అజీమ్ రఫీక్: ఇంగ్లండ్ క్రికెట్ ‘జాత్యహంకారి’ అని ఆరోపించిన ఈ క్రికెటర్ ఎవరు? ఈ వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, House Of Commons
ఇంగ్లీష్ క్రికెట్ జాత్యహంకార వివక్షను ప్రదర్శించినట్లు గత కొన్ని వారాలుగా అభియోగాలు వినిపిస్తున్నాయి. యార్క్‌షైర్‌కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఈ అభియోగాలు చేశారు.
అజీమ్ రఫీక్ చేసిన ఈ అభియోగాలపై విచారణ చేపట్టారు. ఈ విచారణ కౌంటీ క్లబ్‌లో అత్యున్నత అధికారులు పదవీ విరమణ చేసేందుకు దారి తీసింది.
అజీమ్ రఫీక్ ఎవరు? ఆయన చేసిన అభియోగాలేంటి?
30 ఏళ్ల అజీమ్ రఫీక్ క్రికెట్ మాజీ క్రీడాకారుడు. బ్యాటర్, బౌలర్. ఆయన కెరీర్‌లో అత్యధిక సమయం యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లోనే గడిపారు.
ఆయన పాకిస్తాన్‌లో జన్మించారు. ఆయనకు 10 ఏళ్ళు ఉండగా ఇంగ్లండ్ వెళ్లారు. ఆయన యూత్ స్థాయిలో ఇంగ్లండ్ క్రికెట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2012లో యార్క్‌షైర్ కెప్టెన్ అయ్యారు.
సెప్టెంబరు 2020లో ఆయన ఈఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్ఫో చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో "సంస్థాగతంగా ఉన్న జాత్యహంకార వివక్ష’’ గురించి అభియోగాలు చేసారు.
అక్కడ చవిచూసిన వివక్ష తను ఆత్మహత్య చేసుకునేంత వరకూ తీసుకెళ్లిందని చెప్పారు.
పాకిస్తాన్ వారసత్వాన్ని అవమానపరిచే విధంగా ఉన్న భాషను వాడటం, ఇతర వేధింపులు అనుభవించినట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘భయంకరమైన స్థాయిలో జాత్యాహంకారం..’
బీబీసీ స్పోర్ట్స్ ఎడిటర్ డార్ రాన్ ఇంటర్వ్యూలో రఫీక్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లీష్ క్రికెట్ సంస్థాగతంగా జాత్యాహంకారి’ అని పునరుద్ఘాటించారు.
తాను ఎదుర్కొన్న ఈ జాత్యాహంకార సమస్యలు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఉన్నాయని పార్లమెంటులో మాట్లాడుతూ రఫీక్ చెప్పారు.
ఇంగ్లండ్‌కు ఆడాలన్నదే తన కల అని, దాన్ని సాకారం చేసుకోవాలనే తాను ప్రయత్నించానని చెప్పారు.
ఈ క్రమంలోనే జట్టు సహచరులు, కోచింగ్ సిబ్బంది ముందు ఇతరులు చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను తాను అవమానంగా భావించినా, ఒంటరిగానే ఎదుర్కొన్నానని, ఎన్నడూ సవాలు చేయలేదని వివరించారు.
ఇంగ్లండ్ క్రికెట్‌లో జాత్యాహంకారం భయంకరమైన స్థాయిలో ఉందని, అయితే దీనిని కప్పిపుచ్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్లమెంటు సభ్యులకు రఫీక్ తెలిపారు.
యార్క్‌షైర్ స్పందన ఏంటి?
రఫీక్ ఆరోపణలపై క్లబ్ అధికారిక విచారణను చేపట్టింది.
ఒక సంవత్సరం తర్వాత రఫీక్ జాత్యహంకార వివక్ష, వేధింపులకు గురయినట్లు యార్క్‌షైర్ అంగీకరించింది.
రఫీక్ చేసిన 43 ఆరోపణల్లో 7 ఆరోపణలు నిజమని స్వతంత్ర విచారణ ప్యానెల్ తేల్చింది.
అయితే, ప్రైవసీ, పరువు నష్టం లాంటి చట్టపరమైన కారణాల రీత్యా ఆ నివేదికను బయటకు విడుదల చేయడానికి అంగీకరించలేదు. ఈ నివేదిక ఫలితాల వల్ల యార్క్ షైర్ ఉద్యోగులు, సిబ్బంది, క్రీడాకారులు ఎటువంటి క్రమశిక్షణ చర్య ఎదుర్కోరని అక్టోబరు 28న యార్క్‌షైర్ తీర్మానించింది.
సంస్థాగతంగా యార్క్‌షైర్ జాత్యహంకార వివక్షతో ప్రవర్తించిందని చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవని క్లబ్ చైర్మన్ రోజర్ హట్టన్ చెప్పారు.

ఆ తర్వాత ఏమి జరిగింది?
