Ind vs NZ: ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత బౌలర్ బుమ్రాపై పాకిస్తాన్‌లో ఆసక్తికర చర్చ..

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

సంజూ శాంసన్‌ – టీ20 ప్రపంచకప్ టోర్నీ నాలుగు మ్యాచుల్లో 77.33 సగటుతో 232 పరుగులు, 201.74 స్ట్రైక్ రేట్.

జస్‌ప్రీత్ బుమ్రా - 15.9 సగటుతో ఏడు మ్యాచుల్లో 10 వికెట్లు, ఎకానమీ - 6.62.

ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అయితే, పాకిస్తాన్‌లో ఈ మ్యాచ్ గురించి జరుగుతున్న చర్చలో ఎక్కువ దృష్టి శాంసన్‌, బుమ్రాలపైనే ఉంది.

సామా టీవీ కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ.. భారత బౌలర్ బుమ్రాను ప్రశంసించారు.

"బుమ్రా వేరే లీగ్ బౌలర్. అతనిలో చాలా నైపుణ్యాలున్నాయి, బాగా బౌలింగ్ చేయడానికి కేవలం పిచ్‌పైనే ఆధారపడడు" అన్నారు.

"అతను అన్ని రకాల పిచ్‌లపై వికెట్లు తీస్తాడు. రెడ్ బాల్, వైట్ బాల్ గేమ్‌లో నిపుణుడు. ఒకే ఓవర్‌లో వివిధ రకాల బంతులను వేయగలడు. ఇటీవలి సంవత్సరాలలో బుమ్రా కంటే బాగా యార్కర్లు వేసిన బౌలర్‌ను నేను చూడలేదు" అని అన్నారు.

ఫైనల్లో బుమ్రా కీలకంగా మారుతాడని అఫ్రీదీ అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బుమ్రాతో సంజూ శాంసన్‌

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

'భారత్‌ను వాళ్లే ఫైనల్‌కు తీసుకెళ్లారు'

భారత్ ఫైనల్‌కు చేరుకోవడంలో బుమ్రాతో పాటు సంజూ శాంసన్‌ క్రెడిట్ కూడా ఉందని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ అభిప్రాయపడ్డారు.

"ఇండియాను కేవలం సంజూ, బుమ్రా మాత్రమే ఆదుకున్నారు. వీరిద్దరి వల్లే భారత్ ఫైనల్‌కు చేరుకుంది. కేవలం ఇద్దరు ఆటగాళ్ల అండతోనే భారత్ ఫైనల్ వరకు చేరుకోవడాన్ని టీమిండియా సాధించిన గొప్ప విజయంగా భావిస్తాను" అని జియో స్పోర్ట్స్ ప్రోగ్రాంలో ఆమిర్ పేర్కొన్నారు.

ముందుగా వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో (మస్ట్ విన్) మ్యాచ్‌లో సంజూ శాంసన్ 97 పరుగుల ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను సెమీఫైనల్‌ చేర్చారు.

మరోవైపు బుమ్రా టోర్నమెంట్ అంతటా ఆకట్టుకున్నాడు. వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లందరూ విఫలమవుతున్న చోట, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకున్నాడు.

ఆ ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన 18వ ఓవర్‌పై చర్చలు జోరుగా సాగుతున్నాయి, ఎందుకంటే ఆ ఓవర్‌లో అతను కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

హై-స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ కేవలం ఏడు పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఈ ఓవర్ అత్యంత కీలకంగా మారింది.

బుమ్రాను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 'చాలా తెలివిగా' ఉపయోగించుకున్నారని ఆమిర్ ప్రశంసించారు.

ఒక న్యూస్ ఛానల్ కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ "సంజూ గత కొన్నేళ్లుగా టీమిండియా రేసులో ఉన్నారు. కానీ ధోనీ, దినేష్ కార్తీక్ వంటి ఇతర వికెట్ కీపర్ల వల్ల అతనికి జట్టులో చోటు దక్కలేదు. ఈసారి గౌతమ్ గంభీర్ పట్టుబట్టి మరీ అతన్ని జట్టులోకి తీసుకువచ్చాడు" అన్నారు.

న్యూజీలాండ్, ఫిన్ అలెన్

ఫొటో సోర్స్, MB Media/Getty Image

ఎవరిది పైచేయి?

ఫైనల్‌లో 'న్యూజీలాండ్ జట్టుదే పైచేయి' అని ఆమిర్ అభిప్రాయపడ్డారు.

"ఒక జట్టుగా న్యూజీలాండ్ మెరుగ్గా ఉంది. ఎందుకంటే, భారత్ కేవలం సంజూ శాంసన్, బుమ్రాపైనే ఆధారపడి ఉంది. కానీ, న్యూజిలాండ్ ఒక యూనిట్‌గా ఆడుతోంది. వారి జట్టులో చాలామంది ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు" అన్నారు.

ఆమిర్ ప్రకారం.. ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర వంటి బ్యాటర్లు న్యూజీలాండ్ బ్యాటింగ్‌కు బలాన్ని ఇస్తుండగా, మిచెల్ శాంట్నర్, ఈష్ సోధి, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో వైవిధ్యాన్ని తీసుకొస్తున్నారు.

అంతేకాదు, భారత్ సీమర్లను ఆడలేకపోతోందని, న్యూజీలాండ్ అదనపు ఫాస్ట్ బౌలర్‌ను దించాలని ఆమిర్ సూచించారు.

అయితే, అదే ప్రోగ్రాంలో పాల్గొన్న పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ మాత్రం ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అని అభిప్రాయపడ్డారు.

"ఇంగ్లండ్‌పై డెత్ ఓవర్లలో ఒత్తిడి ఉన్నప్పటికీ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ బుమ్రా నాయకత్వంలో బౌలర్లు రాణిస్తున్నారు. న్యూజీలాండ్ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే కానీ, నాకు ఇండియానే బలంగా కనిపిస్తోంది" అని చెప్పారు.

ఇదే జియో స్పోర్ట్స్ ప్రోగ్రాంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ కూడా పాల్గొన్నారు. హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ జట్టులో ఉండటం భారత్‌కు బలాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్‌తో పాటు కీలక సమయాల్లో బంతితో కూడా రాణించి అతను భారత్‌కు విజయాన్ని అందించగలడని పేర్కొన్నారు.

"పాకిస్తాన్ ఆల్ రౌండర్లు పాండ్యాను చూసి నేర్చుకోవాలి" అన్నారు సికందర్.

వరుణ్ చక్రవర్తి , కుల్దీప్ యాదవ్

ఫొటో సోర్స్, FADEL SENNA/AFP via Getty Images

కుల్దీప్ వైపు మొగ్గు

భారత్ మ్యాచ్ గెలవాలంటే వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ సరైనవాడని ఆమిర్, అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డారు.

"కుల్దీప్‌కు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఫైనల్‌లో అతనికి అవకాశం ఇవ్వాలి" అన్నారు ఆమిర్.

ఫైనల్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను 'వరుణ్ చక్రవర్తి బౌలింగ్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా?' అని ప్రశ్నించగా.. "మేం అస్సలు ఆందోళన చెందడం లేదు. చివరి మ్యాచ్ గెలిచాం. ప్రతి ఆటగాడికి ఒక రోజు కలిసి రావొచ్చు, మరో రోజు రాకపోవచ్చు. ఒక ప్లేయర్ రాణించనప్పుడు మరొకరు ఆ లోటును భర్తీ చేస్తారు" అన్నారు.

మరోవైపు, న్యూజీలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను భారత్‌కు ఉన్న హోమ్ అడ్వాంటేజ్ గురించి ప్రశ్నించగా.. "మా లక్ష్యం ఒక్కటే, ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడం" అని చెప్పారు.

ట్రోఫీని గెలవడం కోసం కొందరు భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసినా పర్లేదని అతను అభిప్రాయపడ్డారు.

న్యూజీలాండ్ కెప్టెన్ వ్యాఖ్యలపై సూర్యకుమార్ స్పందిస్తూ, "మేం అస్సలు ఒత్తిడిలో లేం. చాలా సంతోషంగా, రిలాక్స్‌గా ఉన్నాం. ఇది మా సొంత గడ్డ, అద్భుతమైన స్టేడియం. మేం మంచిగా ఆడతాం" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)