పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...

మతియుర్ రెహ్మాన్

ఫొటో సోర్స్, BANGLADESH/ALCETRON.COM

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ విమానాన్ని హైజాక్ చేసిన బెంగాలీ అధికారి మతియుర్ రెహ్మాన్
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు. రెండోసారి తన టి-33 ట్రైనర్‌ విమానాన్ని టేకాఫ్ దిశగా తరలించారు.

టేకాఫ్ పాయింట్‌కు చేరుకోగానే, అసిస్టెంట్ ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహ్మాన్ విమానాన్ని ఆపారు.

కొత్తగా విమానం నడపడం నేర్చుకుంటున్న పైలెట్లను సేఫ్టీ ఆఫీసర్లు ఇలా ఆపి పరీక్షిస్తుంటారు.

పరీక్షించడం కోసమే ఆపారని మిన్హాస్ కూడా భావించారు. అయితే, రెహ్మాన్ ఉద్దేశం వేరు.

మతియుర్ రెహ్మాన్ ఒక బెంగాలీ అధికారి. ఢాకాలో పాకిస్తాన్ సైన్యం చర్యలతో ఆయన అసహనంగా ఉన్నారు.

తన స్నేహితుడు సద్రుద్దీన్‌తో కలిసి పాకిస్తాన్ విమానంలో భారతదేశం పారిపోవాలని ప్లాన్ చేశారు.

పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ విషయం ఉప్పందింది.

భారతదేశంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో, ఇతర బెంగాలీ అధికారులతో పాటూ మతియుర్ రెహ్మాన్‌కు కూడా గ్రౌండ్ డ్యూటీ వేసి అసిస్టెంట్ ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్‌గా నియమించారు.

పాకిస్తాన్ ఫైటర్ పైలట్ కైసర్ తుఫైల్ తన వ్యాసం 'బ్లూబర్డ్ 166 ఈజ్ హైజాక్డ్లో' ఈ విషయాలను వివరించారు.

"పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తమపై నిఘా పెట్టిందన్న విషయాన్ని కరాచీలో ఉన్న బెంగాలీ అధికారులు గ్రహించారు. స్థావరంలోని ఆఫీసర్లతో స్నేహంగా మెలగాలని, పరస్పరం రాసుకు పూసుకు తిరుగుతున్నట్లు కనిపించకూడదని వారంతా నిర్ణయించుకున్నారు. అయితే, సమయం చూసి పాకిస్తాన్ విమానాన్ని హైజాక్ చేసి భారతదేశం పారిపోవాలనే అంగీకారానికి వచ్చారు.

ఒకటి లేదా రెండు ఎఫ్-86 సేబర్ విమానాలను హైజాక్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ, బేస్ టార్మాక్‌లో బెంగాలీ ఆఫీసర్ ఉంటే వాళ్లకి అనుమానం వస్తుందని ఆ ఆలోచన విరమించుకున్నారు. గ్రౌండ్ సిబ్బంది సహాయం లేకుండా జెట్‌ విమానాన్ని హైజాక్ చేయడం దాదాపు అసాధ్యం. కాబట్టి అదీ కుదరదు. చివరికి, సోలో మిషన్‌లో వెళ్తున్న టి-33 ఎయిర్‌క్రాఫ్ట్‌ను హైజాక్ చేయడం సులువని నిర్ణయించారు.”

బంగ్లాదేశ్ అధికారులు

ఫొటో సోర్స్, BANGLADESH DEFENCE

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ అధికారులు

రషీద్ మిన్హాస్ నడుపుతున్న విమానాన్ని ఆపారు

ఆ రోజు ఉదయం కరాచీ చుట్టుపక్కల వాతావరణం విమానం నడిపేందుకు వీలుగా లేదు. దాంతో, రషీద్ మిన్హాస్ టిఫిన్ చేయడానికి స్క్వాడ్రన్ సిబ్బంది గదికి వెళ్లారు.

అకస్మాత్తుగా వాతావరణం మెరుగుపడింది. టేకాఫ్‌కు సిద్ధం కావాలని రషీద్‌కు ఆదేశాలు వెళ్లాయి.

