గంజాయి కోలా.. కొత్త రుచి కోసం ప్రయోగాలు చేస్తున్న కోకా కోలా

ఫొటో సోర్స్, Getty Images
కెఫీన్ ప్రధానంగా కలిగిన పానీయాలకు ప్రసిద్ధి చెందిన కోకా కోలా ఇప్పుడు గంజాయితో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.
కెనడాకు చెందిన బీఎన్‌ఎన్ బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, కెనడాకు చెందిన 'అరోరా కానబీస్' అనే సంస్థతో గంజాయి పానీయాల తయారీపై చర్చలు జరుపుతోంది.
అయితే అరోరా కానబీస్ సంస్థ పానీయాలు మత్తు కోసం కాకుండా వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు.
చర్చలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన కోకా కోలా, తాము గంజాయి పానీయాల మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
''ప్రపంచవ్యాప్తంగా కానబీడియోల్ కలిపిన పానీయాల మార్కెట్ ఎలా ఉందో గమనిస్తున్నాం'' అని కోకా కోలా ఒక ప్రకటనలో తెలిపింది.
గంజాయిలోని కానబీడియోల్ అనే పదార్థం నొప్పిని, వాపులను, తిమ్మిర్లను తగ్గిస్తుంది.
ఇటీవల అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో గంజాయిని వినోదం కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించిన నేపథ్యంలో కెనడా కూడా అదే బాటలో వెళ్లాలని యోచిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో, ప్రముఖ బీర్ తయారీ సంస్థ 'మాల్సన్ కూర్స్', తాము గంజాయి బీర్లను తయారు చేస్తామని తెలిపింది.
మరో సంస్థ 'కాన్‌స్టెలేషన్ బ్రాండ్స్' గంజాయిని పెంచే 'కేనోపీ గ్రోత్'లో భారీ పెట్టుబడులు పెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
'పునరుత్తేజ పానీయం'
అరోరాతో చర్చల విషయంలో కోకా కోలా చాలా పట్టుదలగా ఉందని, అయితే ఇంకా రెండింటి మధ్య ఒప్పందం ఏమీ కుదరలేదని బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది.
అది 'పునరుత్తేజ పానీయం' విభాగంలో ఉంటుందని బ్లూమ్‌బర్గ్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు.. తమ వాణిజ్య కార్యకలాపాలు పూర్తయ్యే వరకు వాటిపై మాట్లాడడడం తమ విధానం కాదని అరోరా కానబీస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే పానీయాల మార్కెట్‌లో తమకు ఆసక్తి ఉందని, తాము కూడా ఆ మార్కెట్‌లో ప్రవేశించాలనుకుంటున్న మాట వాస్తవం అని అంగీకరించింది.
గంజాయి డ్రింకులను ఉత్పత్తి చేయాలనుకుంటున్న వార్తలు వెలువడగానే కోకా కోలా షేర్ల విలువ స్వల్పంగా పెరిగింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








