మైనర్లు నేరం చేస్తే తల్లిదండ్రులపై కేసు ఎందుకు, చట్టం ఏం చెబుతోంది?

పుణేలో కారు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

పుణెలో ఒక మైనర్ బాలుడు మద్యం సేవించి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనకు కారణమైన బాలుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, 12 గంటల్లోగానే జువైనల్ జస్టిస్ బోర్డు కొన్ని షరతులతో ఆ బాలుడికి బెయిల్ మంజూరు చేసింది.

దీనిపై చాలా వివాదం చెలరేగింది. అసలు ఆ బాలుడు నిజంగా మైనరేనా అనే ప్రశ్నలు తలెత్తాయి. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విలేఖరుల సమావేశాన్ని నిర్వహించి, జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయాన్ని ప్రశ్నించారు.

అనంతరం మే 22న (బుధవారం) జువైనల్ జస్టిస్ బోర్డు, నిందితునికి బెయిల్‌ రద్దు చేసింది.

ఈ కేసు నేపథ్యంలో 18 ఏళ్ల లోపు వయస్సున్న వ్యక్తుల్ని చట్టం వేరేలా ఎందుకు చూస్తుంది? మైనర్లు చేసే తీవ్రమైన నేరాలకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. వీటి గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మే 19వ తేదీ రాత్రి, పుణెలోని కల్యాణినగర్‌లో ఒక మైనర్ బాలుడు కారు నడుపుతూ రెండు బైక్‌లను ఢీకొట్టడంతో అనీశ్ కుర్దియా, అశ్వినీ కోస్టా అనే ఇద్దరు చనిపోయారు.

మరుసటి రోజే ఆ బాలుడికి బెయిల్ లభించింది. అయితే, ఈ కేసును పోలీసులు తప్పుదారి పట్టించారని, అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధాంగేకర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ బాలుణ్ని నిందితుడిగా పేర్కొంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారాన్ని పరిశీలించి, కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆదేశించారు.

అయితే, ఒక మైనర్‌పై చర్య తీసుకునేందుకు చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి?

పుణేలో కారు ప్రమాదం
ఫొటో క్యాప్షన్, అనీశ్ కుర్దియా, అశ్వినీ కోస్టా

మైనర్‌పై చట్టంలోని ఏ నిబంధన ప్రకారం చర్య తీసుకోవచ్చు?

18 ఏళ్ల లోపు వారిని చట్టప్రకారం మైనర్లుగా పిలుస్తారు. ఒకవేళ మైనర్లు ఏదైనా నేరం చేస్తే, జువైనల్ జస్టిస్ యాక్ట్-2015 ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారమే జరిమానా, శిక్షలు విధిస్తారు.

కోర్టు అతనికి (మైనర్‌కు) కస్టడీ కూడా విధించవచ్చు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం, ఈ శిక్షను మరింత పెంచారు.

మద్యం తాగి ఖరీదైన పోర్ష్ కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడిపై పుణె పోలీసులు ఐపీసీ 304, 337, 338, 427, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కానీ, ఈ కేసులో నమోదు చేసిన ఈ సెక్షన్లంటికీ బెయిల్ అందుతుంది. కాబట్టి, ఒకవేళ నిందితుడు మత్తులో లేకపోయినా ఈ సెక్షన్ల ప్రకారం ఆయనకు బెయిల్ లభించి ఉండేది.

పోర్ష్ కారు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

తల్లిదండ్రులపై నేరం ఎందుకు?

నిందితుడైన కుమారుడు మైనర్ కావడంతో, అతన్ని కారు నడిపేందుకు అనుమతించిన ఆయన తండ్రిపై కేసు నమోదు చేశారు.

ఛత్రపతి శంభాజీనగర్‌ (ఔరంగాబాద్) లో బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్-2015 ప్రకారం, బాలుడి తండ్రిపై చర్య తీసుకుంటారు.

ఈ యాక్ట్ ప్రకారం, మైనర్ చేసిన నేరానికి వారి తల్లిదండ్రులను విచారించవచ్చు. ఎందుకంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం తల్లిదండ్రుల తొలి బాధ్యత. ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులకు మూడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు.

ఈ మొత్తం వ్యవహారంలో చట్టపరమైన చర్యల గురించి న్యాయవాది అసిమ్ సరోదేతో బీబీసీ మాట్లాడింది.

మైనర్ బాలుడికి కారు ఇచ్చిన తల్లిదండ్రులతో పాటు, పబ్‌లో బాలుడికి మద్యం అందించిన యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు న్యాయవాది అసిమ్ చెప్పారు. మోటార్ వెహికిల్ యాక్ట్‌లోని 199ఎ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలుడు నడిపిన కారుకు నెంబర్ ప్లేట్ లేదు. కాబట్టి ఈ కొత్త చట్టంలోని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం, ఒకవేళ మైనర్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడంతో పాటు వారికి శిక్ష కూడా విధించవచ్చు.

కొంతకాలం కిందట అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక పాఠశాల విద్యార్థి, మరో నలుగురు పిల్లల్ని కాల్చి చంపాడనే కారణంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

మిషిగన్‌లోని ఒక స్కూల్‌లో బాలుడు కాల్పులు జరిపి నలుగురిని చంపాడు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

మైనర్‌ను విచారించవచ్చా?

ప్రస్తుతం, ఇద్దరి చావుకు కారణమైన మైనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

2015లో జువైనల్ అఫెండర్స్ యాక్ట్‌ (బాల నేరస్తుల చట్టం)ను సవరించారు. ఒకవేళ 16 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ చాలా తీవ్రమైన నేరానికి పాల్పడితే ఉద్దేశపూర్వకంగా (కాగ్నిజెన్స్) నేరానికి పాల్పడ్డాడన్న అభియోగం కింద చర్య తీసుకోవచ్చు.

గత కొన్నేళ్లుగా 16-18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు చేసే తీవ్రమైన నేరాలు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ చట్టంలో కొన్ని మార్పులను సూచించింది.

చట్టంలో ఈ సవరణ తర్వాత, ఇలాంటి (కాగ్నిజెంట్) నిందితుని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోగలుగుతారు. అందుకోసం జువైనల్ జస్టిస్ బోర్డు నుంచి పోలీసులు అనుమతి తీసుకోవాలి. కానీ, అరుదైన కేసుల్లో మాత్రమే ఇలాంటి అనుమతులు మంజూరు అవుతాయి.

దిల్లీలో 2012 డిసెంబర్‌లో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆ కేసులోని ఆరుగురు నిందితుల్లో ఒకరు 17 ఏళ్ల మైనర్. ఒకవేళ ఈ నేరం తీవ్రమైనదని కోర్టులో రుజువైతే, నిందితునికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)