బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? మళ్లీ ఇప్పట్లో పెరగవా?

బంగారం, వెండి ధరలు, ఏషియన్ స్టార్ మార్కెట్లు, ముడి చమురు, అమెరికా

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

    • రచయిత, పీటర్ హాస్కిన్స్, నిక్ ఎడ్సర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 4 నిమిషాలు

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తరువాత ఒక్కసారిగా పతనం మొదలైంది. ఆ పతనం ఇంకా కొనసాగుతోంది.

సోమవారం ఆసియా మార్కెట్లలో బంగారం ధరలు 9 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 4,403 డాలర్లకు(సుమారు రూ. 4 లక్షలు) చేరుకుంది. వెండి ధర 15శాతం తగ్గింది.

అంతర్జాతీయంగా ఏర్పడిన అస్థిర పరిస్థితుల మధ్య బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా భావించడంతో జనవరిలో పుత్తడి ధరలు కొత్త రికార్డులను తాకాయి.

అయితే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్‌గా సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్‌ కెవిన్ వార్ష్‌ పేరు ప్రతిపాదించిన తరువాత మార్కెట్లలో లోహాల ధరలు శుక్రవారం పతనం కావడం ప్రారంభమైంది.

వార్ష్ పేరును ఫైనాన్షియల్ మార్కెట్లు స్వాగతించాయి. శుక్రవారం అనేక దేశాల కరెన్సీలతో పోల్చినప్పుడు డాలర్ విలువ 1 శాతం పెరిగింది.

డాలర్ పుంజుకోవడంతో, 1983 తర్వాత బంగారం ధరల్లో ఒకే రోజు ఈ స్థాయిలో భారీ పతనం నమోదైంది. బంగారం ధర 9 శాతం, వెండి ధర 27శాతం పడిపోయింది.

"శుక్రవారం నాటి అమ్మకాలకు స్పష్టమైన, ప్రధానమైన కారణం కెవిన్ వార్ష్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా ఎంపికవుతున్నారన్న వార్తలే" అని డాయిష్ బ్యాంక్‌‌కు చెందిన విశ్లేషకులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరలు, ఏషియన్ స్టార్ మార్కెట్లు, ముడి చమురు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

సోమవారం కూడా కమోడిటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో పాటు ఏసియన్ స్టాక్స్ పడిపోయాయి.

సౌత్ కొరియాకు చెందిన స్టాక్ ప్రైస్ ఇండెక్స్ కోస్పీ 5 శాతానికి పైగా నష్టపోయింది.

హాంగ్‌కాంగ్ మార్కెట్‌లో హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 3 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 225 ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

యూరప్‌లో యూకే షేర్ మార్కెట్ సూచీ ఎఫ్‌టీఎస్ఈ100 ట్రేడింగ్ మొదట్లో 0.4 శాతం నష్టపోయింది.

మైనింగ్ సంస్థల షేర్లు స్వల్ప నష్టాలను మూటకట్టుకున్నాయి. ఫ్రెస్‌నిల్లో, ఎండీవర్ మైనింగ్ కంపెనీల షేర్లు 7 శాతం నష్టపోయాయి.

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. ముడి చమురు ధర 5 శాతానికి పైగా తగ్గింది.

ప్రధాన చమురు ఉత్పత్తి సంస్థలు, యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించడం, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గొచ్చన్న సంకేతాలు వంటివి చమురు ధరలు తగ్గడానికి కారణాలుగా భావిస్తున్నారు.

దీంతో పాటు అమెరికా డాలర్ విలువ పెరగడం కూడా ముడి చమురు ధరల తగ్గుదలపై ప్రభావం చూపింది.

చమురు ధరను డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికాయేతర దేశాలకు ముడి చమురు మరింత ఖరీదైనదిగా మారుతుంది.

బంగారం, వెండి ధరలు, ఏషియన్ స్టార్ మార్కెట్లు, ముడి చమురు, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలువైన లోహాల ధరల పెరుగుదలకు 2025 అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది.

విలువైన లోహాలకు 2025 అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. 1979 తర్వాత బంగారం అత్యధిక వార్షిక లాభాల్ని నమోదు చేసింది.

ట్రంప్ సుంకాల భయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన షేర్ల ధరలు పెరగవచ్చనే అంచనాలమధ్య ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన ఏర్పడటంతో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డుల్ని తాకాయి.

బంగారం ధర ఈ ఏడాది జనవరి చివరి నాటికి 5,500 డాలర్లను దాటింది, వెండి ధర కూడా ‘ఆల్‌టైమ్ హై’కి చేరింది.

2026లో ఫెడరల్ రిజర్వ్ రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని వాల్‌స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ఆకర్షణీయ పెట్టుబడిగా మారుతుంది.

బంగారం ధరలు పెరగడానికి మరో పెద్ద కారణం లభ్యత. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ట్రేడ్ అసోసియేషన్ ప్రకారం ఇప్పటి వరకు 216,265 టన్నుల బంగారాన్ని మాత్రమే వెలికి తీశారు.

కొన్నేళ్ల క్రితం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం మొదలు పెట్టడంతో బంగారం ధరలు పెరగడం మొదలైంది.

అయితే గత ఏడాది కాలంలో అమెరికా సుంకాల వంటి అంతర్జాతీయ పరిణామాలు బంగారాన్ని మరింత ఆకర్షణీయ పెట్టుబడిగా మార్చాయి.

ఆర్థికపరమైన ఆందోళనలు కూడా బంగారం విలువ పెరగడానికి కారణమైనప్పటికీ, పరిస్థితులు చక్కబడినప్పుడు లేదా లాభాలు చాలని ఇన్వెస్టర్లు భావించినప్పుడు ధరలు అంతే తేలిగ్గా పడిపోవచ్చు.

"గత కొన్ని వారాల్లో విలువైన లోహాల ధరలు విపరీతంగా పెరిగాయి. అవి ఇప్పుడు కుప్పకూలాయి" అని రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి గల కారణాలను విశ్లేషిస్తూ జూలియస్ బేర్ బ్యాంక్‌కు చెందిన ఆసియా రీసర్చ్ హెడ్ మార్క్ మాథ్యూస్ ‘రాయిటర్స్‌’తో చెప్పారు.

బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)