మంత్రసాని పశ్చాత్తాపం: అప్పుడు పసికందుల ఉసురు తీశారు, ఇప్పుడు ఊపిరి పోస్తున్నారు

సీరోదేవితో మోనికా తట్టే
ఫొటో క్యాప్షన్, సీరోదేవితో మోనికా తట్టే
    • రచయిత, అమితాబ్ పరాశర్
    • హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్

మోనికా తట్టేను ఆలింగనం చేసుకుని, మంత్రసాని సీరోదేవి పెద్దగా ఏడ్చారు.

20 ఏళ్ల మోనిక బిహార్‌లో తాను పుట్టిన ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలోనే సీరోదేవి వందలమంది మహిళలకు పురుళ్లు పోశారు.

అయితే, సీరోదేవి ఏడుస్తున్నది మోనికా తట్టేను కలుసుకున్నందుకు మాత్రమే కాదు.

మోనిక పుట్టడానికి కొన్నాళ్ల ముందు వరకు సీరోదేవితోపాటు ఆ ప్రాంతంలో మంత్రసానులుగా పనిచేసిన అనేకమంది మహిళలు ఆడశిశువులను పురిట్లోనే చంపేయాల్సి వచ్చేది. అలా చేయాలని వారికి ఒత్తిళ్లు ఎదురయ్యేవి.

కానీ, మంత్రసానులు చంపకుండా రక్షించిన శిశువులలో మోనికా తట్టే ఒకరని రికార్డులను బట్టి అర్థమవుతోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమితాబ్ పరాశర్
ఫొటో క్యాప్షన్, 90లలో అప్పటి మంత్రసానులతో జరిపిన ఇంటర్వ్యూలను చూస్తున్న అమితాబ్ పరాశర్

ఇది 1996 నాటి మాట. దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో, సీరోదేవితోపాటు మరో నలుగురు మంత్రసానులను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పటి నుంచి.. అంటే దాదాపు 30ఏళ్లుగా నేను సీరోదేవిని గమనిస్తున్నాను.

కటిహార్ జిల్లాలో ఆడ శిశువులను చంపేసే మంత్రుసానుల్లో ఒక అయిదుగురిని ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది.

పుట్టింది ఆడపిల్లయితే, ఆ శిశువు తల్లిదండ్రుల ఒత్తిళ్ల కారణంగా ఆ మంత్రసానులు శిశువుకు విషం తాగించో, గొంతు నులిమో చంపేసేవారు.

నేను ఇంటర్వ్యూ చేసిన మంత్రసానులలో హకియా దేవి అందరికన్నా సీనియర్.

తాను ఒకప్పుడు 12 నుంచి 13 మంది ఆడ శిశువులను చంపినట్లు ఆమె నాతో చెప్పారు. మరో మంత్రసాని ధర్మీదేవి కూడా తాను చాలామంది చిన్నారులను చంపానని, కనీసం 15 నుంచి 20 మంది వరకు ఉండొచ్చని వెల్లడించారు.

అయితే, వారు ఎంతమందిని చంపి ఉంటారన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కచ్చితమైన సంఖ్య నిర్ధరించలేం.

మిడ్ వైఫ్
ఫొటో క్యాప్షన్, సీరోదేవి చాలాకాలంగా మంత్రసాని పనిలో ఉన్నారు.

ఒక స్వచ్ఛంద సంస్థ 1995లో రూపొందించిన రిపోర్టులో వీరితోపాటు మరో 30మంది మంత్రసానుల ఇంటర్వ్యూలను ప్రచురించింది.

ఈ రిపోర్టులో ఉన్న అంచనాలే నిజమైతే, ఒక్క కటిహార్ జిల్లాలోనే 35 మంది మంత్రసానుల చేతిలో ఏటా వెయ్యి కంటే ఎక్కువమంది ఆడపిల్లలు పుట్టిన వెంటనే మరణించి ఉంటారు.

ఆ రిపోర్టు ప్రకారం ఆ సమయంలో బిహార్ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది మహిళలు మంత్రసాని వృత్తిలో ఉన్నారు. ఈ ఆడ శిశు హత్యలు కేవలం బిహార్‌కే పరిమితం కాలేదు.