"అల్పాహారాన్ని మధ్యలోనే ముగించి రషీద్,ఫ్లైట్ లెఫ్టినెంట్ హసన్ అక్తర్ దగ్గరకు ఫ్లైట్ బ్రీఫింగ్ పొందేందుకు వెళ్లారు. ఉదయం 11.30 గంటలకు బ్లూ బర్డ్ 166 కాల్ సిగ్నల్‌తో టి-33 విమానం టర్మాక్‌కు చేరుకుంది. ఇంతలో, మతియుర్ రెహ్మాన్ తన వ్యక్తిగత ఒపెల్ క్యాడిట్ కారులో ప్రధాన విమానాశ్రయానికి ఈశాన్యం వైపున్న ట్రాక్‌కు చేరుకున్నారు. రెహ్మాన్ విమానాన్ని ఆపినప్పుడు, ఏదో ముఖ్యమైన సందేశం ఇవ్వడానికే ఆపి ఉంటారని రషీద్ భావించారు" అని కైసర్ తుఫైల్ వివరించారు.

ALCETRON.COM

ఫొటో సోర్స్, ALCETRON.COM

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు విమానం హైజాక్ గురించి తెలిసింది

రషీద్ విమానం ఆపగానే, తెరిచి ఉన్న కనోపీ ద్వారా రెహ్మాన్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. కాక్‌పిట్‌ను తనిఖీ చేస్తున్నట్లు నటించారు.

ఏం జరుగుతోందో రషీద్‌కు అర్థమయే లోపలే రన్‌వేపై విమానం దౌడు తీసింది.

"ఇక రషీద్ చేయగలిగింది ఒక్కటే. 11.28 నిమిషాలకు తన విమానాన్ని హైజాక్ చేశారంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)కు మెసేజ్ అందించారు. రెహ్మాన్, రషీద్‌కు పిస్టల్ చూపించి భయపెట్టి ఉంటారు. లేదంటే రషీద్ ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే ఇంజిన్ ఆపివేసి ఉండేవారు" అని కైసర్ తుఫైల్ తన వ్యాసంలో రాశారు.

కైసర్

ఫొటో సోర్స్, KAISAR TUFAIL/FB

"విమానంలో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరుగుతోందన్న విషయం నాకు అర్థమైంది" అని ఏటీసీలో ఉన్న బెంగాలీ ఆధికారి కెప్టెన్ ఫరీదుజ్మాన్ చెప్పారు.

బంగ్లాదేశ్ దినపత్రిక 'ది డైలీ స్టార్‌'లో 2006 జూలై 6న వచ్చిన వ్యాసంలో ఫరీదుజ్మాన్ ఆ సంఘటన గురించి వివరించారు.

"ఆ సమయంలో మతియుర్ రెహ్మాన్ భారతదేశానికి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన పారాచూట్‌గానీ హెల్మెట్‌గానీ ధరించలేదు. విమానం హైజాక్ అయిన సందేశం రాగానే ఏటీసీలో అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. టి-33ని అడ్డుకోవడానికి తక్షణమే రెండు సేబర్ జెట్‌లను పంపించారు."

రషీద్ మిన్హాస్‌ను కాక్‌పిట్‌లో బంధించారు

మరో ప్రఖ్యాత పాకిస్తానీ పైలట్, సితార్-ఎ-జుర్రత్ అవార్డు గ్రహీత సజ్జాద్ హైదర్, తన ఆత్మకథ 'ఫ్లైట్ ఆఫ్ ది ఫాల్కన్'లో ఈ విషయాలను ప్రస్తావించారు.

"1965-66లో మతియుర్ రెహ్మాన్ నా దగ్గర పనిచేశారు. హైజాక్‌ను ఆపడానికి రషీద్ గట్టి ప్రయత్నం చేయలేదని నేను అనుకుంటున్నా. అతను కావాలనుకుంటే ఫ్రంట్ కాక్‌పిట్‌లో ఉండే ప్రధాన ఇంధన స్విచ్‌ను ఆపివేయవచ్చు."

