థాయ్‌లాండ్ -కంబోడియా : హిందూ గుడి చుట్టూ అల్లుకున్న ఈ ఘర్షణ ఏమిటి?

థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణలు

ఫొటో సోర్స్, Getty Images

థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ప్రస్తుతం జరుగుతున్న సరిహద్దు ఘర్షణలలో ఇప్పటిదాకా కనీసం 12 మంది చనిపోయారు. 14మంది గాయపడ్డారు.

ఘర్షణలలో ఓ సైనికుడు, 11మంది పౌరులు చనిపోయారని థాయ్‌లాండ్ ఆరోగ్యశాఖామంత్రి చెప్పారు. మరోపక్క కాల్పులు మొదలుపెట్టింది మీరేంటే మీరేనని ఇరుపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

సరిహద్దులో ఓ ల్యాండ్‌మైన్ పేలి తమ సైనికుడు గాయపడిన తరువాత థాయ్‌లాండ్ కంబోడియా నుంచి తమ రాయబారిని వెనక్కు పిలిచాక ఈ ఘటన చోటు చేసుకుంది.

గురువారం ఉదయం నుంచి సరిహద్దు దగ్గర ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కంబోడియా సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు థాయ్‌లాండ్ చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

థాయ్‌లాండ్ గ్రామాలు, ఆస్పత్రులపై కంబోడియా రాకెట్‌లను ప్రయోగించిందని థాయ్‌లాండ్ ఆరోపించింది. మరోపక్క థాయ్‌లాండ్ గగనతలం నుంచి కంబోడియా లక్ష్యాలపై దాడులు చేసింది.

థాయ్‌లాండ్‌తో దౌత్యపరమైన సంబంధాలను తగ్గించుకుంది కంబోడియా. ఆ దేశం మితిమీరిన బలప్రయోగం చేస్తోందని ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరింది.

వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసిన చైనా, ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది.

థాయ్ లాండ్ కంబోడియా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివాదాస్పద ప్రాంతంలోని ఆలయం వద్ద థాయ్‌లాండ్ కంచె వేయడం వల్ల ఘర్షణలు మొదలయ్యాయని కంబోడియా రక్షణ మంత్రి చెప్పారు.

కంబోడియా ఏం చెబుతోంది?

థాయ్ దళాలు గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి, స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6.30 గంటలకు సరిహద్దుకు సమీపంలోని హిందూ దేవాలయం వైపు దూసుకెళ్లి దాని చుట్టూ ముళ్లకంచె వేయడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అనంతరం రాత్రి ఏడుగంటలకు డ్రోన్‌ను ప్రయోగించిన థాయ్ సైనికులు రాత్రి 8.30 గంటలకు గాల్లోకి కాల్పులు జరిపారు.

రాత్రి 8.46 గంటలకు థాయ్ దళాలు కాల్పులు జరిపాయని, కంబోడియా దళాలు తమను తాము రక్షించుకోవడం తప్ప మరో మార్గం లేదని కంబోడియా రక్షణ శాఖ మహిళా ప్రతినిధి మాలి సోచెటా ‘నాంఫెన్ ‌పోస్ట్’ వార్తాపత్రికకు తెలిపారు.

థాయ్‌లాండ్ మితిమీరిన బలగాలను మోహరించిందని, భారీ ఆయుధాలను ఉపయోగిస్తోందని, కంబోడియా భూభాగంపై వైమానిక దాడులు చేస్తోందని సోచెటా ఆరోపించారు.

ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని కంబోడియా ప్రధాని హున్ మానెట్ అన్నారు.

‘‘అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే సూత్రాన్ని కంబోడియా ఎప్పుడూ విశ్వసిస్తుందని, అయితే ఈ పరిస్థితిలో సైనిక దాడికి సైనిక బలంతో ప్రతిస్పందించడం తప్ప మరో మార్గం లేదు’’ అని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

థాయ్ లాండ్ సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

థాయ్‌లాండ్ వాదనేంటి?

స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7:30 గంటలకు సరిహద్దు సమీపంలో థాయ్ దళాలను పర్యవేక్షించడానికి కంబోడియా సైన్యం డ్రోన్లను మోహరించిందని థాయ్‌లాండ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు.

కొద్దిసేపటి తరువాత, కంబోడియా సైనికులు ఆర్.పి.జి.లతో సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. థాయ్ వైపు ఉన్న సైనికులు సంప్రదింపులు జరపడానికి విఫలయత్నం చేశారు.

కంబోడియా సైనికులు ఉదయం 8గంటల 20 నిమిషాలకు కాల్పులు ప్రారంభించారని, దీంతో థాయ్ సైనికులు కూడా ప్రతిస్పందించాల్సి వచ్చిందని ప్రతినిధి తెలిపారు.

కంబోడియా బీఎం-21 రాకెట్ లాంచర్లు, ఫిరంగులతో భారీ ఆయుధాలను మోహరించిందని థాయ్‌లాాండ్ ఆరోపించింది.

ఈ దాడితో సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇళ్లు, ప్రభుత్వ నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని థాయ్ ప్రభుత్వం తెలిపింది.

థాయ్‌లాండ్, కంబోడియా ఘర్షణలు

ఫొటో సోర్స్, Royal Thai Army/Facebook

వివాదానికి మూలమేంటి

ఈ వివాదానికి మూలాలు వందల సంవత్సరాలనాటివి. ఫ్రెంచ్ ఆక్రమణ తరువాత కంబోడియా సరిహద్దులు నిర్ణయమయ్యాయి. కంబోడియా వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 11వ శతాబ్దపు దేవాలయాన్ని 2008 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీనిపై థాయ్‌లాండ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగి సైనికులు, పౌరులు మరణించారు.

ఇటీవల మేలో జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు గత దశాబ్ద కాలంలో కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

గత రెండు నెలలుగా ఇరు దేశాలు పరస్పరం సరిహద్దు ఆంక్షలు విధించుకున్నాయి. థాయ్‌లాండ్ నుంచి పండ్లు, కూరగాయల దిగుమతిని నిషేధించిన కంబోడియా విద్యుత్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది.

గత కొన్ని వారాలుగా ఇరు దేశాలూ సరిహద్దుల్లో బలగాల మోహరింపును పెంచాయి.

షినవత్రా

ఫొటో సోర్స్, Getty Images

పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా?

బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్ జొనాథన్ హెడ్ మాట్లాడుతూ, ఈ సంఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందని ఎవరూ నమ్మడం లేదని, అయితే ప్రస్తుతానికి ఈ ఉద్రిక్తతను తగ్గించే శక్తి, విశ్వాసం ఉన్న నాయకత్వం ఏ దేశంలోనూ కనిపించడం లేదన్నారు.

ఈ వివాదంలో ఇతర ఆసియన్ సభ్యదేశాలు జోక్యం చేసుకుని ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలను ఒప్పిస్తాయో లేదో చూడాల్సి ఉంది.

ఆసియాన్ ప్రధాన లక్ష్యం దాని సభ్య దేశాల మధ్య సంఘర్షణను నివారించడం. ఈ సమయంలో, థాయ్‌లాండ్ కంబోడియా మధ్య వివాదాన్ని పరిష్కరించడం కొన్ని సభ్య దేశాలకు ప్రాధాన్యత కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)