భారత్-పాక్.. మధ్యలో వైద్య వీసా

భారత్ - పాకిస్తాన్‌ల మధ్య మెడికల్ వీసాల విషయంలో పైకి కనిపించని అగాధం నెలకొంది. ఇతర దేశాల నుంచి వచ్చే రోగులతో పోలిస్తే భారత్‌లో వైద్యం కోసం పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్లు ఖర్చు చేసే మొత్తమే ఎక్కువని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ నుంచి వైద్యం కోసం భారత్‌కు వచ్చిన రోగుల్లో డాక్టర్ తైముర్ అల్ హసన్ ఒకరు. లాహోర్‌లో ఉండే ఆయన 2015లో తొలిసారి దిల్లీకి వచ్చి క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు.
సర్జరీ విజయవంతం కావడంతో ఆయన కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నా, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆయనకు మళ్లీ క్యాన్సర్ సోకింది.
ఈసారి కూడా భారత్‌కు వచ్చి చికిత్స చేయించుకుందామని ఆయన భావించారు. కానీ అది అంత సులువుగా సాధ్యం కాలేదు.
దాదాపు ఆర్నెల్లు వీసా కోసం ప్రయత్నించి ఆశలు వదులుకునే సమయంలో తైముర్ చెల్లెలు చేసిన ఓ ట్వీట్ ద్వారా ఆయనకు భారత్‌కు వచ్చే అవకాశం దొరికింది.
వీసా దొరకదని తైముర్ నిశ్చయించుకున్న సమయంలో భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోదరుడి వీసా కోసం అభ్యర్థిస్తూ ఆయన చెల్లెలు ఒక ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌కి స్పందించిన సుష్మ, మరుసటి రోజే ఆయనకు వీసా అందేలా చూశారు. వెంటనే ఆయన చికిత్స కోసం దిల్లీ బయల్దేరారు.

‘దిల్లీ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. అక్కడి భాష, సంప్రదాయాలు మాకు దగ్గరగా ఉంటాయి’ అంటారు తైముర్.
సుష్మా స్వరాజ్ చొరవతో తైముర్ పని సులువైనా, చాలా మంది పాకిస్తాన్ ప్రజలకు మెడికల్ వీసా పొందడం కష్టంగా మారుతోంది.
ఇటీవల భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2015-16లో 1921మంది పాకిస్తాన్ రోగులకు మెడికల్ వీసా లభించింది. ఆసియాలోనే ఇతర దేశాల ప్రజలకు దక్కిన వీసాలతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ.
గతంలో భారత్ నెలకు 500మంది పాకిస్తాన్ రోగులకు మెడికల్ వీసాలు అందించేదనీ, ఇటీవలి కాలంలో ఆ సంఖ్య బాగా తగ్గిపోయిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్.ముహమ్మద్ ఫైసల్ అన్నారు.
‘వీసాలు ఉచితంగా రావు. దానికోసం ప్రజలు చాలా డబ్బుని ఖర్చు చేస్తున్నారు. రెండు దేశాల మధ్య మానవతా దృక్పథాన్ని చాటుకోవడానికి లభించే అవకాశాల్లో మెడికల్ వీసా జారీ ఒకటి’ అనేది ఫైసల్ అభిప్రాయం.
‘ప్రస్తుతం గౌరవనీయులైన మంత్రి (సుష్మా స్వరాజ్) ట్విటర్ ద్వారా వీసాల కోసం రోగులన్ని ఎంపిక చేస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ రోగుల నుంచి భారత్‌కు వచ్చే తలసరి ఆదాయ సగటే ఎక్కువ. సగటున 1.8లక్షల రూపాయలను భారత్‌లో చికిత్స కోసం పాకిస్తాన్ రోగులు ఖర్చు చేస్తున్నారు.
పాకిస్తాన్‌లోని రోగులు కాలేయ మార్పిడి, క్యాన్సర్, చిన్న పిల్లల వ్యాధులు మొదలైన వాటి చికిత్స కోసం భారత్‌కు రావడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
పాకిస్తాన్ రోగులకు మెడికల్ వీసాల జారీపై భారత్ నిషేధం విధించిందని 2017 మేలో పాకిస్తాన్‌లోని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ భారత్ ఆ వార్తలను నిరాకరించింది.
వీసాలపై నిషేధం విధించలేదనీ, కాకపోతే ఉన్నత స్థాయి అధికారులు వాటి జారీని పర్యవేక్షిస్తున్నారనీ భారత్ అంటోంది.
దేశ విభజన జరిగిన నాటి నుంచీ భారత్ - పాక్‌ల సంబంధాలు ఎత్తు పల్లాలను చవిచూస్తున్నాయి. 2016లో పఠాన్‌కోట్ వాయుసేన స్థావరంపై దాడి, భారత మాజీ నావికదళ అధికారి కులభూషణ్ యాదవ్ అరెస్టు మొదలైన సంఘటనలు, దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఫొటో సోర్స్, Youtube/Rajyasabha TV
సుష్మా స్వరాజ్ ట్విటర్ టైం లైన్‌లో కుప్పలు తెప్పలుగా వీసా కోసం అభ్యర్థనలు కనిపిస్తాయి. వాళ్లలో కొందరు మాత్రమే ఆ ప్రయత్నంలో సఫలమయ్యారు.
పాకిస్తాన్‌లో ఇటీవల అడుగుపెట్టిన భారతీయ దౌత్యవేత్త అజయ్ బిసారియా కూడా మెడికల్ వీసాల అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని భరోసా ఇచ్చారు.
‘ప్రజల కోసం పనిచేయడం మాకు చాలా ముఖ్యం. అందుకే ఈ మెడికల్ టూరిజం చాలా ప్రాధాన్యమున్న అంశం. సమస్యల్లో ఉన్నవాళ్లకు మెడికల్ వీసా చాలా భరోసానిస్తుంది. ఈ అంశాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తాం’ అని అజయ్ బిసారియా బీబీసీ మాట్లాడుతూ చెప్పారు.
వైద్యం కోసం భారత్‌లో అడుగుపెట్టిన తైముర్ అల్ హసన్ చికిత్సలో భాగంగా మూడు నెలలకోసారి భారత్‌కు రావల్సి ఉంటుందని ఆయనకు చికిత్సను అందించే దిల్లీ వైద్యుడు సుభాష్ గుప్తా అంటారు.
సుష్మా స్వరాజ్ ప్రస్తుతానికి వీసా అందించడంపై తైముర్ సంతోషంగా ఉన్నా, భవిష్యత్తులో అది కొనసాగుతుందో లేదోనని ఆయన కలవరపడుతున్నారు.
చాలా మంది పాకిస్తానీల లానే తైమర్ జీవితం కూడా రాబోయే రోజుల్లో భారత్ రూపొందించే మెడికల్ వీసా పాలసీపైనే ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









