భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు.. పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ తాలిబాన్ల సయోధ్యకు మధ్యవర్తి పాత్ర పోషిస్తాం - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ

అమీర్ ఖాన్ ముత్తాఖీ
ఫొటో క్యాప్షన్, అఫ్గాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ
    • రచయిత, ఫర్హత్ జావేద్
    • హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్

పాకిస్తాన్, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)ల మధ్య ఒప్పందానికి తాము మధ్యవర్తి పాత్ర పోషించనున్నట్టు అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ధృవీకరించారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరు పక్షాల అభీష్టం మేరకు ఒప్పందంలో మూడవ పక్షంగా తమ ప్రభుత్వం మధ్యవర్తి పాత్ర పోషిస్తోందని అన్నారు.

"ఇంకా తుది ఒప్పందం ఖరారు కాలేదు. కానీ ప్రారంభం చాలా బాగుంది. ఒప్పందం మొదటి దశలో భాగంగా ఒక నెల కాల్పుుల విరమణకు అంగీకరించారు. చర్చలు కొనసాగుతాయని ఇరుపక్షాలు అంగీకరించాయి" అని ఆయన చెప్పారు.

ఇది ఓ మంచి ముందడుగు, ఇకపై ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పాకిస్తాన్, టీటీపీ మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆగస్టులో తాలిబాన్లు తిరిగి అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత, తాలిబాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన ప్రతినిధి బృందంతో కలిసి మూడు రోజులపాటు పాకిస్తాన్‌లో పర్యటించారు.

వీడియో క్యాప్షన్, హింస మధ్యే వెనక్కి వెళ్లిపోతున్న విదేశీ బలగాలు, అఫ్గాన్‌ భవిష్యత్తు ఏంటి?

మహిళా జర్నలిస్టుకు తొలి ఇంటర్వ్యూ

ఈ పర్యటనలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీతో సహా వివిధ ప్రభుత్వ ప్రముఖులను, జర్నలిస్టులను మంత్రి అమీర్ ఖాన్ కలిశారు.

ఈ పర్యటనలో మంత్రి అమీర్ ఖాన్‌ని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఒక మహిళా జర్నలిస్టుకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి.

అఫ్గానిస్తాన్‌లోని తమ ప్రభుత్వానికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో ఏమైనా ముప్పు ఉందా అనే ప్రశ్నకు అమీర్ ఖాన్ ముత్తాఖీ బదులిచ్చారు.

ఇస్లామిక్ స్టేట్‌తో ముప్పేనని, అయితే తమ ప్రభుత్వం దేశంలోని చాలా భాగాల్లో వారి ఉనికిలేకుండా చేసిందన్నారు.

"ప్రపంచంలో ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉండటం సహజమే. గతంలో అఫ్గానిస్తాన్‌లోని 70 శాతం ఇస్లామిక్ స్టేట్‌ ఆధీనంలో ఉండేది. ఇప్పుడు తాలిబాన్లు ఈ ప్రాంతాలన్నింటి నుంచి ఇస్లామిక్ స్టేట్‌ను పూర్తిగా నిర్మూలించారు. గత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు వారి ఉనికి ఉంది".

"మేము కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, ఇస్లామిక్ స్టేట్ ఈ ప్రాంతాలలో తిరిగి పట్టుసాధించడానికి ప్రయత్నించింది. కానీ మా తాలిబాన్ ప్రభుత్వం దాన్ని నియంత్రించడానికి పటిష్ట చర్యలు తీసుకుంది. కొన్నిసార్లు మసీదులు, ఇతర ప్రదేశాలలో కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి ప్రపంచంలో ఎక్కడైనా జరగవచ్చు".

తాలిబాన్

ఫొటో సోర్స్, PRESS INFORMATION DEPARTMENT

'భారత్‌తో విభేదాలను కోరుకోవడం లేదు'

భారత్‌తో సంబంధాలపై అమీర్ ఖాన్ ముత్తాఖీ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ భారత్‌తో సహా ఏ దేశంతోనూ విభేదాలను కోరుకోవడం లేదని అన్నారు.

