భారత్, చైనా: సరిహద్దుకు అటూఇటూ మళ్ళీ సేనల మోహరింపు... నాలుగేళ్ళుగా శీతాకాలంలో ఎందుకీ టెన్షన్స్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్ర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, చైనా సైన్యాలు ఈ శీతాకాలం కూడా, అంటే వరుసగా నాలుగో ఏడాది, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరస్పరం ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య 2020లో తలెత్తిన సరిహద్దు వివాదం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సరిహద్దుల వద్ద వేలమంది సైనికులను మోహరించడం చర్చనీయాంశమైంది.
ఇప్పటి వరకు రెండు దేశాల మిలటరీ మధ్య సరిహద్దు వివాదంపై 20 సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా కొన్ని ప్రాంతాల నుంచి భారత్, చైనాలు సైన్యాలను వెనక్కి తీసుకున్నాయి.
గల్వాన్, ప్యాంగాంగ్ నార్త్, సౌత్ బ్యాంకు, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియాలోని పెట్రోలింగ్ పాయింట్ 17, పెట్రోలింగ్ పాయింట్ 15ల వద్దనున్న సైనికులను ఇరు దేశాలు వెనక్కి రప్పించాయి.
ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో డీ-మిలిటరైజ్డ్ ‘బఫర్ జోన్’లను ఏర్పాటు చేశాయి.
ప్యాంగాంగ్ ట్సో నుంచి ఇరు దేశాలు తమ సైన్యాలను వెనక్కి తీసుకునేందుకు 2021 ఫిబ్రవరిలో ఏకాభిప్రాయం కుదరగా.. గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియా నుంచి 2021 ఆగస్ట్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాయి.
కానీ, డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల విషయంలో సరిహద్దు వివాదంపై ఎన్నిసార్లు చర్చలు జరిగినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు.

ఫొటో సోర్స్, AFP
20వ రౌండ్ మిలటరీ చర్చల్లో కూడా పురోగతి లేదు
భారత సరిహద్దులోని చుషుల్-మోల్డో వద్ద అక్టోబర్ 9, 10 తేదీల్లో భారత్-చైనాల మధ్యలో కోర్ కమాండర్ స్థాయిలో 20వ సారి చర్చలు జరిగాయి.
ఈ సమావేశం తర్వాత మాట్లాడిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ‘‘ఇరు దేశాల జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, 2023 ఆగస్ట్ 13, 14 తేదీల్లో జరిగిన కోర్ కమాండర్ స్థాయి సమావేశంలో చివరి చర్చల ఆధారంగా, వెస్ట్రన్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద సైన్యం తీవ్రతను తగ్గించడానికి అంగీకరించాయి.
సంబంధిత సైన్యం, దౌత్య యంత్రాంగాల ద్వారా చర్చలు జరుపుకునేందుకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాలు చెప్పాయి’’ అని తెలిపింది.
కానీ, తూర్పు లద్దాఖ్ వద్ద ఉన్న వాస్తవాధీన రేఖపై కొనసాగుతున్న వివాదానికి సరిహద్దు చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరకలేదని ఈ ప్రకటనతో అర్ధమవుతోంది.
డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల విషయంలో చర్చలకు చైనా అంగీకరించకపోవడంతోనే ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు.

ఫొటో సోర్స్, ALKA ACHARYA
ఎన్నికల ఏడాదిలో పరిష్కారం దొరుకుతుందా...
ఎన్నికల ఏడాదిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కష్టమే.
భారత్, చైనాల మధ్యలో వాస్తవాధీన రేఖ వివాదాన్ని అర్థం చేసుకునేందుకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, ఈస్ట్ ఏషియన్ స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ అల్కా ఆచార్యతో బీబీసీ మాట్లాడింది.
‘‘రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగనుంది. భారత్ తన భూభాగమని చెప్పుకుంటోన్న ప్రాంతాలను చైనా ఆక్రమించుకుంది.
