అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రజలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కరోలిన్ హాలీ
- హోదా, వరల్డ్ అఫైర్స్ కరెస్పాండెంట్
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్త వినగానే, హమీద్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. తెహ్రాన్‌లోని తన ఇంటి నుంచితన భార్య, కూతురిని తీసుకుని వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
ఆ తర్వాత కొన్ని రోజులు, ఇరాన్ దేశ రాజధాని అంతటా భవనాలపైకి అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు చొచ్చుకురావడం కనిపించింది. ఈ వైమానిక దాడులను చూసేందుకు ఆ కుటుంబం డాబాపైకి ఎక్కేవారు. ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్న ప్రతిసారీ వారు చప్పట్లు కొడుతూ ఆనందించారు.
''తమ దేశంపై ఎవరైనా బయటి వారు దాడి చేస్తుంటే సంతోషించే ప్రజలను ఈ భూగోళంపై ఎక్కడైనా ఉన్నారేమో కనుక్కోండి'' అని యూకేలోని తన కజిన్ ద్వారా హమీద్ నాతో అన్నారు.
''ఇప్పుడు పాలన త్వరలోనే మారుతుందని ఆశిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
హమీద్ ఆయన అసలు పేరు కాదు. ఇరాన్‌లో ఇలా సంతోషించేవారు ఆయన ఒక్కరే కాదు.

బీబీసీ పర్షియన్‌కు చెందిన సహోద్యోగులతో పాటు, ఇరాన్ లోపల, వెలుపలున్న ప్రజల నుంచి ఈ వారం వారికి, వారి దేశ భవిష్యత్‌కు, ఈ ప్రాంతం మొత్తానికి ఎంత కీలకమైనదో మేం వింటున్నాం.
బీబీసీ పర్షియన్ బీబీసీ న్యూస్‌కు చెందిన సర్వీస్. ప్రపంచ వ్యాప్తంగా 2.4కోట్లమంది ఈ సర్వీసును వినియోగించుకుంటున్నారు. ఇరాన్ ఈ సర్వీసును అడ్డుకుంటూ, ప్రసారాలకూ తరచూ అంతరాయం కలిగిస్తున్నప్పటికీ ఇరాన్ నుంచే మెజార్టీ వినియోగదారులు బీబీసీ పర్షియన్‌ను ఫాలో అవుతున్నారు.
బాంబుదాడులు కొనసాగుతున్న కఠిన నియంత్రణల దేశంలో, తీవ్ర ఇంటర్‌నెట్ పరిమితులు అమల్లో ఉన్నచోట, 9కోట్లమంది జనాభా ఉన్న దేశంలో ప్రజాభిప్రాయమేమిటో అర్థం చేసుకోవడం అసాధ్యం.
''రాబోయే రోజుల్లో మీరు ఇంటర్‌నెట్ వినియోగిస్తే మీ లైన్‌ను బ్లాక్ చేస్తాం. మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది'' అని తెహ్రాన్‌లోని ప్రజలకు హెచ్చరిక సందేశాలు వస్తున్నాయి.
అక్కడ ప్రభుత్వం ప్రజల్లో ఇంకా భయం రేకెత్తిస్తూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు తాము, తమ కుటుంబం ఎదుర్కొనే పరిణామాలకు భయపడి పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు.
కానీ, ఈ దాడులు మొదలై వారం దాటుతోంది. కొందరు ఇంకా దాడి జరిగిన ప్రతీసారి వేడుక చేసుకుంటున్నారు.
కొందరిలో భయం పెరుగుతోంది. ఈ యుద్ధం వెనుకున్న వ్యూహం ఏంటి, దీని తుదిపరిణామం ఎలా ఉండనుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ''ఈ యుద్ధ లక్ష్యం కేవలం ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను లేదా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం కాదు'' అని అలీ మాతో అన్నారు.
ఇది అరబ్ దేశాలకు, అమెరికా, ఇజ్రాయెల్‌కు భౌగోళిక రాజకీయ ప్రయోజనమని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మొహమ్మద్ ప్రస్తుతం తెహ్రాన్‌లో నివసిస్తున్నారు.ఆయన వయసు 30 ఏళ్లు .యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు.
ఖమేనీ మరణం తనకు సంతోషం కలిగిస్తుందనుకున్నానని, చివరకు అలా ఏమీ అనిపించలేదన్నారు.
నా సహోద్యోగి సోరౌష్ పక్జాద్‌తో మాట్లాడిన ఆయన.. భవిష్యత్ గురించి తనకు అనిశ్చితి ఉందని చెప్పారు.
ప్రతి చోట ప్రభుత్వ తనిఖీ కేంద్రాలు, ఆకాశం నుంచి పడుతున్న బాంబులతో తనకు చాలా భయమేస్తున్నట్లు తెలిపారు.
మిగిలిన ఇరాన్ ప్రజలు భయం, ఒత్తిడి, ఆశ అనే మూడు రకాల భావనలతో మాతో మాట్లాడారు.
మాతో మాట్లాడిన ఒక మహిళ.. ప్రస్తుతం తాను, ఇతర ఇరాన్ ప్రజలు ఏ సంక్లిష్టతను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవడానికి ఇరాన్‌లో మరో 40 ఏళ్లు నివసించాల్సి ఉంటుందని అన్నారు.
''ప్రభుత్వ భవనాలు లక్ష్యంగా దాడులు జరిగినప్పుడు మేం ఆనందంగా నవ్వుకుంటాం. కానీ, పిల్లలు చనిపోయినప్పుడు, మా భవంతులేమైనా దెబ్బతిన్నప్పుడు, దేశ భవిష్యత్ ఏంటని ఆందోళన చెందుతున్నాం'' అని తెలిపారు.
ఇరాన్‌లో ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయడానికి లేదు. చాలా మంది ఇరాన్ ప్రజలు తమకు చెప్పలేనన్ని బాధలు ఇచ్చిన ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇప్పటికీ ఆ దేశంలో ప్రభుత్వానికి వీరాభిమానులు ఉన్నారు.
''ట్రంప్ ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ అబద్ధాలు చెప్పేవారే. వారు ఇజ్రాయెల్ కోసం వచ్చారే తప్ప ఇరాన్‌పై దాడికి వారివద్ద సరైన కారణం లేదు'' అని సయీద్ మాతో అన్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని ప్రకటనలను పక్కన పెడితే, దాని మద్దతుదారుల నుంచి కొందరి స్వరాలను మాత్రమే మేం వింటున్నాం.
దక్షిణాది పట్టణమైన మినాబ్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలపై ఫిబ్రవరి 28న దాడి జరిగినప్పుడు చనిపోయిన పిల్లల గురించి బాధపడుతున్న తల్లిదండ్రుల నుంచి మేం ఎలాంటి కథనాలను వినలేదు.
ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇదే అత్యంత దారుణమైన దాడి.
ఇస్లామిక్ రిపబ్లిక్ 47 ఏళ్లు కొనసాగిన తరువాత దాని నుంచి బయటపడేందుకు ప్రస్తుత యుద్ధం మాత్రమే మార్గంగా కనిపిస్తోందని కొంతమంది ఇరాన్ పౌరులు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశ బహిష్కరణకు గురైన లక్షల మంది ఇరాన్ ప్రజల్లో హమీద్ కజిన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె యూకేలో నివసిస్తున్నారు.
గత శనివారం బీబీసీకి పంపిన వాట్సాప్ మెసేజ్‌ల్లో చాలా మంది నుంచి భిన్నమైన భావాలు వ్యక్తమయ్యాయి.
''నాకు యుద్ధాలంటే అసహ్యం. వారు ఏవైపు ఉన్నా ఒక్క అమాయకపు ప్రాణం కూడా పోకూడదు లేదా ఒకరికి కూడా హాని జరగకూడదని కోరుకుంటాను. కానీ, ఈ ఉదయం దాడులు జరిగిన వార్తలు రాగానే నేను సంతోషంతో ఎగిరి గంతేశాను'' అని తెలిపారు.
''నాకు తెలుసు, ఇది చాలా పిచ్చి పని అని. కానీ ఇదే నిజం. హంతక అయతొల్లాల నుంచి విముక్తిని పొందాలనే నా కల, చివరికి సాకారం కాబోతుందనే ఆలోచన నన్ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది'' అన్నారు.
వారం చివరిలో హమీద్‌తో మరోసారి మాట్లాడేందుకు ఆమెను సాయం కోరాం. కానీ ఆమె తన సోదరుడితో మాట్లాడలేకపోయారు.
''ప్లీజ్, నా గురించి తప్పుగా అనుకోవద్దు'' అని ఆమె తెలిపారు. ''కానీ, దాడులు కొనసాగాలి. వారు పనిని పూర్తి చేయాలి'' అన్నారు.
వైమానిక దాడులు చాలా వరకు ''చెడ్డ'' వారికి వ్యతిరేకంగానే జరుగుతున్నట్లు ఆమెకు హమీద్ చెప్పారు.
కానీ, చాలామంది పిల్లలతో పాటు పౌరులు మరణిస్తున్నట్లు మనం వింటున్నాం. ఈ దేశంలో ఎలాంటి బాంబు షెల్టర్లు లేదా సైరన్లు లేవు.
ఇప్పటి వరకు సుమారు 200 మంది చిన్నారులతో పాటు వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల న్యూస్ ఏజెన్సీ (హెచ్‌ఆర్ఏఎన్ఏ) తెలిపింది.
ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో చనిపోయిన వేలాది మంది నిరసనకారులను గుర్తించేందుకే హెచ్‌ఆర్ఏఎన్ఏ ప్రయత్నిస్తూ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ భద్రతా దళాలు నిరాయుధ ప్రదర్శనకారులపై కాల్పులు జరిపినప్పుడు జరిగిన రక్తపాతంతోనే ఇరాన్ ప్రజలు ఇంకా బాధపడుతున్నారు.
ఆ సమయంలో సెంట్రల్ సిటీలోని వీధుల్లో భద్రతా కాల్పుల్లో ఆరుగురు చనిపోవడం తనకు తెలుసని సమాన్ తెలిపారు. ఇది ఆయన పూర్తి పేరు కాదు.
ప్రస్తుతం తెహ్రాన్‌లోని రెండు వేరువేరు వైమానిక దాడుల్లో తన బంధువుల్లో ఇద్దరు చనిపోయినట్లు తెలిపారు.
బీబీసీ పర్షియన్ నుంచి సోరౌస్ పక్జాద్‌కు ఈ వారం చివరిలో ఆయన మెసేజ్ చేశారు. ఇరాన్‌లోని ప్రముఖ నగరం ఇస్ఫాహాన్‌లో పరిస్థితి ''నిజంగా ప్రమాదకరంగా'' ఉందని చెప్పారు. వీధుల్లో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు.
తాను చాలా దిగ్భ్రమ చెందానని, కోపం వచ్చిందని చెప్పారు. ''మేమింత యుద్ధంతో బాధపడతామని కలలో కూడా ఊహించలేదు'' అని చెప్పారు.
దేశం లోపల నుంచి ప్రజలతో మాట్లాడుతున్న నా సహోద్యోగి ఘాంచే హబిబియాజాద్ యుద్ధం కొనసాగుతుండటంతో కొందరు ప్రజల అభిప్రాయాలు మారుతున్నట్లు తెలిపారు.
ఖమేనీ మరణం తర్వాత ఈ దాడులు మరింత కొనసాగుతాయని వారు అంచనావేయలేదు.
తెహ్రాన్‌లోని ఓ 20 ఏళ్ల యవతి మాట్లాడుతూ.. సుప్రీం నేతను వారు లక్ష్యంగా చేసుకున్నప్పుడు తనకు చాలా సంతోషం వేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆరు రోజులకు ఘాంచేతో మాట్లాడిన ఆ యువతి, ''ఇప్పుడు నేను సంతోషంగా లేదా బాధగా లేను. అలసిపోయాను అంతే'' అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














