పాకిస్తాన్: అమెరికా పెట్టుబడి పెట్టేంత 'భారీ’ చమురు నిల్వలు ఆ దేశంలో ఉన్నాయా, ఎక్కడ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తన్వీర్ మాలిక్
- హోదా, బీబీసీ కోసం
పాకిస్తాన్‌లోని 'భారీ చమురు నిల్వల'ను అభివృద్ధి చేయడానికి అమెరికా, పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్ ఉత్పత్తి నిరంతరం తగ్గుతోన్న సమయంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
పాకిస్తాన్ పెట్రోలియం ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అందించిన సమాచారం ప్రకారం గత కొన్ని నెలలుగా చమురు ఉత్పత్తి 11 శాతం తగ్గింది.
ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌లోని భారీ చమురు, గ్యాస్ నిల్వల్లో, ఉత్పత్తిలో క్షీణతను గమనించారు.
ఈ చమురు, గ్యాస్ క్షేత్రాలలో, ఖాదిర్‌పూర్, సుయి, ఉచ్, మాడి వంటి ప్రధాన క్షేత్రాలతో పాటు, ఇతర క్షేత్రాలలో కూడా క్షీణత నమోదైంది.
పాకిస్తాన్‌లో పనిచేస్తున్న ప్రధాన చమురు, గ్యాస్ కంపెనీల ఉత్పత్తి కూడా తగ్గింది.
ఇటువంటి పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత..అసలు పాకిస్తాన్‌లో భారీ చమురు నిల్వలు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్న వినిపిస్తోంది.
పాకిస్తాన్‌లో ఏయే ప్రాంతాలలో చమురు నిక్షేపాలను అన్వేషిస్తున్నారు? ఈ ప్రాంతంలో అమెరికా భాగస్వామ్యం ప్రకటించడం వల్ల పాకిస్తాన్‌లో చైనా పెట్టుబడిపై ప్రభావం పడుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.


ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో చమురు అన్వేషణ రంగంలో అనేక కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ కొన్ని దశాబ్దాలుగా చమురు అన్వేషణలోగానీ, ఉత్పత్తిలోగానీ ఎలాంటి గణనీయమైన పెరుగుదల కనిపించలేదు.
పాకిస్తాన్ పెట్రోలియం ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి ఆ దేశ చమురు నిల్వలు సుమారుగా 2 కోట్ల 38 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి.
"పాకిస్తాన్‌లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురు దేశ అవసరాలలో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే తీర్చగలుగుతోంది. మిగిలిన 80 నుంచి 85 శాతం వరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది" అని అనేక చమురు కంపెనీలలో సీనియర్ పదవులు నిర్వహించిన ఇంధన నిపుణుడు మహ్మద్ వాసి ఖాన్ బీబీసీతో చెప్పారు.
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం పాకిస్తాన్‌లో తొమ్మిది బిలియన్ బ్యారెళ్ల వరకు పెట్రోలియం నిల్వలు ఉండవచ్చని ఆయన చెప్పారు. అయితే, అవి వాణిజ్య పరంగా లభ్యమయ్యే వరకు కచ్చితమైనవిగా పరిగణించలేమని అన్నారు.
"పాకిస్తాన్‌లో చమురును అన్వేషించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. దీనికి కారణం ఈ పనికి పెట్టుబడితో పాటు అవసరమైన సాంకేతికత లేకపోవడం" అని వాసి ఖాన్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు చేసిన ప్రకటనతో పాకిస్తాన్‌లోని చమురు క్షేత్రాల నుంచి చమురును వెలికితీసేందుకు అమెరికా ప్రభుత్వం ఒక పెద్ద చమురు కంపెనీని కోరనున్నట్లు అనిపిస్తోందని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సులలో చమురు అన్వేషణ జరుగుతోంది. ఈ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం సింధ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా పని జరుగుతోంది.
పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిపై పాకిస్తాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం సింధ్‌లో ఉన్న మొత్తం చమురు, గ్యాస్ బావుల సంఖ్య 247.
పంజాబ్‌లో ఈ సంఖ్య 33. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 15 చమురు బావులు, బలూచిస్తాన్‌లో నాలుగు చమురు బావులపై పనులు జరుగుతున్నాయి.
ఈ నివేదికనుబట్టి చూస్తే ఈ బావులలో చాలా వాటిపై పని పూర్తయింది. అంటే చమురు, గ్యాస్ వెలికితీత పూర్తయింది. అవి ఇప్పుడు ఎండిపోయాయి. మరికొన్నింటిపై పనులు జరుగుతున్నాయి.
"సాంకేతికంగా చెప్పాలంటే, భద్రతా సమస్యలు, పన్ను, ఆదాయ నిర్మాణం మొదలైన వాటి కారణంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రస్తుతం పెద్దగా పని జరగడం లేదు" అని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో ఇంధన రంగ నిపుణురాలు డాక్టర్ అఫియా చెప్పారు.
సెప్టెంబర్ 2021లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని లకీ మార్వాత్ జిల్లాలోని బీట్ని ఎఫ్ఆర్ ప్రాంతంలో గ్యాస్, చమురు నిల్వలను కనుగొంది పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ.
జూన్ 2022లో మాడి పెట్రోలియం కంపెనీ ఉత్తర వజీరిస్తాన్‌లోని బన్నూ వెస్ట్ బ్లాక్‌లోని తహసీల్ షెవాలో పెద్ద మొత్తంలో గ్యాస్, చమురు నిల్వలను కనుగొంది. ఇదే ఇటీవలి కాలంలో జరిగిన చివరి ప్రధాన అన్వేషణగా తెలుస్తోంది.
సింధ్‌లో దీనిపై చాలా పని జరుగుతోందని, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా చాలా చమురు నిల్వలు ఉన్నాయని, వాటి నుంచి ప్రభుత్వం చమురును తీయడానికి కృషి చేస్తోందని బీబీసీతో చెప్పారు పెట్రోలియం డివిజన్ పార్లమెంటరీ కార్యదర్శి మియా ఖాన్ బుగ్టి.
"దీని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. అయితే ఈ ప్రకటన పాకిస్తాన్‌లోని చమురు రంగానికి సానుకూలంగా ఉంది" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లోని చమురు నిల్వలపై గతంలో ఏదైనా అమెరికన్ కంపెనీ పని చేసిందా?
పాకిస్తాన్‌లో చమురు నిల్వలపై కలిసి పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఈ భాగస్వామ్యం కోసం ఒక చమురు కంపెనీని ఎంపిక చేసే పనిలో ఉన్నామని చెప్పారు.
"గతంలో కూడా అనేక అమెరికన్ కంపెనీలు పాకిస్తాన్ చమురు, గ్యాస్ రంగంలో చురుగ్గా పనిచేశాయి" అని ఇంధన రంగ నిపుణుడు మహ్మద్ వాసి ఖాన్ అన్నారు.
ముఖ్యంగా, ఆక్సిడెంటల్ పెట్రోలియం, యూనియన్ టెక్సస్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ వంటివి ముఖ్యమైన పాత్ర పోషించాయి.
"ఇటీవలి కాలంలో ఈ కంపెనీల ఉనికి తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు ఇవి ఆ ప్రాంతంలో కీలక పాత్ర పోషించాయి" అని వాసి ఖాన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














