భర్త పాకిస్తాన్‌లో, భార్య భారత్‌లో

- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ముగ్గురు పిల్లలు, ఓ చిన్న ఉద్యోగం.. నిన్నమొన్నటి దాకా ఉన్నంతలో ఏ చీకూచింతా లేకుండా సిరాజ్ బతికేవాడు. కానీ నెల రోజుల క్రితం అతడి జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఒక్కసారిగా కలల ప్రపంచం కూలిపోయి భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లి అతడు జీవించాల్సి వస్తోంది.
24ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో మొదలైన కథ ఇది.
అప్పుడు సిరాజ్ వయసు 10ఏళ్లు. పాకిస్తాన్‌లోని షర్కూల్ అనే అందమైన పల్లెలో కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఓసారి పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో కుటుంబ సభ్యులు కోప్పడతారేమోనన్న భయంతో ఇల్లొదిలి వచ్చేశాడు.
కరాచీ పారిపోవాలన్నాది సిరాజ్ ఆలోచన. కానీ లాహోర్‌లో పొరబాటున సంఝోతా ఎక్స్‌ప్రెస్ ఎక్కడంతో అతడు నేరుగా భారత్‌లో వచ్చిపడ్డాడు.
ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కొన్ని రోజులపాటు తాను కరాచీలోనే ఉన్నట్లు సిరాజ్ భావించేవాడు. భారత అధికారులకు విషయం తెలీడంతో సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత మూడేళ్ల పాటు అతడు అహ్మదాబాద్‌లోని పిల్లల జైళ్లో గడపాల్సి వచ్చింది.
అక్కడి నుంచి బయటికొచ్చాక అతడు నేరుగా ముంబై చేరుకున్నాడు. ఫుట్‌పాత్ మీద పడుకుంటూ దొరికింది తింటూ కొన్నాళ్లు కాలం గడిపేశాడు. ఆ తరవాత వంటపని నేర్చుకొని సొంతకాళ్లపై నిలబడటం అలవాటు చేసుకున్నాడు.
వంటవాడిగా స్థిరపడ్డ సిరాజ్‌కు తెలిసిన వాళ్ల సాయంతో సాజిదా పరిచయమయ్యారు. పదమూడేళ్ల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్లకిప్పుడు ముగ్గురు పిల్లలు.

అంతా బానే ఉందనుకుంటున్న దశలో 2009లో అసలు సమస్య మొదలైంది. సిరాజ్ తనంతట తానుగా అధికారుల దగ్గరకు వెళ్లి తన గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అలా చేస్తే వాళ్ల సాయంతో మళ్లీ పాకిస్తాన్ వెళ్లి తన తల్లిదండ్రుల్ని కలుసుకోవచ్చన్నది సిరాజ్ ఆలోచన.
‘2006లో తొలి బిడ్డ పుట్టాక నాకు తరచూ మా అమ్మానాన్నలు గుర్తొచ్చేవారు. చిన్నప్పుడు వాళ్ల కోపమే కనిపించింది కానీ, ఆ కోపం నా మంచి కోసమేనని గ్రహించలేకపోయా. ఓ తండ్రిగా వాళ్ల మనసేంటో నాకప్పుడు అర్థమైంది. దాంతో వాళ్లను కలుసుకోవాలన్న ఉద్దేశంతో పోలీసుల్ని ఆశ్రయించా. కానీ కథ ఇలా అడ్డం తిరుగుతుందని ఊహించలేదు’ అని అన్నాడు సిరాజ్.
సిరాజ్ అందించిన వివరాల ప్రకారం విచారణ చేపట్టిన ముంబై సీఐడీ అధికారులు పాకిస్తాన్‌లోని అతడి కుటుంబ సభ్యుల్ని గుర్తించారు. కానీ పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా, ఫారినర్ యాక్ట్ కింద అతడిని జైళ్లో పెట్టినట్లు సిరాజ్ చెప్పారు.
ఆ కేసు విషయంలో ఐదేళ్లపాటు సిరాజ్ న్యాయపోరాటం చేసి విఫలమయ్యాడు. దాంతో అధికారులు అతడిని పాకిస్తాన్ పంపించేశారు. ఆ చర్యతో సిరాజ్‌తో పాటు అతడి భార్య కూడా ఆవేదన చెందుతున్నారు.

‘భారత్‌లో ఒక్క మనిషి ఉండేందుకు చోటు లేదా? వాళ్లు(అధికారులు) నా ప్రపంచాన్ని తలకిందులు చేశారు. తండ్రిని చూడాలని ఏడుస్తున్న పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలి? నా భర్తను పాకిస్తాన్‌కు పంపించాక మమ్మల్ని ఏ అధికారీ పట్టించుకోలేదు. మేం ముస్లింలం కాబట్టే ఈ వివక్ష చూపుతున్నారా?
అధికారులు దయచూపి నాకూ, నా పిల్లలకూ పాకిస్తాన్ వెళ్లడానికి కావాల్సిన అనుమతి పత్రాలు ఇప్పించాలి. నా భర్తను కలుసుకునే దారి చూపించాలి’ అంటున్నారు సాజిదా.
సాజిదాకు పాస్‌పోర్ట్ కావాలంటే తన ఇంటి యజమాని ఎన్‌ఓసీ ఇవ్వాలి. కానీ అతడు దానికి సహకరించట్లేదని ఆమె చెబుతున్నారు.
సిరాజ్ కూడా పాకిస్తాన్ ఐడెంటిటీ కార్డు కోసం దరఖాస్తు చేసినా, అది చాలా రోజులుగా అతడికి అందట్లేదు. న్యాయపరమైన ఆంక్షల కారణంగా భార్యభర్తలిద్దరూ సరిహద్దుకు చెరోవైపు చిక్కుకుపోయారు.

‘నాకు భారత్, పాకిస్తాన్.. రెండూ ఒక్కటే. ఒక దేశంలో పుట్టాను. మరో దేశంలో బతకడం నేర్చుకున్నాను. చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదు. పాతికేళ్ల క్రితం నేను అనుభవించిన బాధను మళ్లీ నా పిల్లలు అనుభవించకూడదు’ అంటారు సిరాజ్.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో సిరాజ్ చాలా కష్టంగా జీవిస్తున్నాడు. అతడి కుటుంబ సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
సిరాజ్ కుటుంబం పష్తూన్ తెగకు చెందింది. కానీ చిన్నప్పుడే ఇల్లొదిలి వచ్చేయడంతో వాళ్లతో ఇమిడిపోయి జీవించడం అతడి సాధ్యం కావట్లేదు.

భారత్‌లో సాజిదా కూడా ఒంటరిగా జీవించడానికి ఇబ్బందిపడుతున్నారు. వంటమనిషిగా పనిచేస్తూ, ఇంటి దగ్గరే గిల్టు నగలు తయారుచేస్తూ పిల్లల్ని పోషిస్తున్నారు.
‘నా పిల్లల కోసం నేనెంత కష్టపడినా, వాళ్లకు కావల్సినవన్నీ ఇచ్చినా, తండ్రి ప్రేమను అందించలేనప్పుడు అవన్నీ వృథానే. నేను ఈ మట్టిలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. నేను నా భర్తను కలవడానికి సాయపడండి’ అంటూ ఆమె భారత అధికారుల్ని అర్జిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








