ఇరాన్ స్కూల్‌, సమీపంలోని సైనిక స్థావరంపై పదేపదే దాడులు జరిగాయా? శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి?

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఐఆర్‌జీసీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, మార్లిన్ థామస్, షయాన్ సర్దారిజాదెహ్, బార్బరా మేజ్లెర్
    • హోదా, బీబీసీ వెరిఫైడ్
  • చదివే సమయం: 6 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు కొంతమంది పాఠకులకు ఇబ్బంది కలిగించవచ్చు.

దక్షిణ ఇరాన్‌లోని ఓ పాఠశాల చుట్టూ అనేక దాడులు, కాలిన గుర్తులు ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో వెల్లడయ్యాయి. ఈ ప్రదేశంపై ఒకటి కంటే ఎక్కువసార్లు దాడులు జరిగినట్టు ఇవి సూచిస్తున్నాయి.

శనివారం(ఫిబ్రవరి 28) జరిగిన దాడిలో 168 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు.

మినాబ్‌లోని శజరాహ్ తయ్యాబా ప్రాథమిక పాఠశాల, పక్కనే ఉన్న ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) కాంపౌండ్ చుట్టూ భారీ నష్టం జరిగినట్టు ధృవీకృత వీడియోలు చూపుతున్నాయి. ఆ ప్రాంతంపై "ఏకకాలంలో లేదా వరుసగా అనేకసార్లు దాడి జరిగి ఉంటుందని" ఈ ఆధారాలు చూపుతున్నాయని పేలుడు పదార్థాల విశ్లేషకుడు ఎన్ఆర్ బెంజెన్ జోన్స్ చెప్పారు.

ధ్వంసమైన రెండు భవనాలను ఈ చిత్రాలు స్పష్టంగా చూపుతున్నాయి. వాటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైన ఐఆర్‌జీసీ కాంపౌండ్. మరొకటి పాక్షికంగా కూలిపోయిన పాఠశాల భవనం.

దాడి జరిగిన వెంటనే తీసిన ప్రజలు భయాందోళనతో కేకలు వేస్తూ శిథిలాల కింద బాధితుల కోసం వెతుకుతున్నట్టు ధృవీకృత ఫుటేజీలో కనిపిస్తోంది. కొన్ని వీడియోలలో పిల్లల బ్యాగులు, పుస్తకాలు తీసుకెళ్తున్న వ్యక్తులు కనిపిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఐఆర్‌జీసీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మార్చి 3న అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరయ్యారు.

ఎవరు చేశారు?

మూడు రోజుల తర్వాత విడుదలైన ఒక ఏరియల్ వ్యూలో 100కుపైగా సమాధుల గుర్తులు కనిపిస్తున్నాయి.

ఈ దాడికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. కానీ ఇరు దేశాలలో ఏ దేశమూ బాధ్యత వహించలేదు.

ఈ ప్రాంతంలో కార్యకలాపాల గురించి తమకు తెలియదని ఇజ్రాయెల్ చెబుతుండగా అమెరికా " పౌరులను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోదు" అని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఈ సంఘటనపై అమెరికా దర్యాప్తు చేస్తోందన్నారు.

ఇరాన్‌లో కొనసాగుతున్న ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ వల్ల స్వతంత్రగా ఈ సంఘటనను ధృవీకరించడం కష్టమవుతోంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఐఆర్‌జీసీ

ఫొటో సోర్స్, ALI NAJAFI / ISNA / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మినాబ్‌లోని బాలికల పాఠశాలపై దాడి జరిగింది.

పాఠశాల భవనంపై దాడికి కారణమేంటి?

దాడి లక్ష్యంపై ఇరాన్‌లో చాలా ఊహాగానాలున్నాయి.

శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఈ దాడి జరిగిందని ఇరాన్ అధికారులు చెప్పారు.

దాడి జరిగిన వెంటనే జరిగిన పరిణామాలను చూపిస్తూ శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫుటేజీని బీబీసీ వెరిఫై ధృవీకరించింది.

రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) కాంపౌండ్‌కు ఈశాన్యంగా ఉన్న పాఠశాల మైదానంలోకి ఒక వ్యక్తి వెళ్తూ రికార్డ్ చేసినట్టు కనిపిస్తుంది.

ఎంట్రన్స్‌పై ఉన్న బోర్డులో కొంత భాగం వీడియోలో కనిపిస్తోంది. దానిపై 'ప్రైమరీ స్కూల్' అనే పదంలోని మొదటి మూడు అక్షరాలు పర్షియన్ భాషలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పాఠశాల ఆవరణలోని నాలుగు ప్రదేశాల నుంచి పైకి వ్యాపించిన నల్లటి పొగ కనిపిస్తోంది. రెండు చోట్ల పొగ కాస్త తక్కువ ఉంది పాఠశాల ప్రధాన భవనంపై అంతస్తు కిటికీల నుంచి కూడా పొగలు వస్తున్నాయి.

ఐఆర్‌జీసీ కాంపౌండ్ నుంచి భవనాన్ని వేరు చేసే పాఠశాల గోడలపై పిల్లల చిత్రాలు, పర్షియన్ పదాలు ఉన్నాయి.

కదులుతున్న వాహనం నుంచి చిత్రీకరించిన మరొక వీడియో, ఐఆర్‌జీసీ కాంపౌండ్ దక్షిణం మూలను, ప్రవేశ ద్వారం వద్ద ఒక బోర్డును స్పష్టంగా చూపిస్తోంది.

వీడియో ప్రవేశ ద్వారం దగ్గర రెండు స్పష్టమైన లోగోలు కనిపిస్తున్నాయి: సయ్యద్ అల్-షోహాదా ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ కోర్, ఒక మెడికల్ క్లినిక్. ఇవి ఐఆర్‌జీసీ నేవీకి సంబంధించినవని ఇరాన్ మీడియా తెలిపింది.

ఈ ఫుటేజ్‌లో నల్లటి పొగ దట్టంగా అలుముకుని మూడు చోట్ల కనిపిస్తుంది. ప్రవేశ ద్వారం దగ్గర, వైద్య క్లినిక్ దగ్గర ఈ పొగ వ్యాపించింది.

భారీ నష్టం కలిగినట్టు ధ్రువీకరించిన వీడియోల్లో కనిపిస్తున్న ఆ ప్రదేశం నుంచి పొగలు పైకి లేస్తున్నాయి.

మధ్యాహ్నం తీసిన దృశ్యాలలో పాఠశాల భవనం శిథిలావస్థలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. శిథిలాల మధ్య రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను చేపడుతుండగా, దిక్కుతోచని కుటుంబాలు ప్రాంగణం ద్వారా నెమ్మదిగా కదులుతున్నట్టు, వారిలో కొందరు ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నాయి.

సంఘటనా స్థలంలో ఉన్న రెస్క్యూ బృందాలు శిథిలాల కింద నుంచి ఒక పిల్లవాడి తెగిపోయిన చేతిని బయటకు తీస్తున్నట్టు కనిపిస్తున్న ఓ వీడియో విస్తృతంగా షేర్ అయింది. స్కూల్ పుస్తకాలు, రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగ్ కూడా వీడియోలో ఉన్నాయి.

వీడియో ఫుటేజీ

శాటిలైట్ ఫోటోల్లో ఏముంది?

సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఉపగ్రహ చిత్రాలు చాలా కీలకం, ఎందుకంటే సంఘటన జరిగిన ప్రదేశం నుంచి లేదా ప్రత్యక్ష సాక్షుల నుంచి మరిన్ని ఫుటేజ్‌లు అందుబాటులో లేవు.

ఈ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మార్చి 4న ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఉపగ్రహ చిత్రాలు, వీడియోలో ఉన్న దానికంటే ఎక్కువ విధ్వంసాన్ని చూపిస్తున్నాయి.

ఈ ప్రాంతంలోని అనేక భవనాలు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్పష్టమైన నల్లటి కాలిన గుర్తులతో కనీసం ఐదు భవనాలను బీబీసీ వెరిఫై గుర్తించింది.

ఈ సంకేతాలన్నీ అక్కడ మళ్లీ దాడులు జరిగే అవకాశాన్ని మరింత బలపరుస్తున్నాయి.

బీబీసీ వెరీఫై

"దాడి జరిగిన ప్రదేశాల సామీప్యతను బట్టి చూస్తే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని తెలుస్తోంది" అని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఉపగ్రహ చిత్ర నిపుణుడు జైమాన్ వాన్ డెన్ హోక్ బీబీసీకి చెప్పారు.

"ఆ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది, కానీ వారు దేనిని లక్ష్యంగా చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారో స్పష్టంగా లేదు" అని ఆయనన్నారు.

రెండంతస్తుల పాఠశాల భవనంలోని కింది అంతస్తులో"భవనంలోని కింది ప్రాంతానికి చేరుకోగల" ఒక నిర్దిష్టమైన ఆయుధాన్ని ఉపయోగించి ఉండవచ్చని మెకెంజీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌లోని సీనియర్ విశ్లేషకుడు బీబీసీ వెరిఫైతో అన్నారు.

ఆ పాఠశాల భవనం రివల్యూషనరీ గార్డ్స్ కోర్ కాంపౌండ్ సమీపంలో ఉంది.

2013 ఉపగ్రహ చిత్రం పాఠశాల భవనాన్ని ఆ కాంపౌండ్‌లో భాగంగా చూపిస్తోంది. అయితే 2016 చిత్రం ఐఆర్‌జీసీ నుంచి దానిని వేరు చేసే గోడను చూపిస్తోంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఐఆర్‌జీసీ

ఫొటో సోర్స్, Amirhossein Khorgooei/ISNA/West Asia News Agency via Reuters

ఫొటో క్యాప్షన్, దాడి చేసినట్టు అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు.

దాడికి బాధ్యత ఎవరిది?

అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడ్డాయని ఇరాన్ పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ లేదా అమెరికా దీనికి బాధ్యత వహించలేదు.

ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల గురించి తమకు "తెలియదని" ఇజ్రాయెల్ బీబీసీ వెరిఫైకి తెలిపింది. కానీ ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతోంది.

బుధవారం(మార్చి 4) అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ బీబీసీతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అమెరికా ఇంకా దర్యాప్తు చేస్తోందని, "మేం ఎప్పుడూ పౌరులను లక్ష్యంగా చేసుకోం" అని అన్నారు.

ఇరాన్‌తో యుద్ధం "మొదటి 100 గంటలు" చూపించే వివరణాత్మక మ్యాప్‌ను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.

ఆ మ్యాప్‌లో మినాబ్ ప్రాంతంతో సహా దక్షిణ తీరం వెంబడి ఇరానియన్ గగతనల రక్షణ వ్యవస్థలు, దాడికి గురయిన ప్రాంతాలు కనిపిస్తున్నాయి.

మందుగుండు సామగ్రి ఆయుధాల ఫుటేజ్‌లు మరిన్ని లేకుండా దాడికి ఎవరు బాధ్యులో కచ్చితంగా చెప్పడం అసాధ్యం.

రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) ప్రయోగించిన విఫలమైన క్షిపణి వల్ల పేలుడు సంభవించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయిన చిత్రం ఒకటి పేర్కొంది.

అయితే ఆ చిత్రం తర్వాత మినాబ్ నుంచి 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న జంజన్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినది.

"ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పేలుడు ఇరానియన్ ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణిని ప్రయోగించడం వల్ల జరిగే అవకాశం లేదు ఎందుకంటే సాపేక్షంగా చిన్న పేలుడు కలిగించే వార్‌హెడ్ మాత్రమే దానికుంది. " అని ఆర్మమెంట్ రీసెర్చ్ సర్వీసెస్ డైరెక్టర్ జెంజెన్ జోన్స్ అన్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఐఆర్‌జీసీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ దాడిలో 14 మంది పాఠశాల ఉపాధ్యాయులు కూడా మరణించారని ఇరాన్ అంటోంది.

పిల్లల అంత్యక్రియలకు భారీగా ప్రజలు

ఈ సంఘటనలో మరణించిన 168 మందిలో ఎక్కువ మంది పిల్లలే అని ఇరాన్ అధికారులు చెబుతున్నారు అయితే అందుబాటులో ఉన్న ఫుటేజ్ ద్వారా బీబీసీ వెరిఫై బృందం దీనిని ధ్రువీకరించలేకపోయింది.

ఈ దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌లోని ఎవరైనా సభ్యుడు మరణించారా లేదా ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారో కూడా స్పష్టంగా లేదు.

ఆ పాఠశాలలో మొత్తం 264 మంది విద్యార్థులు ఉన్నారని ఇరాన్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరాన్ మీడియాలో ప్రచురించిన చేతితో రాసిన జాబితాలో చనిపోయిన 56 మంది పేర్లు, పుట్టిన తేదీలున్నాయి.

వీరిలో 48 మంది ఆరు నుంచి పదకొండేళ్ల మధ్య వయసున్నవారు.

బీబీసీ వెరిఫై ఈ వివరాలను స్వయంగా ధ్రువీకరించలేకపోయింది. కానీ ఈ పేర్లతో శవపేటికలను చూపించే మరొక వీడియోలో మూడు పేర్లు కనిపిస్తున్నాయి.

ముగ్గురు పిల్లల మృతదేహాలు ఒక చోట ఉన్నాయి.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 1,114 మంది ఇరాన్ పౌరులు మరణించారని, వారిలో 183 మంది పిల్లలు ఉన్నారని అమెరికా మానవ హక్కుల న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఎన్ఏ) తెలిపింది.

దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇరాన్ ప్రభుత్వ మీడియా వేలాది మంది వీధుల్లో బారులు తీరిన అంత్యక్రియల ఊరేగింపు దృశ్యాలను చూపించింది.

ఫుటేజ్‌లో కొన్ని శవపేటికలు ఇరాన్ జెండాలతో కప్పిఉన్నాయి. కొన్ని పిల్లల పరిమాణంలో ఉన్నాయి. అంత్యక్రియలకు హాజరైన మహిళలు అబ్బాయిలు, అమ్మాయిల ఫోటోలను పట్టుకున్నారు.

ఇరాన్ సెమీ అఫీషియల్ తస్నిమ్ వార్తా సంస్థ ఒక ఫోటోను ప్రచురించింది. ఈ దాడిలో 14 మంది పాఠశాల ఉపాధ్యాయులు కూడా మరణించారని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)