యువకుడు, పెద్దగా అనుభవం లేని రషీద్ హైజాక్ జరగగానే నిశ్చేష్టులైపోయి ఉంటారని ఎయిర్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ హెడ్ గ్రూప్ కెప్టెన్ జహీర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

రెహ్మాన్ చాలా తక్కువ ఎత్తులో విమానాన్నినడుపుతూ ఎడమవైపుకు మళ్లించారు. తక్కువ ఎత్తులో ఎగరడంతో ఏటీసీ అధికారి అసిమ్ రషీద్‌కు అనుమానం వచ్చింది. వెంటనే బేస్ కమాండర్ బిల్ లతీఫ్‌కు సూచనలు అందించారు.

స్టోరీ ఆఫ్ ఎ ఫైటర్ పైలట్

ఫొటో సోర్స్, VANGUARDBOOKS

అప్పుడే ల్యాండ్ అయిన ఎఫ్-86 సేబర్ విమానాలను టి-33ని అడ్డగించేందుకు పంపించారు. వీటిని వింగ్ కమాండర్ షేక్ సలీం, ఆయన వింగ్‌మ్యాన్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కమ్రాన్ ఖురేషీ నడిపారు.

అయితే, రాడార్‌కు టి-33 జాడ తెలియలేదు. ఎందుకంటే ఒక చెట్టు ఎత్తులో అది ఎగురుతోంది. అంత కిందకు ఎగిరే విమానాలను రాడార్ పట్టుకోలేదు.

అప్పటికే టి-33 రెహ్మాన్ చేతిలోకొచ్చి ఎనిమిది నిమిషాలు గడిచిపోయింది. సేబర్ విమానాలు పూర్తి వేగంతో వెళ్లినా సరిహద్దుల లోపల టి-33ని అందుకోలేవు.

రాడార్ తప్పిదంతో నవాబ్‌షా నుంచి వస్తున్న బి-57 విమానం వెనుక భాగాన్ని ఎఫ్-86 గుద్దుకోవడంతో మరికొంత సమయం వృథా అయిపోయింది.

రషీద్ మిన్హాస్

ఫొటో సోర్స్, ALCETRON.COM

ఫొటో క్యాప్షన్, రషీద్ మిన్హాస్

విమానం కూలిపోయిందన్న వార్త

కొద్దిసేపటి తరువాత మరో రెండు ఎఫ్-86 సేబర్ విమానాలను టి-33ని వెంబడించేందుకు పంపించారు. వీటిని ఫ్లైట్ లెఫ్టినెంట్‌లు అబ్దుల్ వహబ్, ఖలీద్ మహమూద్‌ నడిపారు.

"కచ్చితంగా ఏదో తప్పు జరిగిందని మాకు తెలుసు. మేము గాల్లోకి ఎగరగానే చాలా గందగోళంగా అనిపించింది" అంటూ అబ్దుల్ వహబ్ ఆనాటి సంఘటనలను తరువాత గుర్తుచేసుకుంటూ చెప్పారు.

"అయినాసరే, ఎఫ్-86, టి-33కి వెనకాలే ఉందని, అది వెనక్కి తిరిగి రాకపోతే కూల్చివేస్తామని గార్డ్ ఛానెల్ ద్వారా ఒక నకిలీ సందేశాన్ని పంపించాం. రేడియో కాల్ ద్వారా రషీద్‌కు సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ టి-33 నుంచి మాకెలాంటి జవాబూ రాలేదు."

చాలాసేపటివరకు హైజాక్ అయిన విమానం జాడ తెలియలేదు.

మధ్యాహ్నం దాటిన తరువాత, ఒక విమానం కూలిపోయిందని, అందులో ఉన్న ఇద్దరూ మరణించారని షహబందర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ రావడంతో పరిస్థితి స్పష్టమైంది.

సహాయక చర్యల కోసం వెంటనే ఒక హెలికాప్టర్‌ను పంపించారు. మష్రూర్‌కు 64 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న చెరువు పక్కన టి-33 తోక కనిపించింది. ఉదయం 11:43 కి విమానం కూలిపోయిందని తేలింది.

ఫ్లయిట్

ఫొటో సోర్స్, GETTYIMAGES

నియంత్రణ కోసం ఘర్షణలో...