ప్రపంచంలోని ఏ దేశంతోనూ విభేదాలు ఉండకూడదనేది ప్రస్తుత అఫ్గానిస్తాన్ ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు.

"అఫ్గానిస్తాన్‌కు మరే ఇతర దేశంతోనూ విభేదాలు ఉండకూడదు. మా దేశానికి సమస్యను తెచ్చే సవాళ్లను ఎదుర్కోవాలని మేము కోరుకోవడం లేదు. ఈ దిశగా మేం మా పని చేసుకుంటూ వెళ్తున్నాం."

భారత్‌తో సన్నిహిత సంబంధాలపై పాకిస్తాన్ లేదా చైనా నుంచి ఏదైనా స్పందన ఉందా అని అడిగినప్పుడు, ఆయన మాస్కోలో జరిగిన సమావేశాలను ప్రస్తావిస్తూ, "మేము మాస్కో సమావేశానికి హాజరైనప్పుడు, భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాలు వచ్చాయి. యూఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. అక్కడ సానుకూల విషయాలు చర్చకు వచ్చాయి. మేము ఏ దేశంతోనూ శత్రుత్వం పెంచుకోవాలని అనుకోవడం లేదు".

వీడియో క్యాప్షన్, తాలిబాన్ల తొలి ప్రెస్ మీట్: మేం మారిపోయాం

''మహిళలకు వారి హక్కులను కల్పించాలి''

తాలిబాన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా హక్కుల ఉల్లంఘనపై మంత్రి అమీర్ ఖాన్‌ని బీబీసీ ప్రశ్నించింది.

గతం కంటే ఇప్పుడు తాలిబాన్లు మారారని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదే నిజమైతే, దేశంలోని మహిళలకు ప్రాథమిక హక్కులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించడంతో.. అమీర్ ఖాన్ ముత్తాఖీ స్పందించారు.

అలాంటి వార్తలను ఖండించారు. "మహిళలు ఏ రంగంలోనూ కనిపించడం లేదనేది అవాస్తవం" అని అన్నారు.

''ఆరోగ్య రంగంలో మహిళల భాగస్వామ్యం 100 శాతం ఉంది. మహిళలు విద్యారంగంలో బోధనలో రాణిస్తున్నారు. వారి అవసరం ఉన్న ప్రతీ రంగంలోనూ మహిళలు పనిచేయగలుగుతున్నారు. మ‌హిళ‌లు ఈ రంగంలో పనిచేయకూడదనే నియమ నిబంధనలు, విధానాలు మా ప్రభుత్వానికి లేవు.''

నివేదికల ప్రకారం, తాలిబాన్లు ఆక్రమించిన చాలా ప్రావిన్సులలో బాలికల విద్యాసంస్థలు మూసివేశారు. మహిళలు పనికి వెళ్లకుండా నిషేధించినట్టు కూడా నివేదికలు వచ్చాయి.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

'మీడియా తప్పుగా ప్రచారం చేస్తోంది'

మానవ హక్కుల కోసం మీడియాలో పనిచేసే మహిళలను చంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాలిబాన్ విదేశాంగ మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. ఈ విషయంపై మీడియా తప్పుగా రిపోర్టు చేస్తోందని అన్నారు.

అఫ్గానిస్తాన్‌లోని కొన్ని ప్రావిన్సులలో బాలికల పాఠశాలలు తెరిచినా, మిగతా చాలా ప్రావిన్సులలో విద్యా సంస్థలు మూసివేశారు కదా? దేశవ్యాప్తంగా అన్ని వయసుల బాలికల కోసం పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయి? ఉద్యోగాల్లో మహిళలకు తమ భాగస్వామ్యాన్ని ఎప్పుడు అనుమతిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానంగా "ఆల్ ఈజ్ వెల్" అంటూ ఆయన బదులిచ్చారు.

అయితే, కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూసివేశామని ఆయన అంగీకరించారు. దీనికి కరోనా వైరస్ మహమ్మారి కారణమని చెప్పారు.

