టీ20 వరల్డ్ కప్ 2026: విమర్శల నుంచి విజేతల వరకు.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ 'కమ్‌బ్యాక్' కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం..
వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడుతోంది. కానీ, ఈ విజయం వెనుక ఉన్న ఇద్దరు ఆటగాళ్ల ప్రయాణం మాత్రం కన్నీళ్లు, విమర్శలు, బలమైన ఆత్మవిశ్వాసంతో కూడుకున్నది.
ఒకరు ఫామ్ కోల్పోయి తనను తాను శంకించుకున్న యువ ఆటగాడు అభిషేక్ శర్మ, మరొకరు తన కెరీర్ ముగిసిపోయిందని భావించి గ్లౌజులు కూడా ఇచ్చేసిన సంజూ శాంసన్.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, విమర్శలను ఎదుర్కొని నిలబడిన ఇద్దరు ప్లేయర్ల ఆత్మగౌరవ పోరాటం.

ఫొటో సోర్స్, Getty Images
'నన్ను నేనే శంకించుకున్నా' - అభిషేక్ శర్మ
మ్యాచ్ ముగిసిన వెంటనే కామెంటేటర్ హర్ష భోగ్లేతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు.
"నేను ఈ విషయాన్ని ముందే చెప్పాలనుకున్నా. కానీ, మాట్లాడటానికి ఇవాళే సరైన రోజు అనిపించింది. నిజానికి ఒకానొక దశలో నన్ను నేనే శంకించుకున్నా" అని భావోద్వేగానికి లోనయ్యాడు.
గత ఏడాది కాలంగా అద్భుతంగా రాణించిన ఈ యువ బ్యాటర్, సరిగ్గా మెగా టోర్నీ వచ్చేసరికి ఫామ్ కోల్పోవడం అతడిని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది.
టోర్నీ ఆరంభం నుంచి విఫలమవ్వడంతో, మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ వంటి వారు కఠిన విమర్శలు చేశారు.
"అభిషేక్ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు, తన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాడు" అని గావస్కర్ ఇండియా టుడేతో అన్నారు.
అతని స్థానంలో రింకూ సింగ్‌ను తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.


ఫొటో సోర్స్, Getty Images
అభిషేక్ శర్మకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్‌లు అండగా నిలిచారు.
"నువ్వు బిగ్ మ్యాచ్ విన్నర్‌వి" అని వారు పదే పదే చెప్పిన మాటే తనను ఫైనల్లో రాణించేలా చేసిందని అభిషేక్ చెప్పాడు.
తనపై వారు చూపిన నమ్మకం చూపారని, టోర్నీ మధ్యలో తాను చాలాసార్లు భావోద్వేగానికి లోనయ్యానని చెప్పాడు.
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ "అభిషేక్ ఈరోజు పరుగులు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో మాకు ఏదీ కలిసి రావడం లేదని మేమిద్దరం పక్కపక్కనే కూర్చునేవాళ్లం.. అప్పుడప్పుడు సీట్లు కూడా మార్చుకునేవాళ్లం. అసలు ఏం జరుగుతోంది? మనకు ఏదీ వర్కవుట్ అవ్వడం లేదేంటి? అని చర్చించుకునేవాళ్లం" అని అన్నారు.
అభిషేక్ శర్మ న్యూజీలాండ్‌పై కేవలం 21 బంతుల్లో 52 పరుగులు సాధించి, పవర్‌ప్లేలోనే భారత్‌ను 90 పరుగుల మార్కుకు చేర్చడం ద్వారా తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చాడు.
యూట్యూబర్ ఆశిష్ చంచ్లాని అన్నట్లుగా.. "అభిషేక్ శర్మను ఏ స్థాయిలోనైతే అవమానిస్తూ ట్రోల్ చేశారో, ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయిలో అతడిపై ప్రశంసల వర్షం కురవాలి".

ఫొటో సోర్స్, Getty Images
సంజూ శాంసన్: గ్లౌవ్స్ వదిలేసిన చోటే గెలుపు
అభిషేక్ కథ ఒక రకమైతే, సంజూ శాంసన్ ప్రయాణం మరో అద్భుతం.
2026 జనవరి 31న న్యూజీలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత సంజూ నిరాశలో కూరుకుపోయాడు.
ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో, టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా అతను కేవలం 6 పరుగులకే అవుట్ కావడంతో ఇక భారత జట్టులో తన ప్రయాణం ముగిసిందని సంజూ భావించాడు.
అదే మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. భారత జట్టు 271 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.
ఆ సమయంలో, సంజు శాంసన్ చాలా నిరాశగా కనిపించాడు, బౌండరీ లైన్ దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు చిన్న పిల్లలకు తన కీపింగ్ గ్లౌవ్‌లను బహుమతిగా ఇచ్చేసి, "ఇక వీటితో పని లేదు" అన్నట్లుగా నిష్క్రమించాడు.
కానీ, కొన్నిరోజుల్లోనే అంతా మారిపోయింది. టోర్నీ మధ్యలో ప్లేయింగ్ లెవన్‌లోకి వచ్చిన సంజూ, ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు.
- సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులు.
- సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు.
- ఫైనల్‌లో మళ్లీ 89 పరుగులు చేసి భారత్‌ను టీ20ల్లో విశ్వవిజేతగా నిలిపాడు.

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
'సచిన్ సార్‌తో మాట్లాడా'
టోర్నీలో మొత్తంగా 321 పరుగులు, 199.37 స్ట్రైక్ రేట్‌తో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు అందుకున్న సంజూ.. తన పునరాగమనంలో మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పాత్రను గుర్తు చేసుకున్నాడు.
"నేను గత రెండు నెలలుగా సచిన్ సార్‌తో టచ్‌లో ఉన్నాను. ఆయన నిన్న రాత్రి కూడా నాకు ఫోన్ చేశారు. నేను ఎంతో కృతజ్ఞుడిని" అని సంజూ ఫైనల్ మ్యాచ్ అనంతరం అన్నాడు.
"న్యూజీలాండ్ సిరీస్ తర్వాత నేను ముక్కలైనట్టనిపించింది. నా కల బూడిదలో కలిసిపోయిందనిపించింది. కానీ, దేవుడికి మరో ప్లాన్ ఉంది. నేను మళ్ళీ కలలు కనే ధైర్యం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది" అని ఎమోషనల్ అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
వాళ్లు టాప్ ప్లేయర్స్: కెప్టెన్ సూర్యకుమార్
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ, "సంజూ శాంసన్, అభిషేక్ శర్మ టాప్ ప్లేయర్స్. వారు ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తారని మాకు తెలుసు, సరిగ్గా ఫైనల్‌లో వారు అదే చేసి చూపించారు" అని అన్నాడు.
ఫైనల్లో అభిషేక్ ఆటపై సచిన్ తెందూల్కర్ ఎక్స్ పోస్టులో స్పందిస్తూ, "అభిషేక్ శర్మకు ఈ టోర్నీ అంత సులభంగా సాగలేదు. కానీ, అతని సామర్థ్యంపై జట్టు ఉంచిన నమ్మకాన్ని, ఫైనల్లో ఆడిన కీలక ఇన్నింగ్స్‌తో నిలబెట్టుకున్నాడు" అని తెలిపారు.
అటు ఇర్ఫాన్ పఠాన్, ఆయుష్మాన్ ఖురానా వంటి ప్రముఖులు కూడా.. ఆటగాళ్లు క్లిష్ట దశలో ఉన్నప్పుడు మేనేజ్‌మెంట్ ఇచ్చే మద్దతు ఎంత గొప్పదో ఈ విజయం నిరూపించిందని కొనియాడారు.

ఫొటో సోర్స్, Getty Images
చివరగా, కుల్దీప్ యాదవ్ నుంచి వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న సంజూ, ఆ కప్పును రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయిన దృశ్యం భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది.
అభిషేక్ శర్మ తనపై తనకు కలిగిన సందేహాలను పటాపంచలు చేస్తే, సంజూ శాంసన్ అసలు ముగిసిపోయిందనుకున్న తన కెరీర్‌ను శిఖరాగ్రానికి చేర్చాడు. వీరిద్దరి పోరాటం స్ఫూర్తిదాయకం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














