ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?

లాజిస్టిస్ట్ సవాళ్ల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ క్రియాశీలంగా ప్రణాళికలు రచించాలని రిపోర్ట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Dept. of Logistics, MoC&I, India

ఫొటో క్యాప్షన్, లాజిస్టిస్ట్ సవాళ్ల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ క్రియాశీలంగా ప్రణాళికలు రచించాలని రిపోర్ట్ పేర్కొంది.
    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లీడ్స్ నివేదికల్లో, 2018, 2019 సంవత్సరాల్లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. 2021లో ఏకంగా ఆరు స్థానాలు పడిపోయి.. తొమ్మిదో స్థానానికి దిగజారింది. ఇక గత నివేదికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈసారి పదో స్థానానికి తగ్గిపోయింది.

ఇంతకుముందు 13వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 6వ స్థానంలో నిలిచింది.

లాజిస్టిక్స్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ - లీడ్స్ 2021 నివేదికను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖామంత్రి పీయుష్ గోయల్ ఇటీవల విడుదల చేశారు.

రోడ్డు, రైలు, జల, వాయు రవాణా, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల తదితర సదుపాయాలు, సేవలు, వాటి నిర్వహణ, నియంత్రణలో నాణ్యతను అంచనా వేయటం ద్వారా ర్యాంకింగ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం లీడ్స్ తొలి నివేదికను 2018లో విడుదల చేసింది. ఆ తర్వాత 2019లో రెండో నివేదికను విడుదల చేసింది.

2020 సంవత్సరంలో కరోనావైరస్ కారణంగా లీడ్స్ నివేదికను విడుదల చేయలేదు.

అయితే.. తొలి రెండు నివేదికలను ఈ రంగాలకు చెందిన వారిని సర్వేచేయటం ద్వారా రూపొందించగా.. ఈసారి సర్వే చేయటంతో పాటు.. ఆయా రాష్ట్రాల నుంచి వాస్తవ సమాచారం కూడా సేకరించి ర్యాంకింగ్ ఇచ్చినట్లు నివేదిక చెప్తోంది.

లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి మీద కొన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టటం వల్ల మెరుగుదల సాధ్యమైంది

ఫొటో సోర్స్, Dept. of Logistics, MoC&I, India

ఫొటో క్యాప్షన్, లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి మీద కొన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టటం వల్ల మెరుగుదల సాధ్యమైంది

తొలి మూడు స్థానాల్లో గుజరాత్, హరియాణా, పంజాబ్..

ఈ ఏడాది మే నుంచి ఆగస్టు మధ్య నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,405 మంది నుంచి 3,363 ప్రతిస్పందనలు సేకరించామని.. ఈ నివేదికను రూపొందించిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పేర్కొంది.

అలాగే దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి వాస్తవ సమాచారం సేకరించామని వివరించింది.

రోడ్డు, రైలు, జల, వాయు రవాణా సదుపాయాలు, గిడ్డంగులు, టెర్మినల్ సదుపాయాలు, సేవలు, నిర్వహణ, నియంత్రణలకు సంబంధించి 17 అంశాల్లో నాణ్యత గురించి ఈ సర్వేలో ప్రశ్నలు అడిగి, సమాచారం సేకరించారు.

లీడ్స్ 2021 సూచీలో గుజరాత్ అగ్రస్థానంలో నిలువగా హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

2018, 2019 నివేదికల్లో సైతం గుజరాత్ అగ్రస్థానంలోనే ఉంది. క్రియాశీల విధానాలు, బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, సేవలు, ప్రతిస్పందించే ప్రభుత్వం.. గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగటానికి దోహదపడ్డాయని ఈ నివేదిక పేర్కొంది.

తొలి రెండు నివేదికల్లో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. ఆ రెండు నివేదికల్లోనూ ఆరో స్థానంలో ఉన్న హరియాణా ఈసారి రెండో స్థానం పొందింది.

గత రెండు నివేదికలతో పోలిస్తే.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల స్థానాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Dept. of Logistics, MoC&I, India

ఫొటో క్యాప్షన్, ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్

ఆరు ర్యాంకులు పడిపోయిన ఆంధ్రప్రదేశ్...

లీడ్స్ సూచీలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక స్థానాలు దిగజారింది. నాణ్యత, మౌలికసదుపాయాల్లో రాష్ట్రానికి మార్కులు తక్కువ వచ్చాయి.

ఉదాహరణకు.. విజయవాడ నుంచి రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వెళ్లే రహదారి నాణ్యత బాగోలేదని సర్వే పేర్కొంది. అలాగే విశాఖపట్నం ఓడరేవు నుంచి గిడ్డంగులకు వెళ్లే నేషనల్ హైవే ఇరుకుగా ఉందని చెప్పింది.

ముఖ్యంగా విజయవాడ, కాకినాడ, నెల్లూరుల్లో గిడ్డంగి సదుపాయాలకు కొరత ఉంది. రాష్ట్రంలో గిడ్డంగి సదుపాయాలు నెలకొల్పటానికి నియంత్రణ లేకపోవటం కూడా మైనస్ అయింది. సులభంగా అనుమతులు పొందే విషయంలోనూ మార్కులు తక్కువ పడ్డాయి.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మినీ టిబెట్

అంతేకాదు.. టోల్ రేట్లు అధికంగా ఉన్నాయని, డీజిల్ మీద అదనంగా లెవీ విధిస్తున్నారని కూడా సర్వేలో ప్రతినిధులు ప్రతికూల అంశాలుగా చెప్పినట్లు నివేదిక తెలిపింది.

