క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాతో స్టాక్ మార్కెట్లో రూ. 550 కోట్ల 'కుంభకోణం'

ఫొటో సోర్స్, Bhargav Parikh
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 5 నిమిషాలు
ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాను నెలకు రూ. 25 వేలకు అద్దెకు తీసుకుని, దాని ద్వారా ఓ గ్యాంగ్ సుమారు 550 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు.
అంతగా పేరులేని కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి ఈ గ్యాంగ్ ‘మనీలాండరింగ్‌కు’ పాల్పడిందని, వీరిని పట్టుకోవడానికి సాయం చేయమని అహ్మదాబాద్ పోలీసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది.
ఈ కుంభకోణంలో ఇప్పటివరకు ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి.

ఫొటో సోర్స్, Bhargav Parikh
అసలేం జరిగింది?
చాలా తక్కువగా గుర్తింపు ఉన్న కొన్ని కంపెనీల షేర్లలో అసాధారణమైన పెరుగుదల కనిపించడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
మ్యురే ఆర్గనైజర్స్ లిమిటెడ్, ప్రధిన్ లిమిటెడ్, కేక్రాఫ్టన్ డెవలపర్స్ లిమిటెడ్ షేర్లు 2025లో వెయ్యి శాతానికి పైగా పెరిగాయి.
ఈ మూడు 'పెన్నీ షేర్ల'లో అసాధారణ కదలికలు గమనించిన షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, డిసెంబర్ 2025లో ఈ కంపెనీల ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. అనంతరం కేసు దర్యాప్తును ఈడీకి అప్పగించింది.
ఈ మూడు కంపెనీల షేర్ల ధరలు పెరగడానికి అహ్మదాబాద్‌లోని గుల్బాయి టెక్రా ప్రాంతంలోని 'రోనక్ ట్రేడర్స్', నవరంగ్‌పురాలోని 'కమలేష్ ట్రేడింగ్', మిఠాఖలీలోని 'ప్రదీప్ ట్రేడర్' అనే సంస్థలే కారణమని ఈడీ దర్యాప్తులో తేలింది.
ఈ కుంభకోణంలో ఇప్పటివరకు సుమారు ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి. వీరు ఒక డ్రైవర్ బ్యాంక్ ఖాతాను ఉపయోగించి అక్రమంగా డబ్బును జమ చేయడం, ఆపై విత్ డ్రా చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హృదేష్ కుమార్ రాసిన లేఖలో ఈ కుంభకోణం తీరును వివరించారు.
ఒక క్యాబ్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ ఔడ్ అనే వ్యక్తి పేరిట 2024లో నిందితులు బ్యాంక్ ఖాతా తెరిచారు.
ఈ ఖాతాను నెలకు రూ. 25,000 చొప్పున అద్దెకు తీసుకుని, అందులో షేర్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించిన కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు.
ఇలాంటి మరికొన్ని బ్యాంక్ ఖాతాలను కూడా నిందితులు వినియోగించినట్లు ఈడీ గుర్తించింది.
షేర్ మార్కెట్‌లో రూ. 550 కోట్ల కుంభకోణానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 336, 335, 340 (నకిలీ పత్రాల సృష్టి), సెక్షన్లు 318, 319 (మోసం) కింద కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను ఈడీ కోరింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో ప్రచారం
దర్యాప్తులో ప్రదీప్ పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆయనకు కిరణ్ పర్మార్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. వ్యాపారంలో ట్యాక్స్ ఆదా చేసేందుకు ఆధార్, పాన్ కార్డు వంటి పత్రాలు ఇస్తే, వాటితో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో డబ్బు జమ చేస్తామని కిరణ్ చెప్పారు.
ఆ బ్యాంక్ ఖాతాను కిరణ్ స్నేహితులు నిర్వహిస్తారని, ఇందుకు ప్రతిగా నెలకు రూ. 25,000 ఇస్తారని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అదనంగా, ప్రదీప్ సంతకం చేసే ప్రతి చెక్కుకు రూ. 400 ఇవ్వజూపారు. ఈ విధంగా ఆదాయం వస్తుందని భావించి ప్రదీప్ తన బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇచ్చాడు. ప్రదీప్‌తో పాటు కమలేష్ కలాల్, రోనక్ పేరుతో కూడా మరో రెండు బ్యాంక్ ఖాతాలు తెరిచారు.
ఈ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుతో చేసిన గోల్ మాల్ ద్వారా పెన్నీ స్టాక్ షేర్ల ధరలను భారీగా పెంచారు. ఈడీ దర్యాప్తు ప్రకారం, 2024లో అహ్మదాబాద్‌లో ప్రారంభమైన మూడు ట్రేడింగ్ సంస్థల పేరిట టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ల గురించి తప్పుడు 'టిప్స్' ఇచ్చారు. ఆ తర్వాత ఆ షేర్ల ధరల్లో కృత్రిమంగా పెరుగుదల తీసుకువచ్చారు.
2024లో దీనిపై నవీ ముంబయి సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత 2025లో బెంగళూరు ఈస్ట్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్‌లో, చివరగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్, గాంధీనగర్ సీఐడీ క్రైమ్‌లో ఫిర్యాదులు దాఖలయ్యాయి.

ఫొటో సోర్స్, Bhargav Parikh
షేర్లలో అసాధారణ పెరుగుదల
ఈ కుంభకోణంలో వినిపించిన పేర్లలో మ్యురే ఆర్గనైజర్ లిమిటెడ్ షేర్ ధర ఏడాదిలో 67 పైసల నుంచి రూ. 10.90 కి పెరిగింది. ఆ తర్వాత ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా ప్రధిన్ లిమిటెడ్ షేర్ విలువ ఏడాదిలో 37 పైసల నుంచి రూ. 2.38 కి, కేక్రాఫ్టన్ డెవలపర్ షేర్ రూ. 122.45 నుంచి రూ. 1,702.90కి పెరిగింది.
ఈ విధంగా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి దాదాపు రూ. 550 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే ఎవరి ఖాతాలో డబ్బు జమ అయ్యిందో ఆయన(ప్రదీప్)కు ఈ విషయాలేమీ తెలియదు. కిరణ్ పర్మార్ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి. ఆయన సహచరుడు మహాదేవ్ అన్ని బ్యాంక్ ఖాతాల చెక్కు బుక్కులను చూసుకునేవారు, ఆఫీసు అద్దె, ఇతర ఖర్చులను చెల్లించేవారని ఈడీ దర్యాప్తు చూపుతోంది.
బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చిన వారి పేరుతో రవి అనే వ్యక్తి సిమ్ కార్డులు తీసేవారు. జుగల్, జీవరాజ్ అనే వ్యక్తులు షేర్ల ధరల పెరుగుదలను పర్యవేక్షించేవారు. ఈ బ్యాంక్ ఖాతా నుంచే గాంధీధామ్‌కు చెందిన వ్యాపారి ఆదిత్య జులా వివాహ వేడుకలకు డబ్బు వాడినట్లు తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
"చాలాకాలంగా కొందరు సోషల్ మీడియాలో షేర్ మార్కెట్ పెట్టుబడుల గురించి టిప్స్ ఇస్తున్నారు. వీరు కృత్రిమంగా షేర్ల ధరలను పెంచి, డబ్బు జమ చేయడానికి బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుంటారు. నెలకు పది, పదిహేను వేలు సంపాదించే వారి నుంచి ఖాతాలను తీసుకొని ప్రతిగా వారికి నెలకు రూ. 20 నుంచి 25 వేల అద్దె ఇస్తారు" అని అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చైర్మన్, డబ్బా ట్రేడింగ్, పెన్నీ షేర్ల మోసాల నిరోధక ప్రచారకర్త హేమంత్‌సింగ్ జాలా బీబీసీ గుజరాతీతో చెప్పారు.
" సోషల్ మీడియా ద్వారా ఏదైనా షేర్ గురించి చర్చ లేవనెత్తి, దాని ధర పెరిగినప్పుడు నిందితులు షేర్లు అమ్మేస్తారు. అద్దె బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవ్వగానే విత్ డ్రా చేస్తారు. ఇలాంటి వారి గురించి సెబీకి సమాచారం ఇస్తే బ్యాంక్ ఖాతాలను జప్తు చేయవచ్చు. కానీ, అప్పటికే నిందితులు డబ్బు తీసుకుని తప్పించుకుంటారు. చివరకు బ్యాంక్ ఖాతా యజమాని వరకు దర్యాప్తు చేరుతుంది. ఈ లోగా నిందితులు తాము ఇచ్చిన ఫోన్ నంబర్లు, సిమ్ కార్డులను (నకిలీవి కావడంతో) పారేస్తారు" అని హేమంత్ జాలా వివరించారు.
పోలీసులు ఏమన్నారు?
షేర్ మార్కెట్‌లో కృత్రిమంగా ధరలను పెంచినట్లు ఆరోపణలున్న ఈ కేసు గురించి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ అజిత్ రాజియన్ బీబీసీ గుజరాతీతో మాట్లాడారు.
"ఈడీ నుంచి లేఖ అందిన తర్వాత నిందితులపై మోసం, ఇతరుల పత్రాలను (డాక్యుమెంట్లను) ఉపయోగించుకుని నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఆధారాలను సేకరిస్తున్నాం. నిందితులు కిరణ్ పర్మార్, రవి, జుగల్, మహాదేవ్, జీవరాజ్‌లను త్వరలోనే పట్టుకుంటాం" అన్నారు ఎస్పీ.
ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హృదేష్ కుమార్ బీబీసీ గుజరాతీతో టెలిఫోన్లో మాట్లాడుతూ, "ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మేం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గుజరాత్ పోలీసులను కోరాం. ఈడీ కూడా దర్యాప్తులో సహకరిస్తుంది" అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












