4 కి.మీ. ఇవతల కిలో టమాటో రూ.3 అవతల రూ.80

- రచయిత, షుమైలా జెఫ్రీ, బీబీసీ ప్రతినిధి, లాహోర్
- హోదా, రవిందర్ సింఘ్ రాబిన్, బీబీసీ ప్రతినిధి
భారత్ పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉన్నాయో, ఈ దేశాల మధ్య వ్యాపారం చేయడమూ అంతే కష్టంగా ఉంది. వాఘా బోర్డర్ ఎగుమతులకు చాలా సులువైన, అనువైన మార్గం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
లాహోర్‌లో పొగమంచు దట్టంగా అలుముకుంది. ముహమ్మద్ సిద్ధిక్ తన కూరగాయల బండిని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ రోజైనా తన వ్యాపారం బాగా సాగాలని ఆశిస్తున్నాడు.
ఇతను లాహోర్ జిల్లాలోని 'వాఘా' గ్రామంలో కూరగాయలు అమ్ముతాడు. భారత దేశం నుంచి వాఘా 4 కి.మీ. దూరంలో ఉంది.
"ఒక బాక్స్ టమాటో ధర రూ.858. దీంతో కేవలం 10 కిలోలు మాత్రమే వస్తాయి. అంటే కిలో రూ.85 ఈ రేటుకు ఎలా అమ్మాలో తెలియడం లేదు. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడంలేదు."
సిద్ధిక్ చాలా అసహనంతో ఉన్నాడు. వ్యాపారం బాలేదు.
"ప్రజలు టమాటోలు వాడటం మానేశారు. ఇంత రేటు పెట్టి ఎలా కొంటారు? చూడండి.. భారత దేశానికీ మాకూ దూరం 4 కి.మీ. మాత్రమే. అందువల్ల నిజానికి మాకు చాలా చవకగా దొరకాలి. కానీ రేటు విపరీతంగా పెరిగిపోయింది" అని బోర్డర్ సెక్యూరిటీ పోస్ట్ వైపు వేలు చూపిస్తూ వివరించాడు.

వాఘాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్‌సర్‌లో కిలో టమాటో ధర కేవలం 3 రూపాయలు మాత్రమే ఉంది. కానీ పాక్ సరిహద్దుల్లో ఈ ధరల్లో తేడాలు అధికంగానే ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా.. వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌కు పళ్లు, కూరగాయలను ఎగుమతి చేస్తోంది. కానీ కొన్ని నెలలుగా ఈ ఎగుమతులు నిలిచిపోయాయి.
అమృత్‌సర్‌కు చెందిన ఇండో-పాక్ ఎగుమతుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజ్‌దీప్ ఉప్పల్ దీనికి కారణాలను వివరించారు.
"గత సంవత్సరం నుంచి భారత్ ఎగుమతులపై పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. త్వరగా పాడయ్యే పళ్లు, కూరగాయలపై ఈ ఆంక్షలు ఉన్నాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను మేం తీర్చగలం. వారికి కావలసిన పళ్లు, కూరగాయలను సమకూర్చగలం. మా ఎగుమతులకు ప్లాంట్ క్వారన్‌టైన్ సర్టిఫికెట్‌ను కూడా అతికించే పంపుతాం."
భారత్ పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉన్నాయో, ఈ దేశాల మధ్య వ్యాపారం చేయడమూ అంతే కష్టంగా ఉంది. వాఘా బోర్డర్ ఎగుమతులకు చాలా సులువైన, అనువైన మార్గం. కానీ చాలా అరుదుగా ఉపయోగించే మార్గం కూడా ఇదే!

భారత్ నుంచి 137 వస్తువులను దిగుమతి చేసుకోవడానికి పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని నెలల క్రితం పళ్లు, కూరగాయల దిగుమతులకు పాకిస్తాన్ ప్లాంట్ క్వారన్‌టైన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వడం లేదు.
"వాఘా సరిహద్దు ద్వారా వ్యాపారం చేయడం వర్తకులకూ వినియోగదారులకూ ఇద్దరికీ లాభదాయకంగానే ఉంది. కానీ ఈవిధంగా ఆంక్షలు విధించడంతో వ్యాపారం దెబ్బతింటోంది."
అమృత్‌సర్, లాహోర్ మధ్య దూరం 50 కిలోమీటర్లు మాత్రమే. కొన్ని గంటల వ్యవధిలోనే పళ్లు, కూరగాయలు లాహోర్ చేరడానికి అవకాశం ఉంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఉజ్మా షాహిద్ అనే మహిళ లాహోర్‌లో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది. భారత్ నుంచి ముడిసరుకులు కొని తన ఫ్యాక్టరీలో బట్టలు తయారుచేసి వాటిని తిరిగి ఇండియాకు ఎగుమతి చేస్తుంది.
"భారత్‌తో వ్యాపారం చేయడం అంత సులువేమీ కాదు" అంటూ ఉజ్మా షాహిద్ తన అనుభవాన్ని వివరించింది.
"భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కస్టమ్స్ తనిఖీలు ఎక్కువయ్యాయి. దీంతో మా సరుకు సరిహద్దులు దాటడానికే వారాలు నెలలు పడుతోంది."

కస్టమ్స్ అధికారుల తనిఖీలు మాత్రమే ప్రధాన అడ్డంకి కాదు.
"వ్యాపార నిమిత్తం తరచూ ఇండియా వెళ్లి రావడానికి మల్టీ ఎంట్రీ వీసాలు దొరకడమూ కష్టమవుతోంది. వ్యాపార ప్రయాణాల సమయాల్లోనూ, తర్వాత కూడా ఇరు దేశాల అధికారులూ తనిఖీలను ముమ్మరం చేశారు."
ఇరు దేశాల మధ్య లావాదేవీల విలువ సంవత్సరానికి దాదాపుగా 2బిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ వ్యాపారం ఎక్కువగా పోర్టుల ద్వారానే జరుగుతుంది. కానీ ఈ లావాదేవీలు రికార్డుల్లో ఉండవు. ముఖ్యంగా.. ఇతర దేశాల ద్వారా జరిగే పరోక్ష వ్యాపారాలకు లెక్కలు ఉండవు.
పాకిస్తాన్‌లో కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహించడానికే ఇండియా నుంచి పళ్లు, కూరగాయల దిగుమతులపై నిషేధం విధించారని లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి చెబుతున్నారు.
"ఇండియాలోని రైతులకు సబ్సిడీలు వస్తాయి. వారికి పెట్టుబడి తక్కువ. ధరల విషయంలో భారతీయ రైతులతో పాకిస్తాన్ రైతులు పోటీపడలేరు. పాకిస్తాన్ రైతులకూ ఓ అవకాశం ఇచ్చాం. ఏమేరకు దిగుబడులు సాధిస్తారో చూడాలి."
ఒకవైపు టమాటో, ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్నా వినియోగదారులు మాత్రం వాటిని కొంటూనే ఉన్నారు.

"ఇది పూర్తిగా రాజకీయ పరమైన నిర్ణయం" అని రాజ్‌దీప్ ఉప్పల్ అంటున్నారు. పాకిస్తాన్‌లోని వ్యాపార వర్గాలు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాయి.
"కశ్మీర్ అంశం పరిష్కారం కాకపోయినా మేం భారత్‌తో వ్యాపారం చేశాం" అంటున్నారు లాహోర్ వ్యాపారి వోరా.
ఇన్ని టెన్షన్ల మధ్య కూడా ఎల్‌వోసీ ప్రాంతంలో వస్తువినిమయ వ్యాపారం జరుగుతూనే ఉంది.
ఇండియా, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతాల్లోని వ్యాపారులు వాఘా ద్వారా జరిగే వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ వ్యాపారంలో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని వీరి అభిప్రాయం.
చాలామంది ఈ మార్గాన్ని దుర్వినియోగపరుస్తున్నారని రాజ్‌దీప్ ఉప్పల్ అంటున్నారు.
"ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టిసారించినపుడు చాలా లోపాలు బయటపడ్డాయి. కానీ వీటిపై చర్యలు తీసుకోవడంలో రెండు దేశాలూ వైఫల్యం చెందాయి. వాఘా మార్గం ద్వారా జరిగే వ్యాపార, వాణిజ్యంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

ఈ విషయాన్నేఉజ్మా షాహిద్ కూడా చెబుతోంది.
"నిజాయతీగా వ్యాపారం చేస్తున్నవారిపై జరిమానాలు విధిస్తున్నారు. కశ్మీర్ మార్గంలో ఇండియా పాకిస్తాన్‌ల మధ్య వస్తువుల అక్రమ రవాణా జరుగుతోంది. పాకిస్తాన్‌లో కనిపించే భారతీయ వస్తువుల్లో చాలావరకు అక్రమ మార్గాల ద్వారా వచ్చి చేరినవే!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








