26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్‌లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?

హోటల్ తాజ్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, జాహ్నవీ మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలో 26/11న తీవ్రవాదుల దాడులకు 13 ఏళ్లు పూర్తైంది. ఈ దాడులపై పాకిస్తాన్‌లో కూడా కేసు నమోదైంది. కానీ, అందులో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు.

2008 నవంబర్ 26న భారత ఆర్థిక రాజధాని ముంబయిలో తీవ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులలో 160 మందికి పైగా చనిపోయారు. ఇది మొత్తం దేశాన్నీ కుదిపేసింది.

ఈ దాడులపై దర్యాప్తు చేసిన భారత్ దీని మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయని ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యుడైన లష్కర్-ఏ-తోయిబా(ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, దాని అనుబంధ సంస్థ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

భారత్ ఈ కేసుకు సంబంధించి పాకిస్తాన్‌కు ఎన్నో పత్రాలను అందించింది. ఈ పత్రాల ఆధారంగా పాకిస్తాన్‌లో ఏడుగురిని నిందితులుగా పేర్కొన్నారు.

కానీ, 26/11 దాడులకు సంబంధించి పాకిస్తాన్ ఎవరినైనా ప్రధాన నిందితులుగా చేర్చడం గానీ, వారిని దోషులుగా తేల్చడంగానీ జరగలేదు.

వీడియో క్యాప్షన్, బీబీసీ ఎక్స్‌క్లూజివ్ : జమాత్-ఉద్-దావా ఛీఫ్ హఫీజ్ సయీద్‌ ఇంటర్వ్యూ

పాకిస్తాన్ కోర్టులో ఏం జరిగింది

రావల్పిండి అదియాలా జైలు కోర్టులో ఈ కేసు విచారణలు ప్రారంభమయ్యాయి. ఈ కేసు విచారణకు సంబంధించి భారత్, పాకిస్తాన్ తరఫున పరస్పర విరుద్ధ వాదనలు వస్తున్నాయి.

ఎన్నోసార్లు ఆధారాలు అందించినప్పటికీ పాకిస్తాన్ నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని భారత్ ఆరోపించింది.

మరోవైపు భారత్ తమకు బలమైన ఆధారాలు ఏవీ ఇవ్వలేదని పాకిస్తాన్ చెప్పింది.

భారత్ తమకు కేవలం డోజియర్(ఫైళ్లు) అందించిందని, ఆధారాలుగా కోర్టులో వాటికి ఎలాంటి విలువా ఉండదని ఈ కేసుపై బీబీసీతో మాట్లాడిన డిఫెన్స్ లాయర్ రిజ్వాన్ అబ్బాసీ చెప్పారు.

ఈ కేసు విచారణ కోసం భారత్ సాక్ష్యులను కూడా పాకిస్తాన్‌కు పంపించలేదని ఆయన చెప్పారు.

"ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ లేవు. ఆరోపణలే ఉన్నాయి. భారత్ నుంచి 24 మంది సాక్ష్యులను పంపించాలని పాకిస్తాన్ కోరింది. భారత సాక్ష్యులకు తరచూ సమన్లు పంపించేవాళ్లం. విదేశాంగ శాఖకు లేఖలు రాశాం. ఈ కేసులో తమ వాదనలు వినిపించడానికి బాధ్యుడుగా ఫోకల్ పర్సన్‌గా నియమించారు. కానీ, తమ సాక్ష్యులను పంపుతారా, లేదా అనేదానిపై భారత్ తరఫున ఎలాంటి స్పందనా రాలేదు" అన్నారు.

2012 మార్చి, 2013 అక్టోబర్‌లో ఒక పాకిస్తానీ ప్రతినిధి మండలి ఈ కేసులో ఆధారాలు సేకరించడానికి భారత్‌లో పర్యటించింది. అయితే వారి మొదటి పర్యటన విఫలమైందని, రెండో పర్యటనలో సాక్ష్యులతో మాట్లాడ్డానికి భారత్‌ వారికి అనుమతి ఇవ్వలేదని అబ్బాసీ చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, ముంబయి దాడులు: అతిపిన్న వయసు ప్రత్యక్ష సాక్షి

ఈ జాప్యానికి భారతే కారణం అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్రమ్ ఖురేషీ కూడా ఆరోపించారు.

"భారత్ నిర్లక్ష్యం వల్లే కేసు బలంగా లేకపోయింది. భారత్ మాకు కీలకమైన ఆధారాలు అందించలేదు" అన్నారు.

పాక్‌లో ఈ కేసులకు సంబంధించి భారత వాదన గురించి భారత సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ బీబీసీతో మాట్లాడారు.

"మన సాక్ష్యులు అక్కడికి వెళ్లరు. ఎందుకంటే వారి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. వాళ్లు ఇక్కడకు రావాలంటే, నిజంగా తీవ్రవాదంతో పోరాడాలని అనుకుంటే, వారికి స్వాగతం" అన్నారు.