2020 ఏడాదిలో మొదలైన ఈ వివాదం చిన్న గొడవ కాదు. ఆ సమయంలో చైనా సైనికులు వచ్చి, మనతో తలపడి వెళ్లారు. అంతకుముందు భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకునేందుకే వాస్తవంగా ఇలా చేసింది.
ఈ సమస్యకు పరిష్కారం అంత త్వరగా దొరకదు. కానీ, ఇది జటిలమైన సమస్య. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ, అందుకు చాలా సమయం పట్టవచ్చు’’ అని అల్కా అన్నారు.
ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడానికి మరో కారణం దీని వెనక ఉన్న రాజకీయ అంశాలని ఆమె చెప్పారు.
‘‘భారత్ ఎన్నికల ఏడాదిలో ఉంది. ఎన్నికల సమయంలో ఇలాంటి విషయంలో రాజీ పడటం కానీ లేదా ఓటమిని అంగీకరించడానికి అధికార పార్టీకి కొన్ని ఇబ్బందులుంటాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘సరిహద్దు విషయంలో ఇరు దేశాలకు సొంత అభిప్రాయాలున్నాయి’
భారత్, చైనాల మధ్య సరిహద్దును పూర్తిగా స్పష్టంగా నిర్వచించలేదు. భారత్ తన సరిహద్దు 3,488 కిలోమీటర్లని చెబుతోంది. చైనా 2,000 కిలోమీటర్లనే పేర్కొంటోంది. సరిహద్దు విషయంలో ఇరు దేశాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
రక్షణ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు, భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌బీ ఆస్తానా ఈ విషయంపై మాట్లాడుతూ, "సరిహద్దులు, వాస్తవాధీన రేఖను పరిగణనలోకి తీసుకుంటే, ఇరువైపుల వారికి సొంత వాదనలున్నాయి" అని అన్నారు.
‘‘రెండు పక్షాలూ దేనినీ వదులుకునేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. మేం చెప్పేదంతా మాదే, మీరు రాజీకి రండి అనే పద్ధతిలోనే సంభాషణలు జరుగుతున్నాయి’’ అని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిపుచ్చుకోవడం జరగడం లేదని ఆస్తానా అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సరిహద్దు సమస్యకు మూలాలేంటి?
సరిహద్దు ఒప్పందాల విషయంలో బ్రిటీష్ ఇండియా, టిబెట్ మధ్య ఒప్పందాలు జరిగాయని, కానీ, భారత్, చైనాల మధ్య మాత్రం ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు జరగలేదని ఆస్తానా చెప్పారు.
‘‘ఒప్పందం ప్రకారం, జాన్సన్ లైన్ లద్దాఖ్‌ను ఆనుకుని ఉన్న సరిహద్దు రేఖగా భారత్ చెబుతోంది. తూర్పు ప్రాంతంలో, టిబెట్‌తో మెక్‌మోహన్ లైన్ ఒప్పందంపై బ్రిటీష్ ఇండియా సంతకాలు చేసింది. ఇది భారత్ వాదన, దీనిలో తప్పేం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి.
ఇక చైనా విషయానికి వస్తే, స్వతంత్ర భారత్‌తో తాము ఎలాంటి ఒడంబడికపై సంతకాలు చేయలేదని అంటోంది. మెక్‌మోహన్ లైన్ ఖరారు చేసేటప్పుడు, దాన్ని ఆమోదించలేదని కూడా అంటోంది’’ అని తెలిపారు.
లద్దాఖ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, చైనా 1960 నాటి క్లెయిమ్ లైన్ గురించి చెబుతోంది. ఈ క్లెయిమ్ లైన్ ఇరు దేశాల సరిహద్దు అని, వాస్తవాధీన రేఖ కాదని అంటోందని ఆస్తానా చెప్పారు.
రెండు దేశాల వైఖరి విభిన్నంగా ఉండటంతో సమస్య ముందుకు కదలడం లేదన్నారు.
‘‘భారత్‌కు సరిహద్దు అంటే జాన్సన్ రేఖ. పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలను చైనా ఉల్లంఘిస్తూ, యధాతథ స్థితిని మార్చిందని భారత్ చెబుతోంది.
