చైనా: భారతదేశాన్ని ఎగతాళి చేసేలా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు... తరువాత తీసేశారు

ఫొటో సోర్స్, WEIBO
- రచయిత, ఫాన్ వాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాలో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో వివాదాస్పదమైంది. అందులో భారతీయులను పోలిన మనుషులు ఉండడమే అందుకు కారణం.
ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఈ వీడియోను రోడ్డు భద్రత అవగాహన కోసం చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తన అధికారిక అకౌంట్లో షేర్ చేసింది.
ఈ పోస్ట్ చైనా వెలుపల తీవ్ర విమర్శలకు దారితీసింది. చైనా జాత్యహంకార ధోరణిని సూచిస్తోందంటూ పలువురు ఆరోపించారు. దాంతో, చైనా ప్రభుత్వం ఆ వీడియోను తొలగించింది.
హావో గే గే అనే వ్యక్తి ఈ వీడియోను సృష్టించారు. ఆయనకు చైనా టిక్‌టాక్ వెర్షన్ 'డౌయిన'లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఈ వీడియోకు 12 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
వీడియోలో ఏముంది?
వీడియోలో చామనఛాయ మనుషులు, తలకు పాగా, రంగురంగుల పూల చొక్కాలు తొడుక్కున్న పురుషులు, దక్షిణ లేదా మధ్య ఆసియా దుస్తులు ధరించిన స్త్రీలు కనిపిస్తారు.
వీరంతా రెండు గుంపులుగా విడిపోయి తునక్ తునక్ తున్ అంటూ చైనా భాషలో పాట పాడతారు. నా బండి గొప్ప అంటే, నా బండి గొప్ప అని పాడుతుంటారు.
పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ గత వారం ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ అకౌంట్‌కు వీబోలో 3.2 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వీబో చైనాలో ట్విట్టర్ లాంటి వేదిక.
"పోలీసుల హెచ్చరిక: కార్లో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ వేసుకోవాలి. వెనుక సీట్లో కూర్చున్నా బెల్ట్ తప్పనిసరి. హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించవద్దు" అని ఆ పోస్ట్‌లో రాసి ఉంది.
చైనాలో ఈ పోస్ట్‌ను విపరీతంగా షేర్ చేశారు. అనుకూలంగా కామెంట్లు వచ్చాయి.
"చట్టాన్ని పాపులర్ చేయడానికి ఇది సమర్థవంతమైన మార్గం" అని ఒకరు కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, చైనా వెలుపల చాలా విమర్శలు వచ్చాయి.
ది ప్రింట్ ఇండియా కాలమిస్ట్ ఆదిల్ బ్రార్ ట్వీట్ చేస్తూ, "ఇందులో భారతదేశాన్ని, భారత ప్రజలను, బాలీవుడ్‌ను ఎగతాళి చేస్తున్నారు" అని రాశారు.
కొంతమంది చైనీస్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
"దీన్ని భారతదేశంలో పోస్ట్ చేస్తే, కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్లు దీన్ని హాస్యంగా తీసుకోరు" అని ఒకరు కామెంట్ చేశారు.
ఈ వీడియోను ఇతర చైనీస్ పొలీస్ విభాగాలు కూడా షేర్ చేశాయి.
అయితే, ఇప్పుడు ఎక్కడా ఆ వీడియో కనిపించట్లేదు. దాన్ని అన్ని వేదికల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.
2018లో, చైనాలో బాగా పాపులర్ అయిన లూనార్ న్యూ ఇయర్ టీవీలో ప్రసారమైన ఓ నాటికలో ఒక చైనీస్ నటి ముఖానికి నల్లరంగు, పెద్ద పిరుదులతో కనిపించారు. అది కూడా జాత్యహంకార విమర్శలకు దారితీసింది.
కిందటి ఏడాది, ఒక చైనీస్ ఫిల్మ్‌మేకర్ మలావియన్ పిల్లలపై జాత్యహంకారాన్ని సూచించే అంశాలతో ఒక వీడియోను రూపొందించిన వైనాన్ని బీబీసీ బయటపెట్టింది.
దాని తరువాత, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, జాత్యహంకారాన్ని చైనా ఏమాత్రం సహించదని, జాతి వివక్ష వీడియోలపై కఠినంగా వ్యవహరిస్తుందని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు? ఇంటి ముఖం పట్టేదెవరు?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి పోటెత్తుతున్న వాట్సాప్ కాల్స్ .. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీకు ముప్పే
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
- కర్ణాటక: ఈ 10 ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














