ఇండియా VS పాకిస్తాన్: దాయాది దేశాల క్రికెట్ పోరు చరిత్ర

భారత్ పాక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, త్రుషార్ త్రివేది
    • హోదా, స్పోర్ట్స్ ఎడిటర్, నవ్ గుజరాత్ సమయ్, బీబీసీ కోసం

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచంటే మామూలుగానే అభిమానులను ఆపలేం. అలాంటిది ఆ మ్యాచ్ దుబాయ్‌లోనో, షార్జాలోనో జరిగితే ఇక అదో థ్రిల్లరనే చెప్పాలి. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ పోటీల్లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 19వ తేదీన జరిగిన మ్యాచ్‌కు కూడా చాలా ప్రాధాన్యం లభించింది. ఈ రెండు జట్ల మధ్య ఏడాది తరువాత జరిగిన పోటీ అది. మళ్లీ ఇదే టోర్నీలో సూపర్ ఫోర్ విభాగంలో ఈ రెండు జట్లూ సెప్టెంబర్ 23వ తేదీన తలపడనున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన జరిగే ఫైనల్‌కు ఒకవేళ (చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా) ఈ రెండు జట్లే అర్హత సాధిస్తే ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడినట్లు అవుతుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఈ పోటీల పట్ల ఉత్కంఠగా ఉన్నారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ పోటీలకు ఉన్న ప్రాధాన్యం ఈనాటి కాదు... ఇవి ఎప్పుడు తలపడినా అంతే.

దేశ విభజన తరువాత భారత్, పాక్‌ల మధ్య సరిహద్దుల్లోనే కాదు... క్రీడా మైదానాల్లోనూ ఉద్రిక్తతలే. అది క్రికెటైనా, హాకీయైనా, కబడ్డీ అయినా భారత్, పాక్ మధ్య మ్యాచంటే రెండు దేశాల అభిమానుల్లోనూ ఎక్కడ లేని ఉత్సాహం, ఉత్సుకత. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో ఈ రెండు జట్లు వన్డే క్రికెట్ మ్యాచ్ ఆడనుండడంతో ఇప్పుడూ అదే పరిస్థితి.

2008 ముంబయి ఉగ్రదాడుల తరువాత భారత్, పాక్‌ల మధ్య ప్రత్యేకంగా సిరీస్ జరగలేదు. వివిధ దేశాలతో నిర్వహించిన టోర్నీల్లో మాత్రం ఈ రెండు జట్లు తలపడ్డాయి. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. అయితే, ఈ రెండు జట్లే ఫైనల్‌కు చేరడంతో అక్కడా మళ్లీ తలపడ్డాయి. ఫైనల్‌లో భారత్ 180 పరుగుల తేడాతో మ్యాచ్ కోల్పోయింది.

ఇండియా పాక్

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా కప్‌లో ఎవరిది పైచేయి?

గత పదకొండేళ్లలో రెండు జట్లు 8 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 2016 టీ20 వరల్డ్ కప్‌ సందర్భంగా కోల్‌కతా వేదికగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, 2007 తరువాత భారత్, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ అన్నది లేదు. దీనికి కారణం... టెస్ట్ సిరీస్‌లు నేరుగా రెండు దేశాల మధ్యే జరుగుతాయి కానీ రెండు కంటే ఎక్కువ దేశాల మధ్య సిరీస్ లేదా టెస్ట్ ప్రపంచకప్ వంటిది లేకపోవడమే.

పాకిస్తాన్‌లో మాజీ క్రికెటర్ ప్రధాని పీఠమెక్కడంతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, ఇప్పుడిప్పుడే ఇది సాధ్యం కాకపోవచ్చు.

భారత్ పాక్

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్ పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత్, పాక్‌ల మధ్య ఎన్నో మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఎప్పటికీ గుర్తుండిపోయేవి కొన్నున్నాయి.

1983-84లో ఆసియా కప్ మొదలైనప్పుడు భారత్, పాకిస్తాన్‌లు ఒకదాంతో ఒకటి 11 సార్లు తలపడ్డాయి. అయితే, ఇందులో ఏ జట్టుకీ పైచేయి దక్కలేదు. రెండూ చెరో అయిదు మ్యాచ్‌లు గెలుచుకోగా ఇంకో మ్యాచ్ టై అయింది. తొలి ఆసియా కప్‌లో రెండూ సమ ఉజ్జీలుగా నిలిచినప్పటికీ మొత్తం ఆసియా కప్ చరిత్ర చూస్తే ఇప్పటికి నాలుగు సార్లు భారత్ చాంపియన్‌గా నిలవగా పాక్ రెండు సార్లు మాత్రమే ఈ కప్ గెలుచుకుంది. దీంతో ఆసియా కప్ చాంపియన్‌షిప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయి అని చెప్పాలి.

పాకిస్తాన్ గెలిచిన రెండు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా బంగ్లాదేశ్‌లో జరిగాయి. మరోవైపు ఆసియా కప్‌లో సక్సెస్ రేట్ ప్రకారం చూస్తే భారత్ కంటే పాక్ కాస్త ముందుంది. భారత్ సక్సెస్ రేట్ 61.90 శాతంగా పాకిస్తాన్ సక్సెస్ రేట్ 62.50గా ఉంది.

ఇండియా పాక్

ఫొటో సోర్స్, Getty Images

మియాందాద్ సిక్సర్

భారత్, పాక్ క్రికెట్ చరిత్రలో షార్జా మైదానానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్రవారం రోజున షార్జాలో భారత్, పాక్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్‌ను గెలవడం ఆషామాషీ కాదని అంటుంటారు.

1984 ఏప్రిల్ నెలలో అలాంటి ఒక శుక్రవారం రోజున భారత్, పాక్ వన్డే మ్యాచ్ షార్జాలో జరుగుతోది. ఇండియా 245 పరుగులు చేసింది. ఆ రోజుల్లో అది గెలవడానికి అవసరమైన కంటే మంచి స్కోరే. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 206 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ, జావేద్ మియాందాద్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. చివరి ఓవర్ వేయాల్సి వచ్చేసరికి భారత్ కెప్టెన్ కపిల్‌దేవ్ తన పది ఓవర్ల కోటా పూర్తి చేసేశారు. మదన్‌లాల్, మణిందర్ సింగ్ కోటా కూడా పూర్తయిపోయింది. బౌలర్లలో రవిశాస్త్రి ఒక్కరే మిగిలారు. అయితే... రవిశాస్త్రికి కాకుండా చేతన్ శర్మకు బంతి అందించాడు కపిల్. నాలుగు పరుగులు చేస్తే పాకిస్తాన్ గెలుస్తుంది. అప్పుడు చేతన్ శర్మ వేసిన బంతిని మియాందాద్ భారీ షాట్ కొట్టి నేరుగా పెవిలియన్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఆ భారీ షాట్ సిక్సర్... పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది. ఆ సిక్సర్ ఇంకా భారతీయ అభిమానులను వెంటాడుతూనే ఉంది.

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచంటే మామూలుగానే అభిమానులను ఆపలేం. అలాంటిది ఆ మ్యాచ్ దుబయిలోనో, షార్జాలోనో జరిగితే ఇక అదో థ్రిల్లరనే చెప్పాలి.

ఫొటో సోర్స్, Getty Images

రాజేశ్ చౌహాన్ మ్యాజిక్

మియాందాద్ సిక్సర్‌కు భారత్ 1997లో కరాచీ వేదికగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఇచ్చిన 266 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేజ్ చేస్తోంది.. ఆ మ్యాచ్‌లో వినోద్ కాంబ్లీ నిలకడగా ఆడి భారత్‌ను విజయం దిశగా నడిపించారు. అయితే.. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన భారత బౌలర్ రాజేశ్ చౌహాన్ ఎవరూ ఊహించని రీతిలో పాక్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలిచి విజయాన్ని అందించారు.

అజయ్ జడేజా-వకార్ యూనిస్... వెంకటేశ్ ప్రసాద్-ఆమిర్ సొహైల్ గొడవ

1996 ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో జరుగుతోంది. సెమీ ఫైనల్ కోసం భారత్, పాక్ జట్లు రెండూ హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. అప్పటివరకు భారత్‌లో ఆడిన పాక్ జట్లలో ఆ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన జట్టే అత్యుత్తమమైనదని అంతా చెబుతున్నారు.

