లద్దాఖ్: కేంద్రం ద్రోహం చేసిందంటూ గడ్డ కట్టే చలిలో వేల మంది రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు?

ఫొటో సోర్స్, Special arrangement
భారత్‌లోని లద్దాఖ్ ప్రాంతంలో గడ్డకట్టే చలిలో వేల మంది నిరసనలు చేస్తున్నారు.
కశ్మీర్‌లోంచి తమకు ఒక ప్రత్యేక ప్రాంతం కావాలనే వారి సుదీర్ఘకాల డిమాండ్‌ను 2019లో భారత ప్రభుత్వం నెరవేర్చింది.
కానీ, ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందని, హామీలను నెరవేర్చలేకపోయిందంటూ 2020 నుంచి వారు తరచూ వీధుల్లోకి వస్తున్నారు. శ్రీనగర్‌కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అకీబ్ జావీద్ అక్కడేం జరిగిందో వివరించారు.
లద్దాఖ్- ముస్లిం, బౌద్ధ కమ్యూనిటీలకు చెందిన మూడు లక్షల మంది నివసించే ప్రాంతం. లేహ్ రీజియన్‌లో బౌద్ధుల ఆధిపత్యం ఉండగా, కార్గిల్ రీజియన్ షియా ముస్లింలకు ఆవాసంగా ఉంటుంది.
దశాబ్దాలుగా అక్కడి బౌద్ధ సమాజం తమ ప్రజల కోసం ఒక ప్రత్యేక రీజియన్ కావాలని డిమాండ్ చేసింది. అలాగే కార్గిల్‌లో ఉండే ముస్లింలు కశ్మీర్‌లో విలీనం కావాలని కోరుకున్నారు.
2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం,జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది.
రాష్ట్రాన్ని లద్దాఖ్, జమ్మూకశ్మీర్ అనే రెండు భాగాలుగా విభజించింది. ఈ రెండూ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి.
ఏడాది తర్వాత కార్గిల్, లేహ్ జిల్లాలు, ప్రజల ఆందోళనల గురించి గొంతెత్తాలనే ఉద్దేశంతో లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ)లను ఏర్పాటు చేశాయి. ఈ పౌర సమాజపు సమూహాలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనల్ని నిర్వహించాయి.

ఫొటో సోర్స్, Special arrangement
ఈ వారం ఆరంభంలో, రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ కార్గిల్‌లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. దుకాణాలను మూసేశారు. లేహ్‌లో నిరసనకారులు వచ్చే వారం ఒక సరిహద్దు ప్రదర్శన నిర్వహించాలని ప్లాన్ చేశారు.
‘‘మేం ఒక చట్టసభతో కూడిన ప్రత్యేక ప్రాంతం కావాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ, మాకు ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఇచ్చారు’’ అని లేహ్‌కు చెందిన ఒక బౌద్ధ నాయకుడు చెరింగ్ డోర్జే లాక్రూక్ అన్నారు.
ప్రాథమికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే లద్దాఖ్ ప్రజల్లో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తమ ప్రాంతపు సంస్కృతిని, గుర్తింపును ప్రభావితం చేస్తుందనే భయాలను కూడా కలిగించింది. బయటి నుంచి వచ్చే వ్యక్తులకు ఈ ప్రాంతంలో భూములను కొనడం సులభతరం చేయడం వల్ల వారిలో ఈ భయాలు చెలరేగాయి.
భారత హోం శాఖ సమాచారం ప్రకారం, 2023 ఏప్రిల్ 5 నాటికి, గత మూడేళ్లలో లద్దాఖ్‌లో ఒక్క భారతీయ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టలేదు. బయటి వ్యక్తులెవరూ ఇక్కడ భూముల్ని కొనలేదు.
అయితే, 2020-22 మధ్య కాలంలో జమ్మూకశ్మీర్‌లో 185 మంది బయటి వ్యక్తులు స్థలం కొన్నట్లు డేటా చూపిస్తోంది.