"ఏ ప్రావిన్సులోనూ విద్యా సంస్థల్ని మూసివేయలేదు. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు తెరిచి ఉన్నాయి. మేము పాఠశాలలను మూడు వర్గాలుగా విభజించాము. అన్ని బాలుర పాఠశాలలు దేశవ్యాప్తంగా తెరిచి ఉన్నాయి. అన్ని ప్రావిన్సులలో బాలికల పాఠశాలలు ఆరవ తరగతి వరకు తెరిచి ఉన్నాయి".

"కొన్ని ప్రావిన్సుల్లో ఉన్నత స్థాయి పాఠశాలలను కూడా తెరిచాం. కానీ అన్నిచోట్లా ఉన్నత పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదు. కరోనా కారణంగా చాలా పాఠశాలలు కొన్ని నెలలుగా మూసివేసే ఉన్నాయి. మేము పాఠశాలలను మళ్లీ ప్రారంభించాము. ఇంతకు ముందుతో పోల్చితే ప్రస్తుతం మేము 75 శాతం పాఠశాలలను తెరిచాము. కాబట్టి మేము ఏ దశలోనూ ఆగిపోలేదు. దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు నడుస్తున్నాం.

అఫ్గానిస్తాన్‌లోని ప్రభుత్వ, ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలను తిరిగి పనికి అనుమతించడం లేదు కదా అనే ప్రశ్నకు బదులిస్తూ.. అఫ్గానిస్తాన్, తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో పనిచేసిన మహిళలను ఎవరినీ తొలగించలేదని ఆయన పేర్కొన్నారు.

"మహిళల వేతనాలు, విద్య, ఉపాధి అవకాశాలలో ఎటువంటి తారతమ్యాలు చూపించడం లేదన్నారు".

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్‌ ప్రభుత్వం అందిరినీ కలుపుకుని ముందుకెళ్తుంది

అంతర్జాతీయ షరతులకు అనుగుణంగా, తమ ప్రభుత్వం అందరినీ కలుపుకుని ముందుకుపోతుందని, అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తుందని తాలిబాన్లు చెబుతున్నారు.

కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మాత్రం 'ఇన్‌క్లూజివ్ గవర్నమెంట్' అంటే మహిళలకు సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వం అని స్పష్టంగా పేర్కొంది.

తాలిబాన్ల తాత్కాలిక మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే ప్రశ్న అమీర్‌ఖాన్‌ ముత్తాఖీని అడిగినప్పుడు.. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత లభించడం లేదని తాను అనుకోవడం లేదని అన్నారు.

"అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సహాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుతం ఈ సహాయం నిలిచిపోయింది. దీనికితోడు, విదేశాలలో అఫ్గానిస్తాన్ ఆస్తులను కూడా స్తంభింపజేశారు. ప్రస్తుతం, అంతర్జాతీయ సహాయ సంస్థలు, ఇతర దేశాల నుంచి జీవనానికి అవసరమయ్యే సహాయాన్ని కూడా స్తంభింపజేశారు. దేశం తీవ్రమైన మానవతా సంక్షోభం వైపు వేగంగా వెళ్లడానికి ఇదే కారణం"

అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి అధికారికి గుర్తింపు దక్కకపోతే, సహాయ వనరులు తిరిగి పునరుద్దరించకపోతే తాలిబాన్ ప్రభుత్వం ఏం చేయాలని యోచిస్తోందని అడిగిన ప్రశ్నకు, ప్రపంచంతో మెరుగైన సంబంధాలు ఏర్పరచడానికి తాము కూడా ముందుకు సాగుతున్నామని ముత్తాకి చెప్పారు. ప్రపంచంతో సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నామన్నారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

తమ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలు, తెగల ప్రతినిధులు ఉన్నారని, ఈ ప్రభుత్వాన్ని ప్రపంచం గుర్తించాలని ఆయన అన్నారు.

"అఫ్గానిస్తాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వంలో మునుపటి ప్రభుత్వ సిబ్బంది, ఉద్యోగులందరూ ఉన్నారు. మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని 'ఇన్ క్లూజివ్ గవర్నమెంట్'గా ప్రపంచం గుర్తిస్తే మా ప్రభుత్వాన్ని ఎందుకు గుర్తించరు?"

