జస్‌ప్రీత్ బుమ్రా: భారత్‌కు, ఇంగ్లండ్‌కు మధ్య తేడా ఈ బౌలరేనా?

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
- రచయిత, ప్రవీణ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
"ఈ అవార్డ్ జస్‌ప్రీత్ బుమ్రాకి రావాలి. అతను లేకుంటే, నేను ఇక్కడ ఉండేవాడిని కాను"
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయిన సంజూ శాంసన్ చెప్పిన మాట ఇది.
టీం ఇండియా ఫైనల్‌కు చేరిన ఘనతను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు ఇచ్చాడు సంజూ శాంసన్.
20 ఓవర్లలో టీం ఇండియా 253 పరుగుల భారీ స్కోరు సాధించిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు దాని విజయం ఖరారు కాలేదు.
చివరకు ఏడు పరుగుల తేడాతో భారత్ గెలిచింది.


ఫొటో సోర్స్, Getty Images
‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’
రెండు జట్లు కలిపి 499 పరుగులు చేసిన మ్యాచ్‌లో భారత్,ఇంగ్లండ్ మధ్య పెద్ద తేడా ఒకే ఒక్క బౌలర్ అని నిరూపితమైంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జస్‌ప్రీత్ బుమ్రా 6 పరుగులు ఇచ్చి భారత్‌ను మ్యాచ్ చేతుల్లోకి తీసుకొచ్చాడు.
అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఫైనల్‌కు ముందు భారత్‌కు ఇంగ్లండ్ అనేక పాఠాలు నేర్పింది. మార్చి 8న న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇవి టీమిండియాకు ఉపయోగపడతాయి.
చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 45 పరుగులు అవసరం. అప్పటికి జాకబ్ బెతెల్ 42 బంతుల్లో 94 పరుగులు చేశాడు. సామ్ కరన్ క్రీజులో ఉన్నాడు.
ఆ సమయంలో జాకబ్ బెతెల్ భారత్‌ను ఫైనల్‌కు చేరనివ్వడని అనిపించింది. కానీ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ ఆటతీరును కనబర్చాడు.
18వ ఓవర్లో అతను కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు చేయడం ఏ జట్టుకైనా అంత తేలికైన పని కాదు. అదీ ఐదుగురు బ్యాట్స్‌మెన్ అవుటై ఉన్నప్పుడు.
ఆ తర్వాతి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి మిగిలిన పనిని పూర్తి చేశాడు. 19వ ఓవర్ బౌలింగ్ చేసిన పాండ్యా ఫైనల్లో భారత్ స్థానాన్ని పదిలం చేశాడు.
కానీ ఈ విజయంలో అసలైన పాత్ర జస్ప్రీత్ బుమ్రాది. అతను నాలుగు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి హ్యారీ బ్రూక్ వికెట్ కూడా తీసుకున్నాడు.
"బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. తరానికి ఒకరు మాత్రమే అలాంటి బౌలర్లు ఉంటారు. ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడు" అంటూ బుమ్రా ప్రదర్శనను సంజూ శాంసన్ ప్రశంసించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య నిజమైన తేడా జస్‌ప్రీత్ బుమ్రా అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
"జస్‌ప్రీత్ బుమ్రా ఏమి చేయగలడో, కొన్నేళ్లగా అతను ఏం చేశాడో మనకు తెలుసు. అతను ఈ రోజు కూడా అలాగే చేశాడు. అతను మ్యాచ్‌ను ఇంగ్లాండ్ నుంచి దూరం చేశాడు. అతనిది చాలా ప్రత్యేకమైన ఆటతీరు" అని సూర్యకుమార్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫీల్డింగ్ మెరుగుపడాలి'
ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ఈ మ్యాచ్‌లో టీమిండియా అనేక బలహీనతలు బయటపడ్డాయి. గత మ్యాచ్‌లతో పోలిస్తే భారత్ తమ ఫీల్డింగ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఫలితం స్పష్టంగా కనిపించింది.
