ఊపందుకొన్న విమానయానం.. ఈ అవకాశాన్ని ఎయిరిండియా అందిపుచ్చుకుంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురంజన తివారి
- హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ను టాటా గ్రూప్ కొనుగోలు చేసినప్పుడు ఏదో అద్భుతం జరగబోతోందని అంతా అనుకున్నారు.
ఎయిరిండియా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో పాటు దశాబ్దాలుగా ఆ ప్రతిష్ఠాత్మక సంస్థకు నిధుల కొరత ఉండేది. నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో భాగస్వాములవ్వాలని ఎవరూ కోరుకోలేదు.
కానీ, ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో 2021లో ఒక ఒప్పందం కుదిరింది. కోవిడ్ అనంతరం దేశాల సరిహద్దులు తెరుచుకోవడంతో విమానయాన సంస్థలు పోటీపడి పరుగెడుతున్నాయి.
అవును అది నిజమే. విమానయానం తిరిగి ఊపందుకుంది. 2024 ప్రారంభం నుంచి విమానయానం భారీ వృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయితే, అమెరికాలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కోవిడ్ మహమ్మారి తర్వాత కనిపించిన వృద్ధి, ప్రజల వ్యయ నియంత్రణ కారణంగా మందగిస్తోందని హెచ్చరికలు ఉన్నాయి. కానీ, ప్రపంచానికి మరోవైపు ఆసియాలో ఆ పరిస్థితి మరోలా ఉంది.
''భారత్‌లో విమానయాన వృద్ధికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే, భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం'' అని సింగపూర్‌లో ఇటీవల జరిగిన ఏవియేషన్ ఈవెంట్‌లో ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యాంప్‌బెల్ విల్సన్ బీబీసీతో చెప్పారు.
''భారత్‌కు భౌగోళికంగా కలిసొచ్చే అంశాలూ ఉన్నాయి. ప్రపంచంలోని ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో అనుసంధానం చేస్తోంది. అలాగే, విమానయానపరంగా ఇప్పటివరకు అది చిన్న మార్కెట్ కావడం కూడా ఒకటి.''
భారత దేశీయ విమానయాన మార్కెట్ 2019తో పోలిస్తే 2042 నాటికి దాదాపు ఐదు రెట్లు పెరుగుతుందని, ఏడాదికి సుమారు 685 మిలియన్ (68.5 కోట్ల) ట్రిప్పులు (సర్వీసులు) నడిచే అవకాశం ఉందని విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ అంచనా వేసింది.
ఇది భారత్‌ను పౌరవిమానయాన మార్కెట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలపడమే కాకుండా చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో నిలబెట్టనుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క భారతదేశం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్యలో 13వ స్థానంలో ఉన్న ఇండోనేషియా 2050 నాటికి నాలుగో స్థానానికి ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న దశాబ్దాల్లో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాంలలో కూడా విమానయాన మార్కెట్‌లో భారీ వృద్ధి నమోదు కానుంది.
ఈ దేశాలన్నీ పెరుగుతున్న జనాభా, యువతతోపాటు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ప్రయాణాలకు ఖర్చు చేయగలవు. అలాగే, గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ 16 శాతం పెరిగింది. ఆసియాలో మాత్రం ఈ పెరుగుదల దాదాపు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు విమానయాన వర్గాలు చెబుతున్నాయి.
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ద్వీప దేశాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఆయా ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నాయి.
చైనాలో మార్కెట్ బాగానే ఉన్నా ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. అయినప్పటికీ జీరో కోవిడ్ ఆంక్షల ఎత్తివేత తర్వాత చైనీయులు విహారయాత్రలకు మొగ్గు చూపుతున్నారు. చైనా కూడా థాయిలాండ్, సింగపూర్ వంటి కొన్ని దేశాల పౌరులకు వీసా లేకుండానే పర్యటించే సౌకర్యం కల్పిస్తోంది. ఆ దేశాలు కూడా అదే విధానాలను అమలు చేస్తున్నాయి.
''చైనాలో విమానయానం తిరిగి ఊపందుకోవడం సంతోషకరం. ప్రయాణాలు వేగంగా పెరిగిన దేశాల్లో చైనా కూడా ఒకటి'' అని బుకింగ్.కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్లెన్ ఫోగెల్ చెప్పారు.
అయితే, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, వ్యాపారంలో అనిశ్చితి, వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడం వంటి అంశాల కారణంగా విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూస్తున్నాయి.
''ఆసియా మార్కెట్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. మరింత మెరుగ్గా ఉన్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. మార్కెట్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి'' అని బడ్జెట్‌లో విమానయాన సౌకర్యం కల్పిస్తున్న ఫిలిప్పీన్స్ సంస్థ సీబు పసిఫిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకేల్ సూజ్ చెప్పారు.
కోవిడ్ మహమ్మారి, ప్రభుత్వ మద్దతు లేకపోవడం వల్ల విమానయాన రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని ఇతర విమానయాన సంస్థల మాదిరిగా ఆ సంస్థ కూడా ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల సమస్యలను ఎదుర్కొంది.
కానీ, గత రెండేళ్లలో తిరిగి పుంజుకుంది. నలుమూలలకూ సర్వీసులు నడపడం ద్వారా దేశీయ మార్కెట్‌లో సగానికి పైగా విస్తరించింది. ఫిలిప్పీన్స్ కొత్త ప్రభుత్వం కూడా సాయం చేస్తోంది.
మనీలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడం, భారీ విమానాలు, మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకల కోసం మరిన్ని రన్‌వేల ఏర్పాటు దిశగా యోచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తలసరి వ్యయ సామర్థ్యం పెరుగుతున్న సుమారు 11.5 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంపై సూజ్ చాలా ఆశలతో ఉన్నారు.
''విద్యావంతులైన జనాభా పెరుగుతోంది, అందులోనూ యువత ఎక్కువ. అది విమానయాన మార్కెట్‌ను పెంచే అవకాశం ఉంది.''
మరోవైపు భారత్. ఇదో గమ్మత్తైన మార్కెట్. ఎయిరిండియా దేశీయంగా ఇండిగో నుంచి గట్టి సవాల్ ఎదుర్కొంటోంది. అలాగే, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఎప్పుడూ మెరుగైన ర్యాంకింగ్స్ సాధించే ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్‌కు దీటుగా ఎదగడంలోనూ ఆ సంస్థకు సవాళ్లున్నాయి.
అయితే, ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వరకు అన్ని రంగాల్లో ఉన్న టాటా సంస్థ ఎయిరిండియాను గాడిలో పెట్టే పనిలో ఉంది. కొత్త విమానాలు, కొత్త బ్రాండింగ్‌తో అస్తవ్యస్తంగా ఉన్న పాత వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఇప్పటికే టాటా వేల కోట్లు ఖర్చు చేసింది.
ఇప్పుడది తన ఐదు ఎయిర్‌లైన్ సంస్థలను ఏకం చేయాలనుకుంటోంది. వాటిలో మూడు ఎయిరిండియా అనుబంధ సంస్థలు కాగా, రెండు జాయింట్ వెంచర్లు. అవి ఎయిర్ ఏషియా, విస్తారా(ఇది సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్). ఉత్తమ విమానయాన సంస్థగా అంతర్జాతీయ ప్రయాణికులకు దగ్గరవడం, దేశీయ ప్రయాణికులకు తక్కువ ధరకు ప్రయాణ వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
ఎయిరిండియా భారతదేశపు మొదటి విమానయాన సంస్థ. 1930లలో టాటాలు దీనిని ప్రారంభించారు. 1950లలో ఈ సంస్థను జాతీయం చేయడంతోపాటు ఎయిరిండియాగా మార్చారు. ఇప్పుడు గత కీర్తిని పునరుద్ధరించాలని విల్సన్ ఆశిస్తున్నారు. దీనికోసం అంతర్జాతీయ మార్కెట్‌ను గెలవడం కీలకమని, అందుకు ''ప్రపంచంలోని ముఖ్యమైన నగరాలకు విస్తృతంగా సర్వీసులను నడపడం'' అవసరమని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకోసం మరిన్ని నగరాలకు సర్వీసులను నడపడంతోపాటు కొత్త విమానాలను కొనాల్సి ఉంటుంది.
విమానయాన చరిత్రలోనే మ్యాక్స్ 8, మ్యాక్స్ 10 మోడల్ విమానాల కొనుగోలు అతిపెద్ద డీల్.
అమెరికాలో గాల్లో ఉండగానే 737 మ్యాక్స్9 విమానంలో డోర్ ప్లగ్ పేలిపోవడంతో, మ్యాక్స్ విమానాలు స్క్రూటినీలో ఉన్నాయి. దీంతో మ్యాక్స్ 10 విమానాల మోడల్‌పై కూడా ఆందోళనలున్నాయి. లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్ కారణంగా 2018, 2019లో జరిగిన రెండు ఘోర ప్రమాదాల తర్వాత ఇది జరిగింది. బోయింగ్‌లో తలెత్తిన ఈ సంక్షోభం ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ కల్హౌన్ రాజీనామాకు దారితీసింది.
''ఆందోళనకర పరిస్థితులు ఉంటే, ఉన్నత స్థాయిలో ఎత్తిచూపుతాం, బోయింగ్ సహా'' అని క్యాంప్‌బెల్ చెప్పారు.
భారత్‌ను దుబాయ్ లేదా సింగపూర్ తరహాలో విమానయాన హబ్‌గా మార్చడం ద్వారా ఎయిరిండియా భవిష్యత్తును నిర్మించాలని విల్సన్ భావిస్తున్నారు.
కోవిడ్ తర్వాత యూరప్ వంటి సుదూర ప్రాంతాలకు ఇంకా సర్వీసులు ఇంకా లేకపోవడం ఆ కలకు సవాల్‌గా మారొచ్చు. అయితే, ఆసియా దేశాలకు చెందిన ప్రయాణికులు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా విమానాలనే ఎంచుకుంటున్నారు. తద్వారా ఈ ప్రాంతంలో విమానాల ట్రాఫిక్‌ను పెంచుతున్నారు.
అయితే, హబ్‌గా మారే అవకాశం ఎయిరిండియాకు, దిల్లీకి ఉంది. ఎందుకంటే, కొన్ని ఆగ్నేయాసియా దేశాల రాజధానులు ఇప్పటికీ సింగపూర్, హాంకాంగ్, దుబాయ్ వంటి హబ్‌ల కంటే వెనకబడి ఉండడమే దానికి కారణం.
ప్రస్తుతం విమానయాన రంగం ఆశాజనకంగా ఉంది. కోవిడ్ మహమ్మారి ముగిసిపోయింది. ప్రజలు విమాన ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు తిరిగి పుంజుకుంటున్నాయి.
''నిజానికి ప్రజలు ప్రయాణాలను ఇష్టపడతారు'' అని ఫోగెల్ చెప్పారు. ''ఆర్థిక వ్యవస్థలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణాలు వేగంగా పెరుగుతాయని తెలుసు. అందులో ఎక్కువ మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే మా పని'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
- లద్దాఖ్: కేంద్రం ద్రోహం చేసిందంటూ గడ్డ కట్టే చలిలో వేల మంది రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు?
- అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ఎందుకు స్పందించింది? భారత్ ఏమని బదులిచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














