ తరఫున బిల్డర్లు, పెద్ద మనుషుల నుండి రాజన్ వసూళ్లు చేసేవాడు. ఏ కాంట్రాక్టరైనా ఏ కాంట్రాక్టు తీసుకోవాలన్నా.. అతడు మూడు, నాలుగు శాతం మొత్తాన్ని చోటా రాజన్‌కు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP
దావూద్‌తో చోటా రాజన్‌కు ఎక్కడ చెడింది?
పోలీసుల సమాచారం ప్రకారం.. 90వ దశకంలో చోటా రాజన్ ప్రతి నెలా దాదాపు రూ. 80 లక్షలు వసూలు చేసేవాడు. ముంబైలో అతడికి రహస్యంగా 122 హోటళ్లు, పబ్బులు ఉన్నట్లు చెప్తారు.
ఈ ఆదాయంలో కొంత భాగాన్ని గ్యాంగ్ సభ్యులపై కోర్టు కేసుల మీద ఖర్చుపెట్టేవారు.
గ్యాంగ్‌లో చోటా రాజన్‌కు ప్రాబల్యం పెరుగుతుండటంతో దానిని తుడిచిపెట్టాలని చోటా షకీల్, శరద్, సునీల్‌రావత్‌లు ఆలోచించటం మొదలుపెట్టారు.
హుస్సేన్ జైదీ తన పుస్తకం 'డోంగ్రీ టు దుబాయ్'లో ఈ కథ ఇలా చెప్పారు:
''దావూద్ భాయ్.. చోటా రాజన్ గ్యాంగ్ బలాన్నంతా తన దగ్గరే పోగు చేసుకుంటున్నాడు. అతడు రేపు కుట్ర చేసి గ్యాంగ్‌ను సొంతం చేసుకోగలడు.''
''ఇలాంటి వదంతుల్ని ఎప్పుట్నించి నమ్ముతున్నావు? అతడు గ్యాంగ్ మేనేజర్ మాత్రమే.''
దావూద్ ఈ జవాబు ఇచ్చిన తర్వాత కూడా.. అక్కడున్న వారిలో చోటా రాజన్ మీద ద్వేషం తగ్గలేదు.
కొంత సేపు మౌనంగా ఉన్న తర్వాత.. చోటా రాజన్‌ను ఫోన్‌లో మాట్లాడటానికి పిలవాలని చోటా షకీల్‌కు దావూద్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
దావూద్ సోదరుడు సబీర్ ఇబ్రహీం కాస్కర్‌ను చంపిన కరీమ్ లాలా, అమీర్జాదాలను హత్య చేసే పనిని చోటా రాజన్‌కు దావూద్ అప్పగించినప్పుడు జరిగిన ఘటన ఇది.
చోటా రాజన్ ఫోన్ తీసుకోగానే.. ''ఇబ్రహీంను చంపిన వారిని నువ్వు పట్టుకోలేకపోయావు'' అని దావూద్ అన్నాడు.
''అవును భాయ్. నా కుర్రాళ్లు ఆ పనిలో ఉన్నారు. ఆ దాడి చేసిన కుర్రాళ్లు ఇప్పుడు జేజే ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంది. త్వరగా ఏదో ఒకటి చేస్తాను భాయ్'' అని చోటా రాజన్ బదులిచ్చాడు.
ఆ గదిలో కూర్చుని ఉన్న సౌత్య.. ''నాకు మరొక్క చాన్స్ ఇవ్వు భాయ్. ఆ సెక్యూరిటీని ఎలా బద్దలు కొడతానో చూపిస్తా'' అని దావూద్‌తో చెప్పాడు.
దావూద్ కాళ్లను తాకి సౌత్యా బయటకు వెళ్లాడు. దావూద్ దృష్టిలో చోటా రాజన్ స్థాయిని తగ్గించటానికి చోటా షకీల్, సౌత్యలకు ఇది అందివచ్చిన అవకాశం.
1992 సెప్టెంబర్ 12న చోటా షకీల్, అతడి అనుచరులు ఆస్పత్రిలో చొరబడటానికి ఒక కుట్ర పన్నారు. ఆస్పత్రి మీద దాడి చేయటానికి ఎ.కె.47 తుపాకీని ఉపయోగించారు. పోలీసు రికార్డుల ప్రకారం 500 రౌండ్ల కాల్పులు జరిపారు.
దావూద్ ప్రతీకారం పూర్తయింది. 'డి' గ్యాంగ్‌లో చోటా రాజన్ ప్రాబల్యం పతనం ప్రారంభమైంది.