విమానాన్ని భారతదేశానికి తీసుకెళ్లాలనే రెహ్మాన్ ప్లాన్ విజయవంతం కాలేదు. భారత సరిహద్దులకు 32 మైళ్లకు ముందే థట్టా అనే ప్రాంతంలో టి-33 నేలకొరిగింది.

విమానం అస్తవ్యస్తంగా ఎగురుతున్నట్లు నేలమీద ఉన్న ప్రత్యక్ష సాక్షులు చూశారు. అంటే నియంత్రణ కోసం కాక్‌పిట్‌లో ఘర్షణ జరిగినట్లు అర్థం చేసుకోవచ్చు.

"ఎగురుతున్న సమయంలో కనోపీ లాక్ చేయలేదని" ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఏర్పాటు చేసిన ఎయిర్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ తన నివేదికలో తెలిపింది.

"బయట గాలి ఒత్తిడి వలన కనోపీ యథాస్థానంలో కొంతసేపు ఉన్నప్పటికీ, విమానం అస్తవ్యస్తంగా ఎగురుతున్నప్పుడు అది ఊడిపడి వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దాంతో విమానం నిలువుగా, ముందు భాగం నేలను తాకుతూ ఒరిగింది. భద్రతా బెల్ట్ బిగించుకునేంత సమయం కూడా లేకపోవడంతో రెహ్మాన్ కాక్‌పిట్ నుంచి ఎగిరి అవతల పడ్డారు" అని ఈ రిపోర్టులో తెలిపారు.

ప్రమాదస్థలానికి కొంతదూరంలో రెహ్మాన్ మృతదేహాన్ని కనుగొన్నారు. పక్కనే ఒక బొమ్మ పిస్టల్ పడి ఉంది. రషీద్ మిన్హాస్ మృతదేహం కాక్‌పిట్‌లోనే ఉంది.

ALCETRON.COM

ఫొటో సోర్స్, ALCETRON.COM

రషీద్ మిన్హాస్‌ సాహసానికి పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం

పాకిస్తాన్‌లో రషీద్ మిన్హాస్‌ను హీరోగా కొనియాడారు. ఆయన చూపించిన ధైర్యసాహసాలకు అత్యున్నత 'నిషాన్-ఎ-హైదర్‌' పురస్కారం ఇచ్చి గౌరవించారు.

ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడైన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆయనే. అప్పటికి రషీద్ వయసు కేవలం 20 సంవత్సరాలు.

యాహ్యా ఖాన్

ఫొటో సోర్స్, GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, యాహ్యా ఖాన్

"రషీద్ ఉద్దేశపూర్వకంగానే, విమానాన్ని హైజాక్ నుంచి తప్పించడానికి నేలకూల్చారు" అని గౌరవపత్రంలో రాశారు.

రషీద్ ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలోనే ఆయన మృతదేహాన్ని సమాధి చేశారు.

మొదటే రషీద్‌కు 'సితార్-ఎ-జుర్రత్' పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు.

అయితే, మొత్తం విషయం పాకిస్తాన్ రాష్ట్రపతి యహ్యా ఖాన్‌కు తెలిసిన తరువాత, ఆ యువకుడికి దేశ అత్యున్నత పురస్కారం 'నిషాన్-ఎ-హైదర్‌' ఇవ్వాలని నిశ్చయించారు.

మతియుర్ రెహ్మాన్.. పాకిస్తాన్‌లో విలన్, బంగ్లాదేశ్‌లో హీరో

రెహ్మాన్‌కు మౌరీపూర్ ఎయిర్‌బేస్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఒక దేశద్రోహిగా, విలన్‌గా రెహ్మాన్ పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోయారు.

మష్రూర్ ఎయిర్‌బేస్ ప్రవేశద్వారం వద్ద రెహ్మాన్ చిత్రపటాన్ని ఉంచి దాని కింద 'గద్దర్' అని రాశారు.

రెహ్మాన్ భార్య, పిల్లలను అదుపులోకి తీసుకున్నారు.

