ఇండిగో విమానంలో గందరగోళం సృష్టించిన 'అదనపు' ప్రయాణికుడు, చివరకు..

ఫొటో సోర్స్, ANI
ముంబయి విమానాశ్రయం నుంచి మంగళవారం (మే 21) నాడు వారణాసికి బయల్దేరిన విమానంలో గందరగోళం చోటుచేసుకుంది. గాల్లోకి ఎగరకముందే ఓ ప్రయాణికుడిని కిందకు దించేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తిని అదనపు ప్రయాణికుడిగా గుర్తించారు. ఇంతకూ ఈ అదనపు ప్రయాణికుడంటే ఏమిటి? విమానప్రయాణాల్లో టిక్కెట్ల బుకింగ్‌లో జరిగే తంతు ఏమిటి?
మంగళవారం (మే 21) ఉదయం ముంబయి నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానంలో సీటు లేకుండా నిలబడిన ఒక ప్రయాణికుడు కనిపించాడు. విమానం గాలిలోకి ఎగరకముందే ఆ విషయాన్ని గమనించడంతో ఆయనను విమానం నుంచి దించివేశారు.
ఇండిగో ఫ్లైట్ 6E 6543లో ఈ ఘటన జరిగింది. బోర్డింగ్ ప్రక్రియలో లోపం కారణంగా ఈ విమానంలో ఓ అదనపు ప్రయాణికుడు ఎక్కడం ఈ గందరగోళానికి దారితీసింది.
ఇండిగో విమాన సర్వీసులో ఓ ప్రయాణికుడు సమయానికి చెక్ఇన్ కాకపోవడంతో ఆ సీటును మరొక ప్రయాణికుడికి కేటాయించారు. అయితే అదే సమయంలో ఆలస్యమైన ప్రయాణికుడు వచ్చి, బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కడంతో ఈ గందరగోళం నెలకొంది.
టేకాఫ్‌కు ముందు రన్‌వేపై షెడ్యూల్ చేసిన ప్రదేశానికి విమానం వెళుతుండగా, ఒక ప్రయాణికుడు నిలబడి ఉండడాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. ఫ్లైట్ అటెండెంట్ పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో, విమానాన్ని తిరిగి బోర్డింగ్ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ అదనపు ప్రయాణికుడిని దించేశారు.
దీంతో 7:50కి బయలుదేరాల్సిన విమానం దాదాపు అరగంట ఆలస్యంగా వెళ్లింది.
ఈ విషయంలో తప్పు జరిగిందని ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఒక ప్రయాణికుడికి సీటు కన్‌ఫామ్ అయినప్పుడు, అదనపు ప్రయాణికుడిని విమానంలోకి ఎలా అనుమతించారో దర్యాప్తు చేస్తామని ఇండిగో తెలిపింది.
"ప్రయాణికుల బోర్డింగ్ ప్రక్రియలో పొరపాటు జరిగింది. కన్‌ఫామ్ అయిన ప్రయాణికుడికి కేటాయించిన సీటును ఒక స్టాండ్‌బై ప్రయాణికుడికి ఇచ్చాం. ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు దీనిని గుర్తించి, స్టాండ్‌బై ప్రయాణికుడిని దించివేశాం. దీని వల్ల విమానం కొంచెం ఆలస్యంగా బయల్దేరింది" అని ఇండిగో తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
విమానంలో గందరగోళం
విమానాల్లో ఇలాంటి గందరగోళం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. కొన్నిసార్లు విమానాలలో ఉన్న సీట్ల కంటే ఎక్కువ మందికి టికెట్లు అమ్ముతారు. దీన్ని ఓవర్ బుకింగ్ అంటారు. కొన్నిసార్లు సీట్లూ మారుతుంటాయి.
తాజా ఘటనకు, ఓవర్ బుకింగ్‌కు సంబంధం లేకపోయినా, ప్రస్తుత సందర్భంలో ఓవర్ బుకింగ్‌పై చర్చ జరుగుతోంది.
కొంతమంది ప్రయాణికులు చివరి నిమిషంలో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారని ఊహించి, విమానయాన సంస్థలు తమకు అందుబాటులో ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లను విక్రయిస్తాయి. దీన్నే 'ఓవర్ బుకింగ్' అంటారు. కానీ కొన్నిసార్లు ప్రయాణికులందరూ వచ్చి, కొంతమందికి ప్రయాణికులకు సీటు లభించకుంటే వాళ్లను తర్వాత విమానంలో ప్రయాణించడానికి అనుమతిస్తారు.

ఫొటో సోర్స్, ANI
‘అదనపు’ నియమాలివే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు ఓవర్ బుకింగ్‌ను అమలు చేస్తున్నాయి. ఇది పూర్తిగా చట్టానికి లోబడి జరుగుతుంది.
మరి, ఓవర్ బుకింగ్ జరిగి, ప్రయాణికులందరూ వచ్చేస్తే ఎలా?
ముందుగా, ఎయిర్‌లైన్స్ ఎవరైనా ప్రయాణికులను తదుపరి విమానంలో వెళ్లమని అడుగుతుంది. అందుకు ఎవరూ సిద్ధంగా లేకుంటే, ఆ ఎయిర్‌లైన్ సంస్థే ఎవరిని డీబోర్డ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటుంది.
ఏ ప్రయాణికులను దింపేయాలనే విషయంపై వివిధ విమానయాన సంస్థలు వేర్వేరు పద్ధతులను అనుసరిస్తున్నాయి. చెక్ఇన్ సమయం, ఆఫర్ చేసిన ఛార్జీలు, తరచుగా ప్రయాణించే ప్రయాణికులు తదితర అంశాల ఆధారంగా ప్రయాణికులను దించేస్తారు.
కానీ, కొన్నిసార్లు అనుకోని సంఘటనలూ జరుగుతాయి. గతంలో అమెరికాలో ఓ ప్రయాణికుడు విమానం దిగేందుకు నిరాకరించడంతో ఎయిర్‌లైన్ సిబ్బందితో గొడవ జరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌లో నిబంధనలు ఎలా ఉన్నాయి?
ఓవర్ బుకింగ్‌పై సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను రూపొందించింది.
డీజీసీఏ నిబంధనల ప్రకారం, ఒక విమానయాన సంస్థ ఫ్లైట్ షెడ్యూల్ సమయం నుంచి ఒక గంటలోపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన సర్వీసును సూచిస్తే, డీబోర్డ్ చేసిన ప్రయాణికులకు ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎయిర్‌లైన్ 24 గంటలలోపు ప్రత్యామ్నాయ విమాన సర్వీసును సూచించలేకపోతే, ప్రయాణికులు బుక్ చేసుకున్న బేసిక్ మొత్తానికి (బేసిక్ ఫేర్) 200% అదనంగా, దానితో పాటు ఎయిర్‌లైన్ ఇంధన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని గరిష్ఠంగా ₹10,000కి పరిమితం చేశారు.
ఓవర్ బుకింగ్ విషయం ఎలా తెలుస్తుంది?
విమానాలు అత్యంత రద్దీగా ఉండే సెలవుల సీజన్ లేదా పండుగ రోజులలో ఓవర్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుందని విమానయాన నిపుణులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ చెక్-ఇన్ అనుమతించకపోతే, మీ ఫ్లైట్ ఓవర్‌బుక్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంపిక చేసుకున్న ప్రయాణికులకు బోనస్‌లనూ ఇస్తుంటాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














