నమాజ్‌కు షరతులు విధిస్తున్నారంటూ ముస్లింల ఆరోపణ... హరియాణా గ్రామంలో ఉద్రిక్తత

- రచయిత, సత్ సింగ్
- హోదా, టిటోలీ(రోహ్‌తక్) నుంచి బీబీసీ కోసం
ఆవు దూడను చంపారంటూ హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా టిటోలీ గ్రామంలో నెలరోజుల క్రితం ఇద్దరు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అదే ఊరిలో తాము ప్రార్థనలు చేసుకోవడంపై పంచాయతీ షరతులు విధించిందని ముస్లిం సముదాయానికి చెందిన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
గ్రామ ముస్లిం సముదాయానికి చెందిన రాజ్‌బిర్ ఖొఖర్ మీడియాతో మాట్లాడుతూ... "మేము ప్రార్థనలు (నమాజ్) చేసుకునేందుకు గ్రామం బయటకు లేదా రోహ్‌తక్ పట్టణానికి వెళ్లాలని అంటున్నారు. ఆవు దూడను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యమీన్ ఖొఖర్ జీవితాంతం ఊరిలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. కోర్టు అతన్ని దోషిగా తేల్చుతుందా లేదా అనేది పట్టించుకోకుండానే గ్రామపంచాయతీలో నిర్ణయం తీసుకున్నారు" అని చెప్పారు.
తమ సముదాయం వారు ప్రశాంతంగా ఉండాలంటే గ్రామ పంచాయతీ నిర్ణయాన్ని తాము అనుసరించాల్సి వస్తోందని రాజ్‌బిర్ ఖొఖర్ అంటున్నారు.
"ఇలాంటి నిషేధాలు పనిచేస్తాయా? లేదా? అన్నది కాలమే చెబుతుంది. కానీ, ప్రస్తుతానికి మాత్రం శాంతియుతంగా ఉండేందుకు పంచాయతీ నిర్ణయానికి తలొగ్గడం తప్ప, మాకు మరో మార్గం లేదు" అని ఆయన చెప్పారు.
అయితే ఈ నిర్ణయానికి సంబంధించి గ్రామ పంచాయతీ రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆయన తెలిపారు. "చాలావరకు ఇలాంటి తీర్మానాలు నోటిమాట ద్వారానే ఆమోదిస్తారు. ఆ తీర్మానం సమయంలో అక్కడ లేనివారికి గ్రామ సహాయకులు వెళ్లి చెబుతారు" అని రాజ్‌బిర్ ఖొఖర్ వివరించారు.

నిషేధం ఏమీ లేదు
అయితే, ముస్లింలు చేస్తున్న ఆరోపణలను గ్రామానికి చెందిన హిందూ జాట్ సముదాయానికి చెందిన సురేష్ కుమార్ ఖండించారు.
"నమాజ్ చేసుకోవడంపై, గడ్డం పెంచుకోవడంపై, టోపీ పెట్టుకోవడంపై గ్రామ పంచాయతీ ఎలాంటి నిషేధమూ విధించలేదు. శ్మశానాన్ని ఊరి నుంచి దూరంగా తరలించాలన్న నిర్ణయం మాత్రమే గ్రామ సభలో జరిగింది" అని ఆయన చెప్పారు.
గ్రామ సర్పంచి పర్మీలా దేవికి దగ్గరి బంధువు సురేష్ కుమార్.
ఈ వివాదంపై పోలీసులను సంప్రదించగా... గ్రామ పంచాయతీ అలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తమకెలాంటి సమాచారం లేదని టిటోలీ పోలీస్ పోస్టు ఏఎస్‌ఐ నఫే సింగ్ అన్నారు.
మంగళవారం కొద్దిమంది గుమికూడి గ్రామంలో నివాసాల మధ్య ఉన్న శ్మశానాన్ని దూరంగా తరలించాలన్న విషయంపై చర్చించారని పోలీసు చెప్పారు.
అయితే, ముస్లింలు మాత్రం గ్రామ సభలో చాలామంది ఉన్నారని అంటున్నారు.

భార్య బిడ్డలు తిరిగిరాలేదు
ఆవు దూడను చంపారన్న కేసులో నెల రోజుల క్రితం ఇద్దరు ముస్లిం యువకులు యమీన్, షౌకీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ దూడను యమీన్ చంపాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యమీన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించాడు.
ఆ ఘటనతో గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తతను నియంత్రించేందుకు అధికారులు పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. ఆ ఇద్దరు ముస్లిం యువకులపై గో వధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అదే సమయంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయంతో నిందితుడి భార్య, సోదరుడు, పిల్లలు ఊరు వదిలి వెళ్లిపోయారు. వాళ్లు ఇప్పటికీ తిరిగిరాలేదు.
ఆ ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా, ఇప్పటికీ యమీన్ ఖొఖర్ ఇంటికి తాళం వేసి ఉంది.
ఇక్కడి ముస్లింల వీధుల్లో ఆందోళన, భయం కనిపిస్తోంది. కొన్ని వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొంత మంది బయట కనిపిస్తున్నా, మీడియాతో మాట్లాడేందుకు వారు భయపడుతున్నారు.
"ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి వచ్చే ముస్లిం నాయకులను ఊరిలోకి రానివ్వవద్దని పంచాయతీ మమ్మల్ని కోరింది" అని రాజ్‌బిర్ తెలిపారు.

నాలుగు నిర్ణయాలు తీసుకున్నారు
పంచాయతీలో నాలుగు నిర్ణయాలు తీసుకున్నారని 70 ఏళ్ల ముస్లిం మీర్ సింగ్ ఖొఖర్ చెప్పారు.
"ఆవు దూడను చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు యమీన్ జీవితాంతం గ్రామంలో అడుగుపెట్టకూడదు. ముస్లిం పురుషులు ప్రార్థనలు చేయాలంటే రోహ్‌తక్ వెళ్లాలి. లేదంటే మరో చోటుకి వెళ్లాలి. గ్రామంలో మాత్రం చేయవద్దు. ముస్లిం సముదాయానికి చెందిన శ్మశానాన్ని గ్రామానికి కిలోమీటర్ దూరానికి తరలించాలి, ప్రస్తుతం శ్మశానం ఉన్నచోట ఆగస్టు 22న చనిపోయిన ఆవుదూడకు స్మారకం నిర్మించాలని పంచాయతీలో నిర్ణయించారు" అని ఆయన వివరించారు.
అయితే, ముస్లిం సముదాయానికి వ్యతిరేకంగా ఎలాంటి షరతులూ విధించలేదని గ్రామంలోని పలువురు హిందూ జాట్లు అన్నారు.
ముస్లింల సమ్మతంతోనే ఆ సముదాయానికి చెందిన శ్మశానాన్ని తరలించాలని పంచాయతీ నిర్ణయం తీసుకుందని గ్రామ పంచాయతీ సమావేశానికి హాజరైన యువకుడు దీపక్ కుమార్ చెప్పారు. "ముస్లింలు తరతరాలుగా పలు నియమాలను పాటిస్తున్నారు. ఇప్పుడు వారి గడ్డంపై, టోపీ పై, ప్రార్థనలపై నిషేధం విధించాల్సిన అవసరం మాకేం లేదు" అని దీపక్ కుమార్ అన్నారు.
ఇవి కూడా చూడండి:
- ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చారు.. భారత్‌లో బాద్‌షాలయ్యారు
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- 'గ్లామర్ ప్రపంచంలో అడుగెయ్యాలంటే యవ్వనంగా కనిపించాల్సిందే'
- ఇండియా VS పాకిస్తాన్: దాయాది దేశాల క్రికెట్ శత్రుత్వం చరిత్ర
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