లద్దాఖ్‌లో 97 శాతం మంది గిరిజనులే
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, ఉద్యోగాలు, తమ భూములు, వనరుల పరిరక్షణ, లేహ్‌తోపాటు కార్గిల్ జిల్లాకు ఒక్కో పార్లమెంటరీ స్థానం వంటివి వారి డిమాండ్లలో ఉన్నాయి.
గిరిజన జనాభాను రక్షించే రాజ్యాంగ నిబంధన అయిన ఆరో షెడ్యూల్‌ను అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. లద్దాఖ్‌లో దాదాపు 97 శాతం మంది ప్రజలు గిరిజనులే.
‘‘స్థానిక, గిరిజన సమూహాల హక్కుల పరిరక్షణ కోసం ఆరో షెడ్యూల్‌ను రూపొందించారు’’ అని చెరింగ్ డోర్జే లాక్రూక్ అన్నారు.
బీజేపీ రీజియనల్ యూనిట్‌కు 2020 వరకు చెరింగ్ డోర్జే లాక్రూక్ అధ్యక్షునిగా ఉన్నారు. ఈ షెడ్యూల్ పారిశ్రామికవేత్తల దోపిడీ నుంచి గిరిజన సమూహాలను కాపాడుతుందని ఆయన అన్నారు.
ఈ డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఎలాంటి పురోగతీ లేదని స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Special arrangement
ఈ రీజియన్‌లోని యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు.
2019 నుంచి సీనియర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్కరిని కూడా నియమించలేదు.
‘‘మా ఉద్యోగాలను బయటివారు ఎక్కడ తన్నుకుపోతారోననే భయం ఉంది’’ అని పద్మా స్టాంజిన్ చెప్పారు. ఆమె లద్ధాఖ్ స్టూడెంట్స్ ఎన్విరాన్‌మెంటల్ యాక్షన్ ఫోరమ్(లీఫ్)కు నాయకత్వం వహిస్తున్నారు.
అయితే దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ చేసిన విజ్ఞప్తిపై లద్ధాఖ్ బీజేపీ ఎంపీ జెమాంగ్ తెస్రింగ్ నాంగ్యాల్ స్పందించలేదు.
చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దులను పంచుకుంటున్న లద్ధాఖ్, భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతం. ఆ రెండు దేశాలు, భారత్ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని ఖండించాయి.
1980వ దశకంలో భారత పాలనలో ఉన్న కశ్మీర్ దిల్లీ పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ సాయుధ తిరుగుబాటును చవిచూసినప్పటికీ, ఈ తీవ్రవాదం ఎప్పడూ లద్దాఖ్‌కు వ్యాపించలేదు.
1999లో కార్గిల్ యుద్ధ సమయంలో లద్ధాఖ్ వాసులు భారత సైనికులకు స్వచ్ఛందంగా మద్దతు పలికి ఆహారం తదితర సౌకర్యాలు అందించారు. అయితే ఇంత విధేయత చూపినందుకు తామిప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని స్థానికులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.
‘‘ప్రజల మనోభావాలను ప్రభుత్వం గాయపరిస్తే ఆ నాటి స్వచ్ఛంద స్ఫూర్తి కొనసాగదు’’ అని సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు. ఆయన ఓ ఇంజినీర్, పర్యావరణ కార్యకర్త. ఆయన స్థానికుల సమస్యలపై ఏళ్ళ తరబడి పనిచేసిన వ్యక్తి.
ఈయన కథ ఆధారంగా 2009లో అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘త్రీ ఇడియట్స్’ వచ్చింది.
‘‘లద్ధాఖ్ పర్యావరణం, గిరిజనుల సంస్కృతిని పరిరక్షిస్తామనే ప్రభుత్వ హామీని గుర్తుచేస్తున్నాం’’ అని 21 రోజులుగా నిరాహారదీక్షలో ఉన్న వాంగ్‌చుక్ చెప్పారు.
