తెహ్రీక్-ఎ-తాలిబాన్‌పై ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు.. పాకిస్తాన్‌లో కలకలం

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

తీవ్రవాద గ్రూప్ తెహ్రీక్-ఎ-తాలిబాన్(టీటీపీ)ను 'పష్తూన్ ఉద్యమం'గా వర్ణించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆ దేశంలో లక్ష్యంగా మారారు.

పష్తూన్ల మనోభావాలను ప్రధానమంత్రి దెబ్బతీశారని, అలా అన్నందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యులు మొహసిన్ దావర్ డిమాండ్ చేశారు.

"అమెరికా దళాలు తిరిగి వెళ్లిపోవడం వల్ల అఫ్గానిస్తాన్‌లో మళ్లీ స్థిరత్వం ఏర్పడిందని, కానీ.. టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్‌కు ఒక సమస్యగా మారిందని మీరు మీ పుస్తకంలో చెప్పారా. అమెరికా తిరిగి వెళ్లాక ఆ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు" అని 'మిడిల్ ఈస్ట్ ఐ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించారు.

సమాధానంగా "టీటీపీ అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లోని పష్తూన్‌లే.. తాలిబాన్ ఒక పష్తూన్ ఉద్యమం. అఫ్గానిస్తాన్‌లో దాదాపు 45 నుంచి 50 శాతం జనాభా పష్తూన్లే, కానీ డ్యూరండ్ రేఖ నుంచి పాకిస్తాన్ వైపుగా పష్తూన్ల జనాభా దాదాపు రెట్టింపు ఉంది" అని ఆయన అన్నారు.

"అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ మీద దాడులు చేసినపుడు తాలిబాన్లను తరిమికొట్టాయి. ఆ సమయంలో సరిహద్దుకు ఈ వైపు ఉన్న పష్తూన్లకు, ఆ వైపు ఉన్న పష్తూన్లపై సానుభూతి కలిగింది. దానికి మత పరమైన భావజాలంతోపాటూ, పష్తూన్ సమాజంలో ఐక్యత కూడా కారణం. అది చాలా బలమైనది" అని కూడా ఇమ్రాన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

పుండుపై కారం చల్లారా?

ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైన తర్వాత పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు, పష్తూన్ తహఫ్పూజ్(రక్షణ) మూవ్‌మెంట్ మద్దతుదారుడు మొహసిన్ దావర్ ఒక ట్వీట్ చేశారు.

"పాకిస్తాన్ ప్రధానమంత్రి మరోసారి పష్తూన్లను తీవ్రవాదులని అంటున్నారు. ఇది తాలిబాన్ల తీవ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది పష్తూన్ల కుటుంబ సభ్యుల గాయాలపై కారం చల్లడమే" అన్నారు.

ఈ ట్వీట్ చేసిన కాసేపటి తర్వాత మొహసిన్ దావర్ మరో ట్వీట్ చేశారు.

"నేను పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాను, పష్తూన్లను తాలిబాన్లుగా వర్ణించడం, తీవ్రవాదులతో పోల్చడంపై ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాను" అన్నారు.

అయితే, తీర్మానం కాపీ అంటూ ఆయన షేర్ చేసిన దానిలో ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ ప్రస్తావన లేదు. బదులుగా ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం గురించి చెప్పారు.

ఈ ఇంటర్వ్యూకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇటీవల ప్రసంగించారు.

"అఫ్గాన్ సరిహద్దు ఆనుకుని ఉన్న గిరిజన ప్రాంతాల్లో వారికి, తాలిబాన్ల పట్ల చాలా సానుభూతి ఉంటుంది. మతపరమైన గుర్తింపే కాదు, పష్తూన్ల సామాజిక బంధం కూడా దానికి కారణం. దీనికితోడు పాకిస్తాన్‌లో ఇప్పటికే 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఉన్నారు. పష్తూన్ క్యాంపుల్లో ఉన్నవారందరూ అఫ్గాన్ తాలిబాన్ల పట్ల సానుభూతితో ఉన్నారు" అన్నారు.

మొహసిన్ దావడ్ తీర్మానం కాపీ

ఫొటో సోర్స్, TWITTER/@@MJDAWAR

ఫొటో క్యాప్షన్, మొహసిన్ దావర్ తీర్మానం కాపీ

మొహసిన్ దావర్ తీర్మానం

దీనిపై తీర్మానం ప్రవేశపెట్టిన మొహసిన్ "యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి ప్రసంగం, ఆయన వ్యాఖ్యలను సభ ఖండిస్తోంది. తన ప్రసంగంలో తాలిబాన్లను ఆయన పష్తూన్ సమాజంగా వర్ణించారు. అది పూర్తిగా తప్పు" అని అందులో చెప్పారు.

