టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాను సరికొత్త కార్యక్రమాలతో ఉత్సాహపరుస్తోంది భారత క్రికెట్ అభిమాన సంఘం 'భారత్ ఆర్మీ'. ప్రత్యేక వేషధారణతో.. ఆటపాటలతో.. కేరింతలతో ఈ బృందం సభ్యులు సందడి చేస్తున్నారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య అయిదో టెస్టు మ్యాచ్ సందర్భంగా రెండో రోజు మధ్యాహ్నం భోజనం సమయంలో ఈ 'ఆర్మీ' చూపరులను ఆకట్టుకుంది. గులాబీ రంగు టీషర్టులు ధరించి, సంగీత వాయిద్యాలు వాయిస్తూ, ఆ దరువుకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ సందడి వాతావరణం సృష్టించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అసలేంటీ ఈ భారత్ ఆర్మీ?
ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ అభిమాన సంఘాల్లో 'భారత్ ఆర్మీ' ఒకటి. 1999 ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా ఇది ఏర్పాటైంది.
అప్పుడు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయుడు రాకేష్ పటేల్ ఆ మ్యాచ్‌ని వీక్షిస్తున్నారు. అయితే, స్టేడియంలో భారత జట్టు కంటే పాకిస్తాన్ జట్టుకు మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉంది. దాంతో భారతీయ క్రికెట్ అభిమానులను ఏకం చేసేందుకు ఓ బృందం ఏర్పాటు చేయాలని రాకేష్ అనుకున్నారు. సుఖ్వీందర్, శైలిన్, హర్వీందర్ అనే తన స్నేహితులతో కలిసి 'భారత్ ఆర్మీ' పేరుతో బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, twitter.com/thebharatarmy
భారత క్రికెట్ జట్టు ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్లి తమదైన శైలిలో ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంది భారత్ ఆర్మీ.
"భారత క్రికెట్ అభిమానులు సందడి వాతావరణాన్ని బాగా ఇష్టపడతారు. అందుకే మేము ఎక్కడికెళ్లినా మా వెంట డ్రమ్స్ వాయించేవారు ఉంటారు. 2017 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా లండన్‌లోని లార్డ్స్ మైదానంలోకి ఒక డ్రమ్ తీసుకెళ్లాలని అనుకున్నాం. అందుకు అనుమతి కోరుతూ 'మాలెబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ)'కి లేఖ రాశాను. అంతకుముందు ఎన్నడూ వాయిద్య పరికరాలను మైదానంలోకి అనుమతించలేదు. కానీ, మా విజ్ఞప్తిని స్వీకరించి అనుమతించారు. దాంతో మైదానంలో సందడి వాతావరణం సృష్టించాం" అని వివరించారు రాకేష్ పటేల్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కొన్నిసార్లు ఎవరూ ఊహించని రీతిలో ఆటగాళ్లను సైతం ఆశ్చర్యపరుస్తుంటారు ఈ బృందం సభ్యులు.
గత నెలలో ఓ మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి ఆటోలో వెళ్లి ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడంతో అందరూ అవాక్కయ్యారు.
వైవిధ్యభరితమైన టీమిండియా జెర్సీలు, టోపీలు ధరించి భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌కూ వీళ్లు హాజరవుతారు. మ్యాచ్‌లో భారత జట్టు గెలిచిందా, ఓడిందా అన్నది పట్టించుకోరు. ఆటగాళ్లను ప్రోత్సహించడమే వీళ్ల లక్ష్యం.
భారత్ ఆర్మీ లాంటిదే ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల కోసం 'బర్మీ ఆర్మీ' అనే సంఘం ఒకటి ఉంది. ఇంగ్లండ్ జట్టును ప్రోత్సహించేందుకు పాల్ బర్నమ్ అనే వ్యక్తి 1994లో దీన్ని ఏర్పాటు చేశారు. భారత్ ఆర్మీ ఏర్పాటు కోసం రాకేష్ పటేల్ పాల్ బర్నమ్ సూచనలను కూడా తీసుకున్నారు.
అందుకే ఈ రెండింటి మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెండు బృందాలు తమ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా జరిగే మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పిస్తున్నాయి.
గతేడాది యూకేలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఒక్కో మ్యాచ్‌కి 3,500 మంది చొప్పున అవకాశం కల్పించామని రాకేష్ తెలిపారు.
ప్రతి మ్యాచ్‌లోనూ బీసీసీఐ ఈ బృందానికి కొన్ని సీట్లు కేటాయిస్తూ వస్తోంది.
ఈ బృందాల మధ్య ఉన్న ముఖ్యమైన తేడా... బర్మీ ఆర్మీ స్వదేశంలో ఏర్పడితే... భారత్ ఆర్మీ మాత్రం భారత క్రికెట్ అభిమానుల కోసం యూకేలో పుట్టడం.

మొదట భారత్ ఆర్మీలో యూకేలో ఉండేవారే సభ్యత్వం తీసుకునేవారు. తర్వాత ఇతర దేశాల్లో ఉంటున్నవారు కూడా పెద్దఎత్తున చేరారు. ప్రస్తుతం భారత్‌లో వీళ్లకు బలమైన నెట్‌వర్క్ ఉంది.
భారత్ ఆర్మీకి సంబంధించిన వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ప్రస్తుతం 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్ ఆర్మీకి సొంత టీవీ చానెల్ కూడా ఉంది.
ప్రస్తుతం భారత్‌లో మధ్య తరగతి జనాభా బాగా అభివృద్ధి చెందుతోందని, వారిలో క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతోందని రాకేష్ అంటున్నారు.
"20 ఏళ్ల క్రితం లండన్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు భారత్ నుంచి చాలా తక్కువ మంది వచ్చేవారు. ఎందుకంటే... అప్పట్లో భారత్‌లో ధనవంతులు, నిరుపేదలు మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మధ్యతరగతి జనాభా పెరుగుతోంది. వారికి క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Bhart-army/twitter
తనలా విదేశాల్లో స్థిరపడిన భారతీయ క్రికెట్ అభిమానులకు భారత్ ఆర్మీ చేసే సందడి సరికొత్త అనుభూతిని పంచుతుందని రాకేష్ అంటున్నారు.
"భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న 2023 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఒక స్టేడియంలో 60,000 మంది ఉంటే, వాళ్లంతా భారత్ ఆర్మీ సభ్యులై ఉండాలన్నది నా ఆశయం. జట్టులో పన్నెండో ఆటగాడిలా భారత్ ఆర్మీ నిలవాలి" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అలస్టర్ కుక్: కెరీర్ తొలి మ్యాచ్, ఆఖరి మ్యాచ్‌లోనూ అదే రికార్డు.. రెండూ భారత్‌పైనే
- ‘పక్షులకు గూళ్లు కట్టాల్సిన బాధ్యత మనదే’
- చిరుత పులి బలహీనతలేంటో మీకు తెలుసా!?
- ఈయన మాట వింటే ఇంట్లో సిరుల పంటే!
- 'ఫేక్ న్యూస్' గుర్తించడం ఎలా?
- ప్రమాదకర ప్రాంతానికి వెళ్లొద్దామా!
- చంద్ర మండల యాత్రకు వెళ్లే పర్యటకుడు యుసాకు మేజావా
- మియాందాద్ సిక్సర్‌కి భారత్ ఎలా బదులిచ్చింది?
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