ఇప్పుడిక దావూద్ తన ప్రత్యేక భేటీలకు చోటా షకీల్‌ను తీసుకెళ్లటం మొదలుపెట్టాడు. చోటా రాజన్‌ను పక్కన పెట్టాడు.

ఫొటో సోర్స్, AFP
1993 బాంబు పేలుళ్లు...
1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. చాలా మంది చనిపోయారు. దావూద్ మీద, అతడి అనుచరుడైన చోటా రాజన్ మీద ముంబై ప్రజల్లో ద్వేషం నిండిపోయింది.
హుస్సేన్ జైదీ తన పుస్తకంలో ఇలా రాశారు: ''చోటా రాజన్ తన వైఖరిని తెలియజేయటానికి వార్తా పత్రికలకు ఫ్యాక్స్ పంపాడు. దావూద్‌ను కూడా వెనకేసుకొచ్చాడు.
చోటా రాజన్, చోటా షకీల్‌ల మధ్య విభేదాలను తగ్గించటానికి దావూద్ ప్రయత్నం చేయలేదని కాదు. ఒకసారి ఓ సమావేశంలో దావూద్ పెద్దగా కేకలు వేశాడు. ''నేను కష్టాల్లో ఉన్నపుడు నానా నాకు స్నేహితుడిగా ఉన్నాడు. అతడికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అంతర్గత గొడవలతో బిజినెస్ చచ్చిపోతుంది'' అని చెప్పాడు.
దావూద్ సమాధానంతో చోటా షకీల్ అనుచరులు సంతృప్తి పడకపోవచ్చు. కానీ కొన్ని నెలల తర్వాత చోటా రాజన్ మనసు శాంతించింది. కానీ అతడి ప్రశాంతత ఎంతో కాలం కొనసాగలేదు. రాజన్‌ను కాఫిర్ అనటం మొదలుపెట్టాడు చోటా షకీల్. ముఖ్యమైన సమావేశాల్లో రాజన్‌కు చోటు దక్కలేదు.

ఫొటో సోర్స్, AFP
'రా అధికారితో రాజన్ సమావేశం'
1993-94 నాటికి ఈ రెండు వర్గాల మధ్య శత్రుత్వం రక్తసిక్తంగా మారింది. దావూద్ కోసం పనిచేయటం మానేశాడు రాజన్. రాజన్ ఇండియా తిరిగి రావాలని అనుకుంటున్నాడు.
కానీ చోటా రాజన్ వీసా.. అతడు దుబాయ్‌లో ఉండటానికి సాయపడిన షేక్‌ల దగ్గర ఉంది. రాజన్ తిరిగి తన దేశానికి వచ్చే దారి లేదు. కానీ అక్కడ ఇంకా ఎక్కువ కాలముంటే తన ప్రాణాలు పోతాయని అతడికి తెలుసు.
ఆ సమయంలో దావూద్ పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. నగరంలో ప్రముఖులు చాలా మందిని ఆ పార్టీకి పిలిపించారు. పార్టీకి వెళ్లటానికి చోటా రాజన్ కూడా రెడీ అవుతున్నాడు. అప్పుడు ఫోన్ రింగయింది. రాజన్ ఫోన్ తీసుకున్నాడు. 'నానా.. వాళ్లు నిన్ను చంపటానికి ప్లాన్ చేశారు' అని అపరిచిత స్వరమొకటి చెప్పింది.
హుస్సేన్ జైదీ తన పుస్తకంలో ఇలా రాశారు: ''ఫోన్ పెట్టేసిన తర్వాత చోటా రాజన్ నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్లాడు. అక్కడ రా ఆఫీసర్‌తో మాట్లాడాడు. అక్కడి నుంచి దిల్లీకి ఫోన్ కాల్స్ వెళ్లాయి. కొన్ని గంటల తర్వాత రాజన్ కఠ్మాండూ విమానంలో కూర్చుని ఉన్నాడు. అతడు కఠ్మాండూ నుంచి మలేసియా వెళ్లాడు.''
దుబాయ్‌లో చోటా రాజన్ అదృశ్యమైన తర్వాత.. చోటా షకీల్‌లో ఉత్సాహం పెరిగిపోయింది. అప్పటి వరకూ దావూద్ కుడిభుజంగా చోటా రాజన్ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్థానం చోటా షకీల్‌తో భర్తీ అయింది.
చోటా రాజన్ కొన్ని సంవత్సరాలు రహస్యంగా గడిపాడు.

