అభిప్రాయం: ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/Getty Images
- రచయిత, వుసతుల్లా ఖాన్, సీనియర్ జర్నలిస్టు
- హోదా, బీబీసీ కోసం, పాకిస్తాన్ నుంచి
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా నాయకుల గురించి వెల్లువెత్తిన పోస్టుల్ని చదివి నాకు విసుగొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన విభజన, తదనంతరం మూడేళ్లు పోట్లాడుకుని, గత 65 ఏళ్లుగా వేల సార్లు పరస్పరం బెదిరించుకుని, లక్షల టన్నుల కొద్దీ విద్వేషాల్ని పెంచుకుని, సరిహద్దులో అడుగడుగునా సైనికుల్ని మొహరించి.. ఇప్పుడు వాటన్నింటినీ పక్కనపెట్టి కరచాలనం చేసుకున్నారు. మరి భారత్-పాకిస్తాన్ అలా ఎందుకు చేయలేవు?
అయితే, కొరియాలను భారత్-పాకిస్తాన్‌లతో పోల్చడం సరికాదన్నది నా అభిప్రాయం. ఉభయ కొరియాలు.. తూర్పు, పశ్చిమ జర్మనీల్లాగా రెండు ప్రాంతాలు. ప్రచ్ఛన్న యుద్ధానికి గుర్తులు. భారత్, పాకిస్తాన్‌లు మాత్రం రెండు భిన్న దేశాలు.
బహుశా ఉభయ కొరియాలు జర్మనీలాగే ఒకరోజు ఏకమైపోవచ్చు. ఎందుకంటే అవి కలవాలనే కోరుకుంటున్నాయి. రెండు కొరియా దేశాల నాయకుల ఆలోచనా ధోరణి వేర్వేరు కావొచ్చు.. కానీ, ఆ రెండు దేశాల్లోనూ ఒకటే భాష, ఒకటే జాతి, ఒకటే రంగు, ఒకటే ఆహారం, ఇరు దేశాల చరిత్ర కూడా ఒక్కటే.
ఒకవేళ ఉత్తర కొరియాలో ఎక్కువ మంది ముస్లింలు, దక్షిణ కొరియాలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారనుకోండి, 2018లో.. ప్రస్తుతమున్న ప్రపంచంలో.. 72 ఏళ్ల విభజన గురించి వాళ్లు ఒకరి గురించి మరొకరు ఏ విధంగా ఆలోచిస్తుండవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
కలయిక అసాధ్యమా?
కొరియన్ల ముక్కులు ఎలాంటివంటే.. చాలా సులభంగా అవి కలసిపోతాయి. కానీ, మన ముక్కులు మాత్రం చాలా పొడవైనవి. ఒకదాన్ని మరొకటి కోసేసుకుంటాయే తప్ప కలవటం అసాధ్యం. అవి విరిగి పడతాయే తప్ప ఏమాత్రం తగ్గవు.
ఇలాంటి పొడవాటి ముక్కులు పెట్టుకుని కూడా మనం సామాన్య దేశాల్లాగా కలసి జీవించలేమా? కచ్చితంగా జీవించగలం, కానీ ఎందుకు జీవించాలి? అలా జీవించటం మొదలు పెడితే విసుగు మినహా సాధించేదేముంది? మిగతా ప్రపంచానికి, మనకీ తేడా ఏముంటుంది?
ఏదేమైనా మేము, మీరు గాలిబ్‌ను అంగీకరిస్తాం. ఆయన కొరియన్ల గురించే కాదు మన గురించి కూడా ఇలా చెప్పుకొచ్చారు..
‘‘కలయిక అసాధ్యమైతే.. విరోధమే మేలు’’
మన వద్ద కశ్మీర్ ఉంది, అణ్వాయుధాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, హఫీజ్ సయీద్ ఉన్నాడు, రా ఉంది, ఐఎస్ఐ ఉంది, ఆఫ్ఘానిస్తాన్ ఉంది, వాఘా-అటారీ పరేడ్ ఉంది, ఒకరినొకరు కలవలేకపోవటానికి చాలా సాకులున్నాయి, వ్యంగ్యాస్త్రాలున్నాయి, తరతరాలను అజ్ఞానుల్ని చేసేందుకు అవసరమైన నకిలీ చరిత్రను చదివి వినిపించే కర్మాగారాలు ఉన్నాయి.
కొరియన్ల వద్ద ఏమున్నాయి? అసహాయ చూపులున్న, వయసు మళ్లిన తల్లులు తప్ప? కాబట్టి కొరియన్లు ఎక్కడ.. మనం ఎక్కడ?
ఇవి కూడా చదవండి:
- ‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’
- ఉభయ కొరియాల చర్చలతో శాంతి నెలకొంటుందా?
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- సరిహద్దుకు ఇరువైపులు.. భర్తల కోసం ఎదురుచూపులు
- భారత్, పాక్, మధ్యలో ఓ ట్విటర్ అకౌంట్!
- పాకిస్తాన్ సెనెటర్‌గా ఎన్నికైన హిందూ మహిళ
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- భారత్ పాక్ మధ్య టమాటో నలిగిపోతోంది?
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