మరోపక్క, బంగ్లాదేశ్‌లో మతియుర్ రెహ్మాన్ ధైర్యసాహసాలను కొనియాడుతూ ఆ దేశ అత్యున్నత్త శౌర్య పురస్కారం 'బీర్ శ్రేష్ఠో' ఇచ్చి గౌరవించారు.

ఈ సంఘటనతో పాకిస్తాన్ సైన్యంలో బంగ్లాదేశీయుల ఇబ్బందులు మరింత పెరిగాయి.

"పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే, 1965 యుద్ధం, 1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధాల హీరో సైఫ్-ఉల్-అజామ్‌‌తో సహా మరో నలుగురు బెంగాలీ అధికారులు కెప్టెన్ ఎంఎస్ ఇస్లాం, వింగ్ కమాండర్ కబార్, స్క్వాడ్రన్ లీడర్ జీఎం చౌదరి, ఫ్లైట్ లెఫ్టినెంట్ మీజాన్‌‌లను అదుపులోకి తీసుకున్నారు" అని పీవీఎస్ జగన్మోహన్, సమీర్ చోప్రా తమ 'ఈగల్స్ ఓవర్ బంగ్లాదేశ్'లో రాశారు.

"వీరిని జైల్లో నిర్బంధించి భారతదేశానికి పారిపోయే ఆలోచనల గురించి కఠినంగా ప్రశ్నించారు. 21 రోజుల పాటూ జైల్లో మగ్గిన తరువాత, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ రహీమ్ ఖాన్ జోక్యం చేసుకోవడంతో సైఫ్-ఉల్-అజామ్‌‌ విడుదలయ్యారు. జైలు అధికారులు సైఫ్-ఉల్-అజామ్‌‌‌తో వ్యవహరించిన తీరుపై రహీమ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, భవిష్యత్తులో ఎలాంటి తప్పుడు ఆలోచన చేయకుండా జాగ్రత్తగా ఉండమని అజామ్‌‌‌‌ను హెచ్చరించారు."

HARPERCOLLINS

ఫొటో సోర్స్, HARPERCOLLINS

విదేశాల్లో స్థిరపడమనే ప్రతిపాదన

పాకిస్తాన్ వైమానిక దళం నుంచి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని విదేశాల్లో స్థిరపడమని రహీమ్ ఖాన్, సైఫ్-ఉల్-అజామ్‌కు సూచించారు. అయితే సైఫ్-ఉల్-అజామ్‌‌ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు.

ఇతర బెంగాలీ అధికారులకు కూడా ఇదే ప్రతిపాదన చేశారు. గ్రూప్ కెప్టెన్ ఎంజీ తవాఫ్ ఈ ప్రతిపాదనను అంగీకరించి పశ్చిమ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారు.

ఫ్లైట్ లెఫ్టినెంట్ షౌకత్ ఇస్లాం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 1965 యుద్ధంలో, యుద్ధ ఖైదీగా మారిన ఇస్లాం, ఆ సమయంలో ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద టర్కీ వైమానిక దళంలో పనిచేస్తున్నారు. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన తరువాత, ఆయన టర్కీ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లకుండా నేరుగా బంగ్లాదేశ్‌ చేరుకున్నారు.

మతియుర్ రెహ్మాన్ మృతదేహాన్ని ఢాకా తీసుకువచ్చారు.

30 సంవత్సరాల పాటు నిర్విరామంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, 2006 జూన్ 24న మతియుర్ రెహ్మాన్ పార్థివదేహాన్ని కరాచీలోని శ్మశానవాటిక నుంచి ప్రత్యేక విమానంలో తరలించి బంగ్లాదేశ్‌లోని ఢాకాకు తీసుకురాగలిగారు.

BANGLADESH DEFENSE

ఫొటో సోర్స్, BANGLADESH DEFENSE

అక్కడ మీర్పూర్‌లోని అమరవీరుల శ్మశానవాటికలో పూర్తి సైనిక గౌరవాలతో తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ఆర్మీ ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది.

తరువాత, జెసోర్‌లోని బంగ్లాదేశ్ ఎయిర్‌బేస్‌కు ఆయన పేరు పెట్టారు. మతియుర్ రెహ్మాన్ గౌరవార్థం బంగ్లాదేశ్ ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)