ఐదోఓవర్ మొదటి బంతికి హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద వెనక్కి పరిగెడుతూ అక్షర్ పటేల్ అద్భుతరీతిలో పట్టి ఒక విధంగా భారత్‌కు మ్యాచ్‌లో ఆధిక్యాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు టోర్నమెంట్‌లో 13 క్యాచ్‌లను వదిలేసింది.
"ఫీల్డింగ్ మెరుగుపడిన క్రెడిట్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌కు దక్కుతుంది. మేం ప్రాక్టీస్ సెషన్‌లలో బాగా రాణిస్తున్నాం. ఇప్పుడు మ్యాచ్ సమయంలో ఫలితాలు కనిపిస్తున్నాయి" అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా గ్రౌండ్ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిఉంటుంది. భారత్ గ్రౌండ్ ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటే, ఇంగ్లండ్‌ను 230 పరుగులకే పరిమితం చేయగలిగేది.
ఫీల్డింగ్ సంగతి పక్కనపెడితే భారత్‌కు ఆందోళన కలిగించే విషయం వరుణ్ చక్రవర్తి ఆటతీరు.
అతను నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా ఇంగ్లండ్ పైచేయి సాధించినట్టు అనిపించింది.
జాకబ్ బెతెల్ తన మొదటి ఓవర్లోనే మూడు సిక్సర్లు బాదాడు. సెమీఫైనల్‌కు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో, వరుణ్ చక్రవర్తి ఎనిమిది ఓవర్లలో 87 పరుగులు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తిని ఫైనల్‌కు తుది 11మంది జట్టులో ఉంచడం టీం ఇండియాకు చాలా కష్టమైన నిర్ణయం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరో బౌలర్, అభిషేక్ శర్మ
ఫీల్డింగ్, వరుణ్ చక్రవర్తితో పాటు టీం ఇండియాకు మరో రెండు ప్రధాన ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. అవి అభిషేక్ శర్మ పేలవమైన ఫామ్, ఆరో బౌలర్ లేకపోవడం.
20వ ఓవర్‌లో ఇంగ్లండ్ గెలవడానికి 30 పరుగులు అవసరం కాగా కెప్టెన్ ముందున్న అతిపెద్ద సవాలు బంతిని ఎవరికి అప్పగించాలో నిర్ణయించడం. అర్ష్‌దీప్, బుమ్రా, హార్దిక్ అప్పటికే తమ ఓవర్ల కోటాను పూర్తి చేశారు.
అక్షర్ పటేల్ లేదా శివమ్ దుబేలో ఎవరో ఒకరికి మాత్రమే ఇవ్వాల్సి ఉంది. చివరి ఓవర్ మొదటి బంతికి బెతెల్ రనవుట్ అయ్యాడు. అయితే చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టి విజయం తేడాను ఆర్చర్ కేవలం ఏడు పరుగులకు తగ్గించాడు.
శివమ్ దుబే వేసిన ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. అంతకుముందు జింబాబ్వేతో మ్యాచ్‌లో అతను రెండు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు.
ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో ఆరో బౌలర్‌గా శివమ్ దుబేపై భారత్ ఆధారపడలేదని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
సెమీఫైనల్స్‌లో అభిషేక్ శర్మ సరిగ్గా ఆడలేకపోయాడు. ఇంగ్లండ్‌పై కేవలం 9 పరుగులు చేశాడు.
అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 89 పరుగులు చేశాడు. జింబాబ్వేపై చేసిన 55 పరుగులు కూడా ఇందులో ఉన్నాయి.
అభిషేక్ ఫామ్‌లో లేకపోవడంతో ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఒక్కసారి కూడా 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించలేకపోయింది.
ఇప్పటివరకు అభిషేక్ శర్మకు మద్దతు ఇస్తున్న జట్టు యాజమాన్యం కూడా ఫైనల్ మ్యాచ్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకునైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