"అన్ని తెగలను కలుపుకొనిపోయే ప్రభుత్వాన్నే ప్రపంచం గుర్తిస్తుందంటే... మా ప్రభుత్వం కూడా అన్ని కులాలు, తెగలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మా ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంది" అని అన్నారు.

"మంత్రిత్వ శాఖలలో పంజ్‌షీర్ నుంచి మంత్రులు ఉన్నారు. బదక్షన్, ఫర్యాబ్, కాందహార్, నంగర్హర్, కాబూల్ నుంచి ప్రతినిధులు ఉన్నారు"

''ప్రతి దేశం, ప్రాంతం సమ్మిళిత ప్రభుత్వం పట్ల దాని సొంత అజెండాను కలిగి ఉంటుంది. కాబట్టి మేము మా ప్రభుత్వాన్ని మరింత సమ్మిళితంగా, ప్రతి ఒక్కరికీ వారి హక్కులను అందించడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తాము''

తాలిబాన్
ఫొటో క్యాప్షన్, బీబీసీ మహిళా జర్నలిస్ట్ ఫర్హత్ జావేద్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీని ఇంటర్వ్యూ చేశారు. ఒక మహిళా జర్నలిస్టుకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి

మహిళా జర్నలిస్టు కావడంతో అంతకుముందు ఇంటర్వ్యూకు నిరాకరణ

నా పేరు తాలిబాన్లను కూడా గందరగోళానికి గురి చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అఫ్గానిస్తాన్, టర్కీ, ఇరాన్‌తో సహా అనేక దేశాలలో, 'ఫర్హత్' అనే పేరు పురుషులకు కూడా ఉంటుంది.

అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి రెండు రోజుల పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. చాలా మంది జర్నలిస్టులు అతనిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కూడా ప్రయత్నించాను. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో ఇంటర్వ్యూ ఖరారు అయ్యింది.

ఇంటర్వ్యూ సమయం రాత్రి 8 నుంచి 9:30 గంటల మధ్య అని చెప్పారు. మా బృందంతో ఆ సమయానికి హోటల్‌కి చేరుకున్నాము. అక్కడ అనేక పాకిస్తానీ, అంతర్జాతీయ ఏజెన్సీలకు చెందిన స్థానిక, విదేశీ పాత్రికేయులు ఉన్నారు.

ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో ముత్తాఖీ సాహెబ్ సమావేశమయ్యారని చెప్పారు. నేను కాకుండా అమెరికా వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌తో అనుబంధం ఉన్న మరో మహిళా జర్నలిస్టు సోఫియా సైఫీ కూడా అక్కడ ఉన్నారు.

జర్నలిస్టులు అమీర్ ఖాన్ ముత్తాఖీని కొన్ని ప్రశ్నలను అడిగారు. వాటికి ఆయన సమాధానమిచ్చారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?

తాలిబాన్ విదేశాంగ మంత్రితో చాలా చర్చలు ఉర్దూ, పాష్టోలో జరిగాయి. అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ గురించి నేను అడిగిన ప్రశ్నకు కూడా ఆయన ఉర్దూలోనే సమాధానం ఇచ్చారు.

అనంతరం అక్కడ ఉన్న సిబ్బంది నాతో, విదేశాంగ మంత్రి ముత్తాఖీ సాహిబ్‌కు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేదన్నారు, దానికి మేము క్షమాపణలు చెబుతున్నామని చెప్పారు.

ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాను. ఒక అధికారి మాట్లాడుతూ, 'ఈ ఇంటర్వ్యూ ఒక పురుష జర్నలిస్టుతో జరుగుతుందని భావించారు. ఆయన మహిళలకు ఇంటర్వ్యూలు ఇప్పటివరకు ఇవ్వలేదు' అని చెప్పారు.

అయితే, కొన్ని ప్రయత్నాల తర్వాత, అమీర్ ఖాన్ ముత్తాఖీ మాకు కొన్ని నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)