ఈ మొత్తం వ్యవహారంపై యార్క్‌షైర్ బోర్డు సభ్యులు పదవుల నుంచి వైదొలగాలని పార్లమెంటు సభ్యులు పిలుపునిచ్చారు.
నవంబరు 04న లీడ్స్‌లో హెడింగ్లె స్టేడియం దగ్గర అంతర్జాతీయ క్రీడలను నిర్వహించకుండా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కలిసి యార్క్‌షైర్‌ను సస్పెండ్ చేశాయి. ఈ క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన ప్రమాణాలను స్పష్టంగా ప్రదర్శించే వరకూ క్లబ్‌కు అధికారాలు ఉండవని ఈసీబీ స్పష్టం చేసింది.
నవంబరు 05న హట్టన్ పదవికి రాజీనామా చేసి రఫీక్‌కు క్షమాపణ చెప్పారు. ఆయన పార్లమెంట్ సభ్యుల ముందు హాజరై, క్లబ్ సంస్థాగతంగా జాత్యహంకార వివక్షతో ప్రవర్తించిందని అంగీకరించారు.
ఆయనతో పాటు మరి కొంత మంది బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేశారు. అందులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఆర్థర్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లార్డ్ పటేల్ క్లబ్‌కు కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన జాతి వివక్ష గురించి తెలియచేసినందుకు రఫీక్‌ను విజిల్ బ్లోయర్ అని ప్రశంసించారు.
ఈ వ్యవహారం పై సత్వర చర్యలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
- ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ ద్వారా రఫీక్‌తో ఒక అంగీకారానికి రావడం
- స్వతంత్ర విజిల్ బ్లోయింగ్ హాట్‌లైన్ ఏర్పాటు
- వైవిధ్యం, భిన్న జాతీయుల ఆమోదంపై సంస్థ పాలసీలు, నియమాల సమీక్ష
- రఫీక్ చేసిన అభియోగాలకు సంబంధించిన విచారణ నివేదికను న్యాయ సంబంధమైన పార్టీలతో షేర్ చేయడం
పార్లమెంటు సభ్యుల ముందు హాజరు
రఫీక్ గత వారం యూకే పార్లమెంటరీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారి ముందు హాజరయ్యారు.
జాతి వివక్ష కారణంగా తన కెరీర్‌ను కోల్పోయినట్లు ఆయన చెప్పారు.
ఇంగ్లండ్, యార్క్‌షైర్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు చెప్పేందుకు మరో ముగ్గురు యార్క్ షైర్ క్రీడాకారులు కూడా ముందుకు వచ్చారు.
తన పేరు నివేదికలో ఉన్నట్లు వాన్ నవంబరు 04న అంగీకరించారు. అయితే, ఆయన జాత్యహంకారంతో ప్రవర్తించాననే అభియోగాలను మాత్రం ఖండించారు. ఆయన బీబీసీ రేడియో 5 లైవ్ షోకు కూడాహాజరు కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మొత్తం వ్యవహారంపై బ్రిటిష్ ఆసియా ప్రజలెలా స్పందించారు?
ఇటువంటి పరిస్థితులను చవి చూసిన బ్రిటిష్ ఆసియా క్రికెట్ క్రీడాకారులకు ఈ వ్యవహారం చాలా దగ్గరగా అనిపించింది. జాత్యహంకార వేధింపులను హాస్యంగా ఆమోదించమని బలవంతపెట్టడం కూడా సాధారణంగా చోటు చేసుకునేది.
"బాధపడుతున్న సమయంలో అది హాస్యంగా పరిగణించమని ఒత్తిడి చేయడం పట్ల కన్నీళ్లను దాచుకోని నల్ల జాతీయులు ఎవరూ బ్రిటన్‌లో లేరు" అని న్యూస్ ప్రెజెంటర్ కృష్ణన్ గురుమూర్తి ట్వీట్ చేశారు.
‘‘రఫీక్ వ్యవహారం బ్రిటిష్ ఆసియన్లకు పరిచయమైన కథే. అయితే, క్రికెట్‌లో తీవ్ర ప్రకంపనలతో కూడిన మార్పు వచ్చిందన్న మాట నిజమైతే, ఈ ఆట అందరినీ కలుపుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పవచ్చు" అని ఇండియాలో జన్మించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ డైలీ మెయిల్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్‌లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’
- 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 23 మంది మృతి.. దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే..
- ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- గ్రీన్ టీ: ఉదయాన్నే ఓ కప్పు తాగారా... అందులోని పోషకాలను కనిపెట్టిన మిషియో సుజిమూర కథేంటో తెలుసుకుంటారా?
- ‘కార్లను అమ్మడం మొదలుపెట్టి నెల కూడా కాలేదు.. కానీ మార్కెట్ విలువలో ఫోర్డ్ మోటార్స్‌ను దాటేసింది’
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











