భారత్‌ మీద టారిఫ్‌లు, పాకిస్తాన్‌తో ఒప్పందాలు..ట్రంప్ నిర్ణయాలపై నిపుణులేమంటున్నారు?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ చమురు నిల్వలను అభివృద్ధి చేసుకోవడానికి అమెరికాతో కలిసి పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

భారతదేశంపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే, పాకిస్తాన్‌లో 'భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాకిస్తాన్‌తో అమెరికా ఒక ఒప్పందం పూర్తి చేసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాశారు. ఇందులో భాగంగా రెండు దేశాలు కలిసి పాకిస్తాన్‌లోని 'భారీ చమురు నిల్వ కేంద్రాలు' డెవలప్ చేస్తాయని తెలిపారు.

ఈ ఒప్పందం గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్‌ షరీఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.

"చరిత్రాత్మక అమెరికా-పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని పేర్కొన్నారు.

భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చల సందర్భంగా భారత్‌పై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు బుధవారంనాడు ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై జరిమానా విధించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ తరువాత ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే కొన్ని భారతీయ కంపెనీలపై కూడా ఆంక్షలు విధించారు.

భారతదేశంపై సుంకాలు విధించడం, పాకిస్తాన్‌తో ఒప్పందం వంటి చర్యలు అమెరికా విదేశాంగ విధానంలో సెల్ఫ్ గోల్‌గా మారే అవకాశం ఉందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ హ్యాపీమాన్ జాకబ్ అన్నారు.

ట్రంప్ ప్రాధాన్యత ఇప్పుడు వాణిజ్యమేనని, సంప్రదాయంగా కొనసాగుతున్న భద్రతా సహకార సంబంధాలు కాదని గేట్‌వే హౌస్ ఆఫ్ ఇండియాలో ఫెలో అయిన నయనిమా బసు అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

'బహుశా పాకిస్తాన్ ఏదో ఒక రోజు భారత్‌కి చమురు అమ్మే పరిస్థితి రావొచ్చు'

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, అమెరికా దగ్గరయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను వైట్ హౌస్‌కు పిలిపించారు.

అదే సమయంలో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తన రూ. 17,000 కోట్ల క్రిప్టో వ్యాపారం కోసం ట్రంప్ కుటుంబంతో అనుసంధానమైన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్'తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

ఒకవైపు అమెరికా భారత్‌తో వాణిజ్యానికి సంబంధించి కఠిన వైఖరిని అవలంబిస్తూ, మరోవైపు పాకిస్తాన్‌తో అమెరికా వాణిజ్య సంబంధాలు పెంచుకుంటోంది.

పహల్గాంలో భారత్-పాకిస్తాన్ వివాదం తర్వాత జనరల్ మునీర్ వైట్ హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు.

తర్వాత కొన్ని రోజులకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు.

ఆ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ‘‘ మేం ఈ రోజు వైట్ హౌస్‌లో చాలా బిజీగా ఉన్నాం. అనేక వాణిజ్య ఒప్పందాలపై పని చేస్తున్నాం. నేను అనేక దేశాల నాయకులతో మాట్లాడాను. అమెరికా మరింత సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు" అని రాశారు.

‘‘అమెరికా, పాకిస్తాన్ సంయుక్తంగా భారీ చమురు నిల్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తాయి. ఈ భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే పనిలో ఉన్నాం. ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు భారతదేశానికి పాకిస్తాన్ చమురు అమ్మొచ్చు కూడా’’ అని రాశారు ఆ పోస్ట్‌లో.

‘‘ఇతర దేశాలు కూడా సుంకాల మినహాయింపుల కోసం ప్రతిపాదనలు చేస్తున్నాయి. ఈ చర్యలన్నీ అమెరికా వాణిజ్య లోటును గణనీయంగా తగ్గించడంలో సాయపడతాయి. పూర్తి నివేదికను త్వరలో విడుదల చేస్తాం. మీరు శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు. 'అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుదాం (మేక్ అమెరికా గ్రేట్ అగైన్)" అని ట్రంప్ రాశారు.

ఎగుమతి

ఫొటో సోర్స్, Getty Images

ముందే చెెప్పిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి

అమెరికా, పాకిస్తాన్ మధ్య 'త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురనుంది' అని గత వారమే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ హింట్ ఇచ్చారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కీలకమైన ఖనిజాలు, మైనింగ్‌లో వాణిజ్యం, భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఇరుదేశాల నాయకులు అంగీకరించారని అమెరికా, పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటన చెబుతోంది.

2024 సంవత్సరంలో అమెరికా పాకిస్తాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.17,500 కోట్లు) విలువైన వస్తువులను ఎగుమతి చేయగా, పాకిస్తాన్ నుంచి 5.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.42,300 కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది.

అమెరికా ప్రస్తుతం రెండింటి మధ్య వాణిజ్యంలో 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 24,900 కోట్లు) నష్టాన్ని ఎదుర్కొంటోంది.

అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్‌తో వివాదం పెరిగేకొద్దీ అమెరికా విదేశాంగ విధానంలో పాకిస్తాన్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు .

అమెరికా కూడా పాకిస్తాన్‌ను నాటోకు ముఖ్యమైన మిత్రదేశంగా పేర్కొంది.

ఇషాక్ దార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (ఎడమవైపు) వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు.

పాకిస్తాన్, అమెరికా స్నేహ సంబంధాలు

భారతదేశంతో సైనిక సంఘర్షణను నివారించడంలో ట్రంప్, రూబియో పాత్రను పాకిస్తాన్ ఇటీవల ప్రశంసించింది. భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణను మధ్యవర్తిత్వం ద్వారా ఆపింది తానేనని ట్రంప్ పదే పదే చెప్పారు.

‘‘యుద్ధం వైపు వెళ్లనందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి నేను జనరల్ మునీర్ ఇక్కడికి ఆహ్వానించా’’ అని ట్రంప్ అన్నారు.

"కొన్ని రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ప్రధాన మంత్రి మోదీకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. భారత్, పాకిస్తాన్ రెండింటితో వాణిజ్య ఒప్పందంపై మేం కృషి చేస్తున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"వారిద్దరూ చాలా తెలివైన వ్యక్తులు, అణు యుద్ధంగా మారే అవకాశం ఉన్న యుద్ధాన్ని తీవ్రతరం చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్, భారతదేశం రెండూ ప్రధాన అణ్వాయుధ శక్తులు. కాబట్టి ఈరోజు అసిం మునీర్ కలవడం నాకు గౌరవంగా ఉంది" అని ట్రంప్ అన్నారు.

అయితే కాల్పుల విరమణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాన్న ట్రంప్ వాదనను భారత్ ఖండించింది.

వైట్ హౌస్‌లో జనరల్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశం తాము సాధించిన ఒక పెద్ద దౌత్య విజయంగా ఇస్లామాబాద్‌లో చాలామంది భావిస్తున్నారు.

జనరల్ మునీర్, అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన సమావేశం గురించి దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను నిశితంగా పరిశీలించే మైఖేల్ కుగెల్మాన్ ఎక్స్‌లో ఇలా రాశారు.

"అధ్యక్షుడు ట్రంప్, జనరల్ మునీర్ మధ్య జరిగిన సమావేశాన్ని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మాత్రమే చూడకూడదు. పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన ఈ సంభాషణను ముఖ్యమైన ఖనిజాలు, క్రిప్టో కోణం నుంచి కూడా చూడాలి. ఈ విషయాలపై ట్రంప్‌కు పర్సనల్ ఇంట్రెస్ట్‌లు ఉన్నాయి. ఈ అంశాలపై మాట్లాడే స్థాయి జనరల్ మునీర్‌కు ఉంది. కశ్మీర్ విషయంలో కూడా" అని పేర్కొన్నారు కుగెల్మాన్.

హ్యాపీమోన్ జాకబ్

ఫొటో సోర్స్, CSDR

నిపుణులు ఏమంటున్నారు

ట్రంప్ పాకిస్తాన్‌తో ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ, విదేశాంగ విధాన నిపుణుల దృష్టిలో అమెరికా తీసుకున్న ఈ చర్య సరైందిగా కనిపించడం లేదు.

"భారతదేశం రష్యాకు సన్నిహితంగా ఉందని చెబుతూ , ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు విధించటం, ఆ తర్వాత దక్షిణాసియాలో పాకిస్తాన్‌‌తో చేయికలపడంలాంటి అమెరికా వైవిధ్యమైన విధానానికి 'సెల్ఫ్ గోల్' వంటివి. ఇది స్వయంకృతాపరాధం అని అమెరికా దౌత్య విధానం తొందర్లోనే గ్రహిస్తుంది" అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్ అయిన హ్యాపీమాన్ జాకబ్ అన్నారు.

అమెరికా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ చమురు ఒప్పందం భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. అమెరికా, పాకిస్తాన్ మధ్య చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి.

"పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ట్రంప్‌ను కలిసినప్పుడు, ఈ సంభాషణ బహుశా 'ఆపరేషన్ సిందూర్' గురించి అని భారతదేశం భావించింది" అని గేట్‌వే హౌస్‌ అనే థింక్‌టాంక్ సంస్థలో ఫెలో అయిన నయనిమా బసు చెప్పారు.

"వాస్తవానికి ఇది ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్య ఆధారంగా జరిగిన చర్చ. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దులో చురుకుగా ఉన్న ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్యకు అమెరికా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ అమెరికాకు తలనొప్పిగా మారిన ఉగ్రవాదులను పట్టుకుంటోంది. వాస్తవానికి పాకిస్తాన్, అమెరికా మధ్య సంబంధాలు మీడియాలో చూపించినంత చెడ్డగా లేవు" అని బసు అన్నారు.

పాకిస్తాన్‌తో అమెరికా ఒప్పందం గురించి అడిగినప్పుడు, ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఇప్పుడు వాణిజ్యానికి ప్రాధాన్యత ఇస్తోందని నయనిమా బసు చెప్పారు.

బసు చెప్పినదాని ప్రకారం ‘ట్రంప్ యుద్ధం కంటే వాణిజ్య యుద్ధాన్ని ఇష్టపడతారు’. ట్రంప్ వీలైనన్ని ఎక్కువ దేశాలతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు.

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయని, పాకిస్తాన్ సహకారంతో అమెరికా దానిని అభివృద్ధి చేయాలని కోరుకుంటుందని బసు చెప్పారు.

బసు అభిప్రాయం ప్రకారం, భారతదేశం అమెరికాతో ఒక చిన్న ఒప్పందమైనా కుదుర్చుకుని ఉండాల్సింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)