"మేం, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆధారాలు పంపించాం. పాకిస్తాన్‌ జ్యుడిషియల్ కమిటీని భారత్ రానివ్వండి అని చెప్పాం. అప్పుడు వాళ్లు ఇక్కడికి వచ్చారు. నలుగురైదుగురు సాక్ష్యులను విచారించారు" అని కూడా ఆయన చెప్పారు.

ఈ కేసులో రెండు దేశాలూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని ఇస్లామాబాద్‌లో బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ చెబుతున్నారు.

ఫలితంగా, పాకిస్తాన్‌లో 26/11 దాడులకు కుట్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఈ కేసులో ప్రధాన నిందితులపై కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ముంబయి దాడులు

ఫొటో సోర్స్, Getty Images

హఫీజ్ సయీద్ ఇప్పుడు ఎక్కడున్నాడు

ముంబయి దాడుల తర్వాత లష్కర్-ఏ-తోయిబా నేత హఫీజ్ సయీద్, దాని సహ-వ్యవస్థాపకుడు జకీవుర్ రహమాన్ లఖ్వీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

హఫీజ్ సయీద్ ప్రస్తుతం భారీ భద్రతతో ఉండే కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. మూడు మనీ లాండరింగ్ కేసుల్లో ఐదేళ్ల చొప్పున పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్ట్ 2020లో హఫీజ్ సయీద్‌కు 15 ఏళ్ల శిక్ష విధించింది.

హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా పేర్కొన్న అమెరికా, అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది.

అమెరికాలో 9/11 దాడులు జరిగినప్పటి నుంచి హఫీజ్‌ను చాలాసార్లు పాకిస్తాన్‌లోని అతడి ఇంట్లో గృహనిర్బంధంలో ఉంచారు. కానీ అతడిపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు.

ముంబయి దాడులకు ముందు భారత పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి, 2006లో ముంబయి బాంబు దాడుల వెనుక కూడా హఫీజ్ సయీద్ హస్తం ఉందని భారత్ ఆరోపించింది.

కానీ, హఫీజ్‌కు పాకిస్తాన్ ఆర్మీలోని కొందరు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే అతడిపై కేసులు నమోదు చేయలేదనే విషయం కూడా తెలిసింది.

మరోవైపు, తీవ్రవాద ఆర్థిక కార్యకలాపాలు, మనీ లాండరింగ్‌ను ట్రాక్ చేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) 2018లో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో ఉంచింది.

ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారనే ఆరోపణలతో హఫీజ్‌ను 2019 జులైలో అరెస్ట్ చేసారు. గత ఏడాది సయీద్‌కు మనీ లాండరింగ్‌కు సంబంధించిన మూడు వేరు వేరు కేసుల్లో 15 ఏళ్ల శిక్ష విధించారు.

జకీవుర్ రహమాన్

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జకీవుర్ రహమాన్

జకీవుర్ రహమాన్ లఖ్వీ ఏమయ్యాడు

ముంబయి దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జకీవుర్ రహమాన్ లఖ్వీని కూడా అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. లఖ్వీని ముంబయి దాడులు జరిగిన కొన్ని రోజులకు 2008 డిసెంబర్ 7న అరెస్ట్ చేశారు.

2015 ఏప్రిల్‌లో లఖ్వీ బెయిల్ మీద విడుదలయ్యారు. హఫీజ్ సయీద్ తర్వాత లఖ్వీపై కూడా తీవ్రవాద కార్యకలాపాలకు ఫండింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

మెడికల్ డిస్పెన్సరీ నడుపుతూ తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించారని లఖ్వీపై ఆరోపణలు ఉన్నాయి. 2021 జనవరిలో కోర్టు లఖ్వీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

లఖ్వీని ముంబయి దాడులకు కూడా బాధ్యుడుగా చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆ సమయంలో ట్వీట్ చేసింది.

ముంబయి దాడులు

26/11న నిజానికి ఏం జరిగింది?

సముద్ర మార్గంలో ముంబయిలోకి ప్రవేశించిన 10 మంది టెర్రరిస్టులు, తర్వాత లియోపోల్డ్ కెఫే, సీఎస్ఎంటీ స్టేషన్, రెండు ఫైవ్ స్టార్ హోటళ్లు తాజ్, ఓబెరాయ్, నారిమన్ హౌస్ మీద దాడి చేశారు.

తీవ్రవాదులు, పోలీసులకు మధ్య దాదాపు 60 గంటలకు పైగా ఘర్షణ కొనసాగింది. ఈ పోరాటంలో పోలీసు అధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సాలస్కర్‌, హెడ్ కానిస్టేబుల్ తుకారాం ఓంబ్లే, ఎన్ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌సహా 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడులకు పాల్పడిన 10 మందిలో ఒక్క అజ్మల్ కసబ్ మాత్రమే సజీవంగా దొరికాడు. కసబ్‌ను పుణెలోని యెరవాడ సెంట్రల్ జైల్లో 2012 నవంబర్ 12న ఉరితీసారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)