ఫొటో సోర్స్, PTI
ప్రాణం కాపాడుకోవటంలో రాజన్ బిజీ...
కౌలాలంపూర్‌లో కొన్నేళ్లు తలదాచుకున్న చోటా రాజన్ తర్వాత కంబోడియా, ఇండొనేసియాలకూ మకాం మార్చాడు. చివరికి బ్యాంకాక్‌లో తనకో సురక్షిత ప్రదేశం లభించింది. తన మొబైల్ ఫోన్ నంబర్, తన ఇంటి అడ్రస్, తన ఉన్న ప్రదేశం వివరాలను రహస్యంగా ఉంచటానికి రాజన్ అన్ని ప్రయత్నాలూ చేశాడు.
మరోవైపు.. చోటా రాజన్‌ను కాల్చి చంపాలని చోటా షకీల్ కల కంటున్నాడు. ఎన్నో ప్రయత్నాలు తర్వాత.. 2000 సంవత్సరంలో చోటా రాజన్ అడ్రస్ షకీల్‌కు దొరికింది.
అదే సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన రాజన్ అపార్ట్‌మెంట్ మీద నలుగురు సాయుధులు దాడిచేశారు. పోలీసుల సాయంతో రాజన్ ఆస్పత్రిలో చేరాడు.
ఆ వార్త ఇండియాకు కూడా చేరింది. అప్పటివరకూ రాజన్ బ్యాంకాక్‌లో దాక్కున్నాడని కూడా వెల్లడైంది.
కొన్ని రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి కూడా రాజన్ అదృశ్యమయ్యాడు. ఆ ఆస్పత్రిని ఎవరో పేల్చివేస్తారన్న వార్త అతడికి అందింది. అతడు ఆస్పత్రి నాలుగో అంతస్తు నుంచి దూకి పారిపోయాడు.
ఆ దాడికి 2001లో రాజన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. చోటా షకీల్ అనుచరులు ఇద్దరిని హత్య చేయించాడు.

ఫొటో సోర్స్, AFP
ఆస్ట్రేలియాలో రాజన్ మీద దాడి...
2001 తర్వాత రాజన్ ఎక్కిడికి వెళ్లాడన్నది ఎవరికీ తెలియదు.
మళ్లీ 2001 జూన్‌లో మిడ్-డే వార్తా పత్రిక సీనియర్ క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డే.. ముంబైలోని పోవాయ్‌లో హత్యకు గురైనపుడు చోటా రాజన్ పేరు ప్రపంచానికి వినిపించింది.
ఆ హత్య కేసులో నిందితుడిగా రాజన్ పేరు బయటకు వచ్చింది. ఇదిలావుంటే.. ముంబైలో 2013లో బిల్డర్లు అజయ్ గోసాలియా, అర్షాద్ షేక్‌ల హత్యల్లో కూడా చోటా రాజన్ గ్యాంగ్‌ను అనుమానించారు.
చోటా రాజన్ అరెస్టుకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
అప్పుడు.. 2015లో ఆస్ట్రేలియాలో చోటా రాజన్ మీద దాడి జరిగిందన్న వార్త వచ్చింది. రాజన్ తన ప్రాణాలు కాపాడుకోవటానికి బాలి వెళ్లాడు.
అదే ఏడాది అక్టోబర్‌లో ఇండొనేసియాలోని బాలిలో చోటా రాజన్ అరెస్టయ్యాడు.
ఆ ఏడాది నవంబర్‌లో ఎప్పుడూ ఊహించని ఫొటోలు కనిపించాయి. వేరే వాళ్లకి తుపాకీ గురి పెట్టి బెదిరించే చోటా రాజన్ చేతులకు బేడీలు వేసి ఉన్న ఫొటోలవి. అతడు ఆరెంజ్ రంగు డ్రెస్‌లో పోలీసుల మధ్య ఖైదీగా నిస్సహాయంగా ఉన్నాడు.
డ్రగ్స్, ఆయుధాలు, వసూళ్లు, స్మగ్లింగ్, హత్య తదితర 70 కేసుల్లో నిందితుడైన చోటా రాజన్.. జర్నలిస్ట్ జే డే హత్య కేసులో దోషిగా తేలాడు.
చోటా రాజన్ ఆరంభంలో బ్లాక్ టికెట్లు అమ్మిన ముంబైలోనే.. కోర్టు అతడికి జీవిత ఖైదు శిక్ష విధించింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