అప్పట్లో శిశువు తల్లిదండ్రుల, బంధువుల ఆదేశాలను ఎదిరించడం ఒక మంత్రసానికి అసాధ్యమని హకియా దేవి అన్నారు.

‘‘కుటుంబ సభ్యులు గదికి తలుపు బిగించి, కర్రలు పట్టుకుని మా వెనక నిలబడేవారు’’ అని హకియా దేవి చెప్పారు.

‘‘మాకు ఇప్పటికే నలుగురైదుగురు అమ్మాయిలు ఉన్నారు. మా ఆస్తి మొత్తం వీళ్లకే సరిపోతుంది. వీళ్లకు కట్నాలిచ్చి మేం ఆకలితో చచ్చిపోవాలి. ఇప్పుడు మళ్లీ అమ్మాయి పుట్టింది. కాబట్టి ఆమెను చంపేయ్’’ అని వాళ్లు హుకుం జారీ చేసేవారని హకియా దేవి చెప్పారు.

“మేం ఎవరికి ఫిర్యాదు చేయాలి? చాలా భయం వేసేది. పోలీసుల దగ్గరకు వెళ్లినా ఇబ్బందులే. ఎదురు మాట్లాడితే శిశువు బంధువులు మమ్మల్ని బెదిరించేవాళ్లు’’ అని హకియా దేవి నాతో అన్నారు.

మంత్రసాని వృత్తి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో చాలాకాలంగా పాతుకుపోయింది. కులం, పేదరికం అనేవి ఈ వృత్తి చుట్టూ అల్లుకుపోయిన చేదు నిజాలు.

నేను ఇంటర్వ్యూ చేసిన మంత్రసానులు దేశంలోని కుల వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందినవారు.

తరతరాలుగా తల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ వృత్తిని వారు కొనసాగిస్తున్నారు.

శక్తిమంతులైన ‘అగ్రవర్ణాల’వారి మాటలను ధిక్కరించడం ఈ మంత్రసానులకు సాధ్యం కాని పని. అలాంటి ఊహ కూడా రాని ప్రపంచంలో వాళ్లు పుట్టి పెరిగారు.

శిశు హత్యలు
ఫొటో క్యాప్షన్, సామాజిక కార్యకర్త అనిలా కుమారి (ఎడమ నుంచి రెండో వ్యక్తి )

ఆడ శిశువును చంపినందుకు ఒక చీరో, బస్తాడు గింజలో లేదంటే కాసిని డబ్బులో బహుమానంగా అందుకోవచ్చు. కొన్నిసార్లు అవేవీ లేకుండానే పని పూర్తిచేయాల్సి ఉంటుంది.

మగబిడ్డ పుడితే వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. ఆడపిల్ల పుడితే అందులో సగమే అందేవి.

ఆడ, మగ శిశువుల మధ్య ఈ తేడాకు మూలాలు దేశపు సామాజిక వ్యవస్థలో పాతుకుపోయిన కట్నం అనే ఆచారంలో ఉన్నాయని వారు అంటారు.

కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం నేరమంటూ 1961లోనే చట్టం వచ్చినా, 90ల నాటికి ఈ ఆచారం ప్రబలంగా ఉండేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

కట్నం అంటే అది ఏదైనా కావొచ్చు- డబ్బు, నగలు, పాత్రలు ఇలా. పేద, ధనిక అనే తేడా లేకుండా చాలా కుటుంబాలలో పెళ్లి అంటే కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడమనే భావన నాటుకుపోయింది.

ఇప్పటికీ దేశంలో చాలామందికి కొడుకు పుట్టడం అంటే వేడుక చేసుకునే సందర్భం. కూతురు పుట్టిందంటే ఆర్ధికంగా భారమనే భావన ఉంది.

నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఇప్పటికీ జీవించి ఉన్న ఒకే ఒక మంత్రసాని సీరోదేవి.

ఆడ, మగ మధ్య వివక్షను వివరిస్తూ.. ‘‘అబ్బాయిలను ఎక్కువగా, అమ్మాయిలను తక్కువగా చూసేవారు. కొడుకు తమకు అన్నం పెడతాడని, జాగ్రత్తగా చూసుకుంటాడనీ గ్యారంటీ లేకపోయినా అందరికీ అబ్బాయే కావాలి’’ అన్నారు సీరోదేవి.

ఈ దేశంలో కొడుకులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో జాతీయ స్థాయి డేటానుబట్టి అర్థం చేసుకోవచ్చు.

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారు.

అయితే, 1991 నాటి జనాభా లెక్కలతో పోలిస్తే ఆడపిల్లల విషయంలో ఇది కాస్త మెరుగైన స్థితేనని చెప్పొచ్చు.

1991 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 926 మంది మహిళలే ఉన్నారు.

2021 నాటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూస్తే ఈ గణాంకాలు మెరుగుపడ్డాయని తేలింది.

అయితే, ఈ గణాంకాలు నమ్మేలాలేవని ఆడ శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్తలు అంటున్నారు.

బిహార్
ఫొటో క్యాప్షన్, అనిలా కుమారితో మోనిక (ఎడమ)

1996లో నేను ఈ మంత్రసానుల ఇంటర్వ్యూలను చిత్రీకరించే సమయానికి ఒక నిశ్శబ్ద విప్లవం కూడా మొదలైంది.

ఎవరైతే శిశువు కుటుంబ సభ్యుల ఆదేశాలకు తలొగ్గి ఇన్నాళ్లు నవజాత శిశువులను చంపుతూ వచ్చారో, ఆ మంత్రసానులే ఆడశిశువులను రక్షించే బాధ్యతను తీసుకున్నారు. ఆడపిల్లలను చంపాలన్న ఆదేశాలను పక్కనపెట్టడం మొదలుపెట్టారు.

వారిలో ఈ మార్పుకు కారకురాలు అనిలా కుమారి అనే సామాజిక కార్యకర్త.

ఆమె కటిహార్ చుట్టుపక్కల ప్రాంతాలలో మహిళలకు అండగా నిలబడే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. శిశుహత్యల సమస్యకు మూలకారణమేంటో తెలుసుకుని, దాన్ని పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేశారామె.

అనిలా కుమారి ఈ సమస్యను చాలా సున్నితంగా డీల్ చేశారు. మంత్రసానులను ఆమె ఒకటే మాట అడిగేవారు. ‘మీ సొంత కూతురైతే ఇలాగే చంపేస్తారా’ అని.

ఈ ప్రశ్న చాలామంది మంత్రసానులను ఆలోచనలో పడేసింది. అప్పటి నుంచి వారు తమకు వచ్చే ఆదేశాలను తిరస్కరించడం మొదలుపెట్టారు. మంత్రసానుల కమ్యూనిటీలకు కొంత ఆర్థిక సాయం కూడా లభించింది.

దీంతో నవజాత శిశువులపై కొనసాగుతున్న ఈ అకృత్యాలు కొంత తగ్గాయి.

ఈ మార్పు గురించి 2007లో నాకు వివరించారు సీరోదేవి.

‘‘శిశువును చంపమని నన్ను ఎవరైనా అడిగితే వారికి ఒకటే మాట చెప్పేదాన్ని. ‘చిన్నారిని నాకు ఇవ్వండి. నేను అనిలా మేడమ్ దగ్గరికి తీసుకెళతాను’ అనేదాన్ని’’ అని చెప్పారు సీరోదేవి.

1995-1996 మధ్య హత్యకు గురికాబోయిన లేదంటే అనాథలుగా వదిలేసిన కనీసం అయిదుగురు నవజాత ఆడశిశువులను ఈ మంత్రసానులు రక్షించారు.

వీరిలో ఒక శిశువు చనిపోగా, మిగిలిన నలుగురిని రాజధాని పట్నాలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థకు తరలించారు అనిలా కుమారి. ఆ సంస్థ శిశువులను దత్తతకు ఇచ్చింది.

కథ ఇంతటితో అయిపోవచ్చు. అయితే మంత్రసానులు రక్షించిన ఆ చిన్నారులు ఎక్కడ ఉన్నారు, దత్తతకు వెళ్లిన తర్వాత వారి జీవితం ఎలా మారిపోయింది అన్నది తెలుసుకోవాలనుకున్నాను.

శిశు హత్యలు
ఫొటో క్యాప్షన్, తనను పెంచుకున్న తండ్రితో మోనిక

అనిలా కుమారి దగ్గరున్న రికార్డులు కచ్చితమైనవే అయినా, వాటిలో దత్తత తర్వాత ఆ పిల్లల గురించి ఎక్కువ వివరాలు లేవు. అయితే, 1990లలో బిహార్‌లో ఆడశిశు హత్యలపై పరిశోధన చేస్తున్న మేధా శేఖర్ అనే మహిళతో నాకు పరిచయం ఏర్పడింది. అనిలా కుమారి, కొందరు మంత్రసానులు కలిసి రక్షించిన శిశువులను అప్పట్లో మేధా శేఖర్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థకే తీసుకొచ్చారు. తన సంస్థ నుంచి దత్తతకు వెళ్లిన ఒక బాలిక మేధా శేఖర్‌తో టచ్‌లో ఉన్నారు. మంత్రసానులు రక్షించిన బాలికల్లో ఆమె కూడా ఒకరై ఉండొచ్చని మేధా శేఖర్ భావించారు. ఆ అమ్మాయి పేరే మోనిక.

మంత్రసానులు రక్షించిన అమ్మాయిలందరి పేరుకు ముందు ‘కోసీ’ అనే మాటను జత (ప్రీఫిక్స్) చేసినట్లు అనిల గుర్తు చేసుకున్నారు.

‘కోసీ’ అనేది బిహార్‌లో ఒక నది. దత్తతకు ముందు మోనిక పేరు ముందు కూడా ‘కోసీ’ అనేపదం ఉందని మేధ వెల్లడించారు.

అప్పట్లో దత్తత ఇచ్చిన ఏజెన్సీ మోనిక రికార్డులను చూసేందుకు మాకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి, మంత్రసానులు, అనిలా రక్షించిన శిశువుల్లో ఒకరే ఈ మోనిక అని కచ్చితంగా చెప్పలేం.

పట్నాలో ఆమె మూలాలు ఉన్నట్లు తెలియడం, పుట్టిన తేదీ, పేరుకు ముందు ‘కోసీ’ అనేపదం...ఇవన్నీ గమనించినప్పుడు అనిలా కుమారి, ఇంకా కొందరు మంత్రసానులు రక్షించిన అయిదుగురు శిశువులలో మోనిక కూడా ఒకరు అన్న నిర్ధరణకు రావచ్చు.

మోనికను కలవడానికి నేను పుణెలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం చూస్తే, ఆమె ఎంతో అందమైన బాల్యాన్ని గడిపి ఉంటారనిపించింది.

‘‘నేను అదృష్టవంతురాలిని. సంతోషకరమైన జీవితం ఏది అంటే నా నిర్వచనం ఇదే. చాలా హాయిగా ఉన్నాను’’ అన్నారు మోనిక.

తనది బిహార్‌ అని, దత్తత వచ్చానని మోనికకు తెలుసు. ఆమె దత్తతకు రావడానికి దారి తీసిన పరిస్థితులను ఆమెకు వివరించగలిగా.

శిశు హత్యలు
ఫొటో క్యాప్షన్, 1990లలో దేశంలో పురిటిలోనే ఆడశిశు హత్యలు ఎక్కువగా జరిగేవి.

అనిల, సీరోదేవిని కలవడానికి మోనిక ఈ ఏడాది మొదట్లో బిహార్ వెళ్లారు. అనిలా కుమారి, మరికొందరు మంత్రసానులు ఏళ్ల తరబడి పడిన శ్రమకు తాను ఫలితంలాంటిదానినని మోనిక అనుకున్నారు.

‘‘పరీక్షల్లో మంచి రిజల్ట్స్ రావాలాని ఎవరైనా కోరుకుంటారు. వాళ్లు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఫలితాన్ని చూడాలనే ఆసక్తి వారికీ ఉంటుంది. అందుకే నేను వాళ్లను కలవాలనుకుంటున్నాను’’ అన్నారు మోనిక.

మోనికను కలిసినప్పుడు అనిల ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. సీరోదేవి మోనికను దగ్గరికి తీసుకుని తలనిమురుతూ బిగ్గరగా ఏడ్చేశారు.