''లాజిస్టిక్స్ పరిశ్రమ భాగస్వాములు లేవనెత్తిన సవాళ్లను పరిష్కరించటానికి ఆంధ్రప్రదేశ్ క్రియాశీలంగా ప్రణాళికలు రచించాల్సిన అవసరముంది. సంస్థాగత వ్యవస్థ, విధాన వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం ద్వారా.. రాష్ట్రం తన లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచుకోవచ్చు. దీనికితోటు.. ప్రస్తుతమున్న మౌలికసదుపాయాలకు రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం కూడా పెరగాల్సిన అవసరముంది'' అని ఈ నివేదిక సూచించింది.

ర్యాంకుల్లో తెలంగాణ

ఫొటో సోర్స్, Dept. of Logistics, MoC&I, India

ఫొటో క్యాప్షన్, ర్యాంకుల్లో తెలంగాణ

8 నుంచి 10కి తగ్గిన తెలంగాణ స్థానం...

లీడ్స్ తొలి నివేదికలో 9వ స్థానంలో నిలిచిన తెలంగాణ రెండో నివేదికలో 8వ స్థానానికి మెరుపడింది. కానీ తాజా నివేదికలో తెలంగాణ ర్యాంకు రెండు స్థానాలు తగ్గి 10వ స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రంలో సరకు రావాణా చార్జీలు అధికంగా ఉన్నాయని లీడ్స్ నివేదిక పేర్కొంది.

రైలు సదుపాయాల నాణ్యత, అవసరమైనంత మేరకు లాజిస్టిక్ సదుపాయాలు లేకపోవటం, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తగినన్ని గిడ్డంగులు లేకపోవటం వంటివి తెలంగాణకు తక్కువ మార్కులు రావటానికి కారణంగా ఈ నివేదిక వివరించింది.

'నిర్వహణ, నియంత్రణ వాతావరణం' విషయంలో సులభంగా అనుమతులు పొందటం, నియంత్రణ సేవల సమర్థత తదితర అంశాలన్నిటిలో రాష్ట్రానికి తక్కువ మార్కులే వచ్చాయి.

''లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు అనుమతుల కోసం సింగిల్ విండో వ్యవస్థకు రాష్ట్రం నుంచి మద్దతు లేదని, నియంత్రణ వాతావరణం అసమర్థంగా ఉందని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లోపించిందని ఇది సూచిస్తోంది'' అని నివేదిక చెప్పింది.

లాజిస్టిక్ ర్యాంకుల్లో యూపీ గణనీయంగా మెరుగుపడింది

ఫొటో సోర్స్, Dept. of Logistics, MoC&I, India

ఫొటో క్యాప్షన్, లాజిస్టిక్ ర్యాంకుల్లో యూపీ గణనీయంగా మెరుగుపడింది

7 స్థానాలు ఎదిగిన యూపీ.. 8 స్థానాలు పతనమైన ఎంపీ

2019లో 13వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఈసారి ఏడు స్థానాలు మెరుగుపడి ఆరో ర్యాంకును సాధించింది. రాష్ట్రంలోని లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్, టెర్మినళ్ల వద్ద కార్గో భద్రత అంశాల్లో యూపీకి గణనీయంగా మార్కులు వచ్చాయి.

లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి మీద ఈ రాష్ట్రం బలంగా దృష్టి పెట్టటం వల్ల ఇది సాధ్యమైందని.. నోడల్ ఆఫీసర్, స్టేట్ లాజిస్టిక్స్ కోఆర్డినేషన్ కమిటీ, స్టేట్ లాజిస్టిక్స్ సెల్ వంటి వ్యవస్థలను నెలకొల్పటం దీనికి ఉదాహరణ అని లీడ్స్ నివేదిక పేర్కొంది.

మరోవైపు.. 2018 నివేదికలో 14వ స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్, 2019 నివేదికలో 9వ స్థానానికి ఎదిగింది. కానీ.. తాజా నివేదికలో ఈ రాష్ట్రం ర్యాంకు భారీగా పడిపోయి 17వ స్థానంలో నిలిచింది.

రైలు సౌకర్యాలలో నాణ్యత, అవసరమైనన్ని లాజిస్టిక్ సదుపాయాలు లేకపోవటం, తెలంగాణకు మైనస్

ఫొటో సోర్స్, Dept. of Logistics, MoC&I, India

ఫొటో క్యాప్షన్, రైలు సౌకర్యాలలో నాణ్యత, అవసరమైనన్ని లాజిస్టిక్ సదుపాయాలు లేకపోవటం, తెలంగాణకు మైనస్

రాష్ట్రాల ర్యాంకులు మారిపోయాయిలా...

ఇదిలావుంటే.. తమిళనాడు ర్యాంకు 5 నుంచి 4కు పెరగగా, మహారాష్ట్ర ర్యాంకు 4 నుంచి 5కు తగ్గింది.

ఒడిషా ర్యాంకు 10 నుంచి 7కి పెరిగింది. కర్ణాటక ర్యాంకు 7 నుంచి 8కి తగ్గింది.

ఛత్తీస్‌గఢ్ ర్యాంకు 14 నుంచి 11కు; జార్ఖండ్ ర్యాంకు 17 నుంచి 12కు, ఉత్తరాఖండ్ ర్యాంకు 19 నుంచి 13కు పెరిగాయి.

కేరళ ర్యాంకు 11 నుంచి 14కు తగ్గితే.. పశ్చిమ బెంగాల్ ర్యాంకు 16 నుంచి 15కు మెరుగుపడింది. ఇక రాజస్థాన్ స్థానం 12 నుంచి 16కు పడిపోయింది.

లీడ్స్ 2021 నివేదికలో రాష్ట్రాలు ఒక వర్గంగా; ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక వర్గంగా, మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలు మరో వర్గంగా విభజించి ర్యాంకులు ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల వాహనాలు ప్రారంభం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)