"ప్రధానమంత్రి నిరాధార, తప్పుడు ఆరోపణలు తాలిబాన్ల దాడులకు తీవ్రంగా ప్రభావితమైన పష్తూన్లను అవమానించడమే. వేలాది పష్తూన్లు, పష్తూన్ నేతలు, కార్యకర్తలు తాలిబాన్ల దాడుల్లో తమ ప్రాణాలు కోల్పోయారు".

"ప్రధానమంత్రి తాలిబాన్లను పష్తూన్ల ప్రతినిధులుగా వర్ణించడం ఇది మొదటిసారి కాదు. అందుకే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, అబద్ధపు వాదనలతో పష్తూన్ల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని మేం డిమాండ్ చేస్తున్నాం" అని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూలో ఏమన్నారు?

"మేం అమెరికాకు మిత్ర దేశంగా ఉన్నప్పుడు వారు(తాలిబాన్లు) మాకు వ్యతిరేకంగా మారారు. మమ్మల్ని అమెరికా మిత్రులుగా చెబుతూ, పాకిస్తాన్ మీద దాడులు చేశారు. తమను పాకిస్తాన్ తాలిబాన్లుగా చెప్పుకోవడం మొదలెట్టారు. అమెరికాకు మిత్రులు కాకముందు అలా లేదు" అని 'మిడిల్ ఈస్ట్ ఐ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

"ఒకప్పుడు దాదాపు 50 వేరు వేరు గ్రూపులను కలిపి తాలిబాన్లుగా చెప్పేవారు. వాళ్లు మాపై దాడులు చేసేవారు. పాకిస్తాన్‌లో మొత్తం 16 వేల తీవ్రవాద దాడులు జరిగాయి. వాటిలో 80 వేల మంది పాకిస్తానీలు చనిపోయారు. అమెరికా ఉనికి(అఫ్గానిస్తాన్‌లో) తగ్గేకొద్దీ, ఈ ఉద్యమం జోరు తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మేం(అమెరికాకు) మిత్రులం కాదు" అన్నారు.

"ఇప్పుడు మేం అమెరికాకు మిత్రదేశం కాదు. ఎందుకంటే, ఇప్పుడు మేం పష్తూన్లతో పోరాడే ఎవరికీ సాయం అందించడం లేదు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి చర్చలు జరపాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మా స్థితి ఇప్పుడు బలంగా ఉంది" అని పాక్ ప్రధాని అన్నారు.

"ఐఆర్ఏ(ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ)తో జరిగినట్లు సాయుధ నిరసనన్నీ చర్చల ద్వారానే అంతం అవుతాయని నేనెప్పుడూ నమ్ముతాను. ఇప్పుడు మేం వారితో బలమైన స్థితిలో చర్చలు జరపాలని అనుకుంటున్నాం. ఎందుకంటే, అఫ్గాన్ నేల నుంచి మాపై దాడులు జరగనివ్వబోమని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లు మాకు హామీ ఇచ్చారు" అని కూడా ఇమ్రాన్ తెలిపారు.

ఆయన ఇంటర్వ్యూలో "చాలామంది కొలేటరల్ డామేజ్ వల్ల టీటీపీలో భాగం అయ్యారు. పష్తూన్ సంస్కృతిలో కుటుంబంలోని ఎవరినైనా చంపేస్తే, కుటుంబ గౌరవం కోసం వారు ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఉంటుంది. దానికోసం వాళ్లు మరో గ్రూపులో చేరుతారు" అని చెప్పారు.

సోషల్ మీడియాలో విమర్శలు

ఫొటో సోర్స్, EPA

సోషల్ మీడియాలో విమర్శలు

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పష్తూన్ తహఫ్పూజ్(రక్ష) మూవ్‌మెంట్ నేత మంజూర్ పష్తూన్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు.

"ఇమ్రాన్ ఖాన్ పష్తూన్లపై వరుసగా జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ వారిని నేరస్థులుగా చూపించడానికి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భద్రత పేరుతో వారిపై జరిపిన అకృత్యాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు" అన్నారు.

"ఒక దేశ ప్రధాని క్షణం కూడా ఆలోచించకుండా ఒక మొత్తం సమాజాన్ని తీవ్రవాదులుగా ప్రకటించేయడం విచారకరం" అని మోనా అనే యూజర్ ట్వీట్ చేశారు.

"ఇమ్రాన్ ఖాన్ పష్తూన్లను చెడ్డవారుగా వర్ణించడం మానండి. ఈ భూమి క్షేమం కోసం వారు తమ ప్రియతములను కోల్పోయారు. కానీ, మీరు వారి త్యాగాలను అంగీకరించరు" అని మరో యూజర్ అన్నారు.

"ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడూ తనకు మంచి చేసినవారికే, నష్టం చేస్తారు. ఆయనకు రెండు సార్లు అధికారం ఇచ్చినందుకు పష్తూన్లకు ఈ బహుమతి లభించింది. ఇప్పుడు ఆయన వారిని తీవ్రవాదులుగా నిరూపించాలని కంకణం కట్టుకున్నారు" ఆలమ్ జేబ్ మహమూద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)