మరోవైపు భారత్ బ్యాటింగ్ లైనప్ అస్థిరంగా ఉంది. చివరి ఓవర్ వరకు ఉంటే 250 పరుగులు చేయడమే గొప్ప అన్న పరిస్థితి. పాక్ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ లయ తప్పింది. అలాంటి సమయంలో అజయ్ జడేజా బ్యాటింగ్‌కు దిగాడు. వస్తూనే ఆయన పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వకార్ యూనిస్ వేసిన ఒక ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు చేయడంతో భారత్ 50 ఓవర్లలో 287 పరుగులు చేయగలిగింది.

ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ ఆమిర్ సొహైల్ ధాటిగా ఆడడం ప్రారంభించారు. వెంకటేశ్ ప్రసాద్ వేసిన ఒక ఓవర్‌లో సొహైల్ వరుస బౌండరీలు బాదాడు. అంతేకాదు... పెవిలియన్ వైపు వేలు చూపిస్తూ వెంకటేశ్ ప్రసాద్‌ను గేలి చేశాడు. అయితే, ఆ తరువాతి ఓవర్లోనే వెంకటేశ్ ప్రసాద్.. ఆమిర్ సొహైల్ వికెట్‌ను పడగొట్టాడు. అదంతా క్రీడాభిమానుల మదిలో ఇప్పటికీ అలాగే ఉంది.

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచంటే మామూలుగానే అభిమానులను ఆపలేం. అలాంటిది ఆ మ్యాచ్ దుబయిలోనో, షార్జాలోనో జరిగితే ఇక అదో థ్రిల్లరనే చెప్పాలి.

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటింగ్ ఆపేసి వచ్చేయమన్న బిషన్ సింగ్ బేడీ

వన్డే క్రికెట్‌కు అప్పుడప్పుడే ఆదరణ పెరుగుతున్న రోజులవి. అలాంటి తరుణంలో 1978 నవంబర్‌లో భారత్, పాక్ మధ్య ఒక వన్డే మ్యాచ్.. పాకిస్తాన్‌లోని సాహివాల్ స్టేడియంలో జరుగుతున్న ఆ మ్యాచ్‌లో భారత్ మరో 22 పరుగులు చేస్తే గెలుస్తుంది. కానీ, ఇంకా రెండు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి.

అప్పటికి అన్షుమన్ గైక్వాడ్, గుండప్ప విశ్వనాథ్ క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లు ఇమ్రాన్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్‌లు ఉద్దేశపూర్వకంగానే ప్రమాదకర బౌన్సర్లు వేయడం మొదలుపెట్టారు.

పదహారేళ్ల తరువాత భారత్ జట్టు పాక్‌ వెళ్లి ఆడుతున్న మ్యాచ్ కావడం.. అప్పటికి రెండు దేశాల మధ్య రాజకీయంగానూ ఉద్రిక్తతలు ఉన్నాయి.

అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు బౌన్సర్ల దాడి ప్రారంభించడంతో భారత కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఆగ్రహానికి లోనయ్యాడు. క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మన్లను పెవిలియన్‌కు వచ్చేయమని పిలిచారు. దీంతో అంపైర్లు పాకిస్తాన్ గెలిచినట్లు ప్రకటించారు.

india pak

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచకప్‌లో భారత్‌దే పైచేయి

ప్రపంచకప్‌లో భాగంగా జరిగే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ భారత్‌పై గెలవలేదు. అన్నిట్లోనూ 1996లో బెంగళూరులో జరిగిన క్వార్టర్ ఫైనల్.. 2003లో సెంచురియన్ మైదానంలో జరిగిన మ్యాచ్ మరిచిపోలేనివి.

సెంచూరియన్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సయీద్ అన్వర్ సెంచరీ చేయడంతో పాక్ 273 పరుగులు చేసింది. చేజింగ్‌కు దిగిన భారత్ జట్టు ఓపెనర్లు సచిన్ తెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్ నుంచే విరుచుకుపడడం ప్రారంభించారు. పాక్ బౌలర్లు వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్లలో ఎవరినీ విడిచిపెట్టకుండా బాదుతున్నారు. వకార్ యూనిస్ బౌలింగ్‌లో సచిన్ థర్డ్ మ్యాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే... 75 బంతుల్లో 98 పరుగులు చేసి భారత్‌ విజయాన్ని ఖాయం చేసిన సచిన్ సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో అవుట్ కావడాన్ని మాత్రం అభిమానులు తట్టుకోలేకపోయారు.

వీడియో క్యాప్షన్, మహిళ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం మిథాలీకే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)