లద్ధాఖ్ ప్రజలు భారత సైనికులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు. ఇందుకోసం మైదాన ప్రాంతంలోని ప్రజలు కూడా అత్యంత ఎత్తైన ప్రదేశాలకు అలవాటు పడటానికి కష్టపడ్డారని, ఎలాంటి అలజడి అయినా ఈ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రాంతంలోని ఏ చిన్న బలహీనతనైనా చైనా, పాకిస్తాన్ గమనిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
‘‘అశాంతి, తిరస్కరణ అనేవి కొనసాగితే, వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తాయి’’ అని మైకేల్ కుగెల్మాన్ చెప్పారు.
ఆయన వాషింగ్టన్ కేంద్రంగా నడిచే విల్సన్ సెంటర్‌లోని ఆసియా సౌత్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా ఉన్నారు.
2019లో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ఏర్పాటు చేయడాన్ని చైనా గుర్తించలేదు.
ఈ ప్రాంతం హిమాలయాల పొడవునా వివాదాస్పద 3,400 కిలోమీటర్ల (2,100 మైళ్ళు) మేర ఉంది. దీనిని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదంటే ఎల్ఏసీగా పిలుస్తారు. దీనిని సరిగా గుర్తించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
లద్దాఖ్‌లోని గాల్వన్ నది లోయలో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ జరిగి, 20 మంది భారతీయ సైనికులు చనిపోయిన తరువాత 2020 నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల కదలికలను పెంచాయి. పెద్ద ఎత్తున సైనిక సదుపాయాల నిర్మాణం మొదలుపెట్టాయి.
మరోపక్క లద్దాఖ్‌లో భారత భూభాగంలోని 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తనదేనంటూ చైనా చొరబాట్లకు దిగింది. అయితే చైనా ప్రకటనలను భారత్ పదేపదే ఖండించింది.
చైనా సైనికులు లద్దాఖ్ ప్రాంతంలోకి ప్రవేశించి గొర్రెలను మేపనీయకుండా అడ్డుకోవడం స్థానికులలో కలవరాన్ని సృష్టిస్తోంది.
ఈ ఏడాది జనవరిలో ఎల్‌ఏసీ వద్ద స్థానిక గొర్రెల కాపర్లు చైనా సైనికులతో గొడవపడ్డారు. ఎల్‌ఏసీ సమీపంలో గొర్రెలను ఎప్పటి నుంచో మేతకు తీసుకువెళ్ళే సంప్రదాయం ఉంది. దీనిని అడ్డుకోవడంతో చైనా సైనికులతో వారు గొడవకు దిగారు.
లద్దాఖ్ లోని అస్థిర పరిస్థితులను భారత్ సహించలేకపోవచ్చుకానీ, 2019లో చేసిన మార్పులను మార్చడం సాధ్యమయ్యే పని కాదని కుగెల్మాన్ చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దే దిల్లీ అంతిమ లక్ష్యంగా ఉండేది. దాని వల్ల ఈ ప్రాంతంలో తలెత్తే అస్థిరతలు, వివాదాలు వాటంతటవే సర్దుకుంటాయని భావించేది.
‘‘లద్దాఖ్ హోదాను మార్చడం, దానికి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడమనేది దాని స్థితిని బలహీనపరుస్తుంది. దీనివల్ల 2019 నాటి చర్యల ప్రయోజనంపై అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. దిల్లీ అందించాలనుకుంటున్న సందేశం ఇది కాదు’’ అని ఆయన వివరించారు.
అందుకే భారత్ లద్దాఖ్‌లోని స్థానిక సంస్థలకు అధికారాలను విస్తరించాలని భావించడం లేదని దిల్లీ ఆలోచనాపరుల వేదిక అయిన ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కు చెందిన సీనియర్ అనలిస్ట్ ప్రవీణ్ దొంతి అన్నారు.
‘‘గాల్వాన్ ఘర్షణల నుంచిఎల్‌ఏసీ వద్ద అస్థిరంగా ఉంది. బహుశా ప్రభుత్వం దానిపై జాగ్రత్తగా అడుగులు వేయాలని భావిస్తోంది’’ అని చెప్పారు.
కానీ లద్దాఖ్ వాసులు తమ ఐక్యత, ముస్లిం, బౌద్ధ సంఘాల ఐక్య కార్యాచరణ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా ఒత్తిడి తెస్తుందనే ఆశతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














