పాకిస్తాన్: ‘ఓవైపు మధ్యవర్తిత్వం, మరోవైపు ఇరాన్ విమానాలకు ఆశ్రయం’.. అమెరికా మీడియా సంస్థ కథనంపై పాకిస్తాన్ ఏమంటోంది

ఫొటో సోర్స్, AFP via Getty Images
తమ దేశంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం వద్ద ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలున్నాయన్న కథనాలను పాకిస్తాన్ ఖండించింది.
పాకిస్తాన్ విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ దీనిని 'తప్పుదోవ పట్టించే', 'అతిశయోక్తి' రిపోర్టింగ్ అని పేర్కొంది.
ఒకవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలను తన వైమానిక స్థావరంలో నిలిపి ఉంచడానికి అనుమతిస్తోందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ‘సీబీఎస్ న్యూస్’ రిపోర్ట్ చేసింది.
ఈ విమానాలను అమెరికా దాడుల నుంచి కాపాడటమే ఇరాన్ లక్ష్యమని సీబీఎస్ న్యూస్ పేర్కొంది.
అమెరికా దాడులకు గురి కాకుండా తమ సైనిక, పౌర విమానాలను సురక్షితంగా ఉంచేందుకు ఇరాన్ వాటిని పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లకు పంపించిందని సీబీఎస్ పేర్కొంది.

పాకిస్తాన్ ఏమంటోంది?
సీబీఎస్ న్యూస్ కథనాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేసింది.
"నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న సీబీఎస్ న్యూస్ నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉంది. మేం ఈ వార్తను ఖండిస్తున్నాం. ప్రాంతీయ స్థిరత్వం, శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలను దెబ్బతీయడమే ఈ ఊహాజనిత కథనం లక్ష్యంగా కనిపిస్తోంది" అని ఆ పోస్ట్‌లో రాసింది.
"కాల్పుల విరమణ తర్వాత ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి దశ చర్చల్లో సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించిన దౌత్య సిబ్బంది, భద్రతా బృందాలు, పరిపాలనా సిబ్బంది రాకపోకలను సులభతరం చేయడానికి ఇరాన్, అమెరికా నుంచి కొన్ని విమానాలు పాకిస్తాన్‌కు వచ్చాయి" అని పాకిస్తాన్ తెలిపింది.
"తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని భావించి కొన్ని విమానాలు, సహాయక సిబ్బంది తాత్కాలికంగా పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం అధికారిక చర్చలు మళ్లీ ప్రారంభం కాకపోయినా, ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఇస్లామాబాద్‌లో పర్యటించారు" అని పాకిస్తాన్ తెలిపింది.
ఇరాన్ విమానాల ఉనికిని పాకిస్తాన్ పూర్తిగా ఖండించలేదు.
"ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఇరాన్ విమానాలు కాల్పుల విరమణ కాలంలో వచ్చాయి. వీటికి ఏ సైనిక దళంతో గానీ, భద్రతా ఏర్పాట్లతో గానీ సంబంధం లేదు. దీనికి విరుద్ధమైన వాదనలు ఊహాజనితమైనవి, తప్పుదోవ పట్టించేవి. వాస్తవాస్తవంతో సంబంధం లేనివి" అని పాక్ పేర్కొంది.
చర్చలకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు సహకరించడంలో తాము నిష్పక్షపాత, నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన భాగస్వామి పాత్రను నిరంతరం పోషించామని పాకిస్థాన్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘సీబీఎస్’ కథనంలో ఏముంది?
జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను చర్చించడానికి తమ పేర్లు వెల్లడించరాదన్న షరతుతో మాట్లాడిన అమెరికా అధికారులు, అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో ఇరాన్‌తో కాల్పుల విరమణను ప్రకటించారని చెప్పినట్లు సీబీఎస్ న్యూస్ పేర్కొంది.
తర్వాత కొన్నిరోజులకు పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయమైన రావల్పిండి శివార్లలో ఉన్న ముఖ్యమైన సైనిక స్థావరం, పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు ఇరాన్ అనేక విమానాలను పంపిందని సీబీఎస్ రిపోర్ట్ చేసింది.
ఈ సైనిక విమానాలలో ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130 విమానం కూడా ఉంది. ఇది లాక్‌హీడ్ సీ-130 హెర్క్యులస్ రవాణా విమానానికి చెందిన నిఘా వెర్షన్.
"ఈ వార్త నిజమైతే ఇరాన్, అమెరికా, ఇతర పక్షాల మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ గురించి పాకిస్తాన్ రక్షణ అధికారులు గతంలో చేసిన కొన్ని ప్రకటనలను బట్టి చూస్తే, ఇది నిజమని తేలినా నేను ఆశ్చర్యపోను" అని రిపబ్లికన్ సెనేటర్ గ్రాహం లిండ్సే ఎక్స్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ ఏమంటోంది?
అఫ్గానిస్తాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న వార్తలను అఫ్గాన్ తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఖండించారు.
"అది నిజం కాదు, ఇరాన్‌కు అలా చేయాల్సిన అవసరం లేదు" అని ఆయన ‘సీబీఎస్ న్యూస్’తో అన్నారు.
"యుద్ధం మొదలుకావడానికి ముందు మహాన్ ఎయిర్‌కు చెందిన ఒక ఇరాన్ ప్రయాణికుల విమానం కాబుల్ వచ్చింది. ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో అది కూడా కాబుల్ విమానాశ్రయంలోనే ఉండిపోయింది" అని అఫ్గాన్ పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
మార్చ్‌లో కాబుల్‌పై వైమానిక దాడులు జరిపిన పాకిస్తాన్, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్‌కు అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించిన తర్వాత, భద్రతపరమైన ఆందోళనల కారణంగా తాలిబాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆ విమానాన్ని ఇరాన్ సరిహద్దు సమీపంలోని హెరాత్ విమానాశ్రయానికి తరలించిందని సీబీఎస్ న్యూస్ పేర్కొంది.
"ఏప్రిల్ 11న ఇరాన్, అమెరికా చర్చల మొదటి దశకు కొన్ని రోజుల ముందు, అమెరికా ప్రతినిధి బృందం రాకకు ముందే భద్రతా, ప్రోటోకాల్ సిబ్బందితో కూడిన పలు విమానాలు ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. అలాగే ఇరాన్ ప్రతినిధి బృందం కూడా విమానంలో ఇస్లామాబాద్‌కు చేరుకుంది" అని బీబీసీ ఉర్దూ పేర్కొంది.
ఆ సమయంలో ఏప్రిల్ 9న ఖతార్‌లోని యూఎస్ అల్-ఉదైద్ ఎయిర్ బేస్ నుంచి యూఎస్ సీ-17 కార్గో విమానం ఇస్లామాబాద్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు చేరుకుందని ఒక ప్రభుత్వ అధికారి బీబీసీకి తెలిపారు.
"ఇది చాలా పెద్ద విమానం. సాయుధ వాహనాలు, ట్యాంకులు మొదలైనవాటిని మోయగలదు. అమెరికన్ ప్రతినిధి బృందం కోసం ప్రత్యేక వాహనాలను ఈ విమానం ద్వారా ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చారు" అని ఆయన చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




