‘‘నీ ప్రాణం కాపాడటానికి నేనే నిన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లాను. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది’’ అని అన్నారు.

అయితే, కొన్ని రోజుల తర్వాత ఈ శిశుహత్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నేను సీరోదేవిని మరిన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆమె సీరియస్ అయ్యారు.

‘‘గతంలో జరిగిందేదో జరిగిపోయింది’’ అని ఆమె అన్నారు.

ఇది జరిగి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, బాలికలపట్ల నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. శిశుహత్యలు ఇంకా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. బాలికలను రక్షించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లింగ వివక్ష పూర్తిగా పోలేదు. ఇప్పుడది అబార్షన్ల రూపంలో సాగుతోంది.

సెక్స్ సెలెక్టివ్ అబార్షన్లు చట్టవిరుద్ధమని 1994లో ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటికీ ఆ తరహా అబార్షన్లు జరుగుతూనే ఉన్నాయన్న వాదన ఉంది.

ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రసవ సమయంలోపాడే ‘సోహార్’ అనే సంప్రదాయ జానపద గేయాలు మగబిడ్డ పుట్టడం ఆనందం కలిగించే విషయం అని వర్ణిస్తాయి. కానీ, ఇప్పటికీ, అంటే 2024లో కూడా స్థానిక గాయకులు ఆ పాటలో సాహిత్యాన్ని మార్చి, ఆడపిల్ల పుట్టుక కూడా ఒక సంతోషకరమైన సందర్భమేనని చెప్పలేకపోతున్నారు.

మేం ఈ డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్న సమయంలో కూడా కటిహార్‌లో ఇద్దరు అనాథ ఆడశిశువులు ఒకరు పొదల్లో, మరొకరు రోడ్డు పక్కన దొరికారు. అది కూడా కొద్దిగంటల వ్యవధిలోనే. ఇద్దరిలో ఒకరు చనిపోగా, మరొకరిని దత్తత కేంద్రానికి పంపారు.

శిశు హత్యలు
ఫొటో క్యాప్షన్, ఎధా అనే శిశువును అస్సాంకు చెందిన గౌరవ్ దంపతులు దత్తత తీసుకున్నారు.

మోనిక బిహార్ నుంచి తిరిగి బయలుదేరే ముందు కటిహార్‌లోని ‘స్పెషల్ అడాప్షన్ సెంటర్’కు వెళ్లారు. అక్కడ ఒక శిశువును చూశారు.

నవజాత ఆడశిశువుల హత్యలు తగ్గుముఖం పట్టాయని, అయితే వారిని అనాథలుగా వదిలేయడం మాత్రం తగ్గలేదని అర్థమై తనకు చాలా బాధేసిందని మోనిక చెప్పారు.

‘‘ఇది ఒక చక్రంలాంటిది. కొన్నేళ్ల కిందట నేనిక్కడ ఉన్నా. ఇప్పుడు నాలాంటి మరో అమ్మాయి ఉంది’’ అన్నారు మోనికా.

కానీ, ఇక్కడ కొన్ని సంతోషించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ చిన్నారిని అస్సాంకు చెందిన ఓ జంట దత్తత తీసుకుంది. ఆమెకు ‘ఎధా’ అని పేరు పెట్టారు. ‘ఎధా’ అంటే ఆనందం అని అర్థం.

‘‘ఒక్కసారి అనాథ అయిన శిశువు మరోసారి అనాథ కాకూడదు’’ అని ఆ శిశువును దత్తత తీసుకున్న గౌరవ్ అన్నారు. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అధికారి.

గౌరవ్ తన కూతురు చేసే అల్లరి పనుల వీడియోలను అప్పుడప్పుడు నాకు పంపుతుంటారు. వాటిలో కొన్ని నేను మోనికకు పంపుతుంటాను.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ కథ పూర్తికావడానికి 30 ఏళ్లు పట్టింది. ఇది కేవలం చరిత్ర కాదు. చరిత్రలో కొన్ని బాధాకరమైన విషయాలతో పోరాడటం.

గతాన్ని మనం మార్చలేం. కానీ, పరివర్తనను సాధించవచ్చు. ఆ పరివర్తనలోనే ఒక ఆశ కూడా ఉంటుంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)