పిల్లలపై అత్యాచారం: ఉరిశిక్షతో న్యాయం లభిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
అయితే అత్యాచారం కేసుల్లో మరణశిక్ష వల్ల న్యాయం లభిస్తుందా? గణాంకాలను పరిశీలిస్తే వాస్తవం వేరేగా ఉంది.
ఈ క్రింది ఐదు అంశాలూ ఉరిశిక్ష వల్ల ఫలితం ఉండదని వెల్లడిస్తున్నాయి.
1. మరణశిక్ష వల్ల అత్యాచారాలు ఆగలేదు
2012లో నిర్భయ ఘటన అనంతరం, అత్యాచారాలకు అత్యధికంగా మరణశిక్షను విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ శిక్షతో నేరస్తులు భయపడిపోతారని, తద్వారా అత్యాచారాలు తగ్గుతాయని భావించారు.
ఈ చట్టం అమలులోకి వచ్చాక, నిర్భయ, శక్తి మిల్ సామూహిక అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించారు.
కానీ తరువాత జరిగిందేమిటి? జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2015లో 34,651 అత్యాచార కేసులు, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2012లో ఈ సంఖ్య 24,923 మాత్రమే.
అంటే, రెండు అత్యంత తీవ్రమైన అత్యాచార ఘటనల్లో దోషులకు మరణశిక్ష విధించిన తర్వాత కూడా అత్యాచారాల సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదు.
నిర్భయ ఘటన అనంతరం జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రకారం రేప్ కేసులను నమోదు చేసే విషయంలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని మనం గుర్తుంచుకోవాలి.
నమోదైన రేప్ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం.

ఫొటో సోర్స్, Getty Images
2. రుజువు కాని నేరాలు
పిల్లలపై అత్యాచారం విషయంలో దోషనిర్ధారణ చాలా తక్కువ.
18 ఏళ్ల లోపు వారిపై అత్యాచారాలు
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2016లో పిల్లలపై అత్యాచారాలకు సంబంధించి 64,138 కేసులు పోక్సో చట్టం కింద నమోదు కాగా, వాటిలో కేవలం 3 శాతం కేసుల్లో మాత్రం వాటిని నేరాలుగా నిరూపించగలిగారు.
అంతే కాదు, పిల్లలపై లైంగిక హింస కేసులు పెరుగుతూ పోయాయి.
అందువల్ల, నేరమే నిరూపించలేకపోయినప్పుడు, ఎవరిని ఉరి తీస్తారు?

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages
3.దోషులు బయటివాళ్లు కాదు, దగ్గరివారే..
ఎన్‌సీఆర్‌బీ 2016 నివేదిక ప్రకారం మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల్లో 94 శాతం దోషులు ఆ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లు, దగ్గర వాళ్లే అయి ఉంటున్నారు.
దోషులలో 29 శాతం మంది ఇరుగుపొరుగు, 27 శాతం పెళ్లి చేసుకుంటామన్న హామీ ఇచ్చినవాళ్లు, 6 శాతం బంధువులు, మిగతా 30 శాతం ఆ కుటుంబానికి దగ్గరివారు.
పిల్లలపై నమోదైన అత్యాచారాల కేసులు -
గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, సగటున 90 శాతం పైగా కేసుల్లో దోషి బాధితులకు దగ్గరివారే అయి ఉంటున్నారు.
అందువల్ల చాలా కేసుల్లో, దోషితో దగ్గర సంబంధాల కారణంగా, ఫిర్యాదు వెనక్కి తీసుకొమ్మని బాధితులపై ఒత్తిడి ఉంటోంది.
బాధితులు, వారి కుటుంబం - దోషిపై ఫిర్యాదు చేయకుండా ఉండడానికి మరణశిక్ష కూడా ఒక కారణం కావచ్చు.
ఇలాంటి కేసుల్లో, తీవ్రమైన శిక్షకు భయపడేది నేరస్తులు కాదు. దానికి బదులుగా, అత్యాచార బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
4. పోలీసులపై చర్యలేవీ?
ఈ కొత్త ఆర్డినెన్స్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల లోపు కేసు విచారణ పూర్తి చేయాలని చెబుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అది చాలా కష్టం.
ప్రముఖ న్యాయవాది వృందా గ్రోవర్ ప్రకారం, నేటి వరకు భారతదేశంలో మూడు నెలల్లో విచారణ ముగిసిన అత్యాచారం కేసు లేదు.
''మూడు నెలల లోపు విచారణ పూర్తి కాకుంటే ఏమవుతుంది? పోలీసులపై కానీ, విచారణాధికారి పైన కానీ చర్య తీసుకుంటారా లేక బాధితులకు ఏదైనా పరిహారం చెల్లిస్తారా? ఆర్డినెన్స్‌లో ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు'' అని వృందా అన్నారు.
2016 చివరి నాటికి, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 90 శాతం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
రాష్ట్రాలవారీగా పిల్లలపై అత్యాచారాలు -
ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన శిక్షకన్నా, శిక్షను విధించడంలో జరుగుతున్న ఆలస్యమే పెద్ద సమస్య. ఎందుకంటే, కేసు విచారణ గడువు పెరిగే కొద్దీ, బాధితుల సమస్యలు మరింత పెరుగుతాయి.
5. పని చేయని ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టులు
మైనర్లపై లైంగిక హింసల కేసుల విచరాణకు పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలన్న చర్చలు జరుగుతున్నాయి. కానీ పోక్సో కోర్టు అనేది ఒక భ్రమే అని వృందా గ్రోవర్ అభిప్రాయపడ్డారు.
దేశంలో దిల్లీలో తప్ప, ఇతర ఏ రాష్ట్రంలోనూ పోక్సో కోర్టులు లేవని ఆమె తెలిపారు.
కొత్త ఆర్డినెన్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెబుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో లైంగిక అత్యాచారానికి గురైన అన్ని వయసు మహిళలు, పిల్లల కేసులను విచారిస్తారు.
''ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినా, జడ్జీలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పటికే కేసుల ఒత్తిడిలో తలమునకలుగా ఉన్న జడ్జీలే ఈ కోర్టులకు కూడా వస్తారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంచి ప్రత్యామ్నాయం కాదేమో అనిపిస్తోంది'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరో పెద్ద ప్రశ్న - ఇప్పుడు మైనర్ బాలురపై అత్యాచారాలు, లైంగిక దాడుల కేసులు ఏమవుతాయి? ఎందుకంటే కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో బాలురపై అత్యాచారాల ప్రస్తావన లేదు. అదే పోక్సో చట్టం 2012లో బాలురు, బాలికలు - ఎవరిపై లైంగిక హింస జరిగినా ఒకే రకమైన శిక్ష విధించే అవకాశం ఉండేది.
అయితే మీడియా వార్తల ప్రకారం, పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
స్వచ్ఛంద సంస్థ 'ఇండియాస్పెండ్' నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, నిర్భయ ఘటన తర్వాత, దిల్లీలో 2013లో ఆరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు.
లైంగిక అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనేది వీటి లక్ష్యం.
ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 2014లో 400 కేసులను పరిష్కరిస్తే, 2012లో సాధారణ కోర్టులే 500 కేసులను పరిష్కరించాయి.

ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరుపై పలు ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అనూప్ సురేంద్రనాథ్ ప్రకారం - పోలీసులు, న్యాయవ్యవస్థ చాలా మెల్లగా విచారణ చేయడానికి చాలా కారణాలున్నాయి.
దీనికి ఒక ప్రధాన కారణం జనాభాతో పోలిస్తే పోలీసులు, జడ్జీల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
''ఐక్యరాజ్య సమితి అంచనా మేరకు ప్రతి 454 మందికి ఒక పోలీసు అధికారి ఉండాలి. కానీ హోం శాఖ 2016లో వెలువరించిన నివేదిక ప్రకారం మనదేశంలో 514 మందికి ఒక పోలీసు అధికారి మాత్రమే ఉన్నారు'' అని ఆయన తెలిపారు.
దీనితో పాటు, ఐక్యరాజ్య సమితి అంచనా మేరకు ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాలి. అయితే ప్రస్తుతం వారి సంఖ్య 19 మాత్రమే ఉంది.
ఈ గణాంకాలు, వాస్తవాలను గమనిస్తే, ప్రభుత్వం నిజంగా పిల్లలకు, మహిళలకు న్యాయం లభించాలని భావిస్తుంటే, కొత్త చట్టానికి చేయడానికి బదులు క్రిమినల్ న్యాయవ్యవస్థను సంస్కరించి, ప్రస్తుతం ఉన్న చట్టాలనే సమర్థంగా అమలు చేయాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








