థాయిలాండ్: స్కూల్ బస్ మంటల్లో చిక్కుకుని 20మందికి పైగా చిన్నారుల మృతి.. ఈ దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎందుకంత ఎక్కువ?

ఫీల్డ్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రమాదానికి గురయిన బస్సు
    • రచయిత, నిక్ మార్ష్, జొనాథన్ హెడ్
    • హోదా, బీబీసీ న్యూస్

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌ సమీపంలో ప్రైమరీ స్కూలు విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్ ప్రమాదానికి గురైంది.

బస్ మంటల్లో చిక్కుకుంది. ప్రమాద సమయంలో బస్‌లో పదుల సంఖ్యలో పిల్లలున్నారు.

‘ప్రమాదం నుంచి 16 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు సురక్షితంగా బయటపడ్డారు. 22మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్ల పరిస్థితిపై ఇంకా స్పష్టతలేదు’’ అని థాయిలాండ్ రవాణాశాఖ మంత్రి చెప్పారు.

‘‘ప్రమాదంలో కొందరు చిన్నారులు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఎంతమంది మరణించారన్నది ఇంకా నిర్ధరణ కాలేదు’’ అని థాయిలాండ్ ప్రధానమంత్రి చెప్పారు.

బస్ మంటల్లో పూర్తిగా కాలిపోయినట్టు ఫొటోల్లో కనిపిస్తోంది.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయడానికి సంబంధిత వ్యక్తులు ప్రమాద స్థలం దగ్గరికి చేరుకున్నప్పటికీ.. వేడి కారణంగా బస్సు లోపలికి వెళ్లలేకపోయారని స్థానిక మీడియా తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన 19 మందిలో 8 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు.

చిన్నారులు, టీచర్లు స్థానికంగా ఒక ఫీల్డ్ ట్రిప్ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

పిల్లలు, టీచర్లు ప్రయాణిస్తున్న మూడు బస్సులలో ఒకటి ప్రమాదానికి గురయింది.

బస్ అత్యంత ప్రమాదకర కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో నడిచిందని రవాణా శాఖ మంత్రి సురియాహె జుంగ్‌రూంగ్‌రాంగ్‌కిట్ చెప్పారు.

‘‘ఇది చాలా విషాదకరమైన ఘటన’’ అని సురియాహె మీడియాతో చెప్పారు.

‘‘దీనికి కచ్చితంగా పరిష్కారం కనుక్కోవాలి. వీలయితే పాసింజర్ వాహనాలకు ఇలాంటి ఇంధనం వాడడాన్ని నిషేధిస్తాం. ఇది అత్యంత ప్రమాదకరమైనది’’ అని ఆయన అన్నారు.

ప్రమాదస్థలాన్ని మంత్రులు పరిశీలించాలని థాయిలాండ్ ప్రధానమంత్రి ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు ఓ తల్లిగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ప్రధాని షినవత్ర చెప్పారు.

‘‘గాయపడ్డవారి చికిత్సకయ్యే ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని’’ ఆమె చెప్పారు.

మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, మృతులను గుర్తించడం చాలా కష్టమని సహాయ చర్యలకు నేతృత్వం వహిస్తున్న పియాలక్ థింకేవ్ చెప్పారు.

బస్సు ముందు భాగం నుంచి మంటలు మొదలయ్యాయని ఆయన తెలిపారు.

మంటల నుంచి తప్పించుకోవడానికి పిల్లలు వెనక్కు పరుగెత్తడంతో వారి మృతదేహాలు బస్ వెనుకభాగంలో ఉన్నాయని చెప్పారు.

ఫీల్డ్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముందు వైపు నుంచి వ్యాపించిన మంటలు

ఏటా 20 వేల మంది మృతి

‘‘హైవే మీదగా బ్యాంకాక్‌కు ప్రయాణిస్తున్న బస్సు టైరు పేలిపోవడంతో, బారియర్‌ను ఢీకొట్టింది’’ అని సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ వ్యక్తి స్థానిక టీవీతో చెప్పారు. ప్రమాద దృశ్యాలను ఆ టీవీ ప్రసారం చేసింది.

ఓవర్‌పాస్ కింద బస్ మొత్తం మంటల్లో కాలిపోతుండడం, పొగ దట్టంగా అలముకోవడం వంటివి ఆ వీడియోలో కనిపించాయి.

ప్రమాదస్థలం నుంచి డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్‌ను పట్టుకుంటామని థాయిలాండ్ మంత్రి చెప్పారు.

బస్సులో ఉన్న చిన్నారుల వయసు ఎంత ఉంటుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఆ స్కూల్‌లో 3 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులు చదువుతున్నారు.

ప్రపంచంలో రోడ్డు భద్రత ప్రమాణాలు అధ్వానంగా ఉన్న దేశాల్లో థాయిలాండ్ ఒకటి. ప్రమాదకర వాహనాలు, సురక్షితం కాని డ్రైవింగ్ వంటి కారణాలతో ఏటా దాదాపు 20 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)