ఇరాన్ ఇజ్రాయెల్ కంటే గల్ఫ్ దేశాలపైనే ఎక్కువ క్షిపణులు ప్రయోగిస్తోందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అబ్దుల్ రెహ్మాన్ అబు తాలిబ్
- హోదా, బీబీసీ న్యూస్ అరబిక్
- చదివే సమయం: 7 నిమిషాలు
గతేడాది ఇజ్రాయెల్‌తో చేసిన 12 రోజుల యుద్ధం కంటే ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధంలోనే గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ ఎక్కువగా క్షిపణులను ప్రయోగించిందని బీబీసీ అరబిక్ పేర్కొంది.
సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ విడుదల చేసిన గణాంకాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 మధ్య గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 550 దాటినట్లు తెలిసింది.
తమపై జరిగిన క్షిపణి దాడులను, డ్రోన్ దాడులను ఒమన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై వేలాది బాంబులను వేశాయి.
గల్ఫ్ దేశాలపై జరిగిన ఈ దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్‌పై దాడికి వారి భూభాగాన్ని వాడకపోతే, ఇరాన్ కూడా వారిపై దాడి చేయదని హామీ ఇచ్చారు.
పెజెష్కియాన్ శాంతి సందేశాన్ని ఇచ్చినప్పటికీ, ఆయన మాటలను ఇరాన్ నాయకత్వ వైఖరిగా పరిగణించవచ్చా? అన్నదే ప్రశ్న అని బీబీసీ వరల్డ్ అఫైర్స్ ఎడిటర్ జాన్ సింప్సన్ అన్నారు.
ఇరాన్ రక్షణ సామర్థ్యాల్లో బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్‌సోనిక్ క్షిపణులు ఉన్నాయి. అలాగే, డ్రోన్లు కూడా ఈ దేశం వాడుతోంది. అయితే, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో దాడులకు ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్‌తో గతంలో జరిగిన యుద్ధాలతో పోలిస్తే ఈసారి తేడా ఏంటి? ఈ ఆయుధాలపై ఇరాన్ ఎంతకాలం ఆధారపడనుంది?

ఈ క్షిపణుల గురించి మనకేం తెలుసు?
ఇరాన్ వద్ద స్వల్ప, మధ్యస్థ శ్రేణి క్షిపణులు ఉన్నాయి.
ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం.. ఇరాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణుల రేంజ్ 300 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లు.
ఈ క్షిపణులు గల్ఫ్ దేశాలు సహా పలు ఇతర సరిహద్దు దేశాలపై ప్రయోగించగలిగే సామర్థ్యంతో ఉన్నాయి.
మధ్యస్థ శ్రేణి క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించదగినవి. ఇవి ఇజ్రాయెల్ వరకు చేరుకోగలవు.
డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం ఇరాన్ వద్దనున్న 8 బాలిస్టిక్ క్షిపణుల రేంజ్..
షహాబ్ 1... 300 కిలోమీటర్లు
ఫతే 110... 300 నుంచి 500 కిలోమీటర్లు
షహాబ్ 2... 500 కిలోమీటర్లు
జుల్ఫిఖార్... 700 కిలోమీటర్లు
ఖియామ్ 1... 750 కిలోమీటర్లు
షహాబ్ 3... 2000 కిలోమీటర్లు
ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఎక్కువ ఎత్తుకు చేరుకుని, అక్కడ నుంచి లక్ష్యాలను వెంబడించగలవు.
ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం.. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా ఈ బాలిస్టిక్ క్షిపణులను తెహ్రాన్ పరిగణిస్తోంది. తమ వైమానిక దళానికి ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తోంది.
క్రూయిజ్, హైపర్‌సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో వెళ్తాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటికి ఎయిర్ పవర్ ఇంజిన్లు (జెట్ లేదా ప్రొపెల్లర్) సాయం అవసరం.

ఫొటో సోర్స్, Wisam Hashlamoun/Anadolu via Getty Images
ఇరాన్ క్షిపణులను ఉపయోగించే వ్యూహం ఎలా మారింది?
ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు రెండింటిపై తన క్షిపణులను ప్రయోగిస్తోంది. మునపటి యుద్ధాల కంటే ఇది చాలా భిన్నమైంది.
అంతకుముందు, తెహ్రాన్ కేవలం గల్ఫ్‌లోని ఖతార్ అల్-ఉదీద్ స్థావరంపైనే దాడులు చేసింది.
అమెరికన్ పాలసీ రీసెర్చ్ సెంటర్ అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ కింద పనిచేసే క్రిటకల్ థ్రెట్స్ ప్రాజెక్టు ప్రకారం.. యుద్ధం ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే సుమారు 36 సార్లు ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది.
అత్యధికంగా తొలిరోజే 20 ప్రయోగాలు చేసింది.
అయితే, రెండో రోజు తీరు మార్చింది. రోజూ ప్రయోగించే క్షిపణి వేవ్స్ (ఒకేసారి ప్రయోగించే క్షిపణి సమూహం) సంఖ్య రెండో రోజు నాలుగుకు.. ఇక మూడవ, నాలుగవ రోజుల్లో ఆరుకు మార్చింది.
ఇదే సమయంలో, రెండో రోజు ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య ప్రతి వేవ్‌లో కూడా సగటున 9 నుంచి 30 మధ్యలో ఉంది.
టెల్ అవీవ్ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న నేషనల్ సెక్యూరిటీస్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ సమాచారం ప్రకారం.. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 4 వరకు ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ 128 క్షిపణులను ప్రయోగించింది.
ఈ దాడుల్లో మంగళవారం ఉదయం వరకు 10 మంది ఇజ్రాయెలీలు చనిపోయారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అయితే, సైనికులెవరూ గాయపడలేదని చెప్పారు.
ఇరాన్ తాను ప్రయోగించిన క్షిపణుల సంఖ్యను కచ్చితంగా వెల్లడించలేదు.
కానీ, రివల్యూషనరీ గార్డ్స్ ప్రకారం.. యుద్ధం ప్రారంభమైన ఐదవ రోజు నాటికి అంటే మార్చి 4 మధ్యాహ్నం నాటికి గల్ఫ్, ఇజ్రాయెల్‌లోని అమెరికా స్థావరాలపై 17 వేవ్స్ ఆఫ్ మిసైళ్లను ప్రయోగించినట్లు తెలిసింది.
ఇరాన్ తన క్షిపణి లాంచ్ ప్లాట్‌ఫామ్‌లలో సగం మేర కోల్పోయిందని ఇజ్రాయెలీలు అంచనావేస్తున్నారు.
ఇది క్షిపణి యూనిట్ల మధ్య సహకారాన్ని బలహీనపరుస్తుందని క్రిటికల్ థ్రెట్స్ ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ నికోలస్ కార్ల్ తెలిపారు.
దాడులకు ముందు, లేదా దాడుల సమయంలో క్షిపణి ప్రయోగాలు చేస్తోన్న టీమ్‌లను అమెరికా, ఇజ్రాయెల్‌లు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన బీబీసీకి చెప్పారు.
అయితే, ఎన్ని ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్నాయో చెప్పడం అసాధ్యమని అన్నారు. అంత ఎక్కువగా ఇవి ఉండకపోవచ్చని కార్ల్ తెలిపారు.
దీనివల్ల ఒకేసారి ఇరాన్ ప్రయోగించగలిగే క్షిపణుల సంఖ్య తగ్గుతుందని అన్నారు.
అయితే, ఇది ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి వచ్చే క్షిపణుల ముప్పును తగ్గించదని అభిప్రాయపడ్డారు.
అయితే, దాడులను సమర్థంగా సమన్వయం చేయడం ఇరాన్‌కు పెద్ద సవాలుగా మారవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
గల్ఫ్ దేశాలపై ఇరాన్ మరిన్ని క్షిపణి దాడులు
''గల్ఫ్‌లో అమెరికా స్థావరాలు''గా పరిగణించే లక్ష్యాలపై ఇరాన్ దాడులు పెంచింది.
యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీల రక్షణ మంత్రిత్వ శాఖలకు చెందిన డేటా ఆధారంగా.. నాలుగు రోజుల్లో గల్ఫ్ దేశాలపై ఇరాన్ 550 క్షిపణులను ప్రయోగించిందని బీబీసీ లెక్కించింది.
ఈ సంఖ్య అంతకుముందు యుద్ధాల కంటే ఎక్కువ. 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 500 క్షిపణులను మాత్రమే ప్రయోగించింది.
ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాలు.. తమ ‘‘సార్వభౌమాధికారంపై ఆమోదయోగ్యం కానీ దాడి''గా ఖండించాయి. పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుందని ఆరోపించాయి.
బహ్రెయిన్, కువైట్, యూఏఈలో జరిగిన దాడుల్లో ఏడుగురు మరణించారు. ఒమన్ తీర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌లో ఒకరు మరణించారు. ఇరాక్, సిరియాలో కూడా మరణాలు సంభవించాయి.
ఇరాన్‌కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు ఇంకా ఎలాంటి సైనిక చర్యకు దిగలేదు. కానీ, రక్షణాత్మక చర్యలు, దౌత్య ఒత్తిళ్లపై ఇవి దృష్టిపెట్టాయి.

ఫొటో సోర్స్, Reuters
నికోలస్ కార్ల్ ప్రకారం.. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవాలనే నిర్ణయం, మునపటి సంఘర్షణల సమయంలో ఉపయోగించడానికి వీలు లేని ఆయుధాలను ఉపయోగించే అవకాశాన్ని ఇరాన్‌కు కల్పించింది.
'' గతేడాది జూన్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌ను చేరగల ఆయుధాలను ఉపయోగించింది. ఇప్పుడు స్వల్ప శ్రేణి క్షిపణులనూ వాడుతోంది. అంటే, గతేడాది ఉపయోగించని అన్ని ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం ఉపయోగకరంగా మారాయి'' అని తెలిపారు. ఇరాన్ ''షాహెద్ డ్రోన్లను'' కూడా వాడుతోంది.
యుద్ధం మొదలైన తొలి రోజుతో పోలిస్తే.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులు 86 శాతం తగ్గాయని యూఎస్ జనరల్ డీన్ కెయిన్ చెప్పారు.
డ్రోన్లపైనే అతిగా ఆధారపడటం
బీబీసీ అనాలసిస్ ప్రకారం.. గల్ఫ్‌లో ఇరాన్ క్షిపణుల కంటే డ్రోన్లతోనే ఎక్కువ దాడులు చేస్తోంది.
మార్చి 4 మధ్యాహ్నం వరకు గల్ఫ్ దేశాలపైకి 1,493 డ్రోన్లను ప్రయోగించగా.. 551 క్షిపణులు వేసింది. గత ఏడాది 12 రోజలు యుద్ధం సమయంలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ కేవలం 1100 డ్రోన్లను మాత్రమే ప్రయోగించింది. వాటితో పోలిస్తే ప్రస్తుత డ్రోన్ల సంఖ్య ఎక్కువ.
గల్ఫ్ దేశాలను ఈ ఉద్రిక్తతల నుంచి వెనక్కి వెళ్లమని ఒత్తిడి పెంచడమే బహుశా ఇరాన్ వ్యూహం కావొచ్చని కార్ల్ అన్నారు. దీనివల్ల, అవి వాషింగ్టన్, టెల్ అవీవ్‌పై ఒత్తిడి పెంచగలవు.
యుద్ధం మొదలైన తొలి రోజుతో పోలిస్తే 73 శాతం ఇరాన్ డ్రోన్ దాడులు పెరిగినట్లు యూఎస్ జనరల్ డీన్ కెయిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Fadel Senna/AFP via Getty Images
ఎంత కాలం ఇరాన్ ఇలా క్షిపణులు ప్రయోగించగలదు?
యుద్ధానికి ముందు ఇరాన్ దగ్గర సుమారు 2500 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని ఇజ్రాయెల్ అంచనావేసింది.
నెలకు సుమారు వంద క్షిపణులను ఇరాన్ ఉత్పత్తి చేయగలదని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో చెప్పారు. ఈ అంచనాలను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు.
ఇరాన్ వద్దనున్న ఈ నిల్వలు ఏదో ఒక దశలో తక్కువ స్థాయికి పడిపోతాయని కార్ల్ అంచనా వేస్తున్నారు. కానీ, ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం కష్టమన్నారు.
ఆయన అభిప్రాయంలో, ఇరాన్ ప్రస్తుతం తన వ్యూహాన్ని కొనసాగించనుంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్షిపణి దాడులు కొనసాగిస్తుంది.
''వారి క్షిపణులను రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటాయని ఇరానియన్లకు తెలుసు. కానీ, పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థుల వద్దనున్న ఇంటర్‌సెప్టర్ మిసైల్ నిల్వలను తగ్గించాలని ఇరాన్ కోరుకుంటోంది'' అని తెలిపారు.
అమెరికా వద్ద అపరిమితమైన ఆయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా ప్లాన్ చేసిన కంటే ఎక్కువ కాలం పోరాడే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రధానంగా వైమానిక శక్తిని ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా కూడా భూభాగం, సముద్రం పైనుంచి క్షిపణులను ప్రయోగిస్తోంది.
యుద్ధం మొదలైన తొలి నాలుగు రోజుల్లో అమెరికా 2 వేల దాడులు చేసింది.
మార్చి 4 వరకు 600 వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మొత్తంగా 5 వేల బాంబులు వేసింది.
ఇరానియన్ రెడ్ క్రెసెంట్ (హిలాల్-ఎ-అహ్మర్) ప్రకారం.. ఈ దాడుల్లో 1045 మంది పౌరులు చనిపోయారు. వారిలో యుద్ధం మొదలైన తొలిరోజు మీనాబ్‌లోని ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో మరణించిన 175 మంది చిన్నారులు, స్కూల్ సిబ్బంది కూడా ఉన్నారు.
ఈ సంఖ్యలో రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన అధికారులు కూడా ఉన్నారో లేదో స్పష్టంగా తెలియదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