చైనా 2020 ఏప్రిల్ ముందటి పరిస్థితులకి తిరిగి వెళ్లాలని భారత్ కోరుతోంది. యధాతథ స్థితి కోసం భారత్ చర్చలు జరుపుతోంది.
చైనా వైఖరి దీనికి భిన్నంగా ఉంది. తమ సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లబోమని అంటోంది. రెండు దేశాలు ఇక్కడే ఆగిపోయాయి. అందుకే, ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది’’ అని ఆస్తానా చెప్పారు.

ఫొటో సోర్స్, SB ASTHANA
ముందు ముందు ఏం జరగనుంది?
చైనా తన సైన్యాన్ని మోహరిస్తుంటే, భారత్ వద్ద కూడా సరిహద్దు వెంబడి సైన్యాన్ని మోహరించడం తప్ప మరో ఆప్షన్ ఉండదని ఆస్తానా అన్నారు.
‘‘డెప్సాంగ్, డెమ్‌చోక్‌ల విషయంలో ఏదైనా పరిష్కారం లభించి, చైనా వైపు నుంచి ఉద్రిక్త పరిస్థితుల తీవ్రత తగ్గితే, భారత్ కూడా దాని తీవ్రతను తగ్గిస్తుంది. ఇప్పటి లాగానే చైనా సరిహద్దులను ఆక్రమించడం కొనసాగిస్తే, భారత్ కూడా ఇలాగే అడ్డుపడుతుంది. ఇది శాశ్వత వివాదంగా మారుతుంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘ప్రమాదం ఎంత పెరిగితే, అంత మోహరింపు’
సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకునే విషయంలో భారత్, చైనాల మధ్య గత కొన్నేళ్లుగా ఒక రేస్ నడుస్తోంది.
2020 ఏడాదిలో నెలకొన్న సరిహద్దు వివాదం తర్వాత, చైనా కేవలం విమానాశ్రయాలను నిర్మించడమే కాకుండా సరిహద్దుకు దగ్గర్లో ఉన్న చాలా ప్రాంతాల్లో హెలీపోర్టులను, ఎయిర్ డిఫెన్స్ సైట్లను ఏర్పాటు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
అంతేకాక, కొత్త కొత్త గ్రామాలను నిర్మిస్తుంది. దీనికి ప్రతిగా భారత్ కూడా సరిహద్దు సమీప ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది.
‘‘ముప్పును ఊహించి సైనిక మోహరింపును భారత్ చేపట్టాల్సి ఉంది. ఎంత మంది సైనికులను మోహరించాలన్నది ముప్పు తీవ్రతను బట్టి ఉంటుంది. సాంకేతికత, నిఘా సామర్థ్యాలను భారత్ మెరుగుపరుచుకోవాలి’’ అని ఆస్తానా చెప్పారు.
‘‘ఈ మధ్యే మనం ఇజ్రాయెల్ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఆ దేశం వద్ద అత్యాధునిక నిఘా వ్యవస్థ ఉంది. అయినప్పటికీ కంచెను దాటుకుని హమాస్ మిలిటెంట్లు దాడులు జరిపారు. ఎందుకంటే, అక్కడ సైనికుల మోహరింపు సరిగ్గా లేదు. నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని హమాస్ ఫైటర్లు ఎత్తిచూపారు’’ అని ఆయన వివరించారు.
టెక్నాలజీ మీ సామర్థ్యాన్ని పెంచుతోంది. మరింత మెరుగ్గా పనిచేసేందుకు సాయం చేస్తోంది. కానీ, ప్రమాద తీవ్రతను బట్టి ఆ ప్రాంతంలో సైనికుల మోహరింపు కూడా అవసరమేనని ఆస్తానా గుర్తు చేశారు.
చైనాతో కొనసాగుతున్న వివాదం వల్ల భారత్ తూర్పు లద్దాఖ్‌తో 50 వేల మంది సైనికులను మోహరించినట్లు అంచనాలున్నాయి. చైనా వైపు కూడా అక్కడ అంతే స్థాయిలో సైనికులున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














