నిజమెంత: అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?

ఫొటో సోర్స్, Reuters
అణ్వాయుధాలను ప్రయోగించే బటన్ ఎప్పుడూ తన బల్లపైనే ఉంటుందని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ హెచ్చరించగా, తన వద్ద కూడా 'న్యూక్లియర్ బటన్' ఉందని, అది కిమ్ వద్ద ఉన్న మీట కన్నా పెద్దది, శక్తిమంతమైనది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్విటర్'లో స్పందించారు.
ఎవరి మీట ఎంతనే చర్చను పక్కనబెడదాం. అసలు అమెరికా న్యూక్లియర్ బటన్ అధ్యక్షుడు ట్రంప్ వద్దే ఉంటుందా?
ఉండదు! ఔను, వాస్తవానికి మీట అధ్యక్షుడి వద్ద ఉండదు. మరి అణ్వస్త్రాలకు సంబంధించి అధ్యక్షుడి వద్ద ఏముంటుంది?
గత ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంట ఒక సైనిక సహాయకుడు లెదర్ బ్రీఫ్‌కేసు పట్టుకొని వచ్చారు. ట్రంప్ ప్రమాణం చేయగానే, ఆ సైనిక సహాయకుడు, ఆ బ్రీఫ్ కేసుతోపాటు ట్రంప్ వద్దకు వెళ్లారు.
ఆ బ్రీఫ్‌కేసును న్యూక్లియర్ 'ఫుట్‌బాల్' అంటారు. అధ్యక్షుడు అణ్వాయుధాలను ప్రయోగించాలనుకుంటే ఇది కీలకమవుతుంది. ఇది ఎప్పుడూ అధ్యక్షుడి వెంట ఉంటుంది.
ట్రంప్ గోల్ఫ్ ఆడేటప్పుడు కూడా ఇది ఆయన వెంటే ఉంటుందని ఒక నిపుణుడు ఆగస్టులో సీఎన్ఎన్‌తో చెప్పారు. గోల్ఫ్ కోర్సులో అధ్యక్షుడి వెంటే ఒక బగ్గీలో ఇది అనుసరిస్తుంటుందని వెల్లడించారు.
అణ్వస్త్రాన్ని ప్రయోగించే విధానం ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో సాంకేతిక అంశాలతోపాటు సంకేత నామాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఈ ఫుట్‌బాల్‌లో ఏముంటుంది?
వాస్తవానికి ఈ ఫుట్‌బాల్‌లో ఏ బటనూ ఉండదు. అప్పటికే సిద్ధం చేసిన యుద్ధ వ్యూహాలతో కూడిన పుస్తకాలు, సమాచార సాధనాలు ఉంటాయి. తక్షణ నిర్ణయాలు తీసుకొనేందుకు వీలు కల్పించేలా ఈ పుస్తకాలు ఉంటాయి.
అధ్యక్షుడి వద్ద 'బిస్కట్' అనే ఒక కార్డు ఉంటుంది. కొన్ని కోడ్‌లతో కూడిన ఈ కార్డును అధ్యక్షుడు ఎప్పుడూ తన వద్ద ఉంచుకోవాలి.
అణ్వాయుధ దాడి జరపాలని సైన్యానికి అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వాలనుకుంటే, ఈ కోడ్‌లను వాడి సైన్యానికి తానెవరో తెలియజేయాలి.
నిరుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ‘‘ఈ బిస్కట్‌ను అందుకోవడం మీకెలా అనిపిస్తోంది’’ అని ఆయన్ను 'ఏబీసీ న్యూస్' అడిగింది.
''బిస్కట్ గురించి, ఇది సృష్టించగల విధ్వంసం గురించి అధికారులు వివరించినప్పుడు చాలా ఉద్విగ్నంగా అనిపించింది. చాలా ఆందోళనగా కూడా అనిపించింది'' అని ట్రంప్ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Thinkstock
బిస్కట్ పోగొట్టుకున్న క్లింటన్
బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ బిస్కట్‌ను పోగొట్టుకొన్నారని ఆయన వద్ద సైనిక సహాయకుడిగా పనిచేసిన రాబర్ట్ 'బజ్' ప్యాటర్‌సన్ గతంలో వెల్లడించారు.
క్లింటన్ ఈ బిస్కట్‌ను తన క్రెడిట్ కార్డులతో కలిపి రబ్బర్ బ్యాండ్ వేసి, ట్రౌజర్ జేబులో పెట్టుకొనేవారని ఆయన తెలిపారు.
మోనికా లూయిన్‌స్కీ ఉదంతం వెలుగులోకి వచ్చిన రోజు ఉదయం, కొంత కాలంగా తన కార్డు కనిపించడం లేదని క్లింటన్ చెప్పారని ప్యాటర్‌సన్ వివరించారు.
క్లింటన్ వద్ద ఉండే బిస్కట్ కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయిందని మాజీ సైనికోన్నతాధికారి జనరల్ హ్యూగ్ షెల్టన్ కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
దాడికి ఆదేశాలు ఎలా వెళ్తాయి?
అణ్వాయుధ దాడికి ఆదేశాలిచ్చే అధికారం అధ్యక్షుడికి మాత్రమే ఉంది. అమెరికా సైన్యంలో అత్యున్నత అధికారి అయిన 'ఛైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్'కు ఆయన ఆదేశాలిస్తారు.
ఆ ఆదేశాలు నెబ్రాస్కా రాష్ట్రంలోని ఆఫుట్ వైమానిక స్థావరంలో ఉండే అమెరికా వ్యూహాత్మక కమాండ్ ప్రధాన కార్యాలయానికి వెళ్తాయి.
అక్కడి నుంచి ఆదేశాలు క్షేత్రస్థాయి బృందాలకు చేరతాయి. ఈ బృందాలు సముద్రంలోనూ ఉండొచ్చు. ఆదేశాలన్నీ కోడ్‌ల రూపంలోనే వెళ్తాయి.
అధ్యక్షుడి ఆదేశాలను ధిక్కరించవచ్చా?
అధ్యక్షుడు సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్. ఆయన మాటే అంతిమం. అయినా కొన్ని సందర్భాల్లో ఆయన ఆదేశాలు అమలుకాని పరిస్థితులూ తలెత్తే అవకాశముంది.
అణ్వస్త్ర ప్రయోగానికి ఆదేశాలిచ్చేందుకు అధ్యక్షుడికి ఉన్న అధికారాలపై 40 ఏళ్లలో తొలిసారిగా నిరుడు నవంబరులో అమెరికా పార్లమెంటు కాంగ్రెస్ పరిశీలన జరిపింది.

సంబంధిత కమిటీ ఎదుట 2011-13 మధ్య అమెరికా వ్యూహాత్మక కమాండ్ కమాండర్‌గా వ్యవహరించిన సి.రాబర్ట్ కెహ్లర్ హాజరయ్యారు. ఈ వ్యవహారాల్లో ఆయన నిపుణుడు.
అణ్వస్త్ర దాడికి అధ్యక్షుడు ఆదేశాలు ఇస్తే అవి చట్టబద్ధంగా ఉంటేనే పాటిస్తానని, ఇలాగే వ్యవహరించాలని తమకు శిక్షణలో చెబుతారని కమిటీకి కెహ్లర్ తెలియజేశారు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేనని చెబుతానని కెహ్లర్ పేర్కొన్నారు.
''అలా చెబితే ఏం జరుగుతుంది'' అని కమిటీలోని ఒక సెనేటర్ ప్రశ్నించగా, ''ఏమో, నాకు తెలియదు'' అని ఆయన బదులిచ్చారు. ఈ సమాధానం విని కమిటీ సభ్యులంతా నవ్వేశారు.
మా ఇతర కథనాలు:
- అమెరికా: ‘భారత్‌కు ఇచ్చే విలువ చైనాకు ఇవ్వం’
- మా త్యాగాలను అమెరికా మరచిపోయింది: పాక్
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- BBC SPECIAL: భారత్ ఒత్తిడితోనే తమపై చర్యలన్న హాఫిజ్ సయీద్
- లైంగిక వేధింపుల బాధితులకు హాలీవుడ్ నటీమణుల మద్దతు
- 2017: శాస్త్ర పరిశోధనా రంగాల్లో జరిగిన 8 కీలక పరిణామాలివే!
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- తెలంగాణ: బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











