నైజీరియాలో మనీ వైవ్స్: ‘బాకీ కింద అమ్మాయిలను జమ కడుతున్నారు’

వీడియో క్యాప్షన్, వీడియో: ‘బాకీ కింద అమ్మాయిలను జమ కడుతున్నారు’

నైజీరియాలో అప్పులు తీసుకున్న చాలా కుటుంబాలు, డబ్బుకు బదులుగా అమ్మాయిలను బాకీ కింద జమ కడుతున్నాయి. అక్కడి బెచేవే ప్రాంతంలో చాలా కాలంగా ఈ పద్ధతి కొనసాగుతోంది.

ఇంకొందరు తీసుకున్న అప్పుకు తోడు ఇంకొంత ఎక్కువ డబ్బు తీసుకొని తమ కూతుళ్లను అప్పిచ్చినవారికే అమ్మేస్తున్నారు. అలా 'బాకీ' రూపంలో వచ్చిన యువతులు పూర్తిగా అప్పు ఇచ్చినవారి సొంతమైపోతారు. వీళ్లను ‘మనీ వైవ్స్’ అని పిలుస్తారు.

నైజీరియాలోని బెచేవే ప్రాంతంలో ఇలాంటి 'డబ్బు పెళ్లిళ్లు' చాలా సాధారణం.

‘అతడు చాలా ముసలివాడు. నన్ను బాగా కొట్టేవాడు. బలవంతం చేసేవాడు. నేను డబ్బిచ్చి కొనుకున్న భార్యనని, అందుకే నన్ను చంపినా ఎవరూ అడగరని అతడు అనేవాడు’ అని తనను బాకీ కింద జమచేసుకున్న వ్యక్తి గురించి చెబుతుంది ‘హ్యాపీనెస్’ అనే ఓ యువతి.

ఆ వ్యక్తి మూలంగా 12ఏళ్ల వయసు కూడా దాటకముందే తాను గర్భం దాల్చినట్లు చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

మరో యువతి మాట్లాడుతూ.. తనను అమ్మేశాక ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ తనను పట్టుకోగా.. ఒకతను అత్యాచారం చేశాడని పేర్కొంది.

నిజానికి 2009లోనే ఈ డబ్బు పెళ్లిళ్లను నిషేధించారు. కానీ ఇప్పటికీ అవి ఆగినట్లు కనిపించట్లేదు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)