'రష్యా నుంచి 30 రోజుల పాటు భారత్ ఆయిల్ కొనుగోలు చేయొచ్చు', అమెరికా ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు భారత్‌కు '30 రోజులు మినహాయింపు' ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా ఆర్థిక శాఖ 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు.
గతంలో రష్యా చమురు కొనుగోలు, ఇతర వాణిజ్య కారణాలు చూపుతూ భారత్‌పై అమెరికా 50 శాతం సుంకం విధించింది. అయితే, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు, భద్రతకు తమ తొలి ప్రాధాన్యమని భారత్ బదులిచ్చింది. ఈ రష్యన్ చమురును భారత చమురు శుద్ధి కర్మాగారాలు పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
అయితే, కొన్నిరోజుల తర్వాత భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని, ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటించారు.
రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించకపోతే సుంకాలను మళ్లీ 25 శాతానికి పెంచుతామని కూడా హెచ్చరించారు.


ఫొటో సోర్స్, ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty Image
అసలు అమెరికా ఏమంది?
"గ్లోబల్ మార్కెట్‌లోకి చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి, భారతీయ రిఫైనరీలు రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపును జారీ చేస్తోంది" అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ 'ఎక్స్' పోస్టులో రాశారు.
"ఇది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న స్వల్పకాలిక చర్య. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన చమురు లావాదేవీలకు మాత్రమే ఇది అనుమతినిస్తుంది కాబట్టి, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదు."
"అమెరికాకు భారత్ కీలక భాగస్వామి, రాబోయే రోజుల్లో దిల్లీ.. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నాం. ప్రపంచ ఇంధన వనరులపై పట్టు కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలతో ఏర్పడిన ఒత్తిడిని ఈ తాత్కాలిక చర్య తగ్గిస్తుంది" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధం ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరా గొలుసును ప్రభావితం చేయడం మొదలైంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న దాడులు, హార్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అస్థిరపరిచాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత, హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఏ నౌకను కూడా ఈ జలసంధి మీదుగా వెళ్లనివ్వబోమని చెప్పింది. ఇది ప్రపంచంలో చాలా ముఖ్యమైన సముద్ర మార్గం. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం ఈ మార్గంలోనే వెళుతుంది. భారత్‌కు వచ్చే చమురు సరఫరాలో 40 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షాల దాడి
అమెరికా ప్రకటన తర్వాత, భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.
"మన విదేశాంగ విధానం మన చరిత్ర, భౌగోళిక స్థానం, విలువలపై ఆధారపడి ఉండాలి, సత్యం, అహింసపై ఆధారపడి ఉండాలి. నేడు మనం చూస్తున్నది ఒక విధానం కాదు, రాజీపడిన వ్యక్తి దోపిడీ ఫలితం" అని ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు.
ఫిబ్రవరి 11 నాటి లోక్‌సభ ప్రసంగాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.
ఆ రోజు రాహుల్ గాంధీ, "మనం ఎవరి నుంచి చమురు కొనాలో, ఎవరి నుంచి కొనకూడదో అమెరికా మనకు చెబుతోంది. మనం రష్యా నుంచి కొనాలా లేదా ఇరాన్ నుంచి కొనాలా అనేది అమెరికా నిర్ణయిస్తోంది. కానీ, మన ప్రధాని నిర్ణయించడం లేదు" అని అన్నారు.
"భారతదేశం - ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారత్ 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ఇదీ మన ఆత్మనిర్భర్ భారత్, ఇదీ మన స్వతంత్ర విదేశీ విధానం" అని కపిల్ సిబల్ ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఇది దేశానికి 'సిగ్గుచేటు' అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో చమురు కొరత ఉందా?
బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ ప్రకారం, దేశంలో ప్రస్తుతం చమురు, గ్యాస్ కొరత లేదు. కానీ, హార్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న యుద్ధం, ఇరుకైన సముద్ర మార్గంపై భారత ఇంధన భద్రత ఎలా ఆధారపడిందో స్పష్టం చేసింది.
ఇటీవలి రోజుల్లో ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలను లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ హెచ్చరించింది. దీని ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
భారత్ తన ముడి చమురు అవసరాలలో 90 శాతం దిగుమతి చేసుకుంటున్నందున ఈ ఘటన దేశాన్ని చిక్కుల్లో పడేసేదే. భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 25 లక్షల నుంచి 27 లక్షల బ్యారెళ్లు ప్రతిరోజూ ఈ మార్గం ద్వారానే వస్తాయి. ఈ చమురు ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ నుంచి వస్తుంది.
పెట్టుబడి సంస్థ జెఫరీస్ ప్రకారం, ముడి చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగి, దాని భారాన్ని వినియోగదారులపై వేస్తే, భారత్‌లో ద్రవ్యోల్బణం దాదాపు 0.2 నుంచి 0.25 శాతం వరకు పెరగొచ్చు.
"దేశంలో శుద్ధి కర్మాగారాలు, వాణిజ్య స్టోరేజీలలో దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉంది. ఇందులో దాదాపు 80 శాతం ఉపయోగించవచ్చు, ఇది దాదాపు 30 నుంచి 35 రోజుల అవసరాలను తీర్చగలదు" అని సముద్ర నిఘా సంస్థ 'కెప్లర్' విశ్లేషకులు సుమిత్ రిటోలియా బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్‌తో చెప్పారు.
భారత్ డీజిల్, విమాన ఇంధనం వంటి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారు. అందుకే, అవసరమైతే దేశీయ సరఫరాలను నిర్వహించడానికి భారత్ ఈ ఎగుమతులను తగ్గించవచ్చు.
యుద్ధం నేపథ్యంలో ప్రస్తుత 'పరిస్థితిని ఎదుర్కోవడానికి' భారత్ వద్ద తగినంత నిల్వలున్నాయని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుత వివాదం.. రష్యా-యుక్రెయిన్ ఘర్షణ ఉన్నంత కాలం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఈ పోరాటం 15 రోజులకు మించి కొనసాగితే, భారత్‌పై ప్రభావం పడుతుందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Dhiraj Singh/Bloomberg via Getty
74 రోజులకు సరిపడా నిల్వలు: కేంద్రం
జనవరిలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని రిఫైనరీలు, నిల్వ కేంద్రాలలో దేశీయ అవసరాలకు 74 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు.
ముడి చమురు నిల్వలు 25 రోజుల పాటు సరిపోతాయని, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజుల పాటు వస్తాయని అధికారులు తెలిపినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది. స్వల్పకాలిక సరఫరా అంతరాయాలను ఎదుర్కోవడానికి ఉంచే 'వ్యూహాత్మక నిల్వలకు' ఇవి అదనం.
కానీ, సహజ వాయువు అతిపెద్ద సరఫరాదారు అయిన ఖతార్, ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఉత్పత్తిని నిలిపివేస్తామని తెలిపింది. భారత్‌కు కావాల్సిన 27 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ)లో 40 శాతం ఖతార్ సరఫరా చేస్తోంది. గ్యాస్ దిగుమతిదారు పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ లిమిటెడ్ తన కస్టమర్లు, గెయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లకు సరఫరా అంతరాయం గురించి సమాచారం ఇచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











