బీబీసీ పరిశోధన: మోస్ట్‌వాంటెడ్ హాఫిజ్ బ్రిటన్‌లోనూ జిహాద్ ప్రచారం చేశారు

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచ మోస్ట్‌వాంటెడ్, 26/11 ముంబయి దాడుల మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న హాఫిజ్ సయీద్ బ్రిటన్‌లో గుట్టుగా సాగించిన కార్యకలాపాల వివరాలు బీబీసీ పరిశోధనలో బట్టబయలయ్యాయి.
2001లో అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై దాడికి కొన్నేళ్ల ముందు.. బ్రిటిష్ ముస్లింలను జిహాద్ వైపు మళ్లించేందుకు హాఫిజ్ స్కాట్లాండ్‌లో పర్యటించినట్టు వెల్లడైంది.
1995లో పలు బ్రిటిష్ ప్రార్థనా మందిరాలకు ఆయన వెళ్లారన్న విషయాన్ని బీబీసీ రేడియో 4లో 'ది డాన్ ఆఫ్ బ్రిటిష్ జిహాద్’ పేరుతో ప్రసారమైన డాక్యుమెంటరీ బహిర్గతం చేసింది.
అదే ఏడాది ఆగస్టులో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో హాఫిజ్ పర్యటించాడు. 'ముస్లింలలో జిహాద్ భావజాలం నిండి ఉంటే ప్రపంచాన్ని వాళ్లే పాలించేవారు. అలా లేకపోవడం వల్లనే నేడు అణచివేతకు గురవుతున్నారు' అంటూ హాఫిజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు బయటపడింది.

ఫొటో సోర్స్, Getty Images
2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి హాఫిజ్ సయీదేనంటూ భారత్ ఆరోపిస్తోంది.
ఆ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. భారత్ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందంటూ సయీద్ చెబుతూ వస్తున్నారు.
2001 నవంబర్ 11న న్యూ యార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్-ఖైదా దాడికి పాల్పడింది. ఆ దాడిలో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ దాడి కంటే ముందే బ్రిటిష్ ముస్లింలలో విప్లవ భావజాలం ఉందా? అన్న విషయాన్ని గుర్తించేందుకు బీబీసీ పరిశోధించింది.

ఫొటో సోర్స్, AFP
మ్యాగజీన్‌లో దాగివున్న గుట్టు
1995లో బ్రిటన్‌లో హాఫిజ్ సయీద్ పర్యటించినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు లష్కర్-ఏ- తోయిబా(ఎల్‌ఈటీ) ఓ మ్యాగజీన్‌లో ప్రచురించి ఉంది.
అందులో ఉర్దూలో రాసి ఉన్న కథనాలను బీబీసీ ఇన్వెస్టిగేషన్ బృందం పరిశీలిచింది.
ఇంగ్లాండ్‌లోని ఓల్డమ్ పట్టణంలో ఉన్న ప్రార్థనా మందిరంలో మతపెద్ద ఆ కథనాలను రాశారు. హాఫిజ్ కు ఆశ్రయం కల్పించింది కూడా ఆయనే.
ఆ కథనాల ప్రకారం.. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఉన్న ప్రధాన మసీదుకు హాఫిజ్ వెళ్లారు. అక్కడ భారీగా గుమికూడిన జనాలను ఉద్దేశించిన ప్రసంగించారు.
'జిహాద్ స్ఫూర్తిని అంతం చేసేందుకు.. ముస్లింల మధ్య కొట్లాట పెట్టేందుకు యూదులు వందల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో.. రాజకీయంగా ముస్లింలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ముస్లింలను ఎదగనీయకుండా చేసే ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నారు" అంటూ హాఫిజ్ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
"1995లో హాఫిజ్ అందరికీ తెలిసిన తీవ్రవాది. కశ్మీర్‌లో తీవ్రవాద చర్యలకు పాల్పడ్డట్టు అతని పై అభియోగాలున్నాయి. అలాంటి వ్యక్తికి బ్రిటన్‌లోని ఓ ప్రార్థనా మందిరం ద్వారాలు తెరవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది" అని బీబీసీ రేడియో 4 డాక్యుంమెంటరీ ప్రొడ్యూసర్ సాజిద్ ఇక్బాల్ అన్నారు.
ఆ ప్రార్థనా మందిరాన్ని నడుపుతున్నది హాఫిజ్ సామాజిక వర్గానికి చెందిన బ్రిటిష్ ముస్లింలేనని తెలిసింది.
ఆ పర్యటనలో భాగంగా హాఫిజ్ బర్మింగ్‌హామ్ కూడా వెళ్లారు.
అక్కడ ప్రసంగిస్తూ.. "జిహాద్ కోసం అందరమూ కదులుదాం" అని పిలుపునిచ్చారు. హిందూ మతానికి వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత.. లెస్టర్ పట్టణంలో 4,000 మంది పాల్గొన్న సదస్సులోనూ ఆయన మాట్లాడారు.
దాంతో "జిహాద్ శిక్షణ పొందేందుకు కొన్ని వందల మంది యువకులు ఆసక్తి చూపారని" ఆ ఉర్దూ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
2001లో బ్రిటన్ నిషేధం
హాఫిజ్ సయీద్ పర్యటనతో పాటు, అతను ప్రారంభించిన మిలిటెంట్ గ్రూపు లష్కర్-ఏ- తోయిబా(ఎల్‌ఈటీ) పైనా 2001 మార్చిలో బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
అదే ఏడాది సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూ యార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్-ఖైదా దాడికి పాల్పడింది. ఆ దాడిలో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
2008 నవంబర్ 26న ముంబయిలో లష్కర్-ఏ- తోయిబా దాడికి తెగబడింది.
ప్రపంచ మోస్ట్‌వాటెడ్‌గా ఉన్న హాఫిజ్ సయీద్ ఏనాడూ శిక్ష అనుభవించలేదు. 26/11 ముంబయి దాడుల అనంతరం అతన్ని గృహనిర్బంధం చేసిన పాకిస్తాన్.. ఇటీవలే విడుదల